బట్టతల సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా?

బట్టతల సమస్యను నియంత్రించగల ఒక కొత్త మందును పరిశోధకులు కనుగొన్నారు. ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారే వ్యాధి) కోసం వాడే డ్రగ్ జుట్టు రాలే సమస్యను కూడా దూరం చేయగలదని గుర్తించారు.

పరిశోధనల్లో.. కేశ మూలాలపై ఈ డ్రగ్ ప్రభావం నాటకీయంగా ఉందని.. వెంట్రుకలు పెరిగేందుకు అది తోడ్పడిందని పరిశోధకులు గుర్తించారు.

వెంట్రుకల పెరుగుదలను నిలిపివేసి.. బట్టతలకు కారణమయ్యే ఒక ప్రొటీన్ మీద ఈ డ్రగ్‌లోని పదార్థం పనిచేస్తుంది.

ప్రాజెక్ట్ లీడర్ డాక్టర్ నాథన్ హాక్‌షా "జుట్టు రాలడంతో బాధపడుతున్న వారికి ఇది చాలా వ్యత్యాసం చూపిస్తుంది" అన్నారు.

బట్టతల (ఆండ్రోజెనిటిక్ అలోపీసియా) సమస్యకు బ్రిటన్‌లో ప్రస్తుతం రెండు డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి.

  • మినోక్సిడిల్ - పురుషులకు, మహిళలకు
  • ఫినస్టెరైడ్ - పురుషులకు మాత్రమే

ఈ రెండూ అంత సమర్థంగా పని చేసిన దాఖలాలు లేవు. రెండింటికీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అందుకే బట్టతల సమస్య ఉన్న వారు ఈ మందులకు బదులు తరచూ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీని ఆశ్రయిస్తున్నారు.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న 40 మందికి పైగా వ్యక్తుల శిరోజాల కుదుళ్ల నమూనాలు సేకరించి ల్యాబ్‌లో పరిశోధన చేశారు. ఈ పరిశోధన ముఖ్యాంశాలను PLOS Biology లో ప్రచురించారు.

"ఈ చికిత్స సమర్థంగా పనిచేస్తుందా, ప్రజలకు సురక్షితమేనా? అనేది చూడాలంటే క్లినికల్ ట్రయల్ అవసరం'' అని డాక్టర్ హాక్‌షా బీబీసీతో అన్నారు.

జుట్టు రాలడానికి కారణం ఏంటి?

జుట్టు రాలడం రోజూ జరిగేదే. ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల జుట్టు రాలటం తాత్కాలికంగా ఉంటుంది. అయితే కొన్ని శాశ్వతంగా రాలిపోతాయి.

డాక్టరును ఎప్పుడు కలవాలి?

  • హఠాత్తుగా జుట్టు రాలుతుంటే
  • బట్టతల చాయలు కనిపిస్తుంటే
  • జుట్టు కుచ్చులుగా ఊడిపోతుంటే
  • తలలో దురద, మంటగా ఉంటే
  • జుట్టు రాలడం గురించి ఆందోళనగా ఉంటే

ఆధారం: NHS Choices

"ఇది చాలా ఆసక్తికరమైన అధ్యయనం" అని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్ ప్రతినిధి బీబీసీతో పేర్కొన్నారు.

జుట్టు రాలడం అనేది సాధారణ వ్యాధి, అది ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టడమే కాదు, మానసిక ఆరోగ్యానికి చాలా నష్టం కలిగిస్తుందని పరిశోధకులు చెప్పారు.

ఈ డ్రగ్‌ను జుట్టు రాలుతున్న వారు ఉపయోగించాలంటే.. ముందుగా దీనిపై మరింత పరిశోధన అవసరమని వారు అభిప్రాయపడ్డారు.

‘‘జుట్టు రాలే వారు చేయించుకొనే చికిత్సల్లో కొన్ని పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు, అన్నిచోట్లా సమర్థంగా పనిచేసినవి ఏవీ లేవు’’ అని పరిశోధకులు అన్నారు.

అందుకే జుట్టు రాలడంపై కొత్త చికిత్సలు వచ్చినప్పుడల్లా మనలో కొత్త ఆశలు రేపుతాయి. మరింత ప్రభావవంతమైన చికిత్స చేయించుకునే ఆప్షన్లను ప్రజలకు అందిస్తాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)