You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పారిస్ ఒలింపిక్స్: వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు, చేజారిన పతకం, ప్రధాని మోదీ ఏమన్నారంటే..
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురయ్యారు.
మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్, అధిక బరువు కారణంగా ఫైనల్ పోటీకి అనర్హురాలిగా ప్రకటించారని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది.
వినేశ్, మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో పోటీపడుతున్నారు.
ఈ వెయిట్ కేటగిరీలో ఉండాల్సిన బరువు కన్నా వినేశ్ 100 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
మంగళవారం రాత్రి జరిగిన సెమీస్‌లో గెలిచిన వినేశ్ ఫైనల్స్‌కు చేరారు.
వినేశ్ అనర్హతకు గురవ్వడంతో ఈ ఈవెంట్‌లో స్వర్ణం లేదా రజతం సాధించాలన్న భారత ఆశలకు గండిపడింది.
రెజ్లింగ్ 50 కేజీ విభాగంలో వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురవ్వడం విచారంగా ఉందని భారత ఒలింపిక్ సంఘం ట్వీట్ చేసింది.
రాత్రంతా టీమ్ మొత్తం కృషి చేసినప్పటికీ, ఆమె ఉదయానికి 50 కేజీల కంటే కొన్ని గ్రాములు ఎక్కువ బరువు తూగారని పేర్కొంది.
ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని, వినేశ్ ప్రైవసీని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.
వినేశ్ అనర్హతపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..
వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
‘‘వినేశ్, మీరు చాంపియన్‌లకే చాంపియన్’’ అంటూ ఆయన ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొన్నారు.
‘‘మీరు భారత్‌కు గర్వకారణం. దేశంలోని ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి. ఈరోజు ఎదురైన ఎదురుదెబ్బ ఎంతో బాధాకరం. ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా. అదే సమయంలో మీరు సవాళ్లకు ఎదురొడ్డి నిలుస్తారని నాకు బాగా తెలుసు. మీ స్వభావమే అది. మీరు మళ్లీ పుంజుకుంటారని నా విశ్వాసం. మేమంతా నీ వెంటే ఉన్నాం’’ అని పేర్కొన్నారు.
ఐఓసీ అధ్యక్షురాలు పీటీ ఉషతో మాట్లాడిన మోదీ
వినేశ్ అనర్హతపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) అధ్యక్షురాలు పీటీ ఉషతో మాట్లాడిన ప్రధాని మోదీ, ఆమె నుంచి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకున్నారని వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
ఈ వ్యవహారంలో ప్రస్తుతం భారత్ ముందున్న అవకాశాలేంటో ఆమెను అడిగి తెలుసుకున్నట్లు చెప్పింది.
వినేశ్‌కు సహాయం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని ఉషను ఆయన కోరారు.
ఒకవేళ వినేశ్‌కు ప్రయోజనం కలుగుతుందని భావిస్తే, అనర్హతకు సంబంధించి బలంగా నిరసనను వ్యక్తం చేయాలని పీటీ ఉషను మోదీ కోరినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ తెలిపింది.
బజ్‌రంగ్ పునియా ఆందోళన
రెజ్లర్ బజరంగ్ పునియా బుధవారం ఉదయం బీబీసీ ప్రతినిధి అభినవ్ గోయల్‌తో మాట్లాడుతూ, వినేశ్ ఫొగాట్ బరువు గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ఏ ప్లేయర్ కూడా ముందుగా సంబరాలు చేసుకోరు. ముందుగా బరువు తగ్గించుకోవాలి. 50 కేజీల లోపు బరువు తగ్గడం చాలా కష్టం. అబ్బాయిలు త్వరగా బరువు తగ్గుతారు. అబ్బాయిలకు ఎక్కువగా చెమటలు పడతాయి. బరువు తగ్గడం అమ్మాయిలకు చాలా కష్టం. బరువును 50 కేజీల కంటే తక్కువకు తీసుకురావడానికి వారు చాలా కష్టపడాలి’’ అని పునియా అన్నారు.
"గత ఆరు నెలలుగా నిరంతరం ఆమె బరువు తగ్గడానికి కష్టపడుతున్నారు. నీళ్లు, ఒకట్రెండు రోటీలు మాత్రమే తింటున్నారు. బరువు తగ్గడం చాలా కష్టం" అని పునియా చెప్పారు.
వినేశ్ ఫొగాట్ అక్కడివరకు చేరడమే మాకు పతకంతో సమానం అని బజ్‌రంగ్ పునియా అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)