You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి
సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో ఆయన కన్ను మూశారు..
చంద్రమోహన్ వయసు 82 ఏళ్లు.
ఆయన కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1942 మే 23న జన్మించారు.
చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చంద్రమోహన్ మృతదేహానికి సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయి.
చంద్రమోహన్ తెలుగు, ఇతర భాషల్లో కలిపి 900కు పైగా సినిమాల్లో నటించారు.
ఆయన తొలి చిత్రం ‘రంగులరాట్నం’.
అలనాటి దర్శకుడు బీఎన్ రెడ్డి తనకు బ్రేక్ ఇచ్చారని ఆయన ద హిందూ పత్రికతో 2011లో చెప్పారు. ఆ సినిమా 1967లో ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు స్వర్ణ నంది పురస్కారాన్ని దక్కించుకొందని ఆయన తెలిపారు.
కొత్త వారితో సినిమాలు చేసే ట్రెండ్ అప్పుడప్పుడే మొదలైందని ఆయన చెప్పారు.
కేసీఆర్, జగన్ సంతాపం
చంద్రమోహన్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్ల మంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.
తెలుగుతో పాటు పలు భాషల్లో అభిమానులను చంద్రమోహన్ సొంతం చేసుకున్నారని, ఆయన స్పూర్తితో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగారని కేసీఆర్ చెప్పారు.
పౌరాణిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో, తన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ ఆకట్టుకున్నారని నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఆయనతోపాటు పలు చిత్రాల్లో నటించానని, ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు లోటు అని చెప్పారు.
చంద్రమోహన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
నటుడిగా చంద్రమోహన్ ప్రాధాన్యం ఎనలేనిదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.
''నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకు నటుడిగా వారి ప్రాధాన్యం ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను'' అని ఆయన ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.
చంద్రమోహన్ పరిచయం గొప్ప స్నేహంగా మారిందని, ఇక ఆయన సాన్నిహిత్యం లేకపోవడం వ్యక్తిగతంగా తీరని లోటు అని నటుడు చిరంజీవి తెలిపారు.
''నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు'' అని తెలిపారు.
‘‘హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన నటుడు చంద్రమోహన్ మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు.
చంద్రమోహన్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని, ఆయన మృతి బాధాకరమని నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది.)
ఇవి కూడా చదవండి
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)