You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దక్షిణ సూడాన్: కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు దొరకని దుస్థితి
- రచయిత, స్వాహిల్ విల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దక్షిణ సూడాన్‌లో తుపాకి మోతలు ఒకవైపు, ఆకలి కేకలు మరోవైపు వినిపిస్తున్నాయ్.
దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం లక్షలాది చిన్నారులకు శాపంగా మారుతోంది. కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు దొరకని దుస్థితి.
తక్షణమే వీరికి ఆహారం అందకపోతే నాలుగోవంతు చిన్నారులు మరణించే ప్రమాదం ఉందని యూనిసెఫ్ హెచ్చరిస్తోంది.
సహాయక చర్యలకు అంతర్యుద్ధం విఘాతం కలిగిస్తుండటంతో కరవు పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఆకలి సంక్షోభానికి ప్రతీక
రెండేళ్ల వయసున్న క్రిస్టీన్ జాక్సన్, ఆకలి సంక్షోభానికి ప్రతీకగా కనిపిస్తోంది.
తీవ్రమైన పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్న ఈ చిన్నారి సగం బరువు కోల్పోయింది. రోగ నిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తోంది. చిన్న అంటువ్యాధి సోకినా ఊపిరి ఆగిపోతుంది.
ప్రస్తుతం ఆ పాప ఓ శిబిరంలో రక్షణ పొందుతూ, పాల తాగి బతుకుతోంది. ఇక్కడి నుంచి బయటకెళ్తే కనీసం ఒక్క పూట భోజనం పెట్టే స్తోమత కూడా తనకు లేదని క్రిస్టీనా తండ్రి జాక్సన్ లెపానీ ఆవేదన చెందుతున్నారు.
యుద్ధం పేదలుగా మారుస్తోంది
దక్షిణ సూడాన్‌లో ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న వారిలో జాక్సన్ ఒకరు. మంచి ఉద్యోగంతో పాటు ఆయనకు కొంత పొలం కూడా ఉంది.
అయితే నాలుగేళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధం జాక్సన్‌ను నిరుపేదగా మార్చేసింది.
దేశ రాజధాని జుబాలో ప్రతి 10 మంది చిన్నారుల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. రాజధాని బయట ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
ప్రాణాల మీదకు వస్తోన్న సహాయం
ప్రభుత్వం, తిరుగుబాటుదార్ల మధ్య జరుగుతున్న యుద్ధం అనేక మంది సహాయక చర్యలు చేపట్టే ఉద్యోగుల ప్రాణాలను తీస్తోంది.
తిరుగుబాటుదార్ల అధీనంలో ఉన్న గాన్యేల్ వంటి ప్రాంతాల్లో విమానాల ద్వారా సహాయం అందిస్తున్నారు.
ఇది ఎంతో ఖరీదైన వ్యవహారం. కాబట్టి అందరికీ సహాయం చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ క్రమక్రమంగా కరవు పరిస్థితులు నెలకొంటున్నాయి.
నాగలి పట్టడం లేదు
అంతర్యుద్ధం వల్ల ఎంతో మంది రైతులు పొలాలను వదిలేస్తున్నారని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెన్రియేటా ఫోర్ చెబుతున్నారు. దీంతో సాగు తగ్గి ఆహారానికి తీవ్రమైన కొరత ఏర్పడిందని తెలిపారు.
వచ్చే జులైలో మొదలయ్యే పంట కాలంలోనూ పరిస్థితులు ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
"దక్షిణ సూడాన్ ఇప్పుడు ఎంతో క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఇటువంటి దయనీయ స్థితిలో మేం పిల్లల ప్రాణాలు కాపాడాల్సి ఉంది" అని హెన్రియేటా ఆవేదన వ్యక్తం చేశారు.
పంతం నెగ్గించుకోవడానికే
తిరుగుబాటుదార్లకు కూడా సమాన హక్కులు ఉండాలని మధ్యవర్తులు కోరుతున్నారని దక్షిణ సూడాన్ అధ్యక్షుని ప్రతినిధి అటెనీ వెక్ అటెనీ అన్నారు. వారి పంతం నెగ్గించుకోవడం కోసం తిరుగుబాటుదార్లు పిల్లల జీవితాలను బలి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
యుద్ధం ఆగే సూచనలు లేకపోవడంతో ఇక్కడి చిన్నారులు దాతల ఔదార్యం మీద ఆధారపడి జీవిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- అసలు ప్రపంచంలో పేదోళ్లు ఎందరు?
- చిన్నారి పెళ్లికూతురు.. ఇప్పుడు రెజ్లింగ్ స్టార్!
- 'తండ్రి పేరు చెప్పలేక స్కూల్ మానేస్తున్నారు'
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- ఈ చిన్నారిని చంపింది ఎవరు? ఆకలి బాధా? ఆధార్ కార్డా?
- తిండిలేక.. ఆకలికి తాళలేక బిస్కెట్లు తిని బతుకుతున్న తండ్రి
- కూల్‌డ్రింక్స్ తాగితే కొవ్వు పెరుగుతుందా?
- 82 శాతం సంపద ఒక్క శాతం కుబేరుల చేతిలో!
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)