అప్పీల్‌తో విజయం సాధించిన రొమేనియన్ అథ్లెట్, వినేశ్ ఫొగాట్‌కు సిల్వర్ మెడల్ దక్కే అవకాశాలు పెరిగాయా?

పారిస్ ఒలింపిక్స్‌లో గతవారం అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చైల్స్ కాంస్య పతకం గెలిచారు. అయితే, ఆ ఫలితాన్ని సవాల్ చేస్తూ రొమేనియా జిమ్నాస్ట్ అనా బార్బొసు కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ (కాస్)లో అప్పీల్ చేశారు. రొమేనియా అథ్లెట్‌కు అనుకూలంగా కాస్ తీర్పు ఇచ్చింది. దాంతో, ఆ పతకాన్ని చైల్స్ దగ్గర నుంచి వెనక్కి తీసుకుని బార్బొసుకు ఇస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ప్రకటించింది.

ఈ తీర్పుతో వినేశ్ ఫొగాట్‌కు పతకం రావచ్చనే ఆశలు పెరిగాయి. జిమ్నాస్ట్ చైల్స్ కేసు ఏంటి? ఆమె దగ్గర నుంచి పతకం ఎందుకు వెనక్కి తీసుకున్నారు?

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మహిళల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించాక, నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నారనే కారణంతో ఆమెను అనర్హురాలిగా తేల్చారు.

ఆమెకు ఎలాంటి పతకం ఇవ్వడం లేదని కూడా ప్రకటించారు. దీనిపై వినేశ్ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో అప్పీల్ చేశారు. ఈ కేసులో తీర్పు ఇవాళ (ఆగస్టు 13న) రానుంది.

కాంస్య పతకాన్ని కోల్పోయిన జోర్డాన్ చైల్స్

పారిస్ ఒలింపిక్స్‌లో ఆగస్టు 5న జరిగిన జిమ్నాస్టిక్స్ ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన జోర్డాన్ చైల్స్ 13.666 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

రొమేనియా జిమ్నాస్ట్ అనా బార్బొసు13.7 సాధించి మూడో స్థానంలో నిలిచారు. తనకు కాంస్య పతకం ఖరారు కావడంతో ఆనందంతో సంబరాల్లో మునిగారు. అయితే ఆమె సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.

జోర్డాన్ స్కోరును తప్పుగా లెక్కించారని అమెరికా జిమ్నాస్టిక్స్ విభాగం కోచ్ సిసిలీ లాండీ అప్పీలు చేశారు. దీంతో జడ్జ్‌లు చైల్స్ స్కోరును 13.766గా ప్రకటించారు.

దీంతో స్కోర్ బోర్డు మీద జోర్డాన్ చైల్స్ పేరు మూడో స్థానానికి, అనా బార్బొసు పేరు నాలుగో స్థానానికి చేరుకుంది. ఇది చూసిన అనా బార్బొసు కన్నీటి పర్యంతం అయ్యారు.

ఈ మార్పులపై రొమేనియా ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద నిరసన తెలిపింది.

"ఇది ఖండించదగినది" అంటూ రొమేనియా ప్రధాని మార్సెల్ సియోలాగు ఒలింపిక్ ముగింపు వేడుకలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ఒలింపిక్స్‌లో, ఫలితాలు ప్రకటించిన ఒక నిమిషంలోపు అప్పీలు చేయాలి. అయితే అమెరికన్ జిమ్నాస్టిక్స్ జట్టు కోచ్ నాలుగు సెకన్లు ఆలస్యంగా అప్పీల్ చేశారని రొమేనియన్ ఒలింపిక్ కమిటీ ఫిర్యాదు చేసింది. చైల్స్ పాయింట్లను వెనక్కి తీసుకోవాలని కోరింది.

జ్యూరీ ఈ ఫిర్యాదును ఆమోదించింది. జోర్డాన్ చైల్స్ స్కోరును 13.666గా ప్రకటించింది. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య (ఎఫ్‌ఐజీ) కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. కాంస్య పతకాన్ని తిరిగి అనా బార్బొసుకు ఇవ్వాలని ఆదేశించింది.

పతకాన్ని తిరిగి ఇచ్చే అంశంపై అమెరికా ఒలింపిక్ కమిటీతో చర్చిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది. మరోసారి పతకాల బహుకరణ వేడుకను నిర్వహించడంపైనా రొమేనియన్ ఒలింపిక్ కమిటీతో సంప్రదింపులు జరుపుతామని ఐఓసీ ప్రకటించింది.

అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చైల్స్‌కు కాంస్య పతకం ప్రకటించినప్పుడు ఇంటర్నెట్‌లో తీవ్ర విమర్శలు వచ్చాయి. రొమేనియన్ జిమ్నాస్ట్ అనా బార్బొసుకు మద్దతుగా, చైల్స్‌కు వ్యతిరేకంగా అనేక మంది పోస్టులు పెట్టారు.

చైల్స్ మీద ఆన్‌లైన్‌లో విమర్శలను ఖండిస్తూ అమెరికన్ ఒలింపిక్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో “ఏ అథ్లెట్ ఇలాంటి నీచమైన విమర్శలను ఎదుర్కోకూడదు. అసహ్యకరమైన ట్రోల్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. మైదానంలో, వెలుపల ఆమె చిత్తశుద్ధిని అభినందిస్తున్నాం. అమెరికన్ ఒలింపిక్ కమిటీ ఆమెకు అండగా నిలుస్తుంది” అని తెలిపింది.

జిమ్నాస్టిక్స్ ఫైనల్లో బ్రెజిల్ క్రీడాకారిణి రెబెకా ఆండ్రేడ్ స్వర్ణం సాధించారు. అమెరికాకు చెందిన మరో క్రీడాకారిణి సిమోనా బైల్స్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.

కాస్‌లో వినేశ్ ఫొగాట్ అప్పీలు

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరుకున్న భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు రజత పతకం ఖాయమైంది.

ఆమె ఒకే రోజు వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచారు. జపాన్ నంబర్ వన్ యుయి సుజాకితో సహా ముగ్గురు ఆటగాళ్లను ఓడించి వినేశ్ ఫైనల్‌కు అర్హత సాధించారు.

ఫైనల్స్‌కు ముందు మహిళా రెజ్లర్ల బరువు చూస్తారు. వారు ఏ కేటరిగీలో పోటీ పడుతున్నారో అంత బరువు ఉండటం ముఖ్యం.

వినేశ్ ఫొగాట్ మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో 50 కిలోల విభాగంలో పోటీపడ్డారు. అయితే ఫైనల్ ఈవెంట్ జరగాల్సిన రోజు ఉదయం బరువు చూసినప్పుడు, ఆమె బరువు అనుమతించిన పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో, ఆమెను ఫైనల్స్‌కు అనర్హురాలిగా నిర్ణయిస్తూ పతకం ఇచ్చేది లేదని ప్రకటించారు.

సెమీఫైనల్‌లో వినేశ్ ఫొగాట్ క్యూబాకు చెందిన యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను ఓడించారు. వినేశ్‌పై అనర్హత వేటు పడిన తర్వాత ఆమెకు రావాల్సిన రజత పతకాన్ని గుజ్మోన్‌కు ఇచ్చారు.

తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేశ్ ఫొగాట్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ (కాస్‌)లో అప్పీల్ చేశారు. రజత పతకాన్ని తనకు, గుజ్మోన్‌కు పంచాలని కోరారు. ఈ పిటిషన్‌ను కాస్ విచారణకు స్వీకరించింది.

ఈ కేసులో శనివారం తీర్పు వెలువడాల్సి ఉండగా, అది ఆగస్టు 13కి వాయిదా పడింది.

అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చైల్స్ కేసులో తీర్పు ప్రభావం వినేశ్ ఫొగాట్ కేసుపైనా ఉంటుందనే చర్చ జరుగుతోంది.

అయితే ఈ రెండు సందర్భాల్లోనూ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చైల్స్ కేసు సమయానికి సంబంధించింది. వినేశ్ కేసు బరువుకు సంబంధించినది.

ఈ కేసులో వినేశ్ ఫొగాట్‌కు అనుకూలంగా తీర్పు వస్తే పారిస్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 7కు చేరుకుంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్‌ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)