పాకిస్తానీ అమ్మాయిని పెళ్ళాడేందుకు ఏడేళ్ళు ఎదురుచూసిన భారత ప్రేమికుడు

    • రచయిత, గురుప్రీత్ చావ్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్థాన్‌కు చెందిన షెహ్లీన్‌‌ను వివాహం చేసుకోవడానికి భారతదేశానికి చెందిన నమన్ ఏడేళ్లు ఎదురుచూశారు.

భారత్‌, పాకిస్థాన్‌‌లకు చెందిన జంట మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది.

ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ ప్రేమ ఇప్పుడు పెళ్లితో మరింత దగ్గరైంది.

ఈ ప్రేమ కథ 2015లో మొదలైంది. సరిహద్దు, మతం, భారత్-పాకిస్థాన్ విభేదాల గోడల్ని దాటి ఈ ప్రేమ విజయం సాధించింది.

ఈ ప్రేమకథ 2015లో మొదలైంది.

నమన్ లూత్రా, షెహ్లీన్‌ జావేద్ ఈ కథలో ప్రధాన పాత్రధారులు.

నమన్ పంజాబ్‌కు చెందిన వ్యక్తి, వృత్తిరీత్యా న్యాయవాది. షెహ్లీన్‌ పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన అమ్మాయి.

వారిద్దరూ 2015లో మొదటిసారి కలుసుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత అంటే 2023 మేలో వారు పెళ్లితో ఒక్కటయ్యారు.

నమన్ హిందువు అయితే షెహ్లీన్‌ క్రిస్టియన్. దీంతో వారిద్దరూ హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు.

అయితే పెళ్లికి ముందు ఇద్దరూ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు షెహ్లీన్‌ పెళ్లి కోసం ఇండియా వచ్చారు.

నమన్, షెహ్లీన్‌కు ఎలా పరిచయం?

2015లో నమన్ లూత్రా తన తల్లి, నానమ్మతో కలిసి లాహోర్ వెళ్లారు.

అక్కడ షెహ్లీన్‌ను కలిశారు. ప్రస్తుతం పంజాబ్‌లోని బాటాలాలో నివసిస్తున్న నమన్ తాత (తండ్రికి తండ్రి) ఒకప్పుడు పాకిస్తాన్‌లోని లాహోర్‌లో నివసించారు.

దేశ విభజన తరువాత అతని తాత భారతదేశానికి వచ్చారు. కాబట్టి పాకిస్తాన్, అక్కడి ప్రజలు నమన్‌కు కొత్తేమీ కాదు.

2015లో బంధువులను కలుసుకోవడానికి తల్లి, అమ్మమ్మతో కలిసి నమన్ లాహోర్‌ వెళ్లాను. షెహ్లీన్‌ ఆయన దూరపు బంధువు. అక్కడ ఆమెను కలిశారు.

అనంతరం నమన్ భారతదేశానికి తిరిగి వచ్చారు. అయితే నమన్ ఆన్‌లైన్‌లో షెహ్లీన్‌తో కాంటాక్ట్‌లో ఉన్నారు.

అభిరుచులు కలవడంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తర్వాత 2016లో కుటుంబసభ్యుల అనుమతితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక పాకిస్థాన్‌లో జరిగింది.

2018లో తన తల్లి, అత్తతో కలిసి ఇండియాకు వచ్చానని షెహ్లీన్‌ చెప్పారు. ఇక్కడే ఆమె, నమన్ కుటుంబం కలుసుకున్నారు.

సమస్య ఎక్కడొచ్చింది?

నమన్, షెహ్లీన్‌ పెళ్లి ఇరు కుటుంబాలకు ఆమోదమే కానీ, భారత్, పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో కలిసి జీవించడం వారికి అంత సులభం కాదు.

2018లో జరిగిన ఫ్యామిలీ మీటింగ్‌లో ఇరువురికి కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించారు.

కానీ 2020లో ప్రపంచం మొత్తం కోవిడ్ మహమ్మారి బారిన పడింది.

కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో చాలా దేశాలు తమ సరిహద్దులను పూర్తిగా మూసివేశాయి.

అంతేకాదు అంతర్జాతీయ ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధించారు.

భారత్‌, పాకిస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ భారత్‌ నిషేధించింది.

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఇరు దేశాలకు వెళ్లడం కష్టతరంగా మారింది.

కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత షెహ్లీన్ కుటుంబం 2021 డిసెంబర్‌లో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుంది.

ఆమె భారత్‌కు రావడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వీసా పొందలేకపోయారు.

ఆరు నెలల తర్వాత అంటే 2022 మేలో మరోసారి వీసా పొందడానికి ప్రయత్నించారు. అయితే ఈసారి కూడా ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది.

చివరగా 2023 మార్చిలో ఆమెకు తన మూడో ప్రయత్నంలో వీసా వచ్చింది.

కానీ షెహ్లీన్, ఆమె తల్లికి మాత్రమే వీసా లభించింది. దీంతో 2023 ఏప్రిల్‌లో భారతదేశానికి చేరుకున్నారు.

షెహ్లీన్ మాట్లాడుతూ "నీ మనస్సు కోరుకునేది మీరు పొందవచ్చు. నిశ్చితార్థం అయినప్పటి నుంచి ఇండియా రావాలని అనుకున్నాను. నేను ఎవరి మాట వినలేదు. ఎంత ఆలస్యమైనా తనకోసం వేచి ఉండాలని అనుకున్నాను. అలాగే ఉన్నాను'' అని అన్నారు.

షెహ్లీన్, నమన్‌లకు పెళ్లి సంబంధం కుదిరింది. కానీ పెళ్లికి చాలా రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారిద్దరూ ఫోన్, సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉన్నారు.

పెళ్లి జాప్యం, వీసాలు రావడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఇరు కుటుంబాలు కర్తార్‌పూర్ సాహిబ్‌కు వెళ్లిపోయాయి. అక్కడ ఇద్దరు మళ్లీ కలుసుకున్నారు.

ఆసక్తికరంగా శ్రీ గురునానక్ దేవ్‌జీ 550వ జయంతి సందర్భంగా 2019 నవంబర్‌లో పాకిస్తాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ భారతీయ పౌరుల కోసం తెరిచారు. ఇదే వారిని మళ్లీ కలుసుకునేలా చేసింది.

ఇరువురి ప్రేమపై కుటుంబ సభ్యులు ఏమన్నారు?

పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయితో తన కొడుకు పెళ్లి జరిపించడం నమన్ తల్లికి అంత సులువు కాలేదు.

''చిన్నతనంలో నమన్ తన బంధువులను చూడటానికి పాకిస్తాన్‌కు వెళ్లేవాడు. అబ్బాయి పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. మొదట్లో నమన్ తండ్రి కూడా ఈ వివాహానికి ఒప్పుకోలేదు. పెళ్లికి వరుడు ఎలా వెళ్తాడని, పెళ్లి ఎలా చేస్తామని ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల మధ్య చాలాదూరం ఉండటంతో పెళ్లికి అడ్డంకులు వచ్చాయి. అయితే నమన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. దీంతో నమన్ తండ్రి వివాహానికి అంగీకరించారు. అయితే వివాహం బటాలాలో జరగాలని షరతు విధించారాయన. అనంతరం షెహ్లీన్‌ కుటుంబానికి ఈ విషయం చెప్పాం. పాకిస్థాన్ వదిలి ఇండియాలో నివసించాలని అనుకుంటున్న నమన్ అమ్మమ్మ అంతా ముందుండి నడిపించారు'' అని నమన్ తల్లి యోగిత అన్నారు.

నమన్ నాయనమ్మ, "నమన్ నా మనవడు, షెహ్లీన్ నా మనవరాలు. ఈ సంబంధం గురించి మాట్లాడుకున్నప్పుడు పిల్లలిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఇంతకాలం వేచి ఉండాల్సి వస్తుందనుకోలేదు.

అప్పుడప్పుడు బంధువులు ఇలా వేచి ఉండటం కష్టమని, మరొకటి చూసుకోవాలని చెప్పేవారు.

అయితే పిల్లలిద్దరూ తమ నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో ఈరోజు ఇరు కుటుంబాల ఇళ్లలో దేవుడు సంతోషాన్ని నింపాడు'' అని చెప్పారు.

ఇండియాకు రాగానే చాలా కంగారుపడ్డాం..

పాకిస్తాన్ నుంచి కూతురి పెళ్లి కోసం ఇండియా వచ్చిన షెహ్లీన్‌ తల్లి మాట్లాడుతూ ''నమన్ ప్రాంతానికి రాగానే మేం చాలా కంగారుపడ్డాం. అందరం కలిసి ఆలోచించాం.

అమ్మాయికి పెళ్లి చేసేటపుడు దగ్గర్లోని మామగారిని చూడాలని చాలామంది చెప్పారు. మేం వీసా కోసం మూడుసార్లు ప్రయత్నించాం.

కానీ మూడోసారి షెహ్లీన్‌‌కు, నాకు మాత్రమే వీసా వచ్చింది. ఇక్కడ (ఇండియాలో) దాదాపు 15 రోజులుగా వివాహ వేడుకలు జరుగుతున్నాయి.

ప్రభుత్వోద్యోగి అయిన నమన్ తండ్రి గుర్విందర్ పాల్ కూడా వివాహం పట్ల సంతోషంగా ఉన్నారు'' అని అన్నారు.

గురుదాస్‌పూర్ ఎంపీ సన్నీ డియోల్, బటాలా ఎమ్మెల్యే అమన్ షెర్సింగ్ షెరీ కల్సి కలిసి షెహ్లీన్‌, ఆమె తల్లికి వీసాలు పొందడంలో సాయం చేశారని నమన్ కుటుంబ సభ్యులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)