సుడిగాలికి ఎగిరిపోయి, చెట్టు మీద సజీవంగా దొరికిన నాలుగు నెలల చిన్నారి

    • రచయిత, క్లోయి కిమ్
    • హోదా, బీబీసీ న్యూస్

టెన్నెస్సీ నగరంలో పెను తుపాను సమయంలో వచ్చిన టోర్నడోలో చిక్కుకుపోయిన నాలుగు నెలల బాబు, దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాడని తల్లిదండ్రులు చెప్పారు.

శనివారం వచ్చిన భీకరమైన టోర్నడోతో తమ మొబైల్ హోమ్ పూర్తిగా ధ్వంసమైందని, బాబు పడుకున్న ఊయలను కూడా గాలులు లాకెళ్లాయని వారు తెలిపారు.

కుండపోత వర్షంలో నేలకొరిగిన చెట్టుపై తమ చిన్నారిని ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు తల్లిదండ్రులు.

నాలుగు నెలలున్న ఈ బాబుకు ఏడాది వయసున్న అన్న కూడా ఉన్నాడు. కుటుంబంలోని వారంతా టోర్నడో వల్ల స్వల్పంగా గాయపడ్డారు.

టోర్నడో వచ్చినప్పుడు తమ ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని పిల్లల తల్లి సిడ్నీ మూరే చెప్పారు.

టోర్నడో కొన భూమిపై విధ్వంసం సృష్టిస్తూ వెళ్తూ.. ఇంట్లో ఊయలను, దానిలో ఉన్న తమ చిన్నారి లార్డ్‌ను పైకి లాకెళ్లిందని మూరే చెప్పారు.

ఊయలలో పడుకుని ఉన్న లార్డ్‌ను రక్షించేందుకు వాళ్ల నాన్న గట్టిగా పట్టుకున్నప్పటికీ, టోర్నడోలో చిన్నబాబు చిక్కుకుపోయినట్లు తెలిపారు.

‘‘బాబు ఊయలను రోజంతా పట్టుకుని ఉన్నాడు. అయినప్పటికీ, ఆ సుడిగుండంలో మేం చిక్కుకుపోయాం. ఆ తర్వాత సుడిగాలి గట్టిగా మమ్మల్ని బయటికి విసిరివేసింది’’ అని టోర్నడో వచ్చిన క్షణాలను మూరే గుర్తుకు తెచ్చుకున్నారు.

అలా జరిగినప్పుడు, మూరే వెంటనే తన ఏడాది వయసున్న కొడుకు ప్రిన్స్‌టన్‌పైకి దూకి కాపాడుకున్నారు.

‘‘వెంటనే పరిగెత్తికెళ్లి నా కొడుకుపైకి దూకమని నాలో ఉన్న ఏదో శక్తి చెప్పింది. బాబుపైకి దూకిన క్షణంలోనే మా ఇంటి గోడలన్ని బద్దలైపోయాయి’’ అని మూరే చెప్పారు.

అవి తనపై పడినప్పుడు కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాయని మూరే గుర్తుకు చేసుకున్నారు.

టోర్నడో తమ ఇంటి పైనుంచి వెళ్లిపోయిన తర్వాత, ప్రిన్స్‌టన్‌ను తీసుకుని విరిగిపడిన ఇంటి శిథిలాల నుంచి బయటపడ్డారు మూరే. ఆ వెంటనే మూరే, ఆమె భర్త కలిసి సుడిగాలి తర్వాత కనిపించకుండా పోయిన చిన్న కొడుకు లార్డ్‌ను వెతకడం ప్రారంభించారు.

కుండపోత వర్షంలోనే తమ చిన్నారిని వెతకడం ప్రారంభించామని, చివరికి వాడిని సజీవంగా కనుక్కోగలిగామని ఆమె చెప్పారు. తమ బాబు కనిపించిన చెట్టు తమకు ఊయలలా కనిపించిందన్నారు.

‘‘బాబు చనిపోయి ఉంటాడని అనుకున్నా. వాడు మాకు ఇక దొరకడనుకున్నా. కానీ, వాడు ఇక్కడే ఉన్నాడు. దేవుడి దయ వల్లనే ఇదంతా సాధ్యమైంది’’ అని మూరే సంతోషంగా అన్నారు.

తమ ఇంటిని, కారును టోర్నడో పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత ప్రజల సాయం కోరేందుకు గోఫండ్‌మీ పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించారు మూరే చెల్లెలు కైత్లిన్ మూరే.

మూరే, ఆమె పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ....మూరే భర్తకు మాత్రం చెయ్యి విరిగిందని, భుజం దెబ్బతిన్నదని కైత్లిన్ మూరే చెప్పారు.

‘‘పిల్లాడిని జాగ్రత్తగా తీసుకెళ్లి చెట్టుపైన పెట్టినట్లు కనిపించింది. ఆ ప్రాంతానికి సురక్షితంగా వెళ్లమని దేవతనే తనకు మార్గనిర్దేశం చేసి ఉంటుంది’’ అని గోఫండ్‌మీ వెబ్ సైట్ చెప్పింది.

‘‘నేను నా పిల్లల కోసం అవసరమైతే ప్రాణాలిస్తాను. అందులో డౌట్ లేదు. మా ఆయన కూడా అంతే’’ అని మూరే అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)