You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BTS బ్రేకప్: Suga, Jin, JHope, RM, Jimin, V, Jungkook ఇక ఎవరికి వారు సోలో ప్రాజెక్టులే
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ పాప్ బ్యాండ్ బీటీఎస్ బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది.
బ్యాండ్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో మాట్లాడుతూ తాము సోలో ప్రాజెక్టులను చేస్తున్నట్లు ఈ బృందం, అభిమానులకు చెప్పింది.
కొంతకాలంగా బ్యాండ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని బృందంలో ఒకరైన జిమిన్ చెప్పారు.
''మేం మా పూర్వవైభవం తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా శ్రమతో కూడిన సుదీర్ఘ ప్రక్రియ'' అని జిమిన్ అన్నారు.
మంగళవారం వార్షిక విందు సందర్భంగా బృందం ఈ ప్రకటనను చేసింది. ఈ విందులో బృంద సభ్యులంతా తమ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను చర్చించారు.
గంటకు పైగా సాగిన వారి చర్చ మొత్తం, బ్యాండ్‌కు సంబంధించిన అధికారిక యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేశారు.
అయితే, ఇంగ్లిష్‌లో ప్రసారమైన ఈ కార్యక్రమంలో ఒక సభ్యుడు ''విరామం తీసుకుంటున్నామని'' అని చెప్పడాన్ని చూపించారు. కానీ, బ్యాండ్ ప్రతినిధి ఒకరు దీనితో విభేదించారు.
''స్పష్టంగా చెప్పాలంటే, వారు విరామం తీసుకోవట్లేదు. కొన్ని సోలో ప్రాజెక్ట్‌లపై పనిచేయడానికి, వివిధ పనుల్లో చురుగ్గా ఉండటానికి ఈ సమయాన్ని తీసుకుంటున్నారు'' అని బీటీఎస్ కార్యక్రమాలను చూసే ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ హైబ్ తెలిపింది.
'గ్రామీ' గ్రూపు వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫెస్టా విందును ఏర్పాటు చేశారు. ఆర్‌ఎం, జంగ్‌కుక్, జిన్, జిమిన్, సుగా, వి, జె-హోప్‌లు కలిసి ఈ గ్రూపును ఏర్పాటు చేశారు.
ఈ చర్చ సందర్భంగా... బీటీఎస్ బృందంగా తామంతా గొప్ప ఉన్నతిని సాధించామని ఆర్‌ఎం అన్నారు. అయితే, వ్యక్తిగతంగా బృంద సభ్యులంతా ఎదగాలని, పరిణితి చెందాల్సిన అవసరముందని చెప్పారు.
''ఇతర గ్రూపుల కంటే బీటీఎస్ భిన్నమైనదని నేను భావించాను. కానీ, కె-పాప్‌తో పాటు ఈ వ్యవస్థలో ఉండే సమస్య ఏమిటంటే మీరు వ్యక్తిగా పరిణితి సాధించే సమయం ఇవ్వవు. ఇక్కడ మీరెప్పుడూ మ్యూజిక్ క్రియేట్ చేస్తూనే ఉండాలి'' అని ఆయన చెప్పుకొచ్చారు.
బీటీఎస్‌కు విరామం ఇవ్వడం చాలా కఠినమైన నిర్ణయమని బృందంలోని ఇతర సభ్యులు కూడా అంగీకరించారు.
''మా అభిమానులు ఎల్లప్పుడూ గుర్తుంచుకునే కళాకారులుగా మిగిలిపోవాలని మేం కోరుకుంటున్నాం'' అని జిమిన్ చెప్పారు.
తర్వాత అభిమానులను ఉద్దేశించి వి మాట్లాడారు. బీటీఎస్ సమూహం విడిపోవడం లేదని స్పష్టత నిచ్చారు. కొంతకాలం తర్వాత మళ్లీ కలిసిపోతామని చెప్పారు. మళ్లీ ఒక గ్రూపుగా మేం కలిసినప్పుడు బీటీఎస్ మరింత బలంగా అభిమానులను అలరిస్తుందని వివరించారు.
బీటీఎస్ బృందంలోని వారంతా 24 నుంచి 29 ఏళ్ల లోపు వారే. ఈ బృందం 2013లో తొలి ఆల్బమ్‌ను విడుదల చేసింది.
వారు రూపొందించిన వాటిలో డైనమైట్, బటర్, మై యూనివర్స్ అతిపెద్ద హిట్లుగా నిలిచాయి. ఇవి యూకే సింగిల్స్ చార్ట్‌లో మూడో స్థానానికి చేరుకున్నాయి.
సంగీత పరిశ్రమ సంస్థ ఐఎఫ్‌పీఐ ఇటీవల విడుదల రూపొందించిన జాబితాలో బీటీఎస్ బృందం '' వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ ఆర్టిస్ట్ ఆఫ్ 2021''గా నిలిచింది.
ఈ నెల ప్రారంభంలో బీటీఎస్ గ్రూపు 'యెట్ టు కమ్' అనే మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో భారత్‌కు అమెరికా పూర్తిగా మద్దతు ఇస్తుందా? ఇస్తే ప్రతిఫలంగా ఏం కోరుకుంటోంది?
- ప్రభుత్వం బుల్డోజర్తో ఇళ్లను కూల్చేయవచ్చా? చట్ట ప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా?
- పాకిస్తాన్: 'దేశ ప్రజలారా.. టీ తాగడం తగ్గించండి.. ఆర్థికవ్యవస్థను కాపాడండి' - ప్రభుత్వం విజ్ఞప్తి
- స్టాక్ మార్కెట్: బేర్ మార్కెట్ అంటే ఏంటి? ఇది ఆర్థిక సంక్షోభానికి సంకేతమా?
- గాలిలేని, పంక్చర్లు పడని టైర్లు వచ్చేస్తున్నాయి.. ఇవి ఎలా పనిచేస్తాయంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)