You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంకతో సంబంధాలకు భారత్‌కు అంత తొందర దేనికి? లంక నుంచి భారతదేశం కోరుకుంటున్నదేమిటి?
- రచయిత, ఎ.డి.బాలసుబ్రమణియన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీలంకలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాధినేతలు భారతదేశ రాజధాని న్యూ దిల్లీని సందర్శించటం ఒక ఆనవాయితీగా ఉండేది.
ప్రాచీన కాలం నుంచి రెండు దేశాల మధ్య గల సాంస్కృతిక, చారిత్రక సంబంధాలకు, ఇటీవలి చరిత్రలో భారతదేశానికి గల ప్రాంతీయ ప్రాధాన్యతకు ఈ ఆనవాయితీని ప్రతిబింబంగా భావించేవారు.
అయితే.. ఇప్పుడు శ్రీలంక అధ్యక్షుడిగా గోటాబయ రాజపక్ష ఎన్నికైన తక్షణమే.. భారత్ తన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను శ్రీలంకకు పంపించటంలోని ఆవశ్యకతపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
రెండు కారణాల రీత్యా ఇది ఆశ్చర్యం కలిగించింది. మొదటిది - శ్రీలంక అధ్యక్షుడు దిల్లీకి వచ్చే వరకూ వేచివుండటానికి బదులుగా.. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షల సందేశంతో తన విదేశాంగ మంత్రిని శ్రీలంకకు పంపించింది. రెండోది - రాజపక్షలను చైనా అనుకూలురుగాను, భారతదేశాన్ని రాజపక్షల వ్యతిరేకిగానూ భావిస్తుంటారు.
కానీ.. రాజపక్షలు చైనా అనుకూలురనే భావనే.. శ్రీలంకను సాధ్యమైనంత త్వరగా తనవైపు తిప్పుకునేందుకు భారత్ ఆతృత కనపరచటానికి గల కారణాన్ని విశదీకరిస్తోందని పరిశీలకులు ఉటంకిస్తున్నారు.
భారతదేశాన్ని సందర్శించటానికి గోటాబయ కూడా ఎటువంటి శషభిషలూ లేకుండా తక్షణమే అంగీకరించటం (ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సందర్శించే తొలి దేశం) కూడా కొందరికి ఆశ్చర్యం కలిగించింది.
భారత్ ఇంత హడావుడి ఎందుకు ప్రదర్శిస్తోందని అడిగినపుడు.. ''ఒకప్పుడు శ్రీలంక అధ్యక్షులుగా కొత్తగా ఎన్నికైన నేతలు భారతదేశాన్ని సందర్శించటం ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు చైనా కారణంగా.. గోటాబయ ఎన్నికైన వెంటనే భారత విదేశాంగ మంత్రి ఈ దీవి దేశాన్ని సందర్శించారు'' అని గతంలో శ్రీలంకలో పనిచేసిన భారత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నిరుపమ సుబ్రమణియన్ బీబీసీతో చెప్పారు.
గోటాబయ సారథ్యంలోని శ్రీలంకతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని భారత్ కోరుకోవటానికి కారణం ఏమై ఉండొచ్చునని అడిగితే.. ''అందుకు ఒక కారణం కాదు.. అనేక కారణాలు ఉండొచ్చు'' అని ఆమె బదులిచ్చారు.
ప్రత్యేకించి.. గత ఎన్నికల్లో మహీంద ఓటమి వెనుక భారతదేశం పాత్ర ఉందనే అభిప్రాయం నేపథ్యంలో.. ''అయిందేదో అయిపోయింది...'' అనే సందేశం అందించటం, ఇప్పుడు వ్యవహారాలు నెరపటానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయటం భారతదేశం ఉద్దేశం కావచ్చునని ఆమె పేర్కొన్నారు.
ఇక గోటాబయ చైనా అనుకూలుడనే భావనకు విరుద్ధంగా.. భారతదేశాన్ని సందర్శించటానికి ఆయన తక్షణమే అంగీకరించటానికి కారణం.. అమెరికాలో గోటాబయకు ప్రయోజనాలు ఉండటమేనని ఫ్రాన్స్‌లో శ్రీలంక తమిళ రచయిత గౌరీపాల్ సాథిరి వ్యాఖ్యానించారు.
''అమెరికా పౌరసత్వాన్ని తాను వదులుకున్నానని గోటాబయ ప్రకటించినప్పటికీ.. దానిని అమెరికా అధికారికంగా ధృవీకరించలేదు. ఈ అంశాన్ని ఉపయోగించుకుని గోటాబయ నేరుగా చైనాకు దగ్గర కాకుండా అమెరికా నియంత్రిస్తుండవచ్చు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
అయినా.. భారతదేశం శ్రీలంకలో ఏం చేయాలని కోరుకుంటోంది? అందుకు శ్రీలంక ఎలా లొంగుతుంది? అనేవి ప్రశ్నలు.
చైనా, పాకిస్తాన్ వంటి శక్తుల ఒత్తిడికి శ్రీలంక లొంగిపోయే ముందుగానే.. భారతదేశం తన దారులు పరచాలని కోరుకుంటోందని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ చెన్నై విభాగాధిపతి ఎన్.సత్యమూర్తి పేర్కొన్నారు.
సిరిసేన ప్రభుత్వం తీరుపట్ల భారతదేశం సంతోషంగా లేదు. భారత్ ఎంతో ఆశించినప్పటికీ.. సిరిసేన ప్రభుత్వం భారత్‌కు చైనాకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది.
వ్యూహాత్మకంగా కీలకమైన ట్రింకోమలీ పోర్టు అభివృద్ధి ప్రాజెక్టును పొందటం భారతదేశం ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉంది. కానీ సిరిసేన హయాంలో అది కూడా సాధ్యం కాలేదు.
అయితే.. గోటాబయ నవంబర్ 29న చేపట్టే భారత పర్యటనలో నాటకీయమైన పరిణామాలేవీ ఉండబోవని సత్యమూర్తి భావిస్తున్నారు. ''వాళ్లు పలు అంశాల మీద చర్చించవచ్చు. కానీ తొలి సమావేశంలోనే ఒప్పందాలు, ఒడంబడికలు వంటి ఫలితాలు వచ్చే అవకాశం లేదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
''ఇరు పక్షాలు.. కీలకమైన ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలని తాము భావిస్తున్న వాటి గురించి ఎదుటి పక్షాన్ని అంచనా వేయటానికి ప్రయత్నిస్తాయి'' అని పేర్కొన్నారు సత్యమూర్తి.
ఇవి కూడా చదవండి
- జేఎన్‌యూ: ఆగని విద్యార్థుల ఆందోళన... ఫీజుల పెంపుపై విద్యార్థులు ఏమంటున్నారు
- 'స్మోకింగ్ నుంచి ఈ-సిగరెట్లకు మారితే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది '
- విశాఖ, కాకినాడ తీరాల్లో మోహరించిన భారత్, అమెరికా సైనిక బలగాలు
- మోదీ ప్రభుత్వం గణాంకాలను దాచిపెట్టి, ఎవరికి మంచి చేయాలనుకుంటోంది
- భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి
- అత్యంత ప్రమాదకరమైన అయిదు ఆహార పదార్థాలు ఇవే...
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
- ఇసుక కొరత ప్రపంచమంతటా ఎందుకు ఏర్పడింది...
- జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో ఎదురుదెబ్బ... వజైనల్ మెష్ కేసులో ఓటమి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)