తెల్ల జుట్టు కనిపిస్తే ముసలితనం వచ్చేసినట్లేనా? ఎందుకు రంగేసుకుంటారు

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"కూతురి పెళ్లిలో ఖరీదైన పట్టు చీర కట్టుకుని జుట్టుకు రంగు వేసుకోకుండా ఉంటావా? అని నా బంధువులు ప్రశ్నించారు" కానీ, నేనిలానే ఉంటానని ఒక చిన్న నవ్వుతో సమాధానం చెప్పాను" అని 51 ఏళ్ల సౌమ్య చెప్పారు. ఆమె ఒక గృహిణి.

"శారీరక ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తాను కానీ, శారీరక సౌందర్యం గురించి కాదు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఉండటమే నాకిష్టం" అని చెప్పారామె.

అయితే, అందరూ ఇలాగే ఉంటారా? అసలు హెయిర్ కలర్ వేసుకోకుండా ఇంట్లోనుంచి బయటకు అడుగుపెట్టని వారు కూడా ఉన్నారు.

హెయిర్ కలర్‌పై ఇప్పుడు చర్చ ఎందుకు?

టాలీవుడ్ నటి సమీరా రెడ్డి జుట్టుకు రంగు వేసుకోకుండా ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేస్తున్న ఫోటోలతో ఈ చర్చ మొదలైంది.

తెల్ల జుత్తులో ఉన్న ఫొటోలు ఎందుకు పోస్ట్ చేస్తున్నావని ఆమె తండ్రే అడగ్గా ఇన్‌స్టాగ్రామ్ వేదికగానే ఆమె తండ్రికి తన అభిప్రాయాన్ని తెలియచేశారు.

"నేనిలా ఉండటం వల్ల ముసలైనట్లు కనిపిస్తున్నానా? అందంగా కనిపించటం లేదా? ఆకర్షణీయంగా లేనా’’ అని ప్రశ్నిస్తూ , తెల్ల జుట్టుతో సహజంగా ఉండటం తనకు స్వేచ్ఛను ఇస్తుందని ఆమె తండ్రికి సమాధానం చెప్పారు.

తానెలా కనిపిస్తున్నాననే విషయంపై ఆమెకు వ్యామోహం లేదని స్పష్టం చేశారు.

ఇంతకుముందు ప్రతి రెండు వారాలకోసారి కచ్చితంగా జుట్టుకు రంగు వేసుకునే ఆమె, ఇప్పుడా విషయం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపారు.

జుట్టుకు రంగు వేసుకునే సంస్కృతి ఎప్పటి నుంచి మొదలైంది?

ప్రాచీన సంస్కృతుల్లో కూడా జుట్టుకు సహజంగా లభించే రంగులతో రంగులు వేసుకోవడం ఉండేదని విక్టోరియా షెర్రో రాసిన ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ కల్చరల్ హిస్టరీలో పేర్కొన్నారు.

ప్రాచీన కాలంలో స్త్రీలు, పురుషులూ జుట్టుకు రంగు వేసుకునేవారని మరికొందరు అధ్యయనకారులు అభిప్రాయపడ్డారు.

కానీ, క్రమేపీ ఇది సౌందర్యానికి సంబంధించిన అంశంగా మారిపోయి, ఎక్కువగా మహిళలకు సంబంధించిన అంశంగా మారిపోయింది.

అయితే, శరీర ఛాయ విషయంలో తెలుపే అందం, జుట్టు విషయం వచ్చేసరికి నలుపే అందం అన్న అభిప్రాయాలు సమాజంలో పాతుకుపోయాయి.

1907లో యూజీన్ స్కల్లర్ అనే ఒక ఫ్రెంచ్ కెమిస్ట్ పారా ఫెన్లినీడైయామిన్ అనే రసాయనాన్ని వాడి తొలి సారి రసాయన డైను తయారు చేశారు. దానికి 'ఓ రియల్' అని పేరు పెట్టారు. అదే రెండేళ్ల తర్వాత 'లో రియల్' గా మారినట్లు సీఎన్ఎన్ లో ప్రచురితమైన ఒక వ్యాసంలో ఉంది.

"ఒక మంచి భావన"

"నేను గత 25 ఏళ్లుగా జుట్టుకు రంగు వేసుకుంటున్నాను. నేను సమాజానికి భయపడో, లేదా ఎవరికోసమో రంగు వేసుకోవడం లేదు. నన్ను నేను నల్లని జుట్టుతో చూసుకోవడానికి ఇష్టపడతాను. నేను బాగా కనిపించడం నాకొక మంచి భావనను కలుగచేస్తుంది" అని విజయవాడకు చెందిన వ్యాపారవేత్త జోగులాంబ అన్నారు. ఆమెకు 61 ఏళ్లు.

ఇదేమీ మహిళలకు మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదని మరికొందరు అంటున్నారు.

"తెల్ల జుట్టు రావడమనేది వయసు పెరిగిపోతోంది, ముసలివాళ్ళమైపోతున్నాం అనే భావనను కలిగిస్తుంది. అందుకే నేను జుట్టుకు రంగు వేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాను" అని హైదరాబాద్ కు చెందిన పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషనల్ సత్య పాముల చెప్పారు.

"ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా మనలో చాలామంది పక్కవాళ్ళు పొగడాలనో, ఎదుటివారికి బాగా కనిపించాలనే ఉద్దేశంతోనే దుస్తులు, ఆహార్యాన్ని మెంటైన్ చేస్తాం" అని అన్నారు.

"నాకు 40 ఏళ్ల నుంచే జుట్టు తెల్లబడటం మొదలైంది. ఇది సహజ పరిణామమే అయినా బాగా కనిపించడం వల్ల కాస్త ఆత్మవిశ్వాసం కలుగుతుంది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"ఏమిటలా అయిపోయావు" అనే ప్రశ్న సమాజంలో ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలను అడ్డుకోవాలంటే మరి రంగు వేసుకోవాల్సిందే" అని అన్నారు.

"పిచ్చి దానిలా ఉన్నావు, జుట్టుకు రంగు వేసుకోవచ్చు కదా!"

21 సంవత్సరాల నుంచే తెల్ల జుట్టుతో ఉన్న అరుణ మాత్రం ఇప్పటి వరకూ పెద్దవాళ్ళ బలవంతం మీద రెండు సార్లు మాత్రమే జుట్టుకు రంగు వేసుకున్నట్లు చెప్పారు. ఆమె స్కూల్ రేడియో వ్యవస్థాపకురాలు. ఆమెకిప్పుడు 49 ఏళ్లు.

సహజంగా ఉండటమే అందంగా ఉండటం అని భావించే అరుణ మాత్రం జుట్టుకు రంగు వేసుకోవడం పట్ల ఇష్టం ప్రదర్శించలేదు.

"జుట్టుకు రంగు వేసుకుంటే, నా తల మీద అదనపు భారాన్ని మోపి, సహజత్వాన్ని నాశనం చేస్తున్నట్లుగా భావిస్తాను" అని అన్నారు.

"నా ఎదురుగానే చాలా మంది, పిచ్చి దానిలా ఉన్నావు, జుట్టుకు రంగు వేసుకోవచ్చు కదా అని నా తల్లితండ్రులతో పాటు, బంధువులు, స్నేహితులు కూడా అనేవారు".

"నేనిలానే ఉంటాను" అని సమాధానం చెప్పాను. నాలా నేను ఉండటం వల్ల నేను సాధికారతతో ఉన్నట్లు భావిస్తాను" అని అన్నారు.

"నేనిలా ఉండటం నా భర్తకు, కొడుకుకు కూడా అభ్యంతరం లేనప్పుడు ఎవరో అభిప్రాయాలను పట్టించుకోవలసిన అవసరం లేదనే అనుకుంటాను. సమాజం ఏమనుకుంటుందో అనే ఆలోచనను దాటి బయటకు వచ్చినప్పుడే ఆత్మవిశ్వాసంతో బ్రతకగలం" అని అరుణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వృద్ధి చెందుతున్న హెయిర్ కలర్ మార్కెట్

2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా హెయిర్ కలర్ మార్కెట్ విలువ 2,800 కోట్ల డాలర్లకు చేరుతుందని స్టాటిస్టా.కామ్ అంచనా వేసింది. ఇది 2019తో పోలిస్తే 8 శాతం ఎక్కువ. ఈ గణాంకాలు హెయిర్ కలర్ మార్కెట్ వృద్ధిని సూచిస్తున్నాయి.

ఒక్క భారతదేశంలోనే హెయిర్ కేర్ పరిశ్రమ 3.3 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని చేస్తుండగా, అందులో ఒక్క రంగులకు సంబంధించిన వ్యాపారం 18 శాతం ఉన్నట్లు 2019లో విడుదల చేసిన నీల్సన్ నివేదిక చెబుతోంది.

హెయిర్ కలరింగ్ కోసం వచ్చే క్లయింట్లు

"రోజుకు కనీసం ముగ్గురు హెయిర్ డై కోసం వస్తారు, స్థానిక రాజకీయ నాయకులు సహా" అని విశాఖపట్నానికి చెందిన ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ చరణ్ చెప్పారు.

సాధారణంగా తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు హెయిర్ కలర్ మంచిదే అని ప్రొఫెషనల్ స్టైలిస్టులు చెబుతూ ఉంటారు. రకరకాల రంగులు కూడా సూచిస్తూ ఉంటారు.

కానీ, 45 సంవత్సరాలు దాటిన వారందరికీ జుట్టుకు రంగును వేసుకోవడం ఆపేయమని సలహా ఇస్తూ ఉంటానని చరణ్ చెప్పారు.

తెల్ల జుట్టు రావడమంటే, ముసలితనానికి ప్రతీకలా చూడటం వల్లే రంగులు వేసుకోవడానికి ప్రాధాన్యం పెరగడానికి కారణమని అన్నారు.

అయితే, తన దగ్గరకు వచ్చే చాలా మంది కస్టమర్లు మాత్రం ముందు "పెద్ద అబ్బాయి పెళ్లి వరకు వేసుకుంటాను, ఆ తర్వాత చిన్న అబ్బాయి పెళ్లి, ఆ తర్వాత మనుమరాలు ఫస్ట్ బర్త్ డే" అంటూ పొడిగిస్తారే తప్ప, వినేవారు చాలా తక్కువ శాతం మంది ఉంటారని చెప్పారు.

"హెయిర్ కలరింగ్ ఒక అడిక్షన్ లా అయింది" అని చెబుతూ ఈ కృత్రిమ రంగుల వల్ల పిగ్మెంటేషన్, కళ్ల సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.

కానీ, ఇటీవల కొంత మంది సినీ తారలు గ్రే హెయిర్‌తో ఉండటాన్ని చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతున్నారని అన్నారు.

"అమ్మోనియా ఫ్రీ అనే చెప్పే ప్రకటనలు చూసి మోసపోవద్దని, ఎంత ఖరీదైన రంగులోనైనా అమ్మోనియా లేకుండా డై ఉండటం అసాధ్యం" అని అన్నారు.

"చాలా మంది రంగు వాడటం లేదు, బ్లాక్ హెన్నా వాడుతున్నామని చెబుతారు. నిజానికి నల్లని గోరింటాకు ఎక్కడైనా ఉందా" అని ప్రశ్నించారు. గోరింటాకులో కృత్రిమ నలుపు రంగు కలిపితేనే ఆ రంగు వస్తుంది కానీ, అది సహజమైనదేమి కాదని చెప్పారు.

రంగులు వేసుకోవడం ఆపడం సాధ్యం కాదు

"జుట్టుకు నల్ల రంగు వేసుకోవడం కొన్ని తరాలుగా జరుగుతోంది. కానీ, 1990ల నుంచీ నలుపు రంగు వేసుకోవడం సాధారణంగా మారిపోయింది. ఎమ్ టీవీ సృష్టించిన విప్లవం తర్వాత యువతలో కూడా రకరకాల రంగులు వేసుకోవడం ప్రాచుర్యం పొందింది" అని విశాఖపట్నానికి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ దాడితోట అన్నారు.

విభిన్నంగా కనిపించడం తమకో ప్రత్యేక గుర్తింపు తెస్తుందనే భావన చాలా మందిలో ఉండటం వల్లే జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటారని ఆయన అన్నారు.

"ఉద్యోగం సంపాదించడానికి, ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసంతో ఉండటానికి లేదా రెండవ సారి వివాహాలు చేసుకోవాలని అనుకునేవారికి, జుట్టుకు రంగు వేసుకోవడం అనేది చాలా సాధారణ ప్రక్రియగా మారిపోయింది" అని ఆయన ప్రత్యక్షంగా చూసిన అనుభవాలను పంచుకున్నారు.

ఈ అభిప్రాయంతో సత్య పాముల ఏకీభవించారు.

"అందంగా కనిపించడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నాను. రంగుతో వయసు పెరుగుదలను ఆపలేం కానీ, ఇతరుల అంచనాలను అందుకోవడం కోసం కూడా ఒక్కొక్కసారి బాగా కనిపించడం ముఖ్యం అని నేను అనుకుంటున్నాను" అని అన్నారు.

అయితే, రసాయనిక హెయిర్ డై లు నిత్య జీవితంలో భాగం అయిపోయాయి. వీటిని పూర్తిగా ఆపేయమని చెప్పే కంటే కూడా ఆరోగ్యానికి హాని చేయకుండా ఎలా వాడాలో చూసుకోవాలని డాక్టర్ గోపీచంద్ సూచించారు.

అలవాటు ఉన్న బ్రాండ్లనే వాడటం మంచిది.

కొత్త బ్రాండ్లను ప్రయోగించడం, తరచుగా బ్రాండ్లను మార్చడం, రంగులను మార్చడం మంచిది కాదని సూచించారు.

వివిధ రసాయనాలతో కూడిన షాంపూలు, కండీషనర్, హెయిర్ డై లను వాడటం వల్ల కూడా శరీరం వివిధ రకాలుగా ప్రభావితమవుతుందని చెప్పారు. దాంతో, వీటి వల్ల స్కాల్ప్ స్కార్స్, శాశ్వతంగా జుట్టు ఊడిపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వీటికి చికిత్స కూడా చాలా ఖరీదుతో కూడుకుని ఉంటుందని చెప్పారు.

ఏ రంగును వాడినా ముందు శరీరం మీద టెస్ట్ చేసుకుని ఎటువంటి ప్రభావం చూపకపోతేనే దానిని వాడమని సూచించారు.

సెలూన్ పరిశ్రమ కూడా రంగు వేసుకుంటే రూపురేఖలు మారిపోతాయనే అభిప్రాయాన్ని కలుగచేసి వీటిని ప్రోత్సహిస్తోంది అని అభిప్రాయపడ్డారు.

"కానీ, సమాజంలో నాటుకుపోయిన పాత ఆలోచనలను కొల్లగొట్టినప్పుడే మార్పు, ఆమోదం సాధ్యం అని" సమీర రెడ్డి తన పోస్టులో రాశారు.

మనం ఇతరులను ఒక ముసుగులో ఉండనివ్వకుండా వారి సహజ ధోరణిలో ఉండనిస్తే, ఆత్మవిశ్వాసం దానంతటదే కలుగుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"నా అభిప్రాయాన్ని మా నాన్నగారు అర్ధం చేసుకున్నారు" అని అదే పోస్టులో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)