హైదరాబాద్ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం: సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ ప్రస్తుత, మాజీ వైస్-చాన్స్‌లర్ల అరెస్ట్

నకిలీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు.. భోపాల్‌ లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ (ఎస్‌ఆర్‌కేయూ) వైస్ చాన్సలర్, రిటైర్డ్ చాన్సలర్లను అరెస్ట్ చేశారు.

నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌కు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌ పరిధిలోని మలక్‌పేట్, ఆసిఫ్ నగర్, ముషీరాబాద్, చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి.

అవసరాల్లో ఉన్న విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని, వారికి ఎటువంటి పరీక్షలు, హాజరు లేకుండానే నేరుగా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు అందిస్తున్నారంటూ.. ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లకు సంబంధించి కొందరు ఏజెంట్లు, మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌లో గల ఎస్ఆర్‌కే యూనివర్సిటీ యాజమాన్యం మీద ఈ కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులన్నిటి విచారణనూ స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్‌)కు బదిలీ చేశారు.

ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏడుగురు ఏజెంట్లు అరెస్ట్

ఈ సిట్‌కు సారథ్యం వహిస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎ.ఆర్.శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎస్‌ఆర్‌కే యూనివర్సిటీ విద్యార్థులకు మొత్తం 101 ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు జారీచేసింది. వాటిలో 44 సర్టిఫికెట్లను విద్యార్థుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ 44 సర్టిఫికెట్లలో 13 సర్టిఫికెట్లు బి.టెక్, బి.ఇ. కోర్సులకు సంబంధించినవి కాగా, మిగతా 31 సర్టిఫికెట్లు ఎంబీఏ, బీఎస్‌సీ వంటి వివిధ డిగ్రీలకు సంబంధించిన సర్టిఫికెట్లు.

''యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వైస్-చాన్సలర్ డాక్టర్ సునీల్ కపూర్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అదే యూనివర్సిటీకి చెందిన కేతన్ సింగ్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను, హైదరాబాద్‌ నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన మరో ఏడుగురు ఏజెంట్లను కూడా అరెస్ట్ చేశాం'' అని ఏసీపీ తెలిపారు.

19 మంది విద్యార్థులు అరెస్ట్...

ఈ కేసులకు సంబంధించి మొత్తం 19 మంది విద్యార్థులను సైతం అరెస్ట్ చేశామని, ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు ముందస్తు బెయిల్ పొందారని ఆయన చెప్పారు.

ఇంకో ఆరుగురు విద్యార్థుల తల్లిదడ్రులకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఎ కింద నోటీసులు పంపించారు.

''బుధవారం నాడు సిట్ బృందం ఒకటి భోపాల్‌లోని ఎస్‌ఆర్‌కె యూనివర్సిటీకి వెళ్లి.. నిందితులైన ప్రస్తుత వైస్-చాన్సలర్ డాక్టర్ ఎం.ప్రశాంత్ పిళ్లై, యూనివర్సిటీ మాజీ వైస్-చాన్సలర్ /చైర్మన్ డాక్టర్ ఎస్.ఎస్.కుష్వహలను అరెస్ట్ చేసింది'' అని వివరించారు.

యూనివర్సిటీకి చెందిన మిగతా నిందితులను, అక్రమంగా సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులను అరెస్ట్ చేయటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఏసీపీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)