You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అన్నమయ్య ప్రాజెక్టు: డ్యాం కొట్టుకుపోయినా ప్రజలకు సమాచారమివ్వలేదా? సైరన్ మోగలేదా
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో కడప జిల్లాలో కొన్ని గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.
చెయ్యేరు నదికి సహజంగా వచ్చిన వరద తీవ్రతకు అదనంగా డ్యాం కట్ట తెగిపోవడం పరిస్థితిని ఇంకా దారుణంగా చేసింది.
డ్యాం కట్ట తెగిపోవడంపై పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు బాధిత గ్రామాల ప్రజలు.
అయితే దీని వెనుక మానవ తప్పదం లేదని చెబుతున్నారు అధికారులు. ఇంతకీ గ్రామస్తుల ఆరోపణలు ఏంటి?
ఈ అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం గురించిన చర్చ 1960ల నుంచీ ఉన్నప్పటికీ వాస్తవం నిర్మాణం 1981లో ప్రారంభం అయింది. 2001లో దీన్ని ప్రారంభించారు.
1996-97 అంచనా ప్రకారం 60 కోట్లు ఖర్చు అయింది. 22 వేల 500 ఎకరాలకు సాగునీరు, రాజంపేట, పుల్లంపేటలకు తాగు నీరు అందిస్తుంది.
నిల్వ సామర్థ్యం 2.38 టీఎంసీలు. పింఛ, మాండవ్య, బాహుధా నదుల సంగమం తరువాత అన్నమయ్య డ్యాం ఉంటుంది.
తాజా వరదల విషయంలో మూడు ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. ఒకటి ముంపు సమాచారంలో ఆలస్యం, రెండవది డ్యామ్ రిపేర్లు - నిర్వహణ లోపం, గేట్లు సమయానికి ఎత్తలేకపోవడం, మూడు ఇసుక తవ్వకందార్ల కోసం గేట్లు ఎత్తడం ఆలస్యం చేశారన్న ఆరోపణ.
ముంపు సమాచారం ఇవ్వలేదా?
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ముంపు వస్తుందన్న సమాచారం వెంటనే గ్రామాలకు చేరలేదనేది ఆరోపణ.
బీబీసీ ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు, కొన్ని గ్రామాలకు చేరింది, మరికొన్ని గ్రామాలకు చేరలేదు అని అర్థమవుతోంది.
తీవ్రమైన వరద వస్తోందనీ, డ్యాం కట్ట తెగిందనీ తమకు తెలియదని వివిధ గ్రామాల వారు బీబీసీకి చెప్పారు.
వరదలో తీవ్రంగా నష్టపోయిన తొగరిపేట గ్రామానికి చెందిన కేశవ, వేంకటేశ్వర్లు బీబీసీతో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
సైరన్ కూడా మోగలేదని వారు అన్నారు. తమ గ్రామానికి చెందిన ఉద్యోగి తప్ప, పోలీసు, రెవెన్యూ వారెవరూ తమకు డ్యాం కట్ట తెగిన సమాచారం ఇవ్వలేదని వారు చెప్పారు.
ఎగువ మందపల్లి గ్రామంలో మాత్రం వీఆర్ఒ కొందరికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
కానీ అక్కడ కొందరు గ్రామస్తులు వీఆర్వో మాటలను తేలికగా తీసుకున్నారు. అయితే వరద వస్తుందని తప్ప డ్యాం కొట్టుకుపోయిన విషయం తమకు చెప్పలేదని ఆ గ్రామానికి చెందిన సుబ్రమణ్యం బీబీసీతో చెప్పారు.
నందలూరు గ్రామంలో యంత్రాంగం చురుగ్గా పనిచేసింది. ఎక్కువ మందిని అలర్ట్ చేశారు.
తమ వైపు నుంచి ఈ విషయంలో ఎటువంటి సమాచారం లోపమూ లేదంటున్నారు సాగునీటి శాఖ అధికారులు.
''ఈ వరద సీజన్ మొదలైనప్పటి నుంచీ కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. వాట్సప్ గ్రూపులో ఉన్నతాధికారులంతో టచ్ లో ఉన్నాం. నిమిషాల మీద కమ్యూనికేట్ చేశాం. మేం అలా చేశాం కాబట్టే ఇంకా పెద్ద ఉపద్రవం నుంచి తప్పించగలిగాం. గంట గంటకూ వరద మోనిటర్ చేశాం. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో టచ్ లో ఉన్నాం. గతంలో కంటే బాగా జరిగింది. సైరన్ మోగలేదు అనేది అవాస్తవం. అది 3-4 కిలోమీటర్లు వినిపిస్తుంది.'' అని బీబీసీతో చెప్పారు అన్నమయ్య ప్రాజెక్టు ఎగ్జిగ్యూటివ్ ఇంజినీర్ రవికిరణ్.
అయితే గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారుల నుంచి గ్రామస్తులకు సమాచారం వెళ్లడంలో లోపం జరిగినట్టు అర్థమవుతోంది.
అలాగే అన్నమయ్య డ్యామ్ సైరన్ ఎక్కువ దూరం వినిపించేది కాదని, సమీపంలోని ఒకట్రెండు గ్రామాలకు మాత్రమే వినిపిస్తుందని అక్కడి సిబ్బంది కొందరు బీబీసీకి చెప్పారు.
ఈ విషయంలో రెవెన్యూ అధికారులు స్పందించాల్సి ఉంది.
డ్యామ్ నిర్వహణ లోపం
డ్యామ్ నిర్వహణలోని పలు లోపాలు, రిపేర్లలో ఆలస్యం ప్రమాదానికి కారణం అనేది ఒక ఆరోపణ.
''అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది. ఐదు గేట్లలో ఒకటి స్ట్రక్ అయింది. దాన్ని రిపేర్ చేయలేదు. కనీసం ఆ గేట్లకు ఎవరూ గ్రీజ్ పెట్టిన పాపాన పోలేదు. గతేడాది పింఛా తెగింది. అప్పుడు ఏదో రిపేర్ చేసారు. ఈసారి అది మళ్లీ తెగి, అన్నమయ్య డ్యామ్ మీద పడింది. దీంతో స్టోరేజీ పెరిగి అన్నమయ్య కూడా తెగింది. ఇది పక్కాగా అధికారుల నిర్లక్ష్యమే.
వరద వచ్చేప్పుడు స్టోరేజీ తక్కువ పెట్టాలి. కానీ ఫుల్ స్టోరేజీ పెట్టుకున్నారు. దీంతో గేట్లు ఎత్తడం కష్టం అయింది. గతేడాది దెబ్బతిన్న ఐదవ గేట్ రిపేర్ చేయించుకుని ఉన్నా అలా జరిగేది కాదు. వాళ్లు ముందే ఖాళీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అంతే కాదు వరద వస్తున్నప్పుడు కూడా గేట్లు ఎత్తడానికి రెండు గంటలు పట్టింది. అక్కడ ఒక జనరేటరే పనిచేసింది అని మాకు తెలిసింది.
ఐదవ గేట్ ఎత్తగలిగి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.'' అని బీబీసీతో అన్నారు తొగరిపేటకు చెందిన కేశవ.
''అన్నమయ్య ప్రాజెక్టు డిజైన్లోనే లోపాలు ఉన్నాయి. దాని క్యాచ్మెంట్ ఏరియా, ఇన్‌ఫ్లో వంటి లెక్కలేవీ సరిగా వేయకుండానే దీన్ని నిర్మించినట్టు అనిపిస్తోంది.
గేట్ల డిజైనింగ్‌లో కూడా లోపాలున్నాయి. నాలుగైదేళ్ల కిందటే ఇంజినీర్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గేట్లను బలపర్చాల్సి ఉంది. అదనపు గేట్లు అవసరం ఉంది. కానీ ఏమీ చేయలేదు అక్కడ. ప్రాజెక్టు నిర్వహణ కూడా సరిగా లేదు. గత వరదకు గేటు తెగితే బాగు చేయలేదు. పింఛా కట్ట తెగితే తాత్కాలిక మరమ్మత్తే చేశారు.'' అని బీబీసీతో అన్నారు సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ.
ఇదే ఆరోపణ చేశారు తొగరిపేటకు చెందిన వెంకటేశ్వర్లు. ''నాకు తెలిసినంత వరకూ ఇది మానవ తప్పిదమే. వచ్చే వరదకు తగ్గట్టు అన్నమయ్య డామ్ అధికారులు గేట్లు తెరిచి వదిలేస్తే సమస్య లేకపోయేది. పింఛ డ్యామ్ తెగిన వెంటనే ఇక్కడ గేట్ల వదిలేసి ఉండాల్సింది. ఇప్పుడు మా ఊరు భూస్థాపితం అయిపోయింది. ఒకవేళ గేట్లు మొత్తం ఎత్తి ఉంటే మాకు ఆ ప్రవాహాన్ని బట్టి తెలిసిపోయి ఉండేది. ప్రాణ నష్టం అయితే కచ్చితంగా జరిగి ఉండేది కాదు. ఇంజినీర్లు ఈ విషయాలు చూసుకోవాలి కదా.'' అన్నారాయన.
అయితే ఈ ఆరోపణలను ఇంజినీర్లు తిరస్కరిస్తున్నారు. డ్యామ్ నిర్వహణలో కానీ, వరదల వచ్చినప్పుడు జాగ్రత్తల విషయంలోనూ ఏ లోపమూ జరగలేదని వారు చెబుతున్నారు.
''మాపై వచ్చే ఆరోపణలు సరికాదు. డ్యామ్ నిర్వహణలో ఏ లోపమూ లేదు. డ్యామ్ ను కాపాడటానికి మేం చేయాల్సిన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకున్నాం. పింఛ నీరు వచ్చేప్పటికి అన్నమయ్య ఫ్రీగానే ఉంది. అన్నమయ్య చాలా చిన్న డ్యాం. రెండు గంటల్లో నిండిపోతుంది. ఆ డ్యామ్ డిశ్చార్జి కెపాసిటీయే 2.17 లక్షలు అయితే, 3 లక్షల పైన వచ్చిన నీటిని ఎలా తట్టుకుంటుంది?
ఐదవ గేట్‌ని నోలోడ్ కండిషన్లో (అసలు రిజర్వాయర్లో నీరు లేనప్పుడు) బాగు చేయాలి. నివార్ తుఫాను తరువాత రిజర్వాయర్ నింపాం. గేట్ డ్యామేజ్ నీటి కింది భాగంలో ఉంది కాబట్టి, రిపేర్ చేయాలంటే నీళ్లన్నీ ఖాళీ చేయాలి.
అప్పుడు రాజంపేటకు నీటి సరఫరా ఉండదు. చెయ్యేరులో సాధారణంగా ఎక్కువ నీరు ఉండదు. తాగునీరు సరఫరా కోసం ప్రాధాన్యత ఇచ్చి ఖాళీ చేయలేదు. కానీ అనుకోని ఉపద్రవం ఇది వచ్చింది. ఒకవేళ ఐదుగేట్లూ పూర్తిగా ఎత్తినా తట్టుకోలేనంత ఇన్ ఫ్లో వచ్చింది కాబట్టి ఆ గేటు ఉండుంటే డ్యామ్ నిలిచేదన్న వాదన సరికాదు.'' అని బీబీసీతో చెప్పారు అన్నమయ్య ప్రాజెక్టు ఈఈ రవి కిరణ్.
''గేట్లు ఎత్తడంలో ఆలస్యం కూడా అపోహే. గురువారం రాత్రి 9 గంటలకే గేట్లు పూర్తిగా ఎత్తేశాం. ఇన్ ఫ్లో కంటే ఎక్కువ అవుట్ ఫ్లో పెట్టేం. (వచ్చే నీరు కంటే పోయే నీరు ఎక్కువగా). కానీ కెపాసిటీ కంటే ఎక్కువ వస్తే ఎలా తట్టుకుంటుంది? గేట్లు ఎత్తడానికి 2 గంటల పట్టడం ఆలస్యం కాదు. అది ప్రొసీజర్. ఇలా స్విచ్ వేయగానే అలా లేవు గేట్లు. ఈలోపు అకస్మాత్తుగా ప్రవాహం పెరిగటింది. తక్కువ సమయంలో ఎక్కువ నీరు రావడం వల్లే ప్రమాదం జరిగింది తప్ప వేరే కారణం లేదు.'' అన్నారు రవి కిరణ్.
''గతంలో ఉన్న ప్రతిపాదనలన్నీ డ్యామ్ కెపాసిటీ పెంచడం, లేదా కొత్త డ్యామ్ కట్టడం గురించే. రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. స్పిల్ వే కెపాసిటీ పెంచే ప్రతిపాదనలు వచ్చాయి. మామూలుగా ఈ నదిలో ఇంతింత వానలు పడవు. కానీ తాజాగా పెరిగాయి కాబట్టి దానికి అనుగుణంగా డిజైన్లు మార్చాలి అని అనుకుంటున్నారు.'' అని వివరించారాయన.
''17 నుంచీ వర్షాలు వస్తున్నాయి. 18వ తేదీ ఉదయం 10 వేల క్యూసెక్కుల ఫ్లో ఉంది. ఆరోజు సాయంత్రం 42 వేల క్యూసెక్కులు వచ్చాయి. సాయంత్రం ఆరు గంటల తరువాత ఫ్లో విపరీతంగా పెరిగింది. మొత్తం 2.17 లక్షల డిశ్చార్జి కెపాసిటీ డ్యామ్ ది. కానీ 3.20 లక్షల కంటే ఎక్కువ వరద వచ్చింది. పైగా అది కూడా 2 గంటల కంటే ఎక్కువ సేపు ఉంది. ఆ తరువాత కూడా 2 లక్షల ప్రవాహం కొనసాగింది. తెల్లవారుఝామున 5 గంటల సమయంలో ప్రధాన డ్యాంపై ప్రవాహం ప్రారంభం అయింది. ఉధృతి పెరుగుతూనే ఉంది తప్ప, తగ్గే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఆ ప్రవాహానికి డ్యామ్ కొట్టుకుపోయింది.'' అని ఆరోజు ఘటనలు చెప్పుకొచ్చారు రవికిరణ్.
ఇసుక తవ్వేవారికి సహకరించేందుకు ఆలస్యం చేశారు
బాధిత గ్రామాల్లో చాలా మంది బీబీసీ దగ్గర ప్రస్తావించిన ఆరోపణ ఇది. చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. అందుకోసం నదిలో లారీలు దిగుతాయి. డ్యాం గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయి కాబట్టి, వాటిని పైకి తరలించే వరకూ డ్యాం గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారనేది ఎగువ మందపల్లి గ్రామానికి చెందిన వెంకట సుబ్రమణ్యం ఆరోపణ.
''ఇసుక క్వారీల వారి కోసం డ్యాములో నీళ్లు నిలిపారు. దానివల్లే నష్టం జరిగింది. వంద శాతం ఇసుక కోసమే గేట్లు ఎత్తలేదు. నేను స్వయంగా ఏఈ, డీఈ లకు ఫోన్లు చేసి గేట్లు ఎత్తమని కోరినా పట్టించుకోలేదు.'' అని బీబీసీతో చెప్పారాయన.
దీనిపై అధికారులు మాట మరోలా ఉంది. ''ఇసుక విషయంలో వస్తోన్న ఆరోపణలు వింటుంటే బాధ వేస్తుంది. ఇంజినీర్లుగా మేం రాత్రింబవళ్లు ఎంతో టెన్షన్ పెడతాం. ఏ ఇంజినీర్ డ్యామ్ ను పోగొట్టుకోవాలని చూడడు. అక్కడ మేం ఉండి కూడా జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా ఉంటాం? ఇది అనుకోని ప్రమాదం వల్లే వచ్చింది. పూర్తి మెయింటినెన్స్ చేశాం. చిత్తశుద్ధితో చేశాం.'' అన్నారు రవి కిరణ్.
విచారణ జరపాలి: సీపీఎం
''ఈ నెల రోజుల్లో రెండు తుపాన్లు వచ్చాయి. సీజన్లో పడే దాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ వానలు పడ్డాయి.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అధికారులు. వరదను అంచనా వేసి గ్రామాలకు సమాచారం ఇచ్చి ముందస్తుగా ఖాళీ చేయించిన ఉంటే ఈ సమస్య వచ్చుండేది కాదు. పింఛా డ్యామ్ తెగినప్పుడే గ్రామాలను అలర్ట్ చేసి ఉండాల్సింది. ముందుగా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. మేం రెవెన్యూ వారికి చెప్పేశాం అని ఇరిగేషన్ వారు అంటున్నారు.
అసలు ఆరోజు ఏం జరిగింది అనే దానిపై విచారణ జరిపించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. వేల కోట్లు నష్టం, ఎన్నో ప్రాణాలు పోయాయి. చర్యలు తీసుకుంటేనే భయం ఉంటుంది. సమగ్ర విచారణ జరిపితేనే ఇవన్నిటి వెనుకా ఏం జరిగిందనేది తెలుస్తుంది. ఇప్పుడు మళ్లీ రీ డిజైన్ చేసి కొత్త ప్రాజెక్టు కడతాం అంటున్నారు. దానికోసమైనా అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలి కాబట్టి విచారణ చేయాలి'' అన్నారు సీపీఎం నాయకులు నారాయణ.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)