You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హవాయి- మౌవి కార్చిచ్చు: ‘మంటలు చుట్టుముడుతున్నాయి. బతకాలంటే సముద్రంలోకి పరుగెత్తాల్సిందే’
అమెరికాలోని హవాయి ద్వీపం పర్యటకానికి ప్రసిద్ధి. ఈ ద్వీపాన్ని కార్చిచ్చు నాశనం చేసింది.
హవాయిలో భాగమైన మౌవి దీవిలో లహైనా ప్రాంతంలో టీ డాంగ్ తన ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి ఒక రెంటల్ కారులో ప్రయాణిస్తున్నారు. ఫ్రంట్‌స్ట్రీట్‌లో వెళుతుండగా, మంటలు వారి వైపు దూసుకువస్తున్న దృశ్యం వారికి కనిపించింది.
చుట్టూ ఉన్న కార్లకు కూడా నిప్పంటుకోవడంతో కారులో ఉన్న ఫుడ్, వాటర్, మొబైల్ ఫోన్లను పట్టుకుని కారు నుంచి దూకి సముద్రం వైపు పరుగెత్తాలని నిర్ణయించుకున్నారు.
చాలా మంది మంటలకు భయపడి సముద్రం వైపు వెళ్లడాన్ని వారు అప్పటికే చూశారు. అందులో ఒక వృద్ధ మహిళ కూడా ఉన్నారు.
‘‘మేం ఇక సముద్రంలోకి వెళ్లాలి. మంటలు మమ్మల్ని చుట్టుముడుతున్నాయి. మాకు అంతకన్నా మార్గం లేదు’’ అని కాన్సాస్‌కు చెందిన టీ డాంగ్ బీబీసీతో అన్నారు.
ఆమె ముగ్గురు పిల్లల వయసు 5, 13, 20 సంవత్సరాలు ఉంటుంది.
మంటలు చుట్టు ముడుతుండటంతో వారు సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. కానీ, సాయంత్రం అయ్యేసరికి ఆటుపోట్లు పెరిగి, నీరు ఒడ్డుకు కొట్టుకు రావడం మొదలైంది. ఒక దశలో అలలు ఆమెను హార్బర్ గోడకు విసిరి కొట్టడంతో కాలికి తీవ్ర గాయమైంది.
ఫ్రంట్ స్ట్రీట్‌లో ఉన్న దాదాపు 50 కార్లు నిప్పంటుకుని పేలిపోతుండటంతో, ఆ పేలుళ్ల నుంచి వచ్చే వస్తువులు తగలకుండా వారు సముద్రంలో మరింత లోతుకు వెళ్లాల్సి వచ్చింది.
తాము నాలుగు గంటలపాటు నీటిలోనే గడిపామని టీడాంగ్ వెల్లడించారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. అప్పటికి కార్చిచ్చు కారణంగా ఏర్పడ్డ పొగ వల్ల ఆకాశం నల్లగా మారింది.
‘ప్రాణాలతో ఉండటమే అదృష్టం’
ఒక దశలో తాము ఈ మంటల్లో సజీవ దహనమవడం ఖాయమని భావించింది టీ డాంగ్ కుటుంబం. చివరకు నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఒక పిల్లవాడు స్పృహ తప్పిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది వీరిని రక్షించారు.
ఆమె కుటుంబంతోపాటు 15 మంది బాధితులు ఆ సమయంలో టీడాంగ్ పక్కన ఉన్నారు.
‘‘మీరు చేయగలరో లేదో మాకు తెలియదు. కానీ, మేం ఏం చెబితే అది చేయాలి. దూకమంటే దూకాలి, పరుగెత్తమంటే పరుగెత్తాలి’’ అని ఫైర్ ఫైటర్స్ బృందం తమకు చెప్పిందని టీడాంగ్ గుర్తు చేసుకున్నారు.
55 మంది మృతి
టీడాంగ్ కుటుంబం సభ్యులందరికీ కాలిన గాయాలయ్యాయి. మౌవి దీవిలోని ఓ స్కూల్లో వారికి ఆశ్రయం లభించగా, ఆ స్కూలు కూడా మంటల్లో చిక్కుకోవడంతో వారంతా అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది.
హవాయి దీవుల్లోని మౌవి ద్వీపంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 55 మంది మరణించారని, 12 వేల మందికి పైగా నిర్వాసితులయ్యారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
పర్యటకానికి కేంద్రమైన లహైనా ప్రాంతం దారుణంగా దెబ్బతింది.
‘‘హవాయి చరిత్రలోనే ఇది అతి పెద్ద విపత్తు’’ అని గవర్నర్ జోష్ గ్రీన్ అన్నారు.
నూటికి నూరు శాతం మంటలు అదుపులోకి వచ్చిన ప్రాంతం ఒక్కటి కూడా లేదు.
వేల మందికి ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోందని, సురక్షిత ప్రాంతాలలో ఉన్నవారు ఇక్కడి వారికి ఆశ్రయం ఇవ్వాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
ఆస్తులన్నీ బూడిద
ఇల్లూ, వాకిలి కాలిపోగా, తాను ఉంటున్న ప్రాంతం నుంచి దూరంగా పారిపోయిన బ్రైస్ బరోయిడాన్‌లాంటి వారు అక్కడ చాలా మంది ఉన్నారు.
‘‘తిరిగి వచ్చేటప్పటికీ ఇల్లయినా ఉంటుందని అనుకున్నా. కానీ అది కూడా మిగల్లేదు. ఆస్తులన్నీ బూడిదయ్యాయి’’ అని బరాయిడాన్ అన్నారు.
‘‘ఇది నా ఒక్కడి పరిస్థితే కాదు, మా వీధిలో ఎవరికీ ఇప్పుడు ఇల్లు లేదు’’ అని ఆయన బీబీసీతో అన్నారు.
‘‘నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఐదు చమేలియన్(ఊసరవెల్లి)లను వదిలేసి రావడం బాధగా ఉంది’’ అంటూ 26 ఏళ్ల వ్యక్తి ఒకరు వాపోయారు.
లహైనా ప్రాంతంలో స్టీవ్ కెంపర్ ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఫ్రంట్ స్ట్రీట్‌లో గ్యాలరీ ఉంది. అది మొత్తం కాలిపోయింది.
తాము నివసించే ఈ ప్రాంతంలో అనేక ఇళ్లను కర్రతోనే తయారు చేస్తారని, మంటలు తీవ్రం కావడానికి ఇది ఒక కారణం కావచ్చని కెంపర్ అన్నారు.
హనీమూన్ కోసం వచ్చి లహైనాలోని ఓ హోటల్‌లో చిక్కుకుపోయిన తన తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వీలు కాలేదని, రెడ్‌క్రాస్ వారికి వారి వివరాలు చెప్పినా వారి నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని ఓ యువతి బీబీసీతో అన్నారు.
అగ్నికీలల నుంచి తప్పించుకుంటూ ఎయిర్ పోర్టుకు చేరిన టీ డాంగ్, ఆమె కుటుంబ సభ్యులు తిరిగి సొంతూరు కాన్సాస్ వెళ్లాలని భావిస్తున్నారు.
ఒక్క గురువారమే మౌవి దీవి నుంచి సుమారు 14 వేల మందిని తరలించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)