చైనా, వియత్నాం, లావోస్: వన్యప్రాణి మాంసం ఉత్పత్తులపై డిస్కౌంట్లు

    • రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
    • హోదా, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌

కోవిడ్-19 పుట్టుకపై స్పష్టత లేకపోవడంతో, ఆగ్నేయాసియా మార్కెట్లలో వన్యప్రాణుల మాంసం వినియోగం మళ్లీ పెరుగుతుందని వన్యప్రాణి పరిరక్షణ ప్రచారకులు, పరిశోధకులు బీబీసీకి చెప్పారు.

సంప్రదాయంగా వన్యప్రాణుల మాంసం తినే ఈ ప్రాంతానికి చెందిన వారు మళ్లీ వాటిపై ఆసక్తి చూపుతున్నారని, 2019లో కోవిడ్ విజృంభణ తర్వాత వీరు మాంసం వినియోగం తగ్గించారని నిపుణులు తెలిపారు.

"వన్యప్రాణులకు కరోనాతో ఉండే లింకును ప్రజలు మర్చిపోతున్నారు. వారు దాని గురించి మాట్లాడటం లేదు. దీని గురించి మేం ఆందోళన చెందుతున్నాం" అని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్‌కు చెందిన ప్రాంతీయ వన్యప్రాణి వాణిజ్య కార్యక్రమ మేనేజర్ జెడ్‌సదా తవీకాన్ అన్నారు.

"ఓ వైపు గతేడాదిలా వన్యప్రాణుల ద్వారా వైరస్ సంక్రమిస్తుందనే భయం ఇప్పుడు ప్రజల్లో లేదు. మరోవైపు, మహమ్మారి తీవ్రత ఉధృతంగా ఉన్నప్పుడు కూడా వన్యప్రాణి మార్కెట్లు కొనసాగడం చూశాం"

అక్రమ వన్యప్రాణి వాణిజ్యాన్ని పరిశోధించే అంతర్జాతీయ సంస్థ ట్రాఫి‍‍క్‌కు చెందిన నిపుణులు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు.

"కోవిడ్ పుట్టుకపై ఆధారాలు లేకపోవడంతో, వన్య ప్రాణులను ఆహారంగా తీసుకోవడంపై ప్రజల్లో ఎలాంటి ఆందోళనా లేదు" అని వియత్నాంలోని ట్రాఫిక్‌కు చెందిన బుయి తుయినా చెప్పారు.

కోవిడ్-19 పుట్టుకపై అస్పష్టత, అది వన్యప్రాణి మాంసం వినియోగదారుల ప్రవర్తనలపై ఎలాంటి ప్రభావం చూపింది అనే అంశంపై ఎలాంటి సర్వే లేదా అధ్యయనం జరగలేదు.

వైరస్ సహజంగా, జంతువుల నుంచి మనుషులకు సోకిందా లేదా ల్యాబ్‌ నుంచి ప్రమాదవశాత్తూ లీక్‌ అయిందా అనే దానిపై అమెరికా ఇంటెలిజెన్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది.

చాలా మంది శాస్త్రవేత్తలు కోవిడ్ పుట్టుకపై కచ్చితమైన నిర్ధారణకు రావడానికి కొన్ని సంవత్సరాల పరిశోధన అవసరమని నమ్ముతున్నారు.

మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా చట్టవిరుద్ధంగా వన్యప్రాణి ఉత్పత్తుల సరఫరా జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని వ్యన్యప్రాణి ప్రచారకులు, పరిశోధకులు చెబుతున్నారు.

"సెప్టెంబర్ 9న, మలేషియా అధికారులు కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న వాహనం నుంచి 50 ఖడ్గమృగం కొమ్ములు, కొమ్ము ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. 2018 తర్వాత దేశంలో పెద్ద ఖడ్గమృగం కొమ్ములను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి" అని ట్రాఫిక్ ఒక ప్రకటనలో తెలిపింది.

"మాంసం వినియోగంపై ఎలాంటి అధ్యయనం జరగనప్పటికీ, మహమ్మారితో సంబంధం లేకుండా వన్యప్రాణి ఉత్పత్తుల రవాణా కొనసాగింది" అని ట్రాఫిక్ ఆగ్నేయ ఆసియా సీనియర్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఎలిజబెత్ జాన్ అన్నారు.

వన్యప్రాణి ఉత్పత్తులపై డిస్కౌంట్లు

చైనా, వియత్నాం, లావోస్ వంటి దేశాల సరిహద్దుల వద్ద కోవిడ్ పరిమితుల కారణంగా చట్టపరమైన, చట్టవిరుద్ధమైన వన్యప్రాణి ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ దేశాలు చాలా ఏళ్లుగా అక్రమ వన్యప్రాణుల వాణిజ్యానికి హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి.

"పేరుకుపోతున్న నిల్వలతో, కొంతమంది అక్రమ రవాణాదారులు డిస్కౌంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు" అని అంతర్జాతీయంగా వన్యప్రాణుల సంరక్షణకు పని చేస్తున్న ప్రభుత్వేతర సంస్థ అయిన వైల్డ్‌లైఫ్ జస్టిస్ కమిషన్, 2020లో ప్రచురించిన ఒక నివేదికలో పేర్కొంది.

ఆగ్నేయాసియా దేశాల్లో సరిహద్దుల వద్ద కోవిడ్ ఆంక్షల కారణంగా ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోతున్నాయని పరిశోధకులు తెలిపారు.

"ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఎందుకంటే అక్రమ రవాణాదారులు పెద్ద మొత్తంలో ఉత్పత్తులను తమతోపాటే ఉంచుకోవడానికి ఇష్టపడరు. దాని వల్ల వారిని ఎవరైనా కనిపెట్టే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వుంటుంది" అని డబ్యూజేసీ సీనియర్ పరిశోధకులు సారా స్టోనర్ చెప్పారు.

గత జులైలో సంస్థ అందించిన సమాచారంతో నైజీరియాలోని అధికారులు 7,000 కిలోల కంటే ఎక్కువ బరువున్న పాంగోలిన్‌ పొలుసులను, లాగోస్ నుంచి దక్షిణాసియాకు ఎగుమతి అవుతున్న 900 కిలోల బరువున్న ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంవత్సరం ప్రచురించిన ట్రాఫిక్ నివేదిక ప్రకారం, 2019-2020 కంబోడియా, లావోస్, వియత్నాం, మయన్మార్, థాయ్‌లాండ్‌లో దాదాపు 78,000 వన్యప్రాణి భాగాలు, వాటి ఉత్పత్తులను ఒక వెయ్యికి పైగా షాపులలో అక్రమంగా అమ్మకానికి ఉంచారు.

"ఏనుగుదంతాలు, ఎలుగుబంట్లు, పెద్ద పిల్లులు, హెల్మెటెడ్‌ హార్న్‌బిల్, పాంగోలిన్, ఖడ్గమృగం, సెరో తదితర ఉత్పత్తులు అమ్మకానికి పెట్టిన వాటిలో ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రముఖమైనవి ఏనుగుదంతాలు"

వియత్నాంలో అక్రమ పులుల వ్యాపారం

ఎంగే అనే ప్రావిన్సులోని ఓ నివాస బేస్‌మెంటులో అక్రమంగా దాచిన 17 పులులను వియత్నాం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు హా టిన్హ్ అనే ప్రావిన్సు నుంచి ఇదే ప్రావిన్సుకు ఏడు పులి పిల్లలను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు.

మహమ్మారి సమయంలో కూడా వన్యప్రాణుల వ్యాపారం జరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని వియత్నాంలోని వన్యప్రాణుల ప్రచారకులు చెప్పారు.

ఇటీవల జరిగిన పరిణామాలతో అక్రమ వన్యప్రాణి వ్యాపారులు పులులను లేదా ఇతర జంతువులను వధిస్తారేమోనని వారు భయపడుతున్నారు.

బందిఖానాలో ఉన్న పులులు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులు పట్టుబడకుండా ఉండటానికి, వాటిని చంపి, మాంసాన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచి, దేశంలోనే విక్రయించడానికి ప్రయత్నాలు జరుగుతాయని అనుమానిస్తున్నారు.

"కరోనా మహమ్మారికి ముందు, వారు బతికి ఉన్న జంతువులను అక్రమంగా రవాణా చేసేవారు. ఇప్పుడు ఆంక్షల కారణంగా వారు అలా చేయలేరు. కాబట్టి వారు కచ్చితంగా దేశంలోని కొనుగోలుదారుల అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు" అని లాభాపేక్షలేని సంస్థ సేవ్ వియత్నాం వైల్డ్‌లైఫ్ డైరెక్టర్ న్గుయెన్ వాన్ థాయ్ అన్నారు.

"కోవిడ్ -19 పుట్టుకపై స్పష్టత లేకపోవడం, వీటన్నింటీనీ ఆగేలా చేసేందుకు సాయం చేయలేదు. ఈ వన్యప్రాణులను తినాలని అనుకునే వారు వైరస్ సోకుతుందని ఆందోళన చెందడం లేదు"

థాయ్‌లాండ్‌లో అక్రమంగా రవాణా చేసిన పులి పిల్లలు

ఈ మార్చిలో, థాయ్‌లాండ్‌లోని అధికారులు ముక్డా టైగర్ పార్క్, ఫామ్‌లోని పులులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా, రెండు పులి పిల్లలు అక్కడ జన్మించినవి కాదని తెలిసింది.

పార్కు నిర్వాహకుడు మాత్రం ఆ పిల్లలు, అక్కడ నివసిస్తున్న పులులకే పుట్టాయని పేర్కొన్నారు.

పిల్లలను ఎక్కడి నుంచో అక్రమ రవాణా చేసి ఇక్కడికి తీసుకొచ్చినట్టు డీఎన్ఏ పరీక్షలు నిరూపించాయి.

"ఈ పార్కులలో దాదాపు 1,500 పులులు ఉన్నాయి. లక్షలాదిగా వచ్చే చైనా పర్యాటకులే వీరి ఆదాయ వనరు. మహమ్మారి కారణంగా వీరు రావడం లేదు" అని తవీకాన్ అన్నారు.

"ఇప్పుడు ఈ పులులు, వాటిని చంపి విక్రయించే అక్రమ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తాయా అన్నది ఆందోళన చెందాల్సిన అంశం. మహమ్మారిని కూడా లెక్కచేయకుండా వన్య ప్రాణుల మాంసాన్ని తీసుకుంటుండటం మరింతగా ఆందోళన కలిగిస్తుంది"

వన్యప్రాణి ఉత్పత్తులపై నిషేధం

మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి చైనా, వియత్నాంలు వన్యప్రాణి ఆహార ఉత్పత్తులపై నిషేధాన్ని విధించాయి. సంప్రదాయ ఔషధాలు, ఆభరణాల తయారీలో మాత్రం వినియోగానికి అనుమతించాయి.

మొదట్లో, కోవిడ్-19 వుహాన్‌లోని మాంసం మార్కెట్‌లో ఉద్భవించిందని విస్తృతంగా భావించారు. ఈ సమయంలో చైనాలో చేసిన సర్వేల్లో వన్యప్రాణులను ఆహారంగా తీసుకోవడానికి మెజారిటీ ప్రజలు సుముఖంగా లేనట్టు తేలింది.

"కానీ ఇప్పుడు చైనా ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఎవరూ దాని గురించి మాట్లాడుకోవడం లేదు. కోవిడ్ అసలు చైనాలో ఉద్భవించలేదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది" అని ఆక్టాసియా సంస్థ డైరెక్టర్ పెయ్ సు అన్నారు.

"నిషేధం కారణంగా, వన్యప్రాణుల వినియోగం మహమ్మారికి ముందు స్థాయిలను అధిగమించకపోవచ్చు. కానీ చైనా పరిమాణం, ఆ దేశంలో పరిమిత సంఖ్యలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఉండటంతో చైనాలోని అనేక ప్రాంతాల్లో వన్యప్రాణుల వ్యాపారం జరుగుతోంది.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)