తప్పు ఒప్పుకున్న అమెరికా.. కాబుల్ డ్రోన్ దాడిలో తీవ్రవాది కాదు అమాయకులు చనిపోయారని వెల్లడి

అఫ్గానిస్తాన్ నుంచి వెనుదిరుగుతున్న చివరి రోజుల్లో కాబుల్‌లో జరిపిన ఒక డ్రోన్ దాడిలో 10 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవమేనని అమెరికా అంగీకరించింది.

ఆగస్టు 29వ తేదీన అమెరికా ఈ దాడి జరిపింది. ఇందులో ఒకే కుటంబానికి చెందిన ఏడుగురు పిల్లలు సహా మొత్తం తొమ్మిది మంది సామాన్య పౌరులు, ఒక సహాయకుడు చనిపోయారని అమెరికా సెంట్రల్ కమాండ్ దర్యాప్తులో తేలింది.

మృతుల్లో రెండేళ్ల సుమయ కూడా ఉన్నారు.

అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్ల తన ఆపరేషన్‌ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో అమెరికా సైన్యం జరిపిన చివరి డ్రోన్ దాడి ఇది.

అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు చేజిక్కించుకోవడం, విదేశీ సైన్యాలు తమతమ దేశాలకు తిరిగి వెళ్లిపోతుండటంతో.. దేశాన్ని వదిలిపెట్టేందుకు వేలాది మంది అఫ్గానీయులు కాబుల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాబుల్ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొన్న సమయంలోనే అక్కడ ఉగ్రవాద దాడి జరిగింది.

ఈ ఉగ్రవాద దాడి తర్వాత మరిన్ని దాడులు జరగొచ్చని, ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ స్థానిక గ్రూపు ఐఎస్ కే ఈ దాడులు చేయొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కాబుల్‌ నగరంలో, విమానాశ్రయానికి సమీపంలో ఒక కారుపై డ్రోన్ దాడి చేసింది.

దాదాపు ఎనిమిది గంటలపాటు ఆ కారుపై నిఘా పెట్టామని, అది ఐఎస్-కే మిలిటెంట్లకు చెందినదేనని భావించామని, పైగా ఈ కారును ఐఎస్-కేతో సంబంధం ఉన్న కాంపౌండులో పార్కు చేశారని అమెరికా తన దర్యాప్తులో పేర్కొంది.

విమానాశ్రయంపై మరిన్ని దాడులు జరగొచ్చునన్న నిఘా సమాచారం నేపథ్యంలో ఈ కారు కదలికలను అనుమానించామని యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ కెన్నెత్ మెక్ కెన్జీ వివరించారు.

ఒకానొక దశలో కారు డిక్కీలో కొందరు వ్యక్తులు పేలుడు పదార్థాలను పెడుతున్నట్లు నిఘా డ్రోన్లు చూపించాయి. అయితే అవి పేలుడు పదార్థాలు కాదు.. మంచినీళ్ల క్యాన్లు అని తేలింది.

ఇదొక 'విషాద తప్పిదం' అని జనరల్ మెక్ కెన్జీ చెప్పారు. అయితే, ఈ డ్రోన్ దాడికి దారితీసిన నిఘా సమాచారానికి తాలిబాన్లకు సంబంధం లేదని వివరించారు.

సహాయకుడిగా ఉద్యోగం చేసే జమైరీ అక్మదీ కాబుల్ విమానాశ్రయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి కారులో వెళ్లినప్పుడు ఈ దాడి జరిగింది.

డ్రోన్ దాడి తర్వాత రెండో పేలుడు సంభవించిందని, కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయనడానికి అదే ఆధారమని తొలుత అమెరికా చెప్పింది. అయితే, అది కారు గ్యాస్ ట్యాంకు పేలడు అని దర్యాప్తులో తేలింది.

డ్రోన్ దాడి తర్వాతి రోజు తమను అమెరికా తీసుకెళ్లాలని దరఖాస్తు చేసుకున్నామని బాధిత కుటుంబం బంధువులు బీబీసీతో అన్నారు. అధికారుల అనుమతి కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.

చనిపోయిన వారిలో ఒకరైన అహ్మద్ నాజర్ అమెరికా సైన్యానికి అనువాదకుడిగా పనిచేశారు. బాధితుల్లో కొందరు పలు అంతర్జాతీయ సంస్థలకు పనిచేశారు. వీరందరికీ అమెరికా వీసాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)