కిమ్ జోంగ్ ఉన్: విదేశీ సినిమాలు, టీవీ డ్రామాలు చూస్తే మరణశిక్ష.. నిజాలు బయటపెట్టిన ఐక్యరాజ్యసమితి నివేదిక

    • రచయిత, జీన్ మెకంజీ
    • హోదా, సోల్ కరస్పాండెంట్

విదేశీ సినిమాలు, టీవీ డ్రామాలను చూస్తూ దొరికినవారికి, షేర్ చేసినవారికి మరణశిక్షలు అమలు చేయడం ఉత్తర కొరియాలో మరింత పెరిగిందని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి వెల్లడించింది.

గత దశాబ్దంలో ''ప్రజల జీవితంలోని ప్రతి అంశంపైన'' ఉత్తర కొరియా ప్రభుత్వం కఠిన నియంత్రణకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం తన నివేదికలో పేర్కొంది.

''ప్రస్తుత ప్రపంచంలో ఇలాంటి నియంత్రణలు మరే ప్రజలపై లేవు'' అని ఆ నివేదిక తేల్చింది.

ఆధునిక సాంకేతిక పురోగతి సాయంతో నిఘా మరింత విస్తృతంగా మారిందని కూడా అందులో పేర్కొంది.

ఈ పరిస్థితి కొనసాగితే, ఉత్తర కొరియా ప్రజలు ''ఇప్పటి వరకు భరిస్తున్న దారుణమైన అణచివేత, భయాందోళన, బాధల''కు మరింతగా గురవుతారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ తెలిపారు.

తరచూ మరణశిక్షలు

గత పదేళ్లలో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన 300 మందిని ఇంటర్వ్యూ చేసి, దాని ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక, అక్కడ మరణశిక్షలను తరచూ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఉత్తర కొరియాలో 2015 నుంచి కనీసం ఆరు కొత్త చట్టాలు తీసుకువచ్చారు. విదేశీ సినిమాలు, టీవీ డ్రామాలు వంటి మీడియా కంటెంట్‌ను వీక్షించడం, పంచుకోవడం ఈ కొత్త చట్టాల ప్రకారం మరణశిక్ష విధించదగ్గ నేరాల్లో ఒకటి.

ప్రజలు సమాచారాన్ని పొందకుండా చేయడంలో కిమ్ జోంగ్ ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయని నివేదిక పేర్కొంది.

విదేశీ కంటెంట్‌ను షేర్ చేసేవారికి మరణ శిక్షలు విధించడం 2020 తర్వాత పెరిగిందని ఉత్తర కొరియా నుంచి పారిపోయినవారు ఐక్యరాజ్య సమితి పరిశోధకులకు తెలిపారు. ప్రజల్లో భయాన్ని కలిగించేందుకు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా ఈ మరణశిక్షలను ఫైరింగ్ స్క్వాడ్‌లు బహిరంగంగా అమలు చేస్తున్నట్టు వారు వివరించారు.

ఉత్తర కొరియానుంచి 2023లో తప్పించుకున్న కాంగ్ గ్యురి, బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, దక్షిణ కొరియా కంటెంట్‌ను చూసిన కారణంగా తన ముగ్గురు స్నేహితులు మరణశిక్షకు గురయ్యారని వెల్లడించారు. వారిలో ఒకరి వయసు 23 ఏళ్లు.

''ఆయనను డ్రగ్స్ కేసుల్లో ఉన్న నేరగాళ్లతో పాటు విచారించారు. ఇప్పుడు ఈ విదేశీ మీడియా నిబంధనల ఉల్లంఘనలను కూడా డ్రగ్స్ నేరాల్లాగే పరిగణిస్తున్నారు'' అని ఆమె తెలిపారు. ''2020 నుంచి ప్రజల్లో భయం బాగా పెరిగింది.''

‘కిమ్‌పై ఆశలు నిరాశలయ్యాయి’

కిమ్ జోంగ్ ఉన్ 2011లో పదవిలోకి వచ్చినప్పుడు, తమ జీవితాలు మెరుగుపడతాయని ఆశించామని ఉత్తర కొరియా నుంచి పారిపోయినవారు తెలిపారు. "ఎవరూ కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం ఉండదు" అంటూ ప్రజలకు తగినంత ఆహారం అందిస్తానని ఆయన వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు, అణ్వాయుధాల అభివృద్ధి ద్వారా దేశాన్ని రక్షిస్తానని కూడా హామీ ఇచ్చారు.

అయితే, 2019లో పశ్చిమ దేశాలతో ముఖ్యంగా అమెరికాతో కిమ్ దౌత్యానికి దూరమై, తన ఆయుధ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించడంతో, ప్రజల జీవన పరిస్థితులు మానవ హక్కులు తీవ్రంగా ''క్షీణించాయని'' నివేదిక వెల్లడించింది.

ఇంటర్వ్యూకు హాజరైన దాదాపు ప్రతి ఒక్కరూ తాము తినడానికి సరిపడా ఆహారం పొందలేకపోతున్నామని, రోజుకు మూడుసార్లు తినడమనేది ఇప్పుడు ఒక విలాసవంతమైన విషయం అయిపోయిందని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆహార కొరత ఏర్పడిందని, ఎన్నో ప్రాంతాల్లో ప్రజలు ఆకలితో మృతిచెందారని పేర్కొన్నారు.

అదే సమయంలో, కుటుంబాలు చిన్నచిన్న వ్యాపారాలు చేసే అనధికారిక మార్కెట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దీనివల్ల వారు జీవనోపాధి పొందడం కష్టంగా మారింది. చైనాతో సరిహద్దుల్లో నియంత్రణలు మరింత కఠినతరం చేయడమే కాకుండా, దేశం దాటేందుకు యత్నించే వారిని కాల్చి చంపాలని దళాలకు ఆదేశించడంవల్ల ఉత్తర కొరియా నుంచి పారిపోవడం దాదాపు అసాధ్యంగా మారిపోయింది.

"కిమ్ జోంగ్ ఉన్ పాలన తొలిరోజుల్లో, మాకు కొంత ఆశ ఉంది, కానీ ఆ ఆశ ఎక్కువ కాలం కొనసాగలేదు" అని 2018 లో 17 సంవత్సరాల వయసులో తప్పించుకున్న ఒక యువతి చెప్పారు.

"ప్రభుత్వం క్రమంగా ప్రజలు స్వేచ్ఛగా జీవించకుండా నిరోధించింది. జీవితంలోని ప్రతి అంశం నిత్య హింసగా మారింది''అని ఆమె పరిశోధకులకు సాక్ష్యమిచ్చారు.

"గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రజలపై పూర్తి నియంత్రణ సాధించింది. వారు తమ ఆర్థిక, సామాజిక, రాజకీయ నిర్ణయాలను సొంతంగా తీసుకోలేకపోతున్నారు" నిఘా సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి దీనిని సాధ్యం చేయడానికి సహాయపడ్డాయని నివేదిక పేర్కొంది.

''ప్రజల కళ్లు చెవులను మూసివేయడమే'' ప్రభుత్వ అణచివేతల ఉద్దేశమని.. తప్పించుకున్న ఓ వ్యక్తి పరిశోధకులకు చెప్పారు. ''ఇది ఏమాత్రం చిన్నపాటి అసంతృప్తి,ఫిర్యాదుకు సంబంధించిన చిన్నసంకేతాన్నైనా కూడా నిర్మూలించడానికి ఉద్దేశించి ఓ నియంత్రణ రూపం'' అని పేరు గోప్యంగా ఉంచిన ఆ వ్యక్తి చెప్పారు.

ప్రభుత్వం ఒక దశాబ్దం కిందట కంటే ఎక్కువ నిర్బంధ శ్రామికులను ఉపయోగిస్తున్నట్టు నివేదిక కనుగొంది. నిర్మాణం లేదా మైనింగ్ ప్రాజెక్టులు వంటి శారీరక శ్రమ ఎక్కువగా అవసరమయ్యే పనులను పూర్తి చేయడానికి పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులను "షాక్ బ్రిగేడ్స్" లో నియమించుకుంటారు.

ఈ నియామకం తమ సామాజిక స్థితిని మెరుగుపరుస్తుందని కార్మికులు భావిస్తున్నారు, కానీ ఈ పనులు పని ప్రమాదకరమైనవి, అందులో మరణాలు సాధారణం. అయితే, కార్మికుల భద్రతను మెరుగుపరచడానికి బదులుగా, చనిపోయినవారిని కిమ్ జోంగ్ ఉన్ కోసం చేసిన త్యాగంగా అక్కడి ప్రభుత్వం కీర్తిస్తోంది.

ఇటీవలి సంవత్సరాలలో ఇది వేలాది మంది అనాథలు, వీధిబాలలను కూడా నియమించిందని నివేదిక పేర్కొంది.

ఐసీసీ దృష్టికి తీసుకెళ్లడం సాధ్యమేనా?

ఈ తాజా పరిశోధన 2014లో యుఎన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ నివేదికను అనుసరిస్తోంది. ఈ నివేదికలో.. ఉత్తర కొరియా ప్రభుత్వం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని కనుగొన్నారు. దేశంలోని రాజకీయ ఖైదీల శిబిరాలలో అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు కనుగొన్నారు. ఇక్కడ ప్రజలను జీవితాంతం బంధించవచ్చులేదంటే "అదృశ్యం" చేయవచ్చు అని నివేదిక పేర్కొంది.

ఈ 2025 నివేదిక ప్రకారం.. ఇలాంటి శిబిరాలలో కనీసం నాలుగు ఇప్పటికీ పనిచేస్తున్నాయి, సాధారణ జైళ్లలో ఖైదీలు ఇంకా హింసకు గురవుతున్నారు. తప్పించుకున్నచాలా మంది ఖైదీలు సరైన చికిత్స అందక, ఎక్కువ పని, పోషకాహార లోపం వల్ల చనిపోవడాన్ని చూశామని చెప్పారు.

ఈ పరిస్థితులను హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.

అయితే ఇది జరగాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆమోదం కావాలి. ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు విధించే ప్రయత్నాలను మండలిలోని రెండు శాశ్వత సభ్య దేశాలు చైనా , రష్యాలు పదేపదే అడ్డుకుంటున్నాయి.

గత వారం, కిమ్ జోంగ్ ఉన్ చైనా నాయకుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి బీజింగ్‌లో జరిగిన సైనిక కవాతులో పాల్గొన్నారు.

"మా నివేదిక.. ఉత్తరకొరియాలో యువత మార్పు కోసం స్పష్టమైన, బలమైన కోరికను చూపుతున్నారని తెలుపుతోంది'' అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ టర్క్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)