You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటనం ఒకేసారి జరిగితే ఎంత ప్రమాదం, ఆ దేశం ఎందుకు భయపడుతోంది?
వరుసగా కంపిస్తున్న భూమి, ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంతో ఐస్‌లాండ్ భయం భయంగా గడుపుతోంది.
భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్ళకు యూరప్‌లోని ఐస్‌లాండ్ ద్వీపకల్ప దేశం ప్రసిద్ధిగాంచింది.
తాజాగా సంభవిస్తున్న భూకంపాలతో, సమీపంలోని అగ్నిపర్వతం విస్ఫోటనం చెందొచ్చనే భయంతో ఐస్‌లాండ్ అత్యవసరస్థితిని ప్రకటించింది.
ఈమేరకు అధికారులు ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా గ్రిండ్‌విక్ పట్టణానికి నైరుతిదిశలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ ఆదేశించారు.
అగ్నిపర్వత శిలలు కరిగిపోయి భూగర్భంలో వ్యాపిస్తున్నాయని, ఇవి భూమిపైకి కూడా వచ్చే అవకాశం ఉందని ఐస్‌లాండ్ మెట్ ఆఫీస్ (ఐఎంఓ) ఆందోళన చెందుతోంది.
ఫాగ్రాదాల్స్‌ఫ్యాల్ అగ్నిపర్వతం వద్ద ఇటీవల వారాలలో వేలాది ప్రకంపనలు నమోదయ్యాయి.
రేక్‌జానెస్ ద్వీపకల్పంలో ఈ ప్రకంపనలు కేంద్రీకతమై ఉన్నాయి. ఈ ద్వీపకల్పంలో 2021లో అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. అయితే అంతకుముందు 800 ఏళ్ళపాటు ఈ ద్వీపకల్పంలో విస్ఫోటనాలు లేవు.
ఇటీవల భూప్రకంపనలు పెరగడంతో సమీపంలోని బ్లూలాగూన్ ను మూసివేశారు. అక్టోబరు చివరివారంలో ఐస్‌లాండ్ నైరుతిదిశలో 20వేలకుపైగా భూకంపనాలు నమోదయ్యాయి.
భూమి అడుగున్న ఏర్పడుతున్న శిలాద్రవ టన్నెల్ గ్రిండ్‌విక్ పట్టణానికి సమీపించే అవకాశం ఉందనే నిర్థరణకు వచ్చాకే ప్రజలను ఖాళీచేయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఐస్‌లాండ్ పౌర రక్షణ ఏజెన్సీ తెలిపింది.
ప్రజలు తప్పనిసరిగా పట్టణాన్ని విడిచి వెళ్ళాలని ఈ ఏజెన్సీ కోరింది. అయితే ఇదేమీ అత్యవసర తరలింపు కాదని పేర్కొంది. జనం పట్టణాన్ని వదిలి వెళ్ళేందుకు తగిన సమయం ఉందని, కాబట్టి ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వెళ్ళవచ్చని తెలిపింది.
‘‘తక్షణ ప్రమాదమేమీ లేదు. కాకపోతే గ్రిండ్‌విక్ నివాసితులను రక్షించడమనే ప్రాథమిక లక్ష్యం మేరకు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయమని కోరుతున్నట్టు ఏజెన్సీ చెప్పింది.
పట్టణంలో 4వేలమంది ప్రజలు ఉపయోగిస్తున్న రహదారులను మూసివేశారు. కేవలం అత్యవసర రాకపోకలను మాత్రమే అనుమతిస్తున్నారు.
భూ ప్రకంపనలలో చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తున్నట్టు ఐఎంఓ తెలిపింది. రోజు గడుస్తున్న కొద్దీ ప్రకంపనలు గ్రిండ్‌విక్ పట్టణం వైపు కదులుతున్నాయని చెప్పింది.
అగ్నిపర్వత శిలాద్రవం పట్టణం అడుగున వ్యాపిస్తూ ఉండవచ్చు. కానీ దానిని కచ్చితంగా ఎక్కడుందని కనిపెట్టడం కష్టం అని ఐఎంఓ తెలిపింది.
ప్రపంచంలో చురుకైన అగ్నిపర్వత ప్రాంతాలను కలిగిన ప్రదేశాలలో ఐస్‌లాండ్ ఒకటి. ఇక్కడ 30కు పైగా చురుకైన అగ్నిపర్వత ప్రాంతాలు ఉన్నాయి.
అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినప్పుడు తన చుట్టు ఉండే రాతి ప్రాంతం కన్నా తేలికైన శిలాద్రవం భూగర్భం నుంచి ఉపరితలానికి ఎగజిమ్ముతుంది.
ఈ ప్రాంతంలో 2021 నుంచి ఇప్పటిదాకా వరుసగా మూడేళ్ళపాటు అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించాయి. అంతకుముందు 800 ఏళ్ళపాటు ఈ ప్రాంతమంతా నిద్రాణంగానే ఉంది.
ఇవికూడా చదవండి :
- యుద్ధం లక్ష్యానికి ఇజ్రాయెల్ ఎంత దూరంలో ఉంది?
- కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత గర్భం దాల్చితే ఏం చేయాలి? వారికి ప్రభుత్వం చేసే సాయం ఎంత?
- అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరి యాదవుల బంగారం, వజ్రాలు, వెయ్యి మణుగుల వెండి దోచుకున్నారా? ఈ కోట రక్షణకు బాహుబలి తరహా సెటప్ ఉండేదా?
- హరియాణా ప్రభుత్వ పాఠశాలలో 60 మంది బాలికలపై ‘లైంగిక వేధింపులు’.. నల్లద్దాల క్యాబిన్లో అసలేం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)