BTS-Army: ఆడుతూ, పాడుతూ ఏడాదికి రూ. 800 కోట్లు సంపాదించే ఈ యువకులు రెండేళ్లు ఆర్మీలో చేరుతున్నారు, ఎందుకు?

కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ కుర్రాళ్లు తమ ఆర్మీని వదిలేసి ‘దేశ సేవ కోసం’ అసలైన సైన్యంలో చేరడానికి సిద్ధమవుతున్నారు.

దక్షిణకొరియాకు చెందిన ఈ బ్యాండ్ సభ్యులకు నిర్బంధ సైనిక సేవల నుంచి మినహాయింపు ఇవ్వాలా, వద్దా? ఇస్తారా, ఇవ్వరా? అనే చర్చ చాలాకాలంగా ఉంది. బ్యాండ్‌లో అందరి కంటే పెద్దవాడైన 29 ఏళ్ల జిన్ వచ్చే నెలలో దక్షిణ కొరియా సైన్యంలో చేరడానికి రెడీ అవుతుండడంతో సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ చర్చకు ముగింపు దొరుకుతోంది.

దక్షిణ కొరియాలో 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్కులైన పురుషులు కచ్చితంగా రెండేళ్ల పాటు సైన్యంలో పనిచేయాలనే నియమం ఉంది.

బీటీఎస్ బ్యాండ్‌లోని ఏడుగురు సభ్యులకు ఈ విషయంలో రెండేళ్ల వెసులుబాటు ఇప్పటికే ఇచ్చారు. అంటే, 30 ఏళ్ల వయసు వచ్చేలోగా వారు ఎఫ్పుడైనా సైన్యంలో చేరొచ్చు.

ఆ క్రమంలోనే జిన్ (29) వచ్చే నెలలో సైన్యంలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు బ్యాండ్ మేనేజ్‌మెంట్ సోమవారం వెల్లడించింది.

మిగతా ఆరుగురు సభ్యులు కూడా త్వరలోనే సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు మేనేజ్‌మెంట్ తెలిపింది.

ఎందుకీ నిర్బంధ సైనిక సేవ

అణ్వస్త్రాలు ఉన్న తమ పొరుగు దేశం ఉత్తర కొరియాతో యుద్ధం టెక్నికల్‌గా ఇంకా ముగియనందున దక్షిణకొరియాలో నిర్బంధ సైనిక సేవల నిబంధన ఇంకా ఉంది.

సాధారణ పౌరులలో పురుషులు ఎవరైనా 28 ఏళ్ల లోపే సైన్యంలో చేరాలి.

అయితే, బీటీఎస్ బృందంలోని ఏడుగురు సభ్యులకు దీన్నుంచి రెండేళ్ల మినహాయింపు.. అంటే 30 ఏళ్ల వరకు గడువు ఇస్తూ 2020లో ఆ దేశ పార్లమెంటులో బిల్ పాస్ చేశారు.

బృందం విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్నాళ్లకే..

బీటీఎస్ బ్యాండ్ కొంతకాలం పాటు బృందంగా ప్రదర్శనలు ఇవ్వబోదని వారు కొద్దినెలల కిందట ప్రకటించారు. ఆ తరువాత బ్యాండ్‌లోని కొందరు సభ్యులు వ్యక్తిగత ప్రదర్శనలు, ప్రాజెక్టులు కొనసాగిస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా బీటీఎస్ విడుదల చేసిన ఆల్బమ్స్, పాటలు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయాయి.

డైనమైట్, బటర్ వంటివి గత రెండేళ్లలో బెస్ట్ సెల్లర్లుగా నిలిచాయి.

దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్లను ఆర్జించి పెట్టారని బీటీఎస్ బృందానికి పేరుంది. 2020 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రదర్శనలు, రాయల్టీస్, వరల్డ్ టూర్స్, ప్రకటనలు సహా అన్ని మార్గాలలో బీటీఎస్ 5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 400 కోట్లు) ఆర్జించింది.

‘ది వెల్త్ రికార్డ్’ వెబ్‌సైట్ లెక్కల ప్రకారం 2022లో బీటీఎస్ సంపద 10 కోట్ల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 800 కోట్లు) ఉండొచ్చని అంచనా.

బీటీఎస్ బృందం ప్రదర్శనలను, ప్రాజెక్టుల వ్యవహారాలు చూసే ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ 2021లో అంతకుముందు ఏడాది కంటే 30.8 శాతం అధికంగా లాభాలు ఆర్జించింది.

అంతేకాదు.. యువత మానసిక ఆరోగ్యం ప్రాధాన్యాన్ని వారు తరచూ ప్రస్తావించడంపైనా వారికి ప్రశంసలు దక్కుతుంటాయి.

దక్షిణ కొరియాలో చాలామంది బీటీఎస్ సభ్యులను జాతీయ సంపదగా భావిస్తున్న కారణంగా వారికి నిర్బంధన సైనిక సేవల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని కొందరు చట్టసభల సభ్యులు గతంలో సూచించారు.

అలా చేయడం వల్ల వారు తమ ప్రదర్శనలను కొనసాగించే అవకాశం ఉంటుందన్నది వారి వాదన.

ఒలింపిక్ పతకాల విజేతలు, క్రీడల్లో బాగా ప్రతిభ చూపిన ఇతరులు, కొందరు డ్యాన్సర్లు, మ్యుజిషియన్లకు గతంలో ఇలాంటి మినహాయింపు ఇచ్చిన సందర్భాలున్నాయి.

అయితే, మినహాయింపుల సంగతి పక్కన పెడితే బీటీఎస్ బృందంలోని వారు సైన్యంలో పనిచేసేందుకు సమ్మతంగా ఉన్నారని వారి మేనేజ్‌మెంట్ ప్రకటించింది.

తాను సైన్యంలో చేరడం మరింత ఆలస్యమవుతుందని, అందుకు అనుమతించాలని జిన్ తొలుత అర్జీ పెట్టుకున్నా ఆ తరువాత ఆ అర్జీని రద్దు చేసుకున్నారని మేనేజ్‌మెంట్ ప్రకటనలో ఉంది.

బృందంలో సభ్యులు సైన్యంలో పనిచేయాల్సి ఉండడంతో వారంతా ప్రస్తుతం కలిసి పనిచేసే అవకాశం లేదని, మళ్లీ 2025 నాటికి వారంతా బృందంగా పనిచేసే అవకాశం ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే, బృంద సభ్యులు సైన్యంలో పనిచేస్తున్నా వారు ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రదర్శనలు ఇవ్వడానికి మార్గం ఆలోచిస్తున్నట్లు దక్షిణ కొరియా రక్షణ మంత్రి లీ జోంగ్ సుప్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)