You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘10 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి కోటి రూపాయలు వస్తుందన్నారు.. నగలు తాకట్టుపెట్టి ఇచ్చాను’
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘మాది గుజరాత్‌లోని జామ్ నగర్. 2014లో మంబయికి మారాం. అక్కడ మా అమ్మాయి స్నేహితురాలి ద్వారా మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ గురించి తెలిసింది.
అప్పటికి నా వయసు 45 ఏళ్లు. ఎలాంటి ఉద్యోగ అనుభవం లేదా మార్కెటింగ్ నైపుణ్యాలు లేవని వారికి చెప్పా. అనుభవం అక్కర్లేదు, భాషపరమైన అడ్డంకులు ఉండవని వారు నాకు చెప్పారు. చాలాసార్లు నాతో మాట్లాడి ఒప్పించారు. ఏటా రూ.5 కోట్ల వరకు సంపాదించవచ్చని ఆశ చూపారు. అందుకు గాను రూ.10 లక్షల పెట్టుబడి పెట్టాలన్నారు.
నా వద్ద డబ్బుల్లేక బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.9 లక్షల లోన్ తీసుకుని పెట్టుబడి పెట్టి మోసపోయా.
దీనిపై 2016లోనే ముంబయిలో కేసు పెట్టా. ఇంకా న్యాయం కోసం పోరాడుతున్నా’’ అని ముంబయికి చెందిన అనుజా కొటేజా బీబీసీకి చెప్పారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో నివాసం ఉండే ఫణీంద్రది మరో కథ.
తాను మోసపోయిన విధానాన్ని బీబీసీతో పంచుకుంటూ- ‘‘మనం డబ్బులు కట్టాక ప్రొడక్ట్స్ అని చెప్పి వాళ్లు పంపించేవన్నీ చెత్త. ఒకసారి వాచీలు, పౌడర్లు, టూర్ ప్యాకేజీలు.. ఇలా రకరకాలుగా పంపుతారు. వాటిని అమ్మి డబ్బులు తీసుకోవాలని చెబుతారు. అందులోనూ కమీషన్ ఇవ్వాలి. కానీ, మనకు ముందే దెబ్బతిన్న వాచీలు పంపిస్తారు. పార్శిల్ మనం తీసుకున్నప్పుడు ఆధారాలు ఉండవు కనుక మన చేతుల్లోనే విరిగిపోయానని వాదిస్తారు. తిరిగి డబ్బులు కూడా ఇవ్వరు’’ అన్నారు.
తన స్నేహితుడు చెప్పడంతోనే ఆ వలలో చిక్కుకున్నట్లు ఫణీంద్ర తెలిపారు.
వేళ్లూనుకుపోయిన వ్యవస్థ
మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలు నిత్యం ఏదో మూలన వెలుగులోకి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థ వేళ్లూనుకుని ఉంది.
ఈ వ్యాపార నమూనాను పిరమిడ్ సెల్లింగ్ స్కీమ్, నెట్వర్క్ మార్కెటింగ్, పోంజీ స్కీము, డైరెక్ట్ సెల్లింగ్ లేదా చైన్ మార్కెటింగ్ అని పిలుస్తారు.
ఇందులో పిరమిడ్ పైభాగంలో ఉన్న కేవలం ఒక శాతం మందికే లాభాలు వస్తుంటాయి. మిగిలిన వారందరూ ఏదో ఒక సమయంలో మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటారు.
ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సంస్థ కొన్నేళ్ల కిందట 350 మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీల వ్యాపార నమూనాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం 99 శాతం మంది వ్యక్తులు డబ్బులు లేదా పెట్టుబడి పోగొట్టుకుంటున్నట్లు తేలింది.
ఈ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘నాసిరకం ఉత్పత్తులను అంటగడతారు’
మల్టీ లెవల్ మార్కెటింగ్ లేదా పోంజి పథకాలు అనేవి చైన్ వ్యవస్థ.
ఇందులో పిరమిడ్ కింద ఉండే వ్యక్తులకు నాసిరకం ఉత్పత్తులను అంటగడతారు. వారు వాటిని విక్రయించలేక ఆర్థికంగా నష్ట పోతారు. పైగా ఆయా కంపెనీలు పంపించే వస్తువుల నిజమైన ధర కంటే నిర్దేశిత ధర ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది.
దీనివల్ల వినియోగదారులు కొనే వీలుండదు. అటు ముందుగా కట్టిన డబ్బులు తిరిగి వచ్చే పరిస్థితి కూడా ఉండదు.
‘‘మనం డబ్బులు కట్టిన తర్వాత తిరిగి తీసుకోవాలంటే 30 రోజుల గడువు మాత్రమే ఉంటుంది.
ఈ విషయం ఎక్కడా చెప్పకుండా జాగ్రత్త పడతారు. మనం మోసపోయామని వెంటనే గుర్తించి అడిగినా సరే.. అవతలివాళ్లు మన స్నేహితులో, కుటుంబ సభ్యులో, బంధువులో కావడంతో ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేస్తారు.
ఏవో మాటలు చెప్పి కాలం గడిపేస్తారు. 30 రోజులు అయ్యాక డబ్బులు తీసుకునే అవకాశం లేదని చెబుతారు’’ అని ఫణీంద్ర బీబీసీతో అన్నారు.
రూ.2 వేల వాచీ రూ.59 వేలకు విక్రయం
ఈ ఏడాది మార్చి రెండో వారంలో సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అందులో చనిపోయిన ఆరుగురు వ్యక్తులు క్యూ నెట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులే అని హైదరాబాద్ సిటీ పోలీసులు గుర్తించారు.
హాంకాంగ్ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది.
విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వీ-ఎంపైర్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు తేల్చారు.
రూ.2 వేలు విలువ చేసే వాచీలను వారు రూ.59 వేలకు విక్రయిస్తున్నారు.
ప్రమాద ఘటన తర్వాత రాజేశ్ అనే వ్యక్తిని బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికే రూ.3 కోట్లు హైదరాబాద్‌లో వసూలు చేశారు.
రాజేశ్‌కు చెందిన 35 బ్యాంకు అకౌంట్లలో రూ.54 కోట్లను ఫ్రీజ్ చేశారు.
పేర్లు మార్చి మళ్లీ తెరపైకి
ఈ మోసాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదా? కొన్ని దశాబ్దాలుగా కంపెనీల తీరు పోలీసులకు సమస్యాత్మకంగా మారింది.
1990ల కాలంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
ప్రస్తుతం భారత దేశంలో అయిదు నుంచి ఆరు వేల కంపెనీలు ఉంటాయని అనధికారిక అంచనా.
ఇతర దేశాల నుంచి వచ్చిన కంపెనీలను చూసి ఇండియాలోనూ కొందరు ఈ తరహా కంపెనీలను ఏర్పాటు చేశారు.
ఉదాహరణకు క్యూ నెట్ పేరుతో నేరాలకు పాల్పడిన కంపెనీ వివిధ రకాల పేర్లను మార్చుకుంది.
ముందుగా గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్ నెట్, క్యూ నెట్.. ఇలా రకరకాల పేర్లతో మారుతూ వచ్చింది.
సికింద్రాబాద్ ఘటనతో ఈ కంపెనీ వీ-ఎంపైర్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది.
ఇవన్నీ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేటు లిమిటెడ్ గొడుగు కింద ఉన్నాయి.
విక్రయాల చాటున మనీ సర్క్యులేషన్
ఉత్పత్తులు, సేవల విక్రయాల పేరుతో మనీ సర్క్యులేషన్ చేయడం ఆయా కంపెనీల ప్రధాన ఉద్దేశమని తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ అన్నారు.
గత కొన్నేళ్లుగా ఆయన మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
2006లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సీఐడీ విభాగంలో పనిచేసేటప్పుడు ఆమ్వే కంపెనీపై సజ్జనార్ కేసు నమోదు చేశారు.
ఏడాది పాటు కేసు విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కంపెనీ వ్యవహారంలో పోలీసుల తీరు సరైనదేనని, ప్రతినిధులను అరెస్టు చేయడం సబబే అని తీర్పు చెప్పింది.
ఎంఎల్‌ఎం మోసాలపై ఫిర్యాదుకు ముందుకు రాని బాధితులు
ఎన్సీఆర్బీ 2021 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 1,74,013 ఆర్థిక సంబంధ కేసులు నమోదయ్యాయి.
ఇందులో మోసాలు, ఫోర్జరీ కేసులే 1,52,073 ఉన్నాయి.
మోసం కేసుల కిందకే మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాల కేసులు వస్తాయి.
కానీ, ఎక్కువగా వాటిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు.
‘‘ఎక్కడైనా సరే స్కీమ్ ఎన్‌రోల్‌మెంట్ జరుగుతోంది అంటే నమ్మొద్దు. అలా చేర్పించుకున్న వాళ్లే కాదు, చేరిన వాళ్లు కూడా నిందితులు అవుతారు.
ఎన్‌రోల్‌మెంట్ ఉన్న స్కీమ్‌లలో చేరడం చట్ట విరుద్ధం.
అలా ఎన్‌రోల్‌మెంట్ జరుగుతోందని లేదా మోసం చేస్తున్నారని గమనిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు కూడా చట్టప్రకారం వ్యవహరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి’’ అని సజ్జనార్ బీబీసీతో అన్నారు.
మహిళలే ప్రధాన లక్ష్యం
కంపెనీలలో చేరే సమయంలో మాతృ సంస్థ పేరు చెప్పడం లేదా అసలు పేరే చెప్పకుండా ఎన్‌రోల్‌మెంట్ చేయడం చేయిస్తుంటారని హైదరాబాద్‌కు చెందిన బాధితుడు ఫణీంద్ర తెలిపారు.
2013-14లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ భారత్‌లో రూ.7,4౦౦ కోట్లుగా ఉన్నట్లు కేపీఎంజీ గ్రూపు అంచనా వేసింది.
2025 నాటికి ఇది రూ.6.45 లక్షల కోట్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి.
వాస్తవ అంచనాలు చూస్తే రూ.20 లక్షల కోట్ల మార్కెట్ ఉంటుందని తెలంగాణకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి బీబీసీతో అన్నారు.
ఈ పథకాలలో చేరుతున్న వారిలో 60 శాతం మంది మహిళలే ఉన్నట్లు కేపీఎంజీ ఎనిమిదేళ్ల కిందటే తేల్చింది.
ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, రిటైర్ అయిన వారిని టార్గెట్ చేసుకుని కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
వీరి ఆధారంగా కస్టమర్లను చేర్పిస్తున్నాయి.
డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌పై ఆధారపడి 70 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, అందులో సగం మంది మహిళలే ఉన్నారని ఆమ్వే ఇండియా కార్పొరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ రజత్ బెనర్జీ గతంలో ఓ సందర్భంలో చెప్పారు.
నమ్మకమే పెట్టుబడి
కంపెనీలలో డబ్బులు పెట్టి అన్ని వర్గాలవారు మోసపోతుంటారని చెబుతున్నారు ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ పుస్తక రచయిత్రి, సీనియర్ జర్నలిస్టు అరుణ రవికుమార్.
మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలపై ఆమె ఈ పుస్తకాన్ని రాశారు.
వస్తువుల అమ్మకాలు, వినియోగదారుల చేరికలపై డబ్బులు కట్టాలి. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు పెట్టి అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.
సాధారణంగా కుటుంబ సభ్యులు, స్నేహితులనే కొత్త సభ్యులుగా చేర్పిస్తుంటారు.
తర్వాత మోసపోయినప్పుడు వారి మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా దెబ్బతింటున్నాయి.
‘‘ఇక్కడ రెండు రకాలుగా స్కామ్(కుంభకోణం) జరుగుతోంది. ఒక విధంగా డబ్బులు నష్టపోతున్నారు. రెండోది సంబంధ బాంధవ్యాలు తెగిపోతున్నాయి’’ అని చెప్పారు అరుణ రవికుమార్.
కాగితాలపైనే ప్లాన్లు, స్కీములు
ఇక్కడ నేరుగా కంపెనీకి డబ్బులు జమ చేయరు.
ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి డబ్బులు మారుతుంటాయి.
అదే సమయంలో వర్య్చువల్ మనీ కంపెనీలలో మారుతుంది.
దేశంలో ఇప్పటివరకు 20 లక్షల మంది మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాల బారిన పడి ఉంటారని అంచనా వేస్తున్నట్లు ఫైనాన్సియల్ ఫ్రాడ్స్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గురుప్రీత్ సింగ్ ఆనంద్ చెప్పారు
కేవలం తమిళనాడులోనే 60 వేల ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు.
ముంబయిలో 2013 ఆగస్టులో మొదటిసారిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
‘‘నా భార్యకు బయో ప్రొడక్ట్సు అంటూ ఏవో నకిలీ ఉత్పత్తులు అమ్మారు. క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని నమ్మబలికారు. వాటిని అమ్మితే లాభాలు వస్తాయని చెప్పారు. కాగితంపై డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఓ ప్లాన్ వేసి చూపిస్తారు. నువ్వు చేరవడంతోపాటు కుటుంబసభ్యులు, స్నేహితులను చేర్పిస్తే అందరూ లాభపడతారు అని నమ్మబలుకుతారు. నువ్వు ఒక స్థాయికి చేరుకుంటే నెలకు మంచి సంపాదన ఉంటుందని చెబుతారు.
అలా కాగితంపై వేసే ప్లాన్‌తో ఏటా రూ.4-5 కోట్లు సంపాదించవచ్చని నమ్మిస్తారు. కానీ అందుకు చైన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని షరతు విధిస్తారు. అది చట్టవిరుద్దమైంది’’ అని గురుప్రీత్ సింగ్ బీబీసీతో అన్నారు.
‘మనీ లాండరింగ్ కింద కూడా కేసులు పెట్టాలి’
దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నప్పటికీ నిత్యం మోసపోయిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ చెప్పారు.
చీటింగ్ కేసుతో పాటు డబ్బులు వేరే దేశాలకు వెళుతుంటే మనీలాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు.
‘‘పోలీసులు కేసు కట్టాలి. వ్యూహాత్మకంగా విచారణను సాగించాలి. సంబంధిత ఏజెన్సీలకు లేఖ రాయాలి. వారి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలి.
సెంట్రల్ ఏజెన్సీలు రంగంలోకి దిగాలి. అప్పుడే నేరాలకు కొంత అడ్డుకట్ట వేయగలం’’ అని సజ్జనార్ బీబీసీతో చెప్పారు.
తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే చట్టం
మనీ సర్క్యులేషన్ మోసాల విషయంలో దేశంలో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే చట్టం అమల్లోకి వచ్చింది.
1965లో ఆంధ్రప్రదేశ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్(ప్రొహిబిషన్) యాక్ట్‌ను తీసుకొచ్చింది.
ఆ తర్వాత పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తీసుకువచ్చాయి.
దేశవ్యాప్తంగా ఈ తరహా నేరాలు పెరుగుతుండటంతో 1978లో ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్య్కులేషన్ స్కీమ్స్(నిషేధ) చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది.
దీని ప్రకారం నెట్‌వర్క్ మార్కెటింగ్ పథకాలు దేశంలో చట్టవిరుద్ధం.
పిరమిడ్ పథకాల కింద డబ్బును తీసుకోవడం నేరంగా పరిగణిస్తారు.
అప్పటివరకు మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లు అమల్లో ఉండగా, మల్టీ లెవల్ మార్కెటింగ్ అనేది తొలిసారిగా 1995లో దేశ వ్యాపార పరిశ్రమలోకి ప్రవేశించింది.
ఈ మోసాలపై 2021లో కేంద్ర ప్రభుత్వం మరోసారి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.
దీని ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు పిరమిడ్ తరహాలో నగదు చెల్లింపు పథకాలు అమలు చేయకూడదని స్పష్టం చేసింది.
ఇవి గమనించడం ఉత్తమం
మల్టీ లెవల్ మార్కెటింగ్ వైపు వెళ్లడమనేది మోసమని గుర్తించాలని ఎండ్ నౌ ఫౌండేషన్ అధ్యక్షుడు అనిల్ రాచమల్ల బీబీసీతో చెప్పారు.
‘‘కంపెనీ చట్టబద్ధమైన ఉత్పత్తునే అమ్ముతోందా, లేదా? చట్టబద్ధమైన సేవలనే అందిస్తోందా, లేదా? జాతీయ బ్యాంకులో కంపెనీకి బ్యాంకు ఖాతా ఉందా, లేదా? లోకల్ కార్యాలయాలు ఉన్నాయా, లేవా ?రిజిస్టర్డ్ సెల్లర్లా, కాదా? కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తోంది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? ఇలా అన్ని అంశాలు చూసుకుంటే కంపెనీ నిజమైనదా, మోసపూరితతమైనదా అనేది మనకు అర్థమైపోతుంది’’ అని అనిల్ విరవించారు.
ఇటీవల ఉదాహరణలు మరికొన్ని
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇటీవల మల్టీ లెవల్ మార్కెటింగ్ బారిన పడి మోసపోయిన ఘటనలు మరికొన్ని చూద్దాం.
మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఏప్రిల్‌లో మెతుకు చిట్ ఫండ్‌లో అధిక వడ్డీ ఆశతో జగదేవ్ పూర్ మండల వట్టిపల్లి గ్రామానికి చెందిన జనగామ మాణిక్యం, ఉమ దంపతులు డిపాజిట్లు చేశారు. ఇతరులతోనూ డిపాజిట్లు చేయించారు. చివరికి డబ్బులు తిరిగి చెల్లించలేదు.
కంపెనీ సీఈవోను పోలీసులు అరెస్ట్ చేశారు. డిపాజిట్లు పెట్టిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో ఆ దంపతులు ఆత్మహత్యయత్నం చేశారు.
2019లో నాగోలులో గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం బయటపడింది.
నాలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అంచనా వేశారు.
పల్లీల నుంచి నూనె తీసే యంత్రాన్ని ఇస్తామని డబ్బులు కట్టించుకుని సంస్థ మోసం చేసింది.
వారం కిందట దిల్లీకి చెందిన పర్ఫఎక్ట్ హెర్బల్ కేర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ.9,999 పెట్టుబడి పెడితే 36 నెలల పాటు రూ.880 తిరిగి చెల్లిస్తామని, హెర్బల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఇస్తామంటూ డబ్బు వసూలు చేసింది.
స్టోర్ల కోసం రూ.6 లక్షలు పెట్టుబడి పెడితే 30 నెలల పాటు 30 వేలు ఇస్తామని వస్తువులపై 5 శాతం కమిషన్ ఇస్తామని చెప్పింది.
తెలంగాణతోపాటు ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 6 వేల మందిని సభ్యులుగా చేర్చుకుని రూ.200 కోట్లు వసూలు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.
సీసీఎస్ పోలీసులు దిల్లీకి వెళ్లి రిజాయుద్దీన్, పూజ కుమారిని అరెస్టు చేశారు.
‘‘బోర్డు లగావో.. పైసా కమావో’’ పేరిట రూ.12 కోట్ల మోసానికి పాల్పడ్డ యూపీలోని గాజియాబాద్‌కు చెందిన బాబీ చౌదరి అలియాస్ ఇజాజ్ అహ్మద్‌ను హైదరాబాద్ పోలీసులు వారం కిందట అరెస్టు చేశారు.
‘‘మల్టీ లెవల్ మార్కెటింగ్ అనేది అక్రమం. అలాంటి వాటి వలలో పడి మోసపోవద్దు’’ అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- కస్టమర్ కేర్ ఉద్యోగాల పేరుతో వ్యభిచారం, సైబర్ క్రైమ్‌లోకి
- పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్: ఫేక్ ఉద్యోగ సైట్లను ఎలా గుర్తించాలి, మోసపోకుండా ఏం చేయాలి
- హైటెక్ బెగ్గింగ్: ఆన్లైన్లో సాయం అడుక్కునేవారి నుంచి 70 శాతం కమీషన్ తీసుకుంటున్న టెక్ సంస్థ
- 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుడుగు ఏంటి?
- BBC Investigation: మహిళల నగ్న చిత్రాలతో వ్యాపారం చేస్తున్న రహస్య ప్రపంచం గుట్టురట్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)