You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మెడలో వెయ్యి ఫిర్యాదుల దండతో రోడ్డుపై పాక్కుంటూ కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లారు.. ఏడేళ్లుగా పట్టించుకోని అధికారులు ఒక్కసారిగా కదిలొచ్చారు
- రచయిత, శురేహ్ నియాజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మట్టి కుండలు అమ్ముతూ జీవనం సాగించే ముఖేశ్ ప్రజాపతి ఒక్కసారిగా జిల్లా అధికారులను పరుగులు పెట్టించారు.
మధ్యప్రదేశ్‌లోని నీమచ్ జిల్లాకు చెందిన ముఖేశ్ తన గ్రామంలో జరుగుతున్న అవినీతిపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నారు.
అయితే, ఆయన ఫిర్యాదులకు ఎలాంటి స్పందన ఉండడం లేదు.
స్థానికంగా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అన్ని స్థాయిలలోనూ ఆయన ఫిర్యాదులు చేశారు.
ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ, ఏనాడూ చర్యలు తీసుకోలేదన్నారు ముఖేశ్. కానీ మంగళవారం (ఈ నెల 3న) ఆయన చేపట్టిన నిరసన చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం దిగొచ్చేలా చేసింది.
ఊరి సమస్య అందరికి తెలియాలని ముఖేశ్ వినూత్న నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. 1,000 ఫిర్యాదు పేజీలతో తయారుచేసిన దండను మెడలో వేసుకొని, చొక్కా లేకుండా చెప్పులు తలపై పెట్టుకొని, రోడ్డుపై పాకుతూ నీమచ్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. దీంతో కలెక్టర్ హిమాన్షు చంద్ర ఈ ఫిర్యాదులపై విచారణకు ఆదేశించారు.
అసలేం జరిగింది?
ముఖేశ్ ప్రజాపతిది నీమచ్ జిల్లా కాకరియా తలై గ్రామం. మాజీ సర్పంచ్ పుష్పాబాయి మేఘవాల్, ఆమె భర్త గోవింద్ రామ్ గంఘ్వాల్ అవినీతికి పాల్పడుతున్నారంటూ గత ఏడేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నట్లు ముఖేశ్ తెలిపారు.
పుష్పాబాయి 2015 నుంచి 2022 వరకు గ్రామ సర్పంచ్‌గా పనిచేసి భారీగా అవినీతికి పాల్పడ్డారని ముఖేశ్ ఆరోపించారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
అందుకే, ఆఖరి ప్రయత్నంగా ఇలా చేశానని, ఒకవేళ దీనికీ అధికారులు స్పందించకపోతే ఇక ఫిర్యాదులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ముఖేశ్ తెలిపారు.
ఫిర్యాదు పత్రాలతో ఆయన పాకుతూ 200 అడుగుల దూరం వెళ్లారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫిర్యాదులపై కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చిందని ఆయన అన్నారు.
ఫిర్యాదుదారును వెంటపెట్టుకునే ఈ విచారణ జరపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించడంతో, విచారణ సమయంలో అధికారుల వెంటే ఉన్నానని ముఖేశ్ చెప్పారు.
మేం తప్పు చేయలేదు: సర్పంచ్ భర్త
‘‘నేను, నా భార్య పుష్పాబాయి ఎలాంటి అవినీతికి పాల్పడలేదు’’ అని గోవింద్ రామ్ చెప్పారు. అధికారులు విచారణ జరుపుతున్నారని, వాస్తవాలు వెల్లడవుతాయని ఆయన అన్నారు.
"గ్రామంలో ఆక్రమణలు, ఇతర ఆరోపణలపై ఫిర్యాదులను స్వీకరించాం. వీటిపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ గ్రామాన్ని సందర్శించి నివేదికను సమర్పిస్తుంది. దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి" అని నీమచ్ జిల్లా కలెక్టర్ హిమాన్షు చంద్ర అన్నారు.
నా గ్రామం వెనకబడిపోయింది: ముఖేశ్
ముఖేశ్ గ్రామం నుంచి కిలోమీటరు దూరంలో రాజస్థాన్ సరిహద్దు ప్రారంభమవుతుంది.
ముఖేశ్ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోని సమీప గ్రామాల్లో మట్టి కుండలు విక్రయిస్తుంటారు. ఆయనకు ఇలా రోజూకు రూ.300-400 వరకు ఆదాయం వస్తుంది.
ముఖేశ్‌కు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ నీమచ్‌లోని ప్రభుత్వ ఎక్సలెన్స్ స్కూల్‌లో చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నారు.
గ్రామ జనాభా సుమారు 2,500 నుంచి 3,000 వరకు ఉంటుంది. కకారియా తలై అత్యంత వెనుకబడిన గ్రామాలలో ఒకటని, అవినీతి వల్ల పరిస్థితి మరింత దిగజారిపోయిందని ముఖేశ్ అంటున్నారు.
గ్రామంలోని అవినీతిపై మిగతా వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదని ముఖేశ్‌ను ప్రశ్నిస్తే “ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా అది మా డబ్బే. ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించాలి. అందుకే అవినీతికి వ్యతిరేకంగా నిలబడ్డాను. గ్రామ సర్పంచ్, ఆమె భర్త మొత్తం చెరువును ధ్వంసం చేసి, దానిలోని మట్టిని రూ. 35-40 లక్షలకు అమ్మేశారు. మురికినీటి కాలువలు, రోడ్డు ఇలా ఏదీ నిర్మించలేదు, అన్నీ కాగితాలపైనే ఉన్నాయి. అందుకే వీటన్నింటిపై నిరసన వ్యక్తం చేశాను’’ అని అన్నారు .
గ్రామంలోని ప్రతి పనిలోను అవినీతి జరిగిందని, అయితే ముఖేశ్‌లా అందరూ నిలబడలేరని, అలా ప్రశ్నిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) అన్నారు.
మోదీ గారూ! ఇది న్యూ ఇండియా: కాంగ్రెస్
నీమచ్ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఎక్స్ వేదికగా స్పందించారు.
"నరేంద్రమోదీ గారూ, ఇది మన "న్యూ ఇండియా" చిత్రం! మీరు పథకాల పేరు చెప్పి రాష్ట్ర ప్రజలను ఓట్లడిగారు. కానీ మధ్యప్రదేశ్‌ను ఈ అవినీతి ప్రభుత్వానికి అప్పగించారు. ఈరోజు మాఫియా, అవినీతి అధికారులు రాష్ట్రంలోని ప్రతి రంగం, డిపార్టుమెంట్‌ను శాసిస్తున్నారు. వారి భయంతో రాష్ట్ర ప్రజలు న్యాయం కోసం ఇలా పాకవలసి వస్తోంది. దయచేసి నీమచ్ ఘటనపై దర్యాప్తు చేయించండి" అని తెలిపారు.
అయితే, రాష్ట్రంలో ఇలాంటి కేసు ఇదే మొదటిది కాదు. అంతకుముందు జులైలో మందసౌర్‌లో ఒక వృద్ధ రైతు కలెక్టర్ కార్యాలయానికి పొర్లుతూ వచ్చారు. ఆయన భూమిని ల్యాండ్ మాఫియా కబ్జా చేసిందని ఆరోపించారు. ఆ తర్వాత వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)