You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్‌లో శ్రీలంక ఇంజినీర్‌పై మూకదాడి, హత్య: ‘ నా భర్తను అన్యాయంగా కొట్టి చంపారు, ఇమ్రాన్ ఖాన్ న్యాయం చేయాలి’
- రచయిత, రంగ సిరిలాల్
- హోదా, బీబీసీ సింహళ
పాకిస్తాన్‌లో పని చేస్తున్న 40 ఏళ్ల శ్రీలంక ఇంజినీర్ ప్రియాంథ కుమార్‌ను పాకిస్తాన్‌లోని ముస్లిం తీవ్రవాదులు దారుణంగా కొట్టి, హింసించి చంపారు. ఆయన సియాల్‌కోట్‌లోని ఒక ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పని చేసేవారు.
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ శ్రీలంక ప్రభుత్వం పాకిస్తాన్‌ను డిమాండ్ చేస్తోంది.
ఈ హత్యతో సంబంధం ఉన్నవారిని శిక్షించేందుకు తమ ప్రభుత్వం చట్టపరమైన అన్ని చర్యలూ తీసుకుంటుందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్షకు హామీ ఇచ్చారు.
ఇమ్రాన్ ఖాన్ దీనిపై రాజపక్షతో ఫోనులో సంభాషించారు. ఈ సందర్భంగా, రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న నమ్మకం, స్నేహ సంబంధాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
ఈ హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం, వీడియోలను పాకిస్తాన్ భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇప్పటికే ఈ హత్యతో సంబంధం ఉన్న 113 మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. మిగిలిన వారి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.
ప్రియాంథ కుమార 2010 నుంచి పాకిస్తాన్‌లో పని చేస్తున్నారు. . ఆయన వృత్తి నిర్వహణలో సమర్థంగా వ్యవహరించినట్లు పాక్ ప్రధాని రాజపక్షతో అన్నారు.
ఈ హత్యకు కారణమైన వారిని భగవంతుడు క్షమించడని, చట్టం కూడా వారిని క్షమించదని ఇమ్రాన్ ఖాన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు.
శ్రీలంక ప్రభుత్వం, ప్రజల అభిప్రాయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నానని, త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. నేరస్థులకు తీవ్రమైన శిక్ష పడేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు.
కొన్ని వందల మంది ముస్లిం తీవ్రవాదులు ప్రియాంథ కుమారను దారుణంగా హింసించి సజీవంగా కాల్చి చంపారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
"నా భర్త అమాయకుడు"
తన కుటుంబానికి అన్యాయం జరిగిందని.. తనకు, తన పిల్లలకు న్యాయం చేకూర్చమని ప్రియాంథ కుమార భార్య శ్రీ లంక అధ్యక్షుడు, పాక్ ప్రధానిని కోరారు.
"నా భర్త అమాయకుడు. ఆయనను దారుణంగా హత్య చేసిన విషయాన్ని నేను టీవీలో చూశాను. విదేశాల్లో చాల్లా ఏళ్ళు పని చేసిన తర్వాత ఆయన జీవితాన్నే కోల్పోయారు" అని ప్రియాంత భార్య నిరోషి దశనాయకే బీబీసీతో చెప్పారు.
"ఆయన పై ఇంటర్‌నెట్‌లో కూడా దాడి జరుగుతోంది. ఈ హత్య విషయంలో సరైన న్యాయ విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని నేను శ్రీలంక అధ్యక్షుడిని, పాకిస్తాన్ ప్రధానిని కోరుతున్నాను" అని అన్నారు.
శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కూడా ప్రియాంథ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"ఈ హత్యతో సంబంధం ఉన్న వారిని పట్టుకుని బాధితుల కుటుంబానికి న్యాయం చేస్తారని శ్రీలంక ప్రజలు విశ్వసిస్తున్నారు" అని ఆయన పాక్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
శ్రీలంకలో సుమారు 25 ఏళ్ల పాటు మైనారిటీ తమిళులు, సింహళీయుల మధ్య పౌర యుద్ధం కొనసాగింది. 2009లో ఈ యుద్ధం ముగిసింది. ఈ పౌర యుద్ధంలో కొన్ని వందల మంది మరణించారు. ఏప్రిల్ 2019లో ఈస్టర్ ఆదివారం ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న మిలిటెంట్లు చర్చిలు, విలాసవంతమైన హోటళ్లపై జరిపిన బాంబుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయారు.
ప్రియాంథ మరణాన్ని శ్రీలంక ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస కూడా ఖండించారు. "ఇలాంటి హింసాత్మక దాడులతో కూడిన తీవ్రవాద సిద్ధాంతాలను సహించకూడదు" అని వ్యాఖ్యానించారు.
"కుమార తమ మతాన్ని అవమానపరిచారనే నెపంతో హింసాత్మక మూకలు ఆయనను తీవ్రంగా కొట్టి చంపినట్లు వార్తాకథనాలు చెబుతున్నాయి . ఈ నేరాన్ని మేం ఖండిస్తున్నాం. ఈ హత్యపై పాకిస్తాన్ అధికారులు సమగ్ర విచారణ జరిపి, నేరస్థులకు శిక్ష వేయాలని కోరుతున్నాం" అని అన్నారు.
ఈ హత్య పట్ల శ్రీలంక ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహం గురించి తనను తెలుసని అన్నారు. ఈ ఘటన పట్ల శ్రీలంక ప్రజలను సంయమనంతో వ్యవహరించాలని కోరారు. దేశ ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చే జాత్యహంకార చర్యలకు పాల్పడేవారి పై కన్ను వేసి ఉంచాలని కోరారు.
"ఈ ఘటన ద్వారా ప్రజలను దేశంలో నెలకొన్న ప్రస్తుత సామాజిక, ఆర్ధిక, రాజకీయ, పర్యావరణ సమస్యల నుంచి పక్క దారి పట్టించేందుకు చూస్తున్నారని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే అవకాశం ఉన్నవారి పట్ల దృష్టి సారించి , ముప్పు పొంచి ఉన్న సమాజాలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి" అని ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాస అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: 'ఇక్కడ నరకంలా ఉంది...' ఆకలితో అలమటిస్తున్న చిన్నారులు
- ఈ దేశం ఎప్పుడు మునిగిపోతుందో చెప్పలేం...
- ఒమిక్రాన్: కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరగడంతో ప్రయాణ ఆంక్షలు కఠినతరం చేసిన బైడెన్
- ‘ప్రేమ, అభిమానం లేని భర్తతో సెక్స్ ఎలా సాధ్యం? నాకు ఆయనతో కలవాలనే కోరికెలా కలుగుతుంది’
- 3డి టెక్నాలజీతో కృత్రిమ కన్ను.. ప్రపంచంలోనే తొలిసారిగా అమర్చుకున్న వ్యక్తి ఈయనే
- అన్నమయ్య ప్రాజెక్టు: డ్యాం కొట్టుకుపోయినా ప్రజలకు సమాచారమివ్వలేదా? సైరన్ మోగలేదా
- ఈ పక్షి మాంసం కామోద్దీపన కలిగిస్తుందా? అరబ్ షేక్‌లు దీన్ని వేటాడేందుకు పాకిస్తాన్ వస్తున్నారా, మరి నజీమ్‌ను ఎవరు చంపారు
- ఒమిక్రాన్‌ను గుర్తించడమెలా? లక్షణాలేంటి
- సిరివెన్నెల సీతారామశాస్త్రి: ప్రేమ, విరహం, భక్తి, రక్తి, విప్లవం, వినోదం అన్నీ తెలిసిన కలం
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- ఫోర్బ్స్ మ్యాగజైన్: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశా ఆశావర్కర్ మతిల్దా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)