Felicity Ace: పోర్షె, ఆడి, లాంబోర్గిని, బెంట్లీ.. మొత్తం 4000 లగ్జరీ కార్లు అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో కాలిపోయాయి

వేల సంఖ్యలో పోర్షె, ఫోక్స్‌వాగన్ కార్లతో అట్లాటింగ్ మీదుగా అమెరికా వెళ్తున్న రవాణా నౌకలో అగ్ని ప్రమాదం సంభవించింది.

ఫెసిలిటీ ఏస్‌గా పిలుస్తున్న ఈ నౌక జర్మనీలోని ఎండెన్ నుంచి బయలుదేరింది. అయితే, పోర్చుగల్‌కు చెందిన అజోర్స్ దీవుల తీరంలో దీనికి నిప్పు అంటుకుంది.

ఈ రవాణా నౌకలో మొత్తంగా 3,965 వాహనాలు ఉన్నాయని జర్మనీ పత్రిక హ్యాండెల్స్‌బ్లట్ తెలిపింది. ఆడి, లాంబోర్గిని, బెంట్లీ లాంటి లగ్జరీ కార్లు కూడా ఈ నౌకలో ఉన్నట్లు పేర్కొంది.

ఈ నౌకలో ప్రయాణించిన సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.

అగ్ని ప్రమాదం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని, పడవలో ఉన్న 22 మందిని రక్షించామని పోర్చుగల్ నౌకా దళం తెలిపింది. బుధవారం ఈ ప్రమాదం జరిగినట్లు వివరించింది. నౌకలోని సిబ్బందిని నాలుగు పడవల్లో ఒక హోటల్‌కు తరలించామని పేర్కొంది.

ఆ నౌకను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు నౌక యజమానితో లాజిస్టిక్ ఏజెంట్ మాట్లాడినట్లు పోర్చుగల్ నౌకా దళం పేర్కొంది.

ఫోక్స్‌వాగన్, పోర్షె, ఆడి, లాంబోర్గినీ లాంటి 3965 లగ్జరీ కార్లు ఆ నౌకలో ఉన్నాయని ఫోక్స్‌వాగన్ అమెరికా ఒక ఈమెయిల్‌లో స్పష్టం చేసినట్లు హ్యాండెల్స్‌బ్లట్ తెలిపింది.

అయితే, ఫోక్స్‌వాగన్ కార్లు ఎన్ని ఉన్నాయో సంస్థ స్పష్టం చేయలేదు. అయితే, పోర్షె మాత్రం 1,100 కార్లు తమ కంపెనీవి ఉన్నట్లు పేర్కొంది.

అట్లాటింక్ మీదుగా ప్రయాణిస్తున్న ఆ నౌకలో ఫోక్స్‌వాగన్ కార్లు కూడా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని సంస్థ పేర్కొంది.

తమ కంపెనీ కార్లు 189 ఉన్నాయని బెంట్లీ వెల్లడించింది. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు షిప్పింగ్ కంపెనీతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.

రోడ్ ఐలాండ్‌ డేవిస్‌విల్‌లోని ఫోక్స్‌వాగన్ ఫాక్టరీకి ఈ కార్లను తరలిస్తున్నట్లు మెరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఆ నౌకలో తన పోర్షె కారు కూడా ఉన్నట్లు ఓ కస్టమర్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు.

ఈ నౌకను బహమాస్ లేదా సమీపంలోని మరొక ఐరోపా దేశానికి తీసుకెళ్లనున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

''ఎలక్ట్రిక్ కార్లలోని లిథియం అయాన్ బ్యాటరీలకు కూడా నిప్పు అంటుకుంది. మంటలను ఆర్పేందుకు ప్రత్యేక పరికరాలు అవసరం''అని సమీపంలోని హోర్తాస్ పోర్టు కెప్టెన్ జోవో మెండెస్ చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.

ఈ లిథియం అయాన్ బ్యాటరీల వల్లే ప్రమాదం జరిగిందో లేదో స్పష్టంగా తెలియడం లేదు.

''ఒకవైపున మొదలైన మంటలు రెండో వైపుగా వెళ్లాయి. నీటికి ఐదు మీటర్లపైనున్న అన్నీచోట్ల మంటలు కనిపిస్తున్నాయి''అని జోవో వివరించారు.

ఈ నౌకను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు రెండు పడవలు జిబ్రాల్టర్, నెదర్లాండ్స్‌ల నుంచి వస్తున్నాయి. ''దీన్ని అజోర్స్ తీరానికి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే ఈ పడవ చాలా పెద్దది''అని జోవో చెపారు.

మరోవైపు మంటలను ఆపేందుకు 16 మంది సభ్యుల అగ్నిమాపక సిబ్బంది వస్తున్నట్లు నెదర్లాండ్స్‌కు చెందిన మెరైన్ ఇంజినీర్ బోస్‌కలిస్.. రాయిటర్స్‌తో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)