You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కశ్మీర్: 'టార్గెట్ కిల్లింగ్స్' వెనుక పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనాల ప్రమేయం ఉందా
"కశ్మీర్‌లో పౌరులపై దాడి తరువాత, మేం ఆపరేషన్ ప్రారంభించాం. తొమ్మిది ఎన్‌కౌంటర్లు జరిగాయి. 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మా ఆపరేషన్ కొనసాగుతోంది" అని ఐజీ విజయ్ కుమార్ అక్టోబర్ 16వ తేదీన మీడియాకు తెలిపారు.
కానీ, అదే రోజు శ్రీనగర్, పుల్వామాలలో మరో ఇద్దరు హత్యకు గురయ్యారు. వీరిద్దరూ కశ్మీర్ పౌరులు కారు.
వీరిలో ఒకరు బిహార్‌లోని బంకాకు చెందిన అరవింద్ కుమార్ షా కాగా, మరొకరు ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన సగీర్ అహ్మద్.
అరవింద్ మూడు నెలల కిందటే శ్రీనగర్ వెళ్లినట్లు ఆయన తండ్రి చెప్పారు.
మరుసటి రోజు అంటే అక్టోబర్ 17న ఆదివారం నాడు కుల్గావ్‌లో మరో ఇద్దరు బిహారీలు హత్యకు గురయ్యారు.
అదే రోజు ఐజీ విజయ కుమార్ ఒక ప్రకటన ఇచ్చారు.
"బయట నుంచి వచ్చిన వలస కార్మికులను పోలీస్/ఆర్మీ క్యాంపుల్లో ఉంచాలని ఆదేశించినట్లుగా వస్తున్న వార్తలు నిజం కావు. అవి నకిలీ వార్తలు" అని ఆయన తెలిపారు.
"మా భద్రతా దళాలు టెర్రరిస్టులకు తగిన జవాబు చెబుతాయి. జమ్మూ, కశ్మీర్ ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుంది" అని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హామీ ఇచ్చారు.
అయితే, పోలీసులు, ప్రభుత్వం ఇస్తున్న హామీలు కశ్మీర్‌లో ఉన్న వలస కార్మికులకు భయం పోగొట్టి, భరోసా ఇవ్వడంలో విఫలమయ్యాయనే చెప్పవచ్చు.
కశ్మీర్‌లోని వలస కూలీలు భయంతో ఆ రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారంటూ అక్టోబర్ 18, సోమవారం ఏఎన్ఐ వార్తా సంస్థ కొన్ని చిత్రాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
దాడుల భయం
"ఇక్కడ పరిస్థితి దిగజారుతోంది. మాకు భయంగా ఉంది. మా పిల్లలు మాతో పాటే ఉన్నారు. అందుకే మా ఊరికి వెళ్లిపోతున్నాం" అని రాజస్థాన్‌కు చెందిన ఓ వలస కార్మికుడు చెప్పినట్లుగా ఏఎన్ఐ తెలిపింది.
అక్టోబర్ మొదటి వారం నుంచీ కశ్మీర్‌లో హత్యలు జరుగుతున్నాయి.
వీటిని 'టార్గెట్ కిల్లింగ్స్'గా భావిస్తున్నారు. వీటి వెనుక పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనాల ప్రభావం ఉందనే చర్చ జరుగుతోంది.
పాకిస్తాన్ హస్తం
అక్టోబర్ మొదటి వారాల్లో హత్యకు గురైన వారిలో కశ్మీరీ పండిట్ మఖన్‌లాల్ బింద్రూ, కశ్మీరీ సిక్కు సుపీందర్ కౌర్, దీపక్ చంద్‌లు ఉన్నారు.
వీరితో పాటూ కశ్మీర్‌కు వచ్చిన కొందరు వలస కూలీలు కూడా అనుమానిత ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు.
ఈ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.
"పాకిస్తాన్, టెర్రరిస్టులు భయ వాతావరణాన్ని సృష్టించడంలో నిమగ్నమయ్యారు" అంటూ బీజేపీ జమ్మూ కాశ్మీర్ యూనిట్ చీఫ్ రవీందర్ రైనా ఆరోపించారు.
"పాకిస్తాన్ తీవ్రవాదులు మరోసారి ఘోరమైన నేరాలకు ఒడిగట్టారు. తమ శ్రమతో కడుపు నింపుకోవాలని కశ్మీర్‌కు వచ్చిన కార్మికులను దారుణంగా హత్య చేశారు. ఇది పాకిస్తాన్‌లోని పిరికిపంద ఉగ్రవాదులు చర్య" అని రైనా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
"రానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ను నిలిపివేయాలి. దాంతో, పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహించినంత కాలం భారతదేశం వారికి ఏ అంశంలోనూ మద్దతు ఇవ్వదనే సందేశం వారికి చేరుతుంది" అని బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు తార్‌కిషోర్ ప్రసాద్ డిమాండ్ చేశారని ఏఎన్ఐ వెల్లడించింది.
అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌తో ఆడకూడదని చనిపోయిన అరవింద్ షా తండ్రి కూడా డిమాండ్ చేశారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
"అమాయక ప్రజలను హత్య చేయడం దారుణం. ఇవన్నీ కశ్మీర్‌కు చెడ్డ పేరు తెచ్చి పెట్టే సంఘటనలు" అని కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
కాగా, ఇది ప్రభుత్వ వైఫల్యమేనంటూ విపక్షాలు అధికార పార్టీ బీజేపీని నిందిస్తున్నాయి.
మాజీ జమ్మూ, కశ్మీర్ గవర్నర్, ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ మాట్లాడుతూ.. "గతంలో నేను గవర్నర్‌గా ఉన్నప్పుడు శ్రీనగర్‌కు 50-100 కిమీ దరిదాపుల్లోకి కూడా టెర్రరిస్టులు ప్రవేశించలేకపోయేవారు. ఇప్పుడు అమాయక ప్రజలను చంపేస్తున్నారు. ఇలా జరగడం విషాదం" అని అన్నారు.
చైనా ప్రస్తావన
ఒకప్పుడు బీజేపీకి మిత్రపక్షమైన శివసేన కూడా ప్రస్తుత పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గతంలో, కశ్మీర్ విషయంలో బీజేపీ, శివసేనల విధానాలు ఒకే రకంగా ఉండేవని నిపుణుల అభిప్రాయం.
"జమ్మూ, కాశ్మీర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బిహార్ వలస కూలీలు, కశ్మీరీ పండిట్లు, సిక్కులపై దాడులు జరుగుతున్నాయి... పాకిస్తాన్ విషయంలో సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడతారు. చైనా విషయంలో కూడా అదే విధానం అవలంబించాలి. జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్‌లలో పరిస్థితి ఎలా ఉందో రక్షణ మంత్రి లేదా హోం మంత్రి ప్రజలకు వివరించి చెప్పాలి" అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రావడమే కారణమా?
అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకోవడం కశ్మీర్‌పై ప్రభావం చూపిస్తుందని తాను ముందే హెచ్చరించినట్లు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చెప్పారు.
"కశ్మీర్‌లో కనిపిస్తున్న నిశ్శబ్దం రాబోయే తుఫానుకు హెచ్చరిక అని నా కశ్మీర్ పర్యనటన సందర్భంగా హెచ్చరించాను" అని ఆయన అన్నారు.
అంతే కాకుండా, "సైనికులు, అమాయక పౌరులపై దాడి జరిగితే చాలా బాధగా ఉంటుంది. ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఆర్టికల్స్ 35ఏ, 370 రద్దు తరువాత కశ్మీర్‌లో టెర్రరిజం అంతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సంగతేంటో తెలుసుకోవాలనుకుంటున్నాం" అని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.
అఫ్హానిస్తాన్‌లో తాలిబాన్ల పునరాగమనం తరువాత, ఇలాంటివి అనుమానించాల్సి వస్తోందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు.
కాగా, "జమ్మూ, కశ్మీర్‌లో ముస్లింల కోసం తమ గళం విప్పుతాం" అని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ గత నెలలో బీబీసీ కరస్పాండెంట్ వినీత్ ఖరేతో జరిపిన ప్రత్యేక సంభాషణలో వెల్లడించారు.
ఇతర దేశాలకు వ్యతిరేకంగా సాయుధ కార్యకలాపాలు నిర్వహించడం తమ విధానంలో భాగం కాదని సుహైల్ షాహీన్ తెలిపారు.
నితీష్ కుమార్ ఏమన్నారు?
కశ్మీర్‌లో బిహార్ వలస కార్మికులపై జరిగిన దాడుల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో చర్చించారు.
"నేను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడాను. జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పాను. అక్కడ కశ్మీరేతర పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న విషయం స్పష్టం అవుతోంది. వలస కార్మికుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం" అని నితీష్ కుమార్ అన్నారు.
"మా బిహారీ సోదరులు కశ్మీర్‌లో హత్యలకు గురవుతున్నారు. ఇది చాలా కలత కలిగిస్తున్న విషయం. అక్కడ పరిస్థితుల్లో మార్పు రాకపోతే, కశ్మీర్‌ను చక్కదిద్దే బాధ్యత మా బిహారీలకు అప్పగించండని ప్రధాని మోదీ, హోం మత్రి అమిత్ షాను అభ్యర్ధిస్తున్నాను. 15 రోజుల్లో మార్పు రాకపోతే అప్పుడు అడగండి" అని బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ అన్నారు.
ఇదిలా ఉండగా, అమాయక పౌరుల హత్యల గురించి జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో బిహార్ డీజీపీ మాట్లాడారని సోమవారం బిహార్ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్‌లో హిందువుల హత్యలు: ‘ఆడవాళ్లను చంపడం కాదు, ఇండియన్ ఆర్మీతో పోరాడండి’
- జమ్మూ డ్రోన్ దాడి: ఈ తరహా దాడులను అడ్డుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందా?
- కశ్మీర్: వారం రోజుల్లో ఏడుగురు మైనారిటీలను కాల్చి చంపారు... జమ్మూలో నిరసన ప్రదర్శనలు
- బంగ్లాదేశ్: హిందూ ఆలయాలు, పూజా మండపాల మీద జరిగిన దాడులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
- వీరప్పన్: అటవీ అధికారి తలతో ఫుట్‌బాల్ ఆడిన గంధపు చెక్కల స్మగ్లర్‌ను 20 నిమిషాల్లో ఎలా చంపారంటే...
- కశ్మీరీ పండిట్ హత్య: ‘జీవితాంతం కశ్మీర్‌కి సేవ చేసిన వ్యక్తిని చంపేసి, ఇది కశ్మీర్ కోసం అంటే ఎలా?’
- ‘కశ్మీర్‌కు స్వతంత్రం వద్దు.. పాకిస్తాన్లో కలవాలి’ అని గిలానీ ఎందుకు కోరుకున్నారు?
- విక్రాంత్‌ను ముంచాలని వచ్చిన పాక్ 'ఘాజీ' విశాఖలో జలసమాధి ఎలా అయ్యింది?
- సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- పీసీ సర్కార్: బ్రిటన్ను భయపెట్టిన మేజిక్ మహారాజు
- బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై భారత్‌కు షేక్ హసీనా హెచ్చరిక, ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)