You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కస్టమర్ కేర్ ఉద్యోగాల పేరుతో వ్యభిచారం, సైబర్ క్రైమ్‌లోకి
ఉద్యోగాల ఆశ చూపించి కెన్యా ప్రజలను మానవ అక్రమ రవాణా ముఠాలు ఎలా మోసం చేస్తున్నాయో కెన్యా సిటిజన్ టీవీకి చెందిన జర్నలిస్ట్ వైహిగ మవురా వివరించారు.
ఆఫ్రికన్ జర్నలిస్టుల ఉత్తరాల సిరీస్‌లో భాగంగా ఈ కథనాన్ని పంపించారు.
ఆగ్నేయాసియాలో మెరుగైన జీవనాన్ని అందిస్తామంటూ ఆకర్షణీయ హామీలను గుప్పించే వారికి దూరంగా ఉండాలంటూ ఉద్యోగార్థులను కెన్యా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
థాయ్‌లాండ్‌కు ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన 60 మందికి పైగా కెన్యా ప్రజలను రక్షించిన తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సూచనలు ఇచ్చింది.
థాయ్‌లాండ్‌లో సేల్స్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అక్కడికి వెళ్లాక అవి సైబర్ క్రైమ్ ఉద్యోగాలను తెలిసింది. కస్టమర్ సర్వీస్ ఉద్యోగాల మాటున వ్యభిచారం, సైబర్ క్రైమ్ నేరాలు చేయిస్తున్నట్లు, చెప్పినవిధంగా చేయకపోతే అవయవాలను అమ్ముకునేందుకు సైతం వారు వెనుకాడరని బాధితులు తెలుసుకున్నారు.
ఇలా మోసపోయిన వారి అనుభవాలు తెలుసుకునేందుకు నేను ఇద్దరు మహిళలతో మాట్లాడాను. వారిద్దరూ తమ గుర్తింపును బయటపెట్టేందుకు ఇష్టపడలేదు. అందులో ఒక మహిళకు 31 ఏళ్లు. ఆమె హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా చేశారు. మరో మహిళకు 35 ఏళ్లు. ఆమె స్కూల్ గ్రాడ్యుయేట్.
నెలకు 800 డాలర్ల (సుమారు రూ. 65,335) జీతం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆగస్టులో థాయ్‌లాండ్‌కు ఉద్యోగాల కోసం ఎలా బయలుదేరి వెళ్లారో వారిద్దరూ నాకు చెప్పారు.
థాయ్‌లాండ్‌కు బయల్దేరే నెల రోజుల ముందు వారు 2000 డాలర్ల (సుమారు రూ. 1,63,339) చొప్పున అప్పు తీసుకొని వాటిని ఏజెంట్లకు చెల్లించారు. తర్వాత స్వల్పకాల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
థాయ్‌లాండ్‌కు చేరుకున్న తర్వాత వారిని రోడ్డు మార్గంలో చాలా దూరం తీసుకెళ్లారు. తర్వాత ఒక నదిని దాటి పొరుగున ఉన్న లావోస్‌కు తీసుకెళ్లారు.
అక్కడ వారిని 15 అంతస్థుల భవనంలో ఉంచారు. ఇక అదే వారి నివాసం అయింది. అయితే, ఆ భవనం ఏ ఊరిలో ఉందో, ఏ నగరంలో ఉందో అనే విషయాలు కూడా వారికి తెలియనివ్వలేదు.
అక్కడే వారికి మోసపోయినట్లు తెలిసింది. కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకు బదులుగా సైబర్ క్రైమ్ నేరాల్లో భాగం కావాల్సి వచ్చిందని వారు తెలుసుకున్నారు. టిండర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించుకొని అమెరికన్లను వలలో వేసుకోవడమే చేయాల్సిన పని అని వారికి అర్థమైంది.
‘‘వారు మీ ప్రేమలో పడతారు. అప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి చెప్పండి. వారి నుంచి డబ్బును దొంగిలించండి’’ అని తమకు చెప్పేవారని 31 ఏళ్ల బాధితురాలు వివరించారు.
ఒక పెద్ద హాలు లాంటి కాల్ సెంటర్‌లో వందలాది మంది ఇతర దేశస్థులతో కలిసి బలవంతంగా ఎలా పనిచేయాల్సి వచ్చిందో ఆమె తెలిపారు.
ముందు హామీ ఇచ్చిన జీతం కూడా వారికి అందలేదు. పైగా ఆన్‌లైన్‌లో తగినంత మందిని మోసం చేయడంలో విఫలమైతే సెక్స్ వర్క్ చేయడం లేదా శరీరంలోని ఏదైనా అవయవాన్ని తీసేసుకుంటామని తమను బెదిరించేవారని ఆమె చెప్పారు.
‘‘వారి నష్టాలను భర్తీ చేసుకునేందుకు మహిళలను బలవంతంగా సెక్స్ వర్క్‌లోనే నెట్టేయవచ్చు. ఒకవేళ అది కూడా వర్కవుట్ కాకపోతే శరీరంలోని అవయవాలను అమ్మేస్తారు’’ అని ఆమె వివరించారు.
‘‘ మేం మిమ్మల్ని కొనుగోలు చేశాం. కాబట్టి మీకు ఇక్కడి నుంచి స్వేచ్ఛ కావాలంటే 1.2 మిలియన్ల షిల్లింగ్స్ (రూ. 8 లక్షలు) చెల్లించాలని మాకు చెప్పారు’’ అని ఆమె తెలిపారు.
ఫ్రాడ్ ఫ్యాక్టరీలు
అదృష్టవశాత్తూ వారిద్దరూ ఆన్‌లైన్‌లో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడే సంస్థ ‘హార్ట్’ను సంప్రదించారు.
కెన్యాకు చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ సమస్యల్లో ఉన్న వలసదారులకు సహాయపడుతుంది. ఈ సంస్థతో పాటు యూఎన్, కెన్యా అధికారులు సహాయం చేయడంతో వారిద్దరూ అక్కడి నుంచి బయటకు రాగలిగారు.
వీరిద్దరే కాకుండా ఇతర కెన్యా ప్రజలు కూడా ఇదే తరహాలో అక్రమ రవాణాదారుల చేతుల్లో చిక్కారు. కెన్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వీటిని ‘ఫ్రాడ్ ఫ్యాక్టరీలు’, ‘బలవంతపు బానిస శిబిరాలు’ అని పిలుస్తుంది. అక్కడికి వెళ్లిన వారి పాస్‌పోర్ట్‌లను ఆ నేర ముఠాలకు చెందిన వారు హస్తగతం చేసుకుంటారు.
ఇలాంటి చాలామంది ఏజెంట్ల కోసం పోలీసులు వెదుకుతున్నాయి. అయినప్పటికీ థాయ్‌లాండ్‌లో ఉద్యోగాలు అంటూ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి మోసగాళ్ల చిక్కులో కెన్యా ప్రజలు పడుతూనే ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వం రక్షించిన బాధితుల్లో కొంతమంది విరిగిన ఎముకలతో, వికలాంగులుగా ఊతకర్రలతో తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఫ్రాడ్ ప్యాక్టరీలను నడిపే 20 మంది ముఠా సభ్యులు తీవ్రంగా కొట్టడంతో వారి పరిస్థితి ఇలా తయారైంది.
థాయ్‌లాండ్‌లోని కెన్యా దౌత్య కార్యాలయం అధికారుల సహాయంతో ఆగస్టు నుంచి మొత్తం 76 మంది బాధితులను కాపాడారు. వీరిలో 10 మంది ఉగాండా ప్రజలు, ఒకరు బురుండియన్ వ్యక్తి కూడా ఉన్నారు.
మోసగాళ్లు ఎక్కువగా ఆఫ్రికాలోని చదువుకున్న యువతనే లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇది ఆఫ్రికా ఖండంలోని ఉపాధి అవకాశాల తీవ్ర కొరతను చూపిస్తుంది. ఉద్యోగాల హామీలు వెదజల్లే ప్రభుత్వాలు వాటిని నెరవేర్చడంలో ఎలా విఫలం అవుతున్నాయో దీని ద్వారా తెలుస్తోంది.
ఆఫ్రికాలో ప్రతీ ఏటా కోటి 20 లక్షల యువ జనాభా వర్క్‌ఫోర్స్‌లోకి వస్తుందని, అయితే అక్కడ ప్రతీ ఏటా 30 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రమే వెలువడుతున్నాయని ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది.
ఆఫ్రికాను వదిలి యూరప్ బాట పట్టే వారిలో 80 శాతం మంది ఉద్యోగాల కోసమే వెళ్తున్నారని మో ఇబ్రహిం ఫౌండేషన్ పరిశోధనలో తేలింది.
అదృష్టవశాత్తు ఉద్యోగాలు లభించి ఇంటికి డబ్బు పంపగలిగే స్థితిలో ఉన్నవారు కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో పని చేస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి.
ఆగ్నేయాసియాకు వలస వెళ్లే ఆఫ్రికా ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
నేను మాట్లాడిన ఇద్దరు మహిళలు ఇప్పుడు చాలా అప్పుల్లో ఉన్నారు. ముందు కంటే వారి పరిస్థితి మరింత దిగజారింది.
35 ఏళ్ల మహిళ ప్రస్తుతం హెయిర్ సెలూన్‌లో పనిచేస్తున్నారు. మరో మహిళ ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- రోమన్ సామ్రాజ్య చరిత్రలో కల్పిత చక్రవర్తిని నిజం చేసిన బంగారు నాణేం
- 'ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం' రివ్యూ: సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని నిజాయితీగా చెప్పిన కథ
- ఆంధ్రప్రదేశ్: భూముల రీసర్వేపై విమర్శలేంటి, వందేళ్ళ తర్వాత ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు?
- శ్రద్ధ వాల్కర్, అఫ్తాబ్ పూనావాలా: ‘ఫ్రిడ్జ్ మర్డర్’ మీద వస్తున్న సంచలన వార్తల్లో నిజానిజాలేంటి?
- డిజీహబ్: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా డీపీలు ఎంతవరకు సేఫ్? మీ ప్రైవసీ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)