You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శరత్ బాబు: అరుదైన పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించిన క్యారెక్టర్ యాక్టర్
సీనియర్ నటుడు శరత్ బాబు సోమవారం కన్నుమూశారు.
ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఏఐజీ హస్పిటల్ వర్గాలు ధ్రువీకరించాయి.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, శరత్ బాబు అనారోగ్యంతో గత నెలలో తొలుత బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
అక్కడ ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
శరీరంలోని పలు అవయవాలు పని చేయడం మానేయడంతో ఆయన మృతి చెందినట్లు ఏఐజీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆముదాలవలసలో జననం
శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు.
ఆయన 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో జన్మించారు. 1973లో రామ రాజ్యం సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు.
1974లో సహనటి రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. అయితే, వ్యక్తిగత కారణాల రీత్యా వీరు విడాకులు తీసుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, విలన్‌గా సహాయనటుడిగా అనేక పాత్రలు పోషించారు.
తెలుగులోనే కాకుండా తమిళ సినీ పరిశ్రమలో కూడా ఆయన అనేక పాత్రల్లో నటించారు.
సీనియర్ ఎన్టీఆర్, కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఆయన స్క్రీన్‌ను పంచుకున్నారు.
50 ఏళ్ల సినీ కెరీర్‌లో మొత్తం 250కి పైగా సినిమాల్లో ఆయన నటించారు.
ఎన్నో హిట్ సినిమాలు
తెలుగులో ఆయన నటించిన మరోచరిత్ర, పంతులమ్మ, గుప్పెడు మనసు, శృంగార రాముడు, ఇది కథ కాదు, సంసారం ఒక చదరంగం, సాగర సంగమం, స్వాతి ముత్యం, సితార, అన్వేషణ, సీతాకోకచిలుక, క్రిమినల్, అన్నయ్య, హలో బ్రదర్, మగధీర, సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
మరో చరిత్ర, గుప్పెడు మనసు, సితార చిత్రాలను చూసిన తరానికి శరత్‌బాబు ఎంత సునిశిత నటుడో గుర్తుండిపోతుంది. సితారలో వేదనను, సీతాకోక చిలుక చిత్రంలో అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఆయన ప్రదర్శించిన నటన ప్రశంసలకు నోచుకుంది.
అందమైన విలన్‌గానూ ప్రేక్షకులను భయపెట్టిన ప్రతిభ శరత్ బాబు సొంతం. ఏ పాత్రను అభినయించినా ఆ పాత్రతోనే గుర్తుండిపోయేలా నటించడం శరత్ బాబు స్పెషాలిటీ.
సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌తో కూడా ఆయన ప్రేక్షకులకు చేరువయ్యారు.
మలయాళం, కన్నడ భాష సినిమాల్లో కూడా ఆయన నటించారు.
ఆయన నటనకుగానూ మొత్తం 8 నంది అవార్డులు అందుకున్నారు.
ఆయన చివరగా తెలుగు సినిమా మళ్లీ పెళ్లిలో నటించారు.
ఆయన మృతిపై సినీ సహచరులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
చిరంజీవి సంతాపం:
వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు శరత్ బాబు గారి మరణవార్త కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
"అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శరత్ బాబుతో నాకు ఎంతో అనుబంధం వుంది." అని చిరంజీవి ట్వీట్ చేశారు.
చెన్నైలో అంత్యక్రియలు
శరత్ బాబు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సోమవారం రాత్రి 7.30 గంటల వరకు ఫిలిమ్ చాంబర్లో ఉంచుతారు.
ఆ తర్వాత అంబులెన్స్ ద్వారా చెన్నైకి తీసుకెళ్తారు
రేపు ఉదయం చెన్నైలో అంత్యక్రియలు.
ఇవి కూడా చదవండి
- డైనోసార్స్: పెట్రోల్, డీజిల్‌లు ఈ జంతువుల వల్లే పుట్టుకొచ్చాయా?
- జర్మనీ: రూ.1,000 కోట్ల విలువైన సంపదను ఐదుగురు దొంగలు ఎలా కొట్టేశారంటే...
- 30 అడుగుల లోతు నీటిలో 74 రోజులుగా ఈ వ్యక్తి ఎలా జీవిస్తున్నారంటే...
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- టైటానిక్: సముద్ర గర్భంలోని ఈ భారీ నౌక 'డీప్ సీ మ్యాపింగ్'తో ఎంత స్పష్టంగా కనిపిస్తోందో చూడండి...
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)