ఎలాన్ మస్క్: టెస్లా కార్లు ఇండియాకి ఎప్పుడొస్తాయి? అడ్డంకులు ఏమిటి?

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2021 జనవరిలో టెస్లా ఇండియాలో అడుగు పెట్టింది. ఇప్పటికి ఏడాది దాటి పోయింది కానీ ఇంతవరకు ఒక్క టెస్లా కారు కూడా భారత్ రోడ్ల మీద పరుగులు తీయలేదు.

టెస్లా కార్లు ఎప్పుడు ఇండియాలోకి వస్తాయంటూ ట్విటర్ వేదికగా ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్‌ను ఒక యూజర్ అడిగారు. గవర్నమెంటుతో తీర్చుకోవాల్సిన కొన్ని పేచీలున్నాయంటూ మస్క్ ఆ యూజర్‌కు జవాబిచ్చారు.

ఎలాన్ మస్క్ ఇలా ట్వీట్ చేశారో లేదా అలా తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఆయనకు ట్విటర్ ద్వారానే ఆహ్వానాలు పంపాయి. మా రాష్ట్రంలోకి రండి అంటే మా రాష్ట్రంలోకి రండి అంటూ పిలవడంలో పోటీలు పడుతున్నాయి. తమ వద్ద తయారీ ప్లాంట్‌ను పెట్టమంటూ అడుగుతున్నాయి.

భారత్‌లో మొదలు కాని అమ్మకాలు

టెస్లా కార్ల అమ్మకాలు 2008లోనే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అమెరికా, కెనడా చైనా, బ్రిటన్‌తో సహా అనేక యూరప్ దేశాల్లో టెస్లా కార్లు అమ్ముతున్నారు.

కానీ భారత్‌లో మాత్రం ఇంకా సేల్స్ మొదలు కాలేదు. ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉండే రెండో దేశమైన భారత్, అతి పెద్ద మార్కెట్ అనే విషయం అందరికీ తెలిసిందే.

అమ్మకాలు పెంచుకోవాలంటే ఏ కంపెనీకైనా భారత్ వంటి మార్కెట్‌లు ఎంతో కీలకం. 2030 నాటికి ఏడాదికి రెండు కోట్ల వాహనాలను అమ్మాలని టార్గెట్ పెట్టుకున్న టెస్లా, తన లక్ష్యం చేరుకోవాలంటే ఇక్కడి కస్టమర్లకు చేరువ కావడం కూడా ముఖ్యమే.

బెంగళూరులో ఆఫీసు తెరచి ఏడాది కావస్తున్నా కూడా టెస్లా కార్ల అమ్మకాలు ఇక్కడ ఎప్పుడు మొదలవుతాయో ఇంకా స్పష్టత లేదు.

దిగుమతి సుంకాలు తగ్గించాలంటున్న టెస్లా

భారత్‌లోకి అడుగు పెట్టలేక పోవడానికి ప్రధానం కారణం దిగుమతి సుంకాలని టెస్లా చెబుతోంది. ప్రస్తుతం విదేశాల్లో తయారు చేసి ఇండియాలోకి దిగుమతి చేసే కార్ల మీద 60 నుంచి 100శాతం వరకు దిగుమతి సుంకాలు విధిస్తోంది ప్రభుత్వం.

కారు ఇంజిన్ సైజ్, ధర వంటి అంశాల ఆధారంగా ఇది మారుతుంది. కారు ధర, ఇన్సూరెన్స్, ఫ్రైట్ చార్జెస్ 40,000 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే దిగుమతి చేసుకునే వాహనం మీద 100శాతం సుంకం విధిస్తున్నారు.

అంతర్జాతీయంగా భారత్‌లోనే దిగుమతి సుంకాలు అత్యంత ఎక్కువగా ఉన్నాయని, వాటి నుంచి తాత్కాలికంగానైనా తమకు ఉపశమనం కలిగించాలని టెస్లా కోరుతోంది.

మేక్ ఇన్ చైనాకు నో

భారత్‌లో టెస్లా కార్లను తయారు చేయాలని కోరుకుంటోంది ప్రభుత్వం. అంతేకానీ చైనాలో తయారు చేసే కార్లను ఇక్కడ అమ్మ కూడదని అది కోరుకుంటోంది. గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

‘చైనాలో తయారు చేసిన కార్లను ఇక్కడ అమ్మడానికి బదులు స్థానికంగానే వాటిని తయారు చేయండి. ఇక్కడి నుంచే ఎగుమతి చేయండి.’ అంటూ గతంలో ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ గడ్కరీ అన్నారు.

టెస్లాకు చైనాలో కార్ల తయారీ ఫ్యాక్టరీ ఉంది. ముందు భారత్‌లో తయారీ ప్రారంభించండి, ఆ తరువాత టెస్లాకు చేయదగ్గ సాయం చేస్తామంటోంది ప్రభుత్వం.

సాయం చేస్తామన్నా టెస్లా ఎందుకు తయారీకి ముందుకు రావడం లేదు?

ఇండియాలో కార్ల తయారీ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు టెస్లాకు సాయం చేస్తామంటున్నాయి. కానీ ఇప్పట్లో భారత్‌లో కార్ల తయారీ చేపట్టడానికి టెస్లా సుముఖంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి ధర, రెండు చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.

టెస్లా మోడల్-3 ధర ప్రస్తుతం 40వేల డాలర్ల నుంచి 54వేల డాలర్ల మధ్య ఉంది. ఇండియా కరెన్సీలో రూ.30-40 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారును దిగుమతి చేసుకుంటే దాని ధర రూ.60-70 లక్షలు అవుతుంది. కానీ ఇది మధ్యతరగతికి అందుబాటులో ఉండే ధర కాదు.

ఇక దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇంకా పూర్తి స్థాయిలో చార్జింగ్ స్టేషన్లు వంటి మౌలికవసతులు రూపుదిద్దుకోలేదు. ఈ కారణాలతో భారత్‌లో తయారీకి టెస్లా ఇప్పుడే సిద్ధంగా లేదని ఆటో మొబైల్ రంగ నిపుణుడు, ఎలారా క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జే కాలే అన్నారు.

భారత్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మెల్లగా పెరుగుతున్నా పెట్రోలు, డీజిల్ వాహనాలతో పోలిస్తే వీటి వాటా సుమారు 1శాతం మాత్రమే. అందుకే దిగుమతులతో ఇండియా మార్కెట్‌ను టెస్ట్ చేయాలని టెస్లా భావిస్తున్నట్లుగా జే కాలే అభిప్రాయపడ్డారు. ఆ తరువాత డిమాండ్ ఆధారంగా భారత్‌లో ప్లాంట్ పెట్టే విషయంపై టెస్లా నిర్ణయం తీసుకుంటుంది.

కేంద్రం ఎందుకు సుంకాలు తగ్గించనంటోంది?

ఇంపోర్టెడ్ కార్ల మీద దిగుమతి సుంకాలు తగ్గించినా లేదా తీసేసినా అది దేశీయ వాహన పరిశ్రమకు మంచిది కాదని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేక్ ఇన్ ఇండియాకు కూడా ఇది మంచిది కాదని జే కాలే అన్నారు. అందుకే భారత్‌లోనే టెస్లా తయారీ చేపట్టాలని, ఇక్కడి నుంచే ఎగుమతి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

దిగుమతి సుంకాలు తగ్గిస్తే టెస్లాకు మేలు జరగొచ్చు. కానీ దీనివల్ల ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇండియాలో తయారీ యూనిట్లు పెట్టడం కన్నా ఇతర దేశాల్లోని ఫ్యాక్టరీల నుంచి వాహనాలను దిగుమతి చేయడానికే మొగ్గు చూపుతాయని, అందుకే సుంకాల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉందని జే కాలే చెప్పుకొచ్చారు.

రాష్ట్రాలు టెస్లాకు సాయం చేయగలవా?

కేంద్ర ప్రభుత్వంతో కొన్ని సవాళ్లు ఉన్నాయని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్వీట్ చేయగానే చాలా రాష్ట్రాలు సాయం చేస్తామంటూ ముందుకొచ్చాయి.

కానీ నిజానికి ఈ విషయంలో రాష్ట్రాలు చేసేది పెద్దగా ఏమీ ఉండదు. దిగుమతి సుంకాలు అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి. తయారీ ప్లాంటు పెట్టడానికి సిద్ధమైతేనే టెస్లాకు రాష్ట్రాలు వివిధ రూపాల్లో సాయం చేయగలవు.

టెస్లా చరిత్ర ఏంటి?

ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో టెస్లాను ఒక సంచలనంగా చెబుతుంటారు. 2003‌లో ప్రారంభమైన ఈ కంపెనీ ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూస్తు నేడు ఒక ట్రిలియన్ డాలర్స్ కంపెనీగా అవతరించింది. అదే రూపాయల్లో చెప్పాలంటే టెస్లా ప్రస్తుత మార్కెట్ విలువ 74 లక్షల కోట్లు. అంటే ప్రపంచంలో చాలా దేశాల జీడీపీ కంటే ఈ కంపెనీ మార్కెట్ విలువే ఎక్కువ.

నేడు చాలా మంది టెస్లాను స్థాపించింది ఎలాన్ మస్క్ అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి టెస్లాను స్థాపించింది మార్టిన్ ఇబర్‌హార్డ్, మార్క్ టార్పెనింగ్ అనే ఇద్దరు అమెరికన్ ఇంజినీర్లు. 2004లో పెట్టుబడులు పెట్టడం ద్వారా టెస్లాలో మెజారిటీ షేర్ హోల్డర్ అయ్యారు మస్క్. 2008లో ఆ కంపెనీకి సీఈఓ అయ్యారు. భవిష్యత్తులో రవాణా రంగాన్ని మరింత పర్యావరణ హితంగా తీర్చిదిద్దడమే తమ టార్గెట్ అని చెబుతోంది టెస్లా.

ఫిజిక్స్ మీద పట్టు ఉన్న వాళ్లకు టెస్లా అంటే ఏంటో తెలిసే ఉంటుంది. టెస్లా అనేది అయస్కాంత క్షేత్ర సామర్థ్యాన్ని కొలిచే ఒక యూనిట్. ప్రముఖ ఎలక్ట్రిక్ ఇంజినీర్ నికోలస్ టెస్లా పేరు మీదుగా ఆ యూనిట్‌కు టెస్లా అని పేరు పెట్టారు. నికోలస్ టెస్లా సేవలకు గుర్తుగా టెస్లా అని తమ కంపెనీకి పేరు పెట్టుకున్నారు ఫౌండర్స్.

టెస్లా ఎందుకు అంత ఫేమస్?

టెస్లా నేడొక ఫేమస్ బ్రాండ్. ఇండియాలోనూ దానికున్న క్రేజ్ ఎక్కువే. మా దేశంలోకి టెస్లా కార్లను ఎప్పుడు తెస్తారంటూ తరచూ ఎలాన్ మస్క్‌ను ట్విటర్ ద్వారా అడుగుతూనే ఉంటారు ఎలక్ట్రిక్ కార్ల అభిమానులు.

టయోటా, ఫోర్డ్ వంటి ఆటో మొబైల్ కంపెనీలు కొన్ని దశాబ్దాలలో సాధించిన సక్సెస్‌ను కేవలం 18 ఏళ్లలో సాధించింది టెస్లా. నేడు మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో మొబైల్ కంపెనీ టెస్లా.

టెస్లా ముందు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. కానీ టెస్లాకు ఎందుకు ఇంత క్రేజ్? అట్రాక్టివ్ డిజైన్, పవర్‌ఫుల్ బ్యాటరీ, మోస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ... ఈ మూడు టెస్లాను ఇతర కంపెనీలకంటే భిన్నంగా నిలిపాయి. అంతేకాదు టెస్లా తయారు చేసిది ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే.

ఎలక్ట్రిక్ కారు అనగానే స్పీడ్, పెర్ఫామెన్స్ తక్కువ అనే ఇమేజ్‌ను బద్దలు కొట్టింది టెస్లా. తన ఇన్నోవేటివ్ టెక్నాలజీతో బ్యాటరీలను మరింత సెఫ్టీగా మరింత పవర్ ఫుల్‌గా మార్చింది కంపెనీ. మోడల్-ఎస్‌ను తీసుకుంటే... దాని రేంజ్ సుమారు 630 కిలోమీటర్లు. టాప్ స్పీడ్... గంటకు 300 కిలోమీటర్లకు పైనే.

ఆధునిక టెక్నాలజీతో కొత్త ట్రెండ్

టెస్లా విజయంలో కీలక పాత్ర పోషించిన మరొక అంశం టెక్నాలజీ. ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఇతర కార్ల కంపెనీలు ఫెయిల్ అయింది ఇక్కడే. వాటి వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంది టెస్లా. అందుకే తమ కార్లు టెక్నాలజీ పరంగా మోస్ట్ అడ్వాన్స్‌డ్‌గా ఉండేలా తీర్చిదిద్దింది.

చాలా మంది టెస్లాను టెక్ కంపెనీగా కూడా చూస్తుంటారు. కారును డ్రైవ్ చేయడం, సెల్ఫ్ పార్కింగ్ వంటి ఫీచర్లున్న టెస్లా ఆటో పైలెట్ ఫీచర్ అందుకొక ఎగ్జాంపుల్. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విషయంలోనూ టెస్లా ఇతర కంపెనీల కంటే ముందే ఉందనేది నిపుణుల చెబుతున్న మాట.

డిజైన్, బ్యాటరీ, టెక్నాలజీతోపాటు టెస్లాకు పేరు తెచ్చిన మరొక అంశం సేల్స్ నెట్‌వర్క్. డీలర్ల ద్వారా కాకుండా నేరుగా టెస్లానే కార్లను అమ్ముతుంది. సర్వీస్ అందిస్తుంది. చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. అంటే కంపెనీకి కస్టమర్ మధ్య మూడో వ్యక్తి ఉండరు. పర్యావరణ మార్పుల గురించి ప్రపంచమంతా చర్చిస్తున్న సమయంలో టెస్లా మార్కెట్‌లోకి ఎంటర్ కావడం కూడా దానికి కలిసొచ్చింది.

టెస్లాపై విమర్శలు

ఇక టెస్లా విజయాలకే కాదు వివాదాలకు కూడా ఫేమసే. ఎలాన్ మస్క్ తనను బయటకు వెళ్లగొట్టి కంపెనీని లాక్కున్నాడంటూ టెస్లా ఫౌండర్స్‌లో ఒకరైన మార్టిన్ ఇబర్‌హార్డ్ గతంలో ఆరోపించారు. 2007లో టెస్లా పదవి నుంచి వైదొలిగిన మార్టిన్, 2008లో కంపెనీని వీడారు. అప్పుడు టెస్లాకు ఛైర్మన్‌గా ఉన్నారు ఎలాన్ మస్క్.

పబ్లిక్ కంపెనీగా ఉన్న టెస్లాను ప్రైవేటు కంపెనీగా మారుస్తున్నామంటూ 2018 అగస్టులో మస్క్ చేసిన ట్వీట్ దుమారాన్ని రేపింది. ఆ తరువాత మస్క్‌ ట్వీట్‌లోని సమాచారం ఫాల్స్ అని తేలడంతో టెస్లా ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాదు 20 మిలియన్ డాలర్లు పెనాల్టీ కూడా కట్టారు.

కంపెనీ అనుసరించిన అకౌంటింగ్ విధానాలు, నియమాలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు గతంలో వచ్చాయి. పర్యావరణ హితమే తమ లక్ష్యమని చెబుతున్న టెస్లా, తాము విడుదల చేసే కర్బన ఉద్గారాలను బయటకు వెల్లడించడం లేదని సీడీపీ వంటి ఎన్జీవోలు గతంలో ఆరోపించాయి. ఇక ఉద్యోగులకు వేధింపులు, ఆఫ్రికా-అమెరికన్లపై వివక్ష వంటి వివాదాలు కూడా టెస్లాను చుట్టు ముట్టాయి.

ఇక కార్ల విషయంలోనూ లోపాలు తలెత్తుతున్నట్లు వార్తలు వచ్చాయి. బ్యాటరీ ఫెయిల్ కావడం, హీటింగ్, ఆటో పైలెట్ ఫెయిల్యూర్స్ వంటివి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. గత ఏడాది డిసెంబరులో అమెరికా మార్కెట్‌ సుమారు 5 లక్షల కార్లను టెక్నికల్ లోపాల కారణంగా వెనక్కి పిలిపించింది టెస్లా.

ఇక ఆటో పైలెట్ ఫీచర్‌లో లోపాల కారణంగా అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)