మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆకలి తీర్చలేకపోతుందా

భారతదేశంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాఠశాల భోజన పథకం. మహమ్మారి కాలంలో ఆగిపోయిన ఈ స్కీమ్ రెండేళ్ల తర్వాత ఏప్రిల్ నుంచి మళ్లీ ప్రారంభమైంది.

అయితే ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించడం చాలా పాఠశాలలకు ఒక సవాలుగా మారింది. దీనిపై బీబీసీకి చెందిన ఆస్తా రాజ్‌వంశ్ అందిస్తున్న కథనం..

కరోనా కాలంలో స్కూళ్లు మూసివేయడంతో ఉచిత భోజనంపై ఆధారపడిన లక్షలాది మంది ఆకలి బాధను అనుభవించారు. కోవిడ్ తర్వాత రెండేళ్లకు స్కూళ్లు మళ్లీ తెరవడంతో ముంబయికి చెందిన అల్ఫిషా అనే బాలిక శంకర్‌వాడి ముంబయి పబ్లిక్ స్కూల్‌కు తిరిగి వచ్చారు.

13 ఏళ్ల అల్ఫీషా తన స్నేహితులు, టీచర్లను కలవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వాటికన్నా ఎక్కువగా, స్కూల్లో మధ్యాహ్నం వేడి వేడిగా వడ్డించే భోజన సమయం కోసం ఆమె ఎదురు చూశారు.

"మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదు. నాకు, నా తోబుట్టువులకు ఆమె అన్నం వండలేదు'' అని ఆమె చెప్పారు.

కానీ, భారీ ప్రభుత్వ పథకమైన మధ్నాహ్న భోజనం ఆమె చదువుకునే స్కూల్‌లో ఏప్రిల్ నుంచి మొదలు కాలేదు. దీంతో అల్ఫిషా చాలా నిరాశకు గురయ్యారు.

''నేను నా స్నేహితులు కలిసి భోజనం చేసేవాళ్లం'' అని అల్ఫిషా కోవిడ్‌కు ముందు రోజులను గుర్తు చేసుకున్నారు.

లాక్‌డౌన్ కాలంలో అల్ఫిషా మధ్యాహ్నం అన్నం తినడం మానేశారు. ఇప్పుడు కూడా ఆకలి కారణంగా స్కూల్లో చెబుతున్న పాఠాలపై ముఖ్యంగా తనకు ఇష్టమైన సైన్సు పాఠాలపై ఆమె శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.

"ఆకలితో ఉన్న విద్యార్ధులు తాము నేర్చుకునే పాఠాల మీద దృష్టి పెట్టలేరు'' అని ఇండియాలో ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు డైరక్టర్ గా పని చేస్తున్న బిషో పరాజులి అన్నారు.

1925లో చెన్నై(అప్పటి మద్రాస్)లో మొదట ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకం, అల్ఫిషా వంటి దాదాపు 11 కోట్లమంది భారతీయ విద్యార్ధులకు ఆహారం అందించడంలో కీలక పాత్ర పోషించింది.

గత సంవత్సరం దీనికి పీఎం పోషణ్‌గా పేరు మార్చారు. ఈ పథకం మహమ్మారి కంటే ముందు దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 87 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థుల కడుపు నింపింది.

పోషకాహార లోపం సమస్యను తీర్చడంతోపాటు, పిల్లలు, ముఖ్యంగా వెనకబడిన నేపథ్యం నుంచి వచ్చిన బాల బాలికలను స్కూల్ కు రప్పించడానికి ఇది ఉత్తమ మార్గమని ఈ పథకాన్ని విద్యావేత్తలు, ఆర్ధికవేత్తలు కొనియాడారు.

"పిల్లలు వేడి వేడి అన్నాన్ని తినడం నేను చూశాను" అని పరాజులి అన్నారు. "ఆకలి వారి చురుకుదనం మీద, నేర్చుకునే గుణం మీద చూపే ప్రభావాన్ని తక్కువ చేసి చూడలేం'' అని ఆయన అన్నారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఈ పథకాన్ని మళ్లీ అమలు చేయడం చాలా పాఠశాలల్లో సవాలుగా మారుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లో, ఎక్కువమందికి భోజనం వండేందుకు అవసరమైన ధాన్యాలు, పప్పు వంటి ముడి పదార్థాల పంపిణీలో ఆలస్యం అవుతోంది. ఇక పట్టణాలు, నగరాలలోని పాఠశాలలు పిల్లలకు ఆహారం అందించే సెంట్రలైజ్డ్ కిచెన్‌లతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు.

కోవిడ్ మహమ్మారి పిల్లలను ప్రభావితం చేసిందని, ఈ పథకాన్ని పునఃప్రారంభించాలని ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ప్రభుత్వాన్ని కోరారు.

"పిల్లలు పాఠశాలలకు తిరిగి వస్తున్నందున వారికి మెరుగైన పోషకాహారం అవసరం" అని ఆమె పార్లమెంటులో అన్నారు.

గత సంవత్సరం, గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లోని 116 దేశాల జాబితాలో భారతదేశం 101వ స్థానంలో ఉంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్‌ల కంటే ఇండియా చాలా దిగువన ఉంది.

అలాగే సబ్-సహారన్ ఆఫ్రికాలోని కామెరూన్, టాంజానియా వంటి పేద, రాజకీయంగా అస్థిర దేశాల కంటే కూడా భారత్ చాలా దిగువన ఉంది.

2019 నుండి 2021 వరకు నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో మూడింట ఒకవంతు మంది తక్కువ బరువు సమస్యతో బాధపడుతున్నారని తేలింది. 2015-2016లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ఎలాంటి మెరుగుదల కనిపించ లేదు.

కొన్ని రాష్ట్రాల్లో - ముఖ్యంగా పశ్చిమాన ఆర్థికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, దక్షిణాన కేరళలలో సాధారణ విద్యార్ధులు, తక్కువ బరువు విద్యార్ధుల నిష్పత్తి కూడా మారింది.

గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ నిపుణులు ఈ తీవ్రమైన పోషకాహార లోపానికి విస్తృతమైన పేదరికం, వేగవంతమైన జనాభా పెరుగుదల, బలహీనమైన పాలనా వ్యవస్థ, పేలవమైన ఆరోగ్య వ్యవస్థలను కారణంగా చూపుతున్నారు.

కరోనా మహమ్మారి పేదలను మరింత బలహీనులుగా మార్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మురికివాడలలోప్రభుత్వ సేవలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగా తగ్గాయి.

ప్రభుత్వ విధానాలలోని లోపాలను తొలగించేందుకు అనేక ఎన్జీవోలు, స్వయం సహాయక బృందాలు భోజనాన్ని పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నాయి. అయితే ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తోంది.

ఉదాహరణకు, ముంబయిలోని శంకర్‌వాడి వద్ద, కొంతమంది విద్యార్థులు 'టీచ్ ఫర్ ఇండియా' కార్యక్రమం ద్వారా ఉచిత భోజనాన్ని అందుకుంటున్నారు. ఇది ప్రైవేట్ పెట్టుబడి ద్వారా మహారాష్ట్ర అంతటా ప్రభుత్వ పాఠశాలలతో పార్ట్‌నర్ షిప్‌ను కొనసాగిస్తోంది.

12 సంవత్సరాలకు పైగా టీచర్‌గా పని చేస్తున్న గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయుడు ఇర్ఫాన్ అంజుమ్, మధ్యాహ్న భోజనం విద్యార్థులకు దేవుడు ఇచ్చిన వరం అంటారు.

ఆయన క్లాసులోని 26 మందిలో 8-10 మంది విద్యార్థులు రోజూ ఇంటి నుంచి మధ్యాహ్నం భోజనం తెచ్చుకోరు. బయట తినడానికి వారి దగ్గర డబ్బులు కూడా ఉండవు.

"ఈ పిల్లలు చాలా పేదరికం నుంచి వచ్చారు'' అని ఆయన అన్నారు. మధ్యాహ్న భోజన పథకం లేకపోవడంతో వారు ఆకలితోనే ఉంటున్నారని ఆయన వెల్లడించారు.

స్కూళ్లు తెరిచిన తర్వాత భోజన పథకం ప్రారంభం కాకపోవడంతో అంజుమ్ తన సొంత డబ్బులతో పిల్లలకు సమోసాలు, మిఠాయిలు తెప్పిస్తుంటారు. ఆకలికి తట్టుకోలేక కొందరు పిల్లలు ఏడుస్తుంటారు. వారి ఆకలి తీర్చడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను'' అన్నారాయన.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలకు భోజనం సక్రమంగా అందేలా చూడాలని పరాజులి అన్నారు.

మిగతా దేశాలలోని పథకాలకు, భారతదేశంలోని మధ్యాహ్న భోజన పథకానికి ప్రధానమైన తేడా ఏమిటంటే దీనిని ఆహార భద్రతా చట్టం ద్వారా నిర్వహిస్తున్నారు. "పాఠశాల వాతావరణంలో భాగంగా పిల్లలకు ఆహారం అందించాలని చట్టం చెబుతోంది" అని పరాజులి అన్నారు.

చట్టం ప్రకారం, భారత ప్రభుత్వం ఈ పథకానికి నిధులను పక్కన పెట్టడమే కాకుండా, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ వంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు ఆహారం ఇవ్వడానికి ఆ నిధులు ఉపయోగిస్తుంది.

"ఇది చాలా గొప్ప పథకం" అని పరాజూలి వ్యాఖ్యానించారు. ‘‘ఎందుకంటే పిల్లలకు అన్నం దొరుకుతుంది. కుటుంబాలకు కొంత ఆర్ధిక ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వం పిల్లల అభివృద్ధి ద్వారా సానుకూల ఫలితాలను సాధించవచ్చు'' అని ఆయన అన్నారు.

ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలోని మురికివాడలో నివసిస్తున్న షహనూర్ అన్సారీ, లాక్‌డౌన్ కారణంగా కార్పెంటర్‌గా పని చేసే తన భర్త నెలవారీ ఆదాయం ఆగిపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టాలు పడ్డారు.

"మాకు పిడికెడు బియ్యం లభిస్తున్నాయి" అని ఆమె పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో చెప్పారు. జనవరిలో పాఠశాలలు ప్రారంభం కావడం, ఏప్రిల్ నుంచి భోజన పథకం కూడా మొదలు కావడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు.

''నేను ఇంతకు ముందు వారికి అన్నం పెట్టడం గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. ఇప్పుడు వాళ్లు ఏనాటికైనా డాక్టర్లు అవుతారని ఆశపడుతున్నాను''అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)