You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్ అమ్మాయి, భారత్ అబ్బాయి... కోవిడ్‌కు ముందు పరిచయం, లాక్‌డౌన్‌లో ప్రేమ, యుద్ధ సమయంలో పెళ్లి
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లోని తన అద్దె ఇంటికి తాళం వేసి భారత్ బయల్దేరారు అన్నా హొరోదెస్కా.
గత నెలలో రష్యాతో యుద్ధం మొదలై కీయెవ్‌పై బాంబుల వర్షం ప్రారంభం కాగానే ఆమె వెంటనే భారత్ బయల్దేరారు. కొన్ని టీషర్ట్‌లు, పెళ్లి కానుకగా తన బామ్మ తనకు ఇచ్చిన ఒక కాఫీ మిషన్ తీసుకుని ఆమె భారత్ పయనమయ్యారు.
ఓ ఐటీ కంపెనీలో పనిచేసే 30 ఏళ్ల అన్నా మార్చ్ 17న దిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే 33 ఏళ్ల లాయర్ అనుభవ్ భాసిన్ ఆమెకు స్వాగతం పలికారు. అన్నా, అనుభవ్‌లు ఏడాదికి పైగా డేటింగ్‌లో ఉన్నారు.
ఆదివారం ఈ జంట దిల్లీలో వివాహం చేసుకుంది. కొద్ది రోజుల్లో వారు తమ వివాహాన్ని రిజిష్టర్ చేయించుకుని చట్టబద్ధం చేసుకోనున్నారు కూడా.
ఏడాది కాలపరిమితితో ఉన్న అన్నా వీసాలో కూడా అనుభవ్ భాసిన్‌ను వివాహం చేసుకునేందుకు భారత్ వస్తున్నట్లుగా రాసి ఉంది.
అన్నా, అనుభవ్ భాసిన్‌ల పరిచయం 2019లో జరిగింది. అన్నా భారత పర్యటనకు వచ్చినప్పుడు 2019 ఆగస్టులో వారిద్దరూ అనుకోకుండా ఒక బార్‌లో కలుసుకున్నారు.
అక్కడ పరిచయం తరువాత వారిద్దరూ ఒకరి ఫోన్ నంబర్ మరొకరు తీసుకున్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అయ్యారు.
వేర్వేరు ఖండాల్లోని రెండు దేశాలలో నివసిస్తున్న వీరిద్దరి మధ్య బంధం ఏర్పడినప్పటికీ.. ఒకరినొకరు కలుసుకోవాలని చేసిన ప్రయత్నాలకు మాత్రం కోవిడ్, విమాన ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ నియమాలు, చివరకు యుక్రెయిన్‌పై రష్యా దాడి అన్నీ కలిసి ఆటంకంగా మారాయి.
''2019 చివరి నాటికి మేం ఇద్దరం మాట్లాడుకోవడం మరింత ఎక్కువైంది'' అని అనుభవ్ చెప్పారు.
2020 మార్చిలో అన్నా మరోసారి భారత్ వచ్చారు. ఈసారి ఆమె తనతో స్నేహితురాలినీ తీసుకొచ్చారు. అనుభవ్ వారిద్దరినీ ప్రేమ చిహ్నంగా పేర్కొనే తాజ్‌మహల్‌కు తీసుకెళ్లారు.
అదే సమయంలో భారత్‌లో హఠాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించారు. దాంతో అన్నా, ఆమె స్నేహితురాలు తిరిగి యుక్రెయిన్ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. వారిద్దరినీ దిల్లీలోని తమ ఇంట్లోనే ఉండమని అనుభవ్ కోరగా అందుకు వారు అంగీకరించారు.
''అన్నా మా ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరం మరింత దగ్గరయ్యాం. ఒకరంటే మరొకరికి ఇష్టమనే విషయమూ గుర్తించాం. ఆ తరువాత ఆమె కీయెవ్ వెళ్లిపోయినప్పటికీ ఇద్దరం రోజూ వీడియో కాల్‌లో మాట్లాడుకునేవాళ్లం'' అని అనుభవ్ చెప్పారు.
ఆ తరువాత మళ్లీ 2021 ఫిబ్రవరిలో ఇద్దరూ దుబయిలో కలుసుకున్నారు. ''అది మా ఇద్దరి బంధంలో కీలక సమయం. ఈ బంధం మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఒక దారి వెతకాలని ఇద్దరం గుర్తించాం'
ఆ తరువాత ఇద్దరూ కలుసుకోవడం మరింత పెరిగింది. 2021 ఆగస్ట్‌లో అనుభవ్ కీయెవ్ వెళ్లగా డిసెంబరులో ఆమె భారత్ వచ్చారు.
''ఆ పర్యటనలో చివరి రోజున అనుభవ్ తల్లి ఒక మాట చెప్పారు. మార్చి నెలలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆమె సూచించారు' అని అన్నా చెప్పారు.
అనుభవ్ హిందూ కాగా అన్నా క్రిస్టియన్. కాబట్టి వారిద్దరి వివాహంలో ప్రత్యేక చట్టం ప్రకారంలో కోర్టులో రిజిష్టర్ కావల్సి ఉంది. ఈ ఫార్మాటిలీలన్నీ పూర్తి కావడానికి మరో నెల పడుతుందని అనుభవ్ చెప్పారు.
అందుకే మార్చిలోనే అన్నా భారత్ వచ్చేలా నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
అయితే, వీరి ప్రణాళికలకు అడ్డం పడుతూ యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైంది.
''దౌత్య ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెలిసినప్పటికీ యుద్ధం వస్తుందని మాత్రం అనుకోలేదు'' అని చెప్పారు అన్నారు.
రష్యా దాడులు సరిహద్దు ప్రాంతాలకే పరిమితం అవుతాయని అనుకున్నామని, కీయెవ్ సురక్షితంగానే ఉంటుందని భావించామని అన్నా చెప్పారు.
''కానీ ఫిబ్రవరి 24 బాంబు శబ్దాల మధ్య నిద్ర లేచాను. ఆ శబ్దాలు కలలోనేమో అనుకున్నాను. అయితే, కీయెవ్‌పై బాంబు దాడులు జరుగుతున్నట్లు అనుభవ్, మరికొందరు మెసేజ్‌లు పెట్టడంతో నిజమేనని నిర్ధరించుకున్నాను'' అన్నారు అన్నా.
కీయెవ్‌పై దాడులు మొదలవగానే చాలామంది స్థానికులు తమ సామాన్లు సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. అన్నాను కూడా వెళ్లిపోమని ఇరుగుపొరుగువారు సూచించారు.
దాడులు తీవ్రం కావడంతో ఆ మరుసటి రోజు అన్నా తన తల్లిని, పెంపుడు కుక్కను తీసుకుని బంకర్లోకి వెళ్లారు.
''బంకర్ అప్పటికే కిటకిటలాడుతోంది. నగరంలో కర్ఫ్యూ విధించారు. బంకర్ నుంచి బయటకు వెళ్లడానికి మమ్మల్ని అనుమతించలేదు. అయినా, కాస్తంత ఊపిరి పీల్చుకోవడానికి కుక్కను బయట తిప్పడానికి నేను బంకర్ నుంచి బయటకొచ్చాను. నగరమంతా పొగ వాసన వస్తోంది.. ఆకాశం ఎర్రగా మారిపోయింది'' అని ఆమె ఆ రోజును గుర్తు చేసుకున్నారు.
రష్యా దాడి మొదలు కావడానికి చాలా ముందు నుంచే అనుభవ్ ఆమెను కీయెవ్ వీడాలని సూచించారు. అయితే, అన్నా మాత్రం తన కుక్కను విడిచి రాలేనంటూ అనుభవ్ సూచనలను తిరస్కరించారు.
చివరకు ఫిబ్రవరి 26న ఆమె కీయెవ్ నుంచి వచ్చేయడానికి సిద్ధపడగా వద్దని వారించారు అనుభవ్.
''అప్పటికి పరిస్థితులు మరింత ఘోరంగా మారిపోయాయి. రైల్వే స్టేషన్ కూడా చాలా దూరంలో ఉంది. వెళ్లడానికి టాక్సీలు కూడా అందుబాటులో లేవు. బంకర్ నుంచి ఆమె బయటకొస్తే రైల్వే స్టేషన్‌కు చేరుకునేలోగా ప్రమాదం జరగొచ్చని నేను భయపడ్డాను. కాబట్టి బంకరులోనే ఉండడం మంచిందని సూచించాను'' అని అనుభవ్ చెప్పారు.
అయితే, మరుసటి రోజు ఆమెకు ఓ టాక్సీ దొరకడంతో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి తన అమ్మమ్మ ఉండే ఊరికి వెళ్లే రైలులో తల్లిని, కుక్కను ఎక్కించిన తరువాత అన్నా మరో రైలులో యుక్రెయిన్ పశ్చిమ ప్రాంత పట్టం లివ్యూకు చేరుకున్నారు.
అక్కడి నుంచి ఆమె మొదట స్లొవేకియాకు, తరువాత పోలాండ్‌కు చేరారు. భారత్ నుంచి అనుభవ్ ఇండియా ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపి అన్నాకు వీసా ఏర్పాటు చేసేవరకు రెండు వారాల పాటు ఆమె పోలాండ్‌లోనే ఉన్నారు.
వీసా దొరికాక పోలాండ్ నుంచి ఫిన్లాండ్‌లోని హెల్సింకీ చేరుకుని అక్కడ నుంచి బయలుదేరిన దిల్లీ విమానం ఎక్కారు.
''విమాన ప్రయాణంలో నాకు కునుకు పట్టలేదు. మేం యుద్ధం ప్రాంతం మీదుగా ప్రయాణించనప్పటికీ ఏదైనా మిసైల్ వచ్చి విమానాన్ని ఢీకొంటుందేమోనన్న భయం నన్ను వెంటాడింది'' అని అన్నా చెప్పారు.
మార్చి 17 ఉదయం తన విమానం దిల్లీ చేరేటప్పటికి ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. విమానాశ్రయానికి తాను రావడం కొంచెం లేటవుతుందంటూ అనుభవ్ ఆ మెసేజ్ పంపించారు.
''ఆ మెసేజ్ చూడగానే చాలా బాధపడిపోయాను. నేను బాగా అలసిపోయాను. ఇంటికి వెళ్లి నిద్రపోవాలని కోరుకున్నాను. అయితే, నేను విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేటప్పటికి అనుభవ్ అక్కడ బెలూన్లు, మ్యూజిక్‌తో సిద్ధంగా ఉన్నాడు'' అని అన్నా గుర్తుచేసుకున్నారు.
డ్రమ్స్ వాయించేవారు మాంచి హుషారుగా వాయిస్తుండగా అనుభవ్ తన మోకాలిపై కూర్చుని అన్నాకు తన ప్రేమను తెలిపి వేలికి ఉంగరం తొడిగారు.
అనుభవ్‌తో పాటు వచ్చిన ఫ్రెండ్స్, అక్కడున్న మిగతా వారు చప్పట్లతో ఉత్సాహపరచడం, కొందరు ఇదంతా తమ ఫోన్లో చిత్రీకరించడం అంతా హాలీవుడ్ రొమాన్స్‌ను తలపించిందని అన్నా చెప్పారు.
ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. యుద్ధం ముగిశాక తాను కీయెవ్ వెళ్లి తన పెంపుడు కుక్కనూ ఇక్కడికి తెచ్చుకుంటానని అన్నా చెబుతున్నారు.
ప్రేమ కథలో అసలు హీరో కాఫీ మెషీన్
''కొద్ది నెలల కిందట నేను మా అమ్మమ్మకు నా పెళ్లి ఆలోచన గురించి చెప్పాను. ఆమె నాకు పెళ్లి కానుకగా కొంత డబ్బులిచ్చారు'' అని అన్నా గుర్తుచేసుకున్నారు.
'అనుభవ్‌కు ఎస్‌ప్రెసో ఇష్టం కావడంతో ఆ డబ్బుతో కాఫీ మెషిన్ కొనాలని నేను నిర్ణయించుకున్నాను. కీయెవ్ నుంచి నేను భారత్ వచ్చినప్పుడు ఆ మెషిన్ నాతో తెచ్చాను. కాఫీ మెషిన్ గురించి ఆందోళన చెందొద్దని... ఇండియాలో అలాంటిది ఒకటి కొనుక్కోవచ్చని అనుభవ్ చెప్పినప్పటికీ, మళ్లీ తిరిగి కీయెవ్ ఎప్పడు వెళ్తానో తెలియదని నాతో తెచ్చాను'' అని అన్నా చెప్పారు.
''అన్నా శిక్షణ పొందిన మేకప్ ఆర్టిస్ట్. ఈ మెషీన్ తనతో పాటు తేవడం కోసం ఆమె తన విలువైన మేకప్ సామగ్రి కూడా అక్కడే వదిలేసి వచ్చారు. కాబట్టి ఈ కాఫీ మెషిన్ మా ప్రేమకథలో రియల్ హీరో' అని అనుభవ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రెండేళ్ల చిన్నారి వీపుపై పేరు, ఊరు, కాంటాక్ట్ నంబర్లు రాసిన ఓ తల్లి కన్నీటి గాథ.. వీళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే..
- బిల్లు చెల్లించడానికి చేయి ఉంటే చాలు... డెబిట్, క్రెడిట్ కార్డులు అక్కర్లేదు, ఎలాగో తెలుసుకోండి..
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
- యుక్రెయిన్: ‘రష్యా సైనికులు మా నాన్న గుండె మీద కాల్చారు.. నా కళ్లెదుటే చంపేశారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)