You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సైబర్ బానిసలు: ‘నా కళ్ళ ముందే ఆ ఇద్దరు అమ్మాయిలను 17మంది రేప్ చేశారు, నన్ను 16 రోజులు చిత్ర హింసలు పెట్టారు’
- రచయిత, సునేత్ పెరీరా, ఇస్సారియా ప్రేతోంగ్యం
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
హెచ్చరిక: ఈ కథనంలో మిమ్మల్ని కలచి వేసే అంశాలు ఉంటాయి.
‘‘వాళ్ళు నా ఒంటిపైనున్న దుస్తులు తీసేసుకున్నారు. ఓ కుర్చీలో కూర్చోబెట్టారు. తరువాత నా కాలికి కరెంట్ షాక్ ఇచ్చారు. ఇక అదే నాకు చివరిరోజు అనిపించింది’’
శ్రీలంకకు చెందిన రవి (పేరు మార్చాం) ఐటీ ఉద్యోగం కోసం థాయ్‌లాండ్‌కు వెళ్ళారు. బ్యాంకాక్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో పనిచేయాల్సిన 24 ఏళ్ళ రవి మియన్మార్‌లోని ఓ చీకటి గదిలో చిక్కుకుపోయారు.
థాయ్‌లాండ్ సరిహద్దు పట్టణమైన మాసాట్‌లో ఆయనను కిడ్నాప్ చేసి, అక్కడి నది మీదుగా తరలించారు. మానవ అక్రమ రవాణాలో రవి ఓ బాధితుడు.
ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే క్రిమినల్ గ్యాంగ్‌లకు అమ్మేసినట్టు ఆయనకు చెప్పారు. ఈ క్రిమినల్ గ్యాంగ్‌లు చైనీస్ మాట్లాడుతుంటాయి. కిడ్నాప్ చేసి తీసుకువచ్చిన వ్యక్తులను ఆన్‌లైన్ మోసాలకు పాల్పడేందుకు గంటలకొద్దీ పనిచేయిస్తుంటారు. వీరు తమను తాము అమ్మాయిలుగా పరిచయం చేసుకుని నకిలీ గుర్తింపుతో అమెరికా, యూరప్‌లలోని ఒంటరి పురుషులను మోసం చేస్తారు.
ఎవరైనా వీరి వలకు చిక్కితే, మంచి లాభాలు వస్తాయంటూ అబద్ధాలు చెప్పి నకిలీ ట్రేడింగ్
ఫ్లాట్‌ఫామ్స్ పై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేలా ఒప్పిస్తారు.
రవి ఉన్న బానిసల శిబిరం మైవడిలోని అటవీప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం మియన్మార్ మిలటరీ ప్రభుత్వ నియంత్రణలో లేదు.
ఇంటర్‌పోల్ ప్రకారం కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలు ఇప్పిస్తామని అబద్ధాలు చెప్పి ఆసియా, తూర్పు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పశ్చిమ యూరప్‌కు చెందిన వేలాదిమందిని క్రిమినల్ గ్యాంగ్‌లు ఆకర్షించి, ఈ సైబర్ క్రిమినల్ శిబిరాలలో పనిచేయిస్తున్నాయి.
వీరు చెప్పే ఆదేశాలను పాటించనివారిని చిత్రహింసలకు గురిచేస్తారు. వారిని చావ బాదుతారు. వారిపై అత్యాచారం చేస్తారు.
‘‘వారు చెప్పింది చేయనందుకు 16 రోజులపాటు ఓ గదిలో బంధించారు. సిగరెట్ పెట్టె ముక్కలు, బూడిద కలిపిన నీరు ఇచ్చి తాగమనేవారు’’ అని రవి బీబీసీకి చెప్పారు.
‘‘నేను బందీగా ఉన్న సమయంలో ఒకరోజు నా పక్క సెల్‌లోకి ఇద్దరు అమ్మాయిలను తీసుకువచ్చారు. వారిపైన నా కళ్ళెదుటే 17మంది అత్యాచారం చేశారు’’ అని చెప్పారు.
‘‘అందులో ఒకమ్మాయి ఫిలిప్పిన్స్ జాతీయురాలు. మరొక అమ్మాయి ఎవరో తెలియదు’’ అని రవి గుర్తు చేసుకున్నారు.
బాధితులు ఎవరు?
ఐక్యరాజ్య సమితి అంచనాల మేరకు ఒక్క 2023లోనే మియన్మార్‌లో లక్షా ఇరవై వేలమందిని, కంబోడియాలో లక్షమందిని ఆన్‌లైన్ మోసాల కోసం బలవంతంగా పని చేయించారు.
లావోస్, ఫిలిప్పీన్స్, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాంలో కొన్ని ప్రాంతాలు ఈ ఆన్‌లైన్ మోసాలకు కేంద్రాలుగా ఉన్నాయని ఇంటర్‌పోల్ నివేదికలు చెబుతున్నాయి.
‘‘ఈ వ్యవహారం ఓ ప్రాంతీయ సమస్య నుంచి ప్రపంచ భద్రతా సమస్యగా పరిణమిస్తోంది’’ అని ఇంటర్‌పోల్ ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు.
ఇప్పటిదాకా కాంబోడియాలో విక్రయానికి గురైన 250మంది భారతీయులను రక్షించినట్టు భారత ప్రభుత్వం ఈ నెల మొదట్లో ప్రకటించింది. మార్చిలో చైనా కూడా మయన్మార్‌లోని స్కామ్ కేంద్రాల నుంచి వందలాదిమంది చైనా పౌరులను రక్షించింది.
ఈ కేంద్రాలను మూసేయాల్సిందిగా చైనా ప్రభుత్వం మియన్మార్ సైనిక ప్రభుత్వంపైనా, సాయుధ గ్రూపులపైనా ఒత్తిడి తెస్తోంది.
మియన్మార్‌లోని నాలుగు వేరువేరు ప్రాంతాలలో కనీసం 56మంది శ్రీలంక పౌరులు బందీలుగా ఉన్నారనే విషయం శ్రీలంక అధికారులకు తెలుసు. స్థానిక అధికారుల సహాయంతో 8మందిని రక్షించినట్టు మియన్మార్‌లోని శ్రీలంక రాయబారి జనక బండారా బీబీసీకి చెప్పారు.
ఈ అధునాతన బానిస శిబిరాలు నడిపేవారికి ఉపాధి కోసం వలస పోవాలనుకునేవారే లక్ష్యంగా మారుతున్నారు.
ప్రతి సంవత్సరం లక్షలమంది దక్షిణాసియా ఇంజనీర్లు, డాక్టర్లు, నర్సులు, కంప్యూటర్ నిపుణులు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళుతుంటారు.
రవి కూడా కంప్యూటర్ నిపుణుడు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలకంను వదిలి ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నప్పుడు ఆయనకు బ్యాంకాక్‌లో డేటా ఎంట్రీ ఉద్యోగం ఉన్నట్టు స్థానిక ఏజెంట్ ద్వారా తెలిసింది. జీతం కింద 12 వందల అమెరికన్ డాలర్లు ముడుతుందని చెప్పారు. ఇది శ్రీలంక రూపాయలలో 3,70,000కు సమానం.
రవికి ఇటీవలే పెళ్ళయింది. ఈ కొత్త ఉద్యోగంతో ఇల్లు కట్టుకోవచ్చని రవి,ఆయన భార్య భావించారు. అందుకే అందినచోటల్లా అప్పులుచేసి, స్థానిక ఏజెంట్‌కు ముట్టచెప్పారు.
థాయ్‌లాండ్ టు మయన్మార్
రవితోపాటు కొంతమందిని 2023లో శ్రీలంక నుంచి బ్యాంకాక్‌కు పంపారు. అక్కడి నుంచి పశ్చిమ థాయ్‌లాండ్‌లోని మేసోట్‌కు తరలించారు.
‘‘వారు మమ్మల్ని ఒక హోటల్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ ఆయుధాలు ధరించిన ఇద్దరు వ్యక్తులకు అప్పగించారు. తర్వాత ఓ నదిని దాటించి మియన్మార్‌కు తీసుకువచ్చారు’’ అని రవి చెప్పారు.
అక్కడి నుంచి చైనీస్ మాట్లాడే వ్యక్తి నడిపిస్తున్న ఓ క్యాంప్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ ఎలాంటి ఫోటోలు తీయవద్దని ఆదేశించారు.
‘‘మాకు చాలా భయమేసింది. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన సుమారు 40మంది యువతీ యువకులను ఆ క్యాంపులో బందీలుగా కనిపించారు.’’ అని రవి చెప్పారు.
ఎవరూ తప్పించుకుపోవడానికి వీల్లేకుండా ఈ క్యాంపుల చుట్టూ పెద్ద పెద్ద ప్రహరీ గోడలు వాటిపైన ముళ్ళ కంచెలు ఉండేవని రవి చెప్పారు. వీటి ప్రవేశద్వారాల వద్ద సాయుధులు 24గంటలూ కాపలా కాస్తుండేవారట.
రవితోపాటు మిగిలినవారిని బలవంతంగా 22 గంటలు పనిచేయించేవారు. నెలలో ఒక పూట మాత్రమే విశ్రాంతి ఇచ్చేవారు. ప్రతినెలా కనీసం ముగ్గురినైనా మోసం చేయాలని నిర్దేశించేవారు.
ఎవరైనా చెప్పినట్టు వినకపోతే వారిని చావుదెబ్బలు కొట్టేవారు. అక్కడి నుంచి బయటపడాలనుకునేవారు వారికి డబ్బు చెల్లించాలి.
‘డబ్బు చెల్లించి బయటపడ్డా’
ఈ గ్యాంగ్‌లకు డబ్బు చెల్లించి బయటపడినవారిలో మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ళ నీల్ విజయ్ ఒకరు. ఆగస్టు 2020లో మరో ఐదుగురు భారతీయులు, ఇద్దరు ఫిలిప్పిన్ మహిళలతో కలిపి ఆయనను అమ్మేశారు.
తన తల్లి చిన్ననాటి స్నేహితుడు బ్యాంకాక్‌లో టెలీమార్కెటింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఇందుకోసం లక్షా యాభై వేల రూపాయలు కమిషన్‌గా తీసుకున్నాడని నీల్ విజయ్ బీబీసీకి చెప్పారు.
‘‘చైనీస్ మాట్లాడే వ్యక్తులు నడిపే కంపెనీలు అనేకం ఉన్నాయి. వారందరూ అక్రమాలకు పాల్పడేవారే. వారే మమ్మల్ని ఈ సైబర్ ఫ్రాడ్ కంపెనీలకు అమ్మేశారు.’’ అని నీల్ చెప్పారు.
‘‘మేం అక్కడకు చేరుకున్నప్పుడు ఆశలు వదిలేసుకున్నాం. మా అమ్మ వారికి పెద్ద ఎత్తున డబ్బు ఇవ్వకపోయి ఉంటే, మిగతా వారిలానే నన్ను కూడా చిత్రహింసలపాల్జేసి ఉండేవారు’’ అని నీల్ తెలిపారు.
నీల్‌ను విడిపించేందుకు ఆయన తల్లి ఈ గ్యాంగులకు 6 లక్షల రూపాయలు ముట్టచెప్పారు. తరువాత ఆయనను ఇండియా చేరుకునేందుకు థాయ్ అధికారుల సహాయపడ్డారు. తరువాత నీల్ కుటుంబం ఆ ఏజెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంది.
థాయ్ అధికారులు బాధితులను వారి దేశాలకు పంపేందుకు ఆయా దేశాలతో కలిసి పనిచేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా రక్షించిన వారి సంఖ్య స్వల్పమని థాయ్‌లాండ్ న్యాయశాఖ మంత్రి బీబీసీకి చెప్పారు.
‘‘ఇలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ బారిన పడి బాధితులుగా మారకుండా ఉండేందుకు ప్రపంచానికి మరింత సమాచారం తెలియాలి. అలాగే ప్రజలను చైతన్య పరచడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది’’ అని థాయ్‌లాండ్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ డిప్యూటీ డైరక్టర్ జనరల్ పియ రక్సకుల్ చెప్పారు.
మానవ అక్రమ రవాణాకు బ్యాంకాక్ ఓ కేంద్రంగా మారింది.
ఈ స్కామ్‌లు ఎలా చేస్తారు?
సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్స్ నుంచి దొంగిలించిన ఫోన్ నెంబర్లలో బాగా డబ్బున్నవారిని ముఖ్యంగా పశ్చిమ దేశాలకు చెందినవారిని లక్ష్యంగా చేసుకుని వారితో నకిలీ శృంగార సంబంధాలు నెరిపే ప్రయత్నం చేస్తారు.
ఇందుకోసం ముందుగా ఏదో పొరపాటున పంపినట్టుగా ‘హలో’ అనే సందేశాన్ని బాధితులకు పంపుతారు.
కొంతమంది ఈ సందేశాలను పట్టించుకోరని రవి చెప్పారు. కానీ ఒంటరిగా ఉండేవారు, సెక్స్ కోసం ఎదురుచూసేవారు తరచుగా వీటి బారిన పడుతుంటారు.
అలా బాధితులు స్పందించగానే, వారు మరింతగా ఆకర్షితులయ్యేలా క్యాంప్‌లో ఉన్న యువతుల ఫోటోలు పంపుతారు. ఇక అప్పటి నుంచి రెండువైపులా వందలాది సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడం మొదలవుతుంది. బాధితుడు తమ వలలో పూర్తిగా పడ్డాడని నమ్మకం కుదిరిన తరువాత, నకిలీ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ వేదికలపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సిందిగా బాధితులను ఒప్పిస్తారు.
ఆయా నకిలీ వెబ్‌సైట్‌లో ఈ కంపెనీలన్నీ పెద్ద ఎత్తున లాభాలు సంపాదించినట్టుగా తప్పుడు సమాచారాన్ని చూపుతుంటాయి.
‘‘ఎవరైనా లక్ష డాలర్లు పెట్టుబడి పెడితే వెంటనే 50 వేల డాలర్లు పంపుతామని చెబుతాం. దీంతో తమ పెట్టుబడి మొత్తం 1,50,000 డాలర్లని బాధితులు నమ్ముతారు. నిజానికి వారు పెట్టుబడి పెట్టాకా మేం తిరిగి పంపే 50 వేల డాలర్లే వారికి మిగిలేది. మిగిలిన డబ్బును వారు వదులుకోవాల్సిందే’’ అని రవి వివరించారు.
దోచేశాకా ఐడీ డిలీట్ చేస్తారు
ఎప్పుడైతే బాధితులను పూర్తిగా దోచేశామని స్కామర్లు నమ్ముతారో, వెంటనే తాము ఏ సోషల్ మీడియా, మెస్సేజింగ్ ఫ్లాట్‌ఫామ్స్ ఉపయోగించారో వాటి నుంచి తమ ఎకౌంట్లను పూర్తిగా డిలీట్ చేసేస్తారు.
ఇలాంటి మోసాలు ఏ స్థాయులో జరుగుతున్నాయో అంచనా వేయడం కష్టమే అయినప్పటికీ యూఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ 2023 ఇంటర్నెట్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఇలాంటి స్కామ్స్‌లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 17వేలమందికిపైగా చిక్కుకున్నారని, దాదాపు 652 మిలియన్ డాలర్లు నష్టపోయారని తెలిసింది.
రవి పనిచేసే గ్యాంగ్ ఒక నెలరోజుల తరువాత ఆయనను మరో గ్యాంగ్‌కు అమ్మేసింది. మియన్మార్‌లో ఆయన గడిపిన ఆరునెలల కాలంలో మూడు వేర్వేరు గ్యాంగులలో ఆయన తో బలవంతంగా పనిచేయాల్సి వచ్చింది.
గ్యాంగ్‌లు మారినప్పుడల్లా తాను ప్రజలను మోసం చేయలేనని, శ్రీలంకకు పంపాలంటూ రవి కొత్త బాసులను వేడుకునేవారు.
కానీ వారెవరూ రవి మాట వినేవారు కాదు. ఒకరోజు తమ టీమ్‌లీడర్‌తో గొడవ పడటంతో రవిని దాదాపు 16 రోజులపాటు ఓ గదిలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు.
కానీ చివరకు ‘చైనీస్ బాస్’ వచ్చి తిరిగి పనిచేయడానికి చివరగా ఒక అవకాశం ఇస్తున్నానని చెప్పారు. రవికి కంప్యూటర్ అనుభవం ఉండటమే అలా చెప్పడానికి కారణమైంది.
‘‘అప్పడు నాకు మరో దారి లేకుండాపోయింది. అప్పటికే నా శరీరం సగం చచ్చుబడిపోయింది’’ అని రవి గుర్తు చేసుకున్నారు.
దీని తరువాత రవి నాలుగు నెలలపాటు వీపీఎన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్, 3డీ వీడియో కెమెరాలతో ఫేస్‌బుక్ అకౌంట్స్‌ను నడిపారు.
మధ్యలో రవి ఒకసారి శ్రీలంకలోని తన తల్లిని చూసి రావడానికి అనుమతి కోరితే గ్యాంగ్ లీడర్ అంగీకరించారు. కానీ ఇందుకోసం శ్రీలంక కరెన్సీలో 6లక్షల రూపాయలు, థాయ్‌లాండ్ నుంచి నదిని దాటించేందుకు మరో 2 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పారు.
రవికి వీసా లేకపోవడంతో థాయ్ ఎయిర్‌పోర్ట్‌లో 20వేల థాయ్ బాట్స్ జరిమానా చెల్లించేందుకు ఆయన తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వచ్చింది.
‘‘నేను శ్రీలంకకు వచ్చే సమయానికి నాకు 18,50,000 రూపాయల అప్పు మిగిలింది’’ అని రవి చెప్పారు.
రవి ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చినా తన భార్యను చూసుకునే టైమ్ లేదు.
ఇప్పడాయన అప్పులు తీర్చేందుకు రాత్రి పగలూ కష్టపడుతున్నారు. మేమిద్దం మా పెళ్ళి ఉంగరాలు తాకట్టు పెట్టాం’’ అని రవి బాధగా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)