You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంక పోర్ట్ సిటీ: కొలంబోలో కొత్త నగరాన్ని నిర్మిస్తున్న చైనా
- రచయిత, అణ్బరసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీలంక రాజధానిలో సముద్ర తీరం వెంబడి రూపుదిద్దుకుంటున్న మహా నగరం కొలంబో పోర్ట్ సిటీని "ఎకనామిక్ గేమ్ ఛేంజర్"గా అభివర్ణిస్తున్నారు అధికారులు.
కొలంబోలోని తీర ప్రాంతంలో ఉన్న అర్బన్ పార్క్ గాల్ ఫేస్ గ్రీన్‌కు పక్కనే, విస్తీర్ణమైన భూభాగంలో హైటెక్ సిటీగా రూపుదిద్దుకుంటోందీ నగరం.
ఇక్కడ ఒక ఆఫ్‌షోర్ ఫైనాన్షియల్ సెంటర్, నివాస ప్రాంతాలు, మెరీనా రానున్నాయి. దాంతో ఈ సిటీని దుబాయ్, మొనాకో, హాంగ్‌కాంగ్‌లతో పోల్చి చూస్తున్నారు.
"పునరుద్ధరించిన ఈ భూభాగం.. శ్రీలంక మ్యాపును మళ్లీ గీయడానికి, ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించడానికి, దుబాయ్ లేదా సింగపూర్‌లతో పోటీపడడానికి అవకాశం ఇస్తుంది" అని కొలంబో పోర్ట్ సిటీ ఎకనామిక్ కమిషన్ సభ్యుడు సాలియా విక్రమసూర్య బీబీసీకి తెలిపారు.
అయితే, శ్రీలంక స్థితిగతులను ఈ నగరం ఎంతవరకు మార్చగలదని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
చైనా సహాయంతో..
తొలి అడుగుగా, ఇక్కడ 665 ఎకరాల భూమిని పునరుద్ధరించేందుకు చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ (సీహెచ్‌సీ) 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ప్రతిఫలంగా, ఆ సంస్థకు 99 సంవత్సరాల లీజుపై 43 శాతం వాటా అందింది.
అనేక సంవత్సరాలపాటు పూడిక తీసిన తరువాత, ఇటీవల అక్కడ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కొత్త నగరం రూపుదిద్దుకుంటోంది.
చైనీస్ ఇంజనీర్ల పర్యవేక్షణలో భారీ క్రేన్‌లు కాంక్రీట్ స్లాబ్‌లను తరలిస్తుండగా, ఎర్త్ మూవర్‌లు టన్నుల కొద్దీ ఇసుకను ట్రక్కుల్లో నింపుతున్నాయి.
ఈ భూభాగం మధ్య నుంచి పారుతున్న నదికి ఇప్పటికే పూడిక తీశారు. అందులో చిన్న చిన్న పడవలు వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు.
ఈ నగరం పూర్తవడానికి సుమారు 25 సంవత్సరాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ ఆసియాలో ఇలాంటి నగరం నిర్మించడం ఇదే తొలిసారి అని అంటున్నారు.
తమ ఆధీనంలో ఉన్న భూమిని, చైనీస్‌కు ఇచ్చిన భాగాన్ని కూడా బహుళజాతి సంస్థలకు, బ్యాంకులు, ఇతర కంపెనీలకు లీజుకు ఇవ్వనున్నట్లు శ్రీలంక తెలిపింది. రాబడిపై శ్రీలంక ప్రభుత్వం పన్ను విధించవచ్చు.
కొత్త నగరంలో సుమారు 80,000 మంది ప్రజలు నివసించవచ్చని అంచనా. ఇక్కడ పెట్టుబడి పెట్టి, వ్యాపారం చేసేవాళ్లకు పన్ను రాయితీలు ఇస్తారు.
ఈ ప్రత్యేక ఆర్థిక జోన్‌లో జీతాలతో సహా అన్ని లావాదేవీలు అమెరికన్ డాలర్లలో జరుగుతాయి.
2014లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కొలంబో పర్యటన సందర్భంగా పోర్ట్ సిటీ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. అప్పటికి ఒక ఏడాది క్రితం జిన్‌పింగ్ తన ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించారు.
2009లో తమిళ వేర్పాటువాదులతో సుదీర్ఘ యుద్ధం ముగిసిన తరువాత, దేశ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం శ్రీలంక, చైనాను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో, మానవ హక్కుల ఉల్లంఘనపై పాశ్చాత్య దేశాలు ఆందోళనలు చేశాయి.
షీ జిన్‌పింగ్ శ్రీలంకలో పర్యటిస్తున్న సమయానికి మహింద రాజపక్సే శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్నారు. చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుంటున్నారన్న ఆందోళనలు శ్రీలంక ప్రజల్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా, హంబన్‌తోట ఓడరేవు విషయంలో ఆందోళనలు రేకెత్తాయి. ఫలితంగా, అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో రాజపక్సే ఓడిపోయారు.
ఎనిమిది సంవత్సరాల అనంతరం, రాజపక్సే శ్రీలంక ప్రధానమంత్రిగా తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆయన తమ్ముడు గోటాబయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
కానీ, ఇప్పుడు హంబన్‌తోట ఓడరేవు శ్రీలంక చేతుల్లో లేదు. అంతకు ముందున్న ప్రభుత్వం, చైనీస్ సంస్థలకు రుణాలు చెల్లించలేక 2017లో ఆ ఓడరేవును చైనీయుల హస్తగతం చేసింది. తద్వారా సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని ఇతర రుణాలను చెల్లించడానికి వినియోగించినట్లు ఆ ప్రభుత్వం పేర్కొంది.
బహుశా అందుకే పోర్ట్ సిటీ పట్ల అధికారులకున్నంత ఉత్సాహం శ్రీలంకలో ఉన్నవారందరికీ లేదు.
ప్రాజెక్టుపై ఆందోళనలు
ఈ ప్రాజెక్టుపై పలు రకాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పర్యావరణ ప్రభావాల పట్ల ఆందోళనలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి నిర్మాణాలు దేశానికి ప్రయోజనం చేకూర్చవని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా, దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని మరికొందరి విశ్వాసం.
"పోర్ట్ సిటీ చట్టంలో టాక్స్ హాలీడేస్ (పన్నులు తగ్గించడం లేదా పరిమిత కాలానికి మినహాయింపు) ఉన్నాయి. కొంతమంది పెట్టుబడిదారులకు గరిష్టంగా 40 ఏళ్లకు పన్ను రాయితీ లభించవచ్చు. ఇదొక ప్రతికూల అంశం. ఇంత భారీ స్థాయిలో పన్ను రాయితీలు శ్రీలంక ఆదాయాన్ని మెరుగుపరచవు" అని వెరైట్ రీసెర్చ్‌లోని ఆర్థికవేత్త దేశాల్ డి మెల్ అన్నారు.
మనీ లాండరింగ్ చేసేవారికి ఇలాంటి చట్టాలు ప్రయోజనాలు చేకూరుస్తాయని అమెరికా హెచ్చరించింది.
అయితే, శ్రీలంక న్యాయ శాఖ మంత్రి మొహమ్మద్ అలీ సబ్రీ ఈ అభిప్రాయలతో ఏకీభవించట్లేదు.
"ఇక్కడ సాధారణ క్రిమినల్ చట్టం కూడా అమలు అవుతుంది. ఇలాంటి ఆర్థిక నేరాలకు తావు ఉండదు. మాకు మనీ లాండరింగ్ చట్టాలు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉన్నాయి. తప్పు చేసి చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు" అని ఆయన బీబీసీకి చెప్పారు.
మరోవైపు, అంతర్జాతీయ స్థాయిలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో, దీర్ఘకాలంలో దాని వ్యూహాత్మక లక్ష్యాల పట్ల ఆందోళలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీలంకలో చైనా పాత్ర పెరగడం భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమే. భారత్‌లోని బహుళజాతి సంస్థలను, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు పోర్ట్ సిటీ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇది భారతదేశంలోని పెట్టుబడులను, ఉద్యోగావకాశాలను దెబ్బతీయవచ్చు.
చైనా రుణాలు అందించే విధానంపై విమర్శలు
అయితే, కొలంబో పోర్ట్ సిటీ, శ్రీలంకకు కూడా ఇబ్బందులు కలిగిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
వెనుకబడిన దేశాలకు చైనా రుణాలు అందించే విధానంపై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. పేద దేశాలను అప్పుల ఉచ్చులో బంధిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
2020లో లావోస్ దేశం తన ఎనర్జీ గ్రిడ్‌లో కొంత భాగాన్ని చైనాకు విక్రయించడం ద్వారా దివాలా తీయకుండా తప్పించుకుంది.
ఈ నేపథ్యంలో, హంబన్‌తోట లాగే కొలంబో పోర్ట్ సిటీ కూడా దీర్ఘకాలంలో చైనీస్ అవుట్‌పోస్ట్‌గా మారుతుందా?
"ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం చైనాకు ఇచ్చిన హామీలు చూస్తే, పోర్ట్ సిటీ మొత్తాన్ని దాదాపుగా చైనా స్వాధీనం చేసుకుంది. ఏదో ఒకరోజు శ్రీలంక ఈ ప్రాజెక్టుపై పట్టు పూర్తిగా కోల్పోతుంది" అని ప్రతిపక్ష ఎంపీ రజిత సేనరత్న బీబీసీతో అన్నారు.
అయితే, ఈ ప్రాజెక్టు వల్ల ఇరు దేశాలూ లాభం పొందుతాయని చైనీస్ విద్యావేత్త జౌ బో అంటున్నారు.
"చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్వచ్ఛంద సంస్థ కాదు. పరస్పర ప్రయోజనాలు చేకూరాలన్నదే మా ఆశయం. పెట్టిన పెట్టుబడికి రాబడి రావాలనే మేం కోరుకుంటాం" అని జౌ బీబీసీతో అన్నారు.
"ఏ దేశాన్నీ అప్పుల ఊబిలో బంధించే ఉద్దేశం చైనాకు లేదు" అని ఆయన అన్నారు.
"ఆ మొత్తం ప్రాంతం శ్రీలంక సార్వభౌమాధికారం కిందే ఉంది. పెట్రోలింగ్, పోలీసు, ఇమ్మిగ్రేషన్, ఇతర జాతీయ భద్రతా విధుల హక్కులు శ్రీలంక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్నాయి" అని సాలియా విక్రమసూర్య తెలిపారు.
అయితే, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు అనేక రకాల పరిమితులు ఉన్నాయి.
కోవిడ్ మహమ్మారి ఆ దేశ పర్యాటక రంగాన్ని నాశనం చేసింది. విదేశీ ఉపాధిని దెబ్బతీసింది. దాంతో విదేశీ మారక నిల్వలు క్షీణించాయి. విదేశీ రుణాలు 45 బిలియన్ డాలర్లకు మించి పెరిగిపోయాయి. దానిలో 8 బిలియన్ డాలర్లు చైనా నుంచి తీసుకున్నవే.
చైనాకు చెల్లించవలసిన రుణాలను పునఃసమీక్షించమని శ్రీలంక గత వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కోరింది.
ఈ రుణాల కారణంగా శ్రీలంక గ్లోబల్ రేటింగ్ తగ్గిపోతూ ఉండడంతో, తదుపరి రుణాల కోసం అంతర్జాతీయ పెట్టుబడిదారుల వద్దకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
చైనాకు మాత్రమే దీర్ఘకాలిక ఆశయాలు ఉన్నాయి. శ్రీలంకలో హాంగ్‌కాంగ్ లాంటి నగరాన్ని నిర్మిస్తే రాబోయే సంవత్సరాల్లో ఆసియాలోని ఈ భాగంపై చైనా తన పట్టు బిగిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక: రాగి శాసనాలలో కనిపించిన తెలుగు భాష-అక్కడ ఒకప్పుడు మాతృభాషగా విలసిల్లిందా?
- కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టానన్న శ్రీలంక తాంత్రికుడు ఎలియంత వైట్ కరోనాతో మృతి
- ఇంటి పెరట్లో బావి తవ్వుతుంటే రూ. 745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
- ఒమిక్రాన్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు ఏంటి... ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)