పంజ్‌షీర్‌ లోయలో తాలిబాన్ ఫైటర్లు, జాతీయ ప్రతిఘటన యోధుల మధ్య హోరాహోరీ పోరాటం.. ‘వందల్లో మృతులు’

అఫ్గానిస్తాన్‌లోని పంజ్‌షీర్ లోయలో తాలిబాన్ దళాలు, త్రతిఘటన యోధుల మధ్య పోరాటం తీవ్రంగా జరుగుతోంది.

జాతీయ ప్రతిఘటన దళం (ఎన్ఆర్ఎఫ్)కు భారీగా నష్టం చేకూర్చామని తాలిబాన్లు చెబుతుండగా.. లోయ ప్రవేశ మార్గాలన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయని, తాలిబాన్లు వందలాది మంది ఫైటర్లను కోల్పోయారని ఎన్ఆర్ఎఫ్ చెబుతోంది.

‘బలమైన తాలిబాన్లు’

అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు చాలా వేగంగా వశపరచుకున్నారు.

వారు కాబుల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ రాజధానికి ఈశాన్య ప్రాంతంలోని చిన్న వ్యాలీ నుంచి తాలిబాన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తాలిబాన్లు తమను చుట్టుముట్టినా వారికి లొంగకుండా వ్యాలీ పోరాడుతోంది.

పంజ్‌షీర్ వ్యాలీలోని ప్రజలు ఆయుధాలను వదిలిపెట్టాల్సిందిగా సీనియర్ తాలిబాన్ లీడర్ ఆమీర్ ఖాన్ మోతాఖీ పిలుపునిచ్చారు. కానీ వారు ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. కాబుల్ తాలిబాన్ల అదుపులోకి వెళ్లిన ఆగస్టు 15న ఈ లోయ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో డజన్ల కొద్దీ తాలిబాన్లు మరణించినట్లు చెబుతున్నారు. అప్పటినుంచి అక్కడ యుద్ధవాతావరణం కొనసాగుతోంది.

అసలు పంజ్‌షీర్ వ్యాలీలో ఏం జరుగుతోంది. అక్కడి పరిణామాలు తాలిబాన్లకు ఆందోళన కలిగిస్తున్నాయా?

ఈ ప్రతిఘటన యోదులు ఎవరు?

తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఈ లోయ జాతీయ ప్రతిఘటన దళానికి (నేషనల్ రెసిస్టాన్స్ ఫ్రంట్- ఎన్ఆర్ఎఫ్) ఆవాసంగా మారింది. మాజీ అఫ్గాన్ భద్రతా దళ సభ్యులు, మిలీషియన్లతో కలిసి ఈ బహుళ జాతి సమూహం ఏర్పడింది. వీరి సంఖ్య వేలల్లో ఉంటుంది.

ఈ దళం ఎంత వ్యవస్థీకరంగా ఉందో, ఆయుధాల వాడుకలో ఎంత సుశిక్షితులో ఈ వారం విడుదలైన ఫోటోల ద్వారా తెలుస్తోంది.

పంజ్‌షీర్ సింహంగా పేరున్న అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ ఈ బలగాలకు నాయకత్వం వహిస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కూడా ఈ బలగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అహ్మద్ షా మసూద్ నాయకత్వం కారణంగానే 1980ల్లో సోవియట్ సేనలు, 1990ల్లో తాలిబాన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోలేకపోయారు. 9/11 దాడులకు కేవలం రెండు రోజుల ముందు ఆయనను చంపివేశారు.

ఆయన కుమారుడు, 32 ఏళ్ల అహ్మద్ మసూద్ ప్రస్తుత బలగాలకు నాయకత్వం వహిస్తున్నారు. కింగ్స్ కాలేజ్ లండన్, శాండ్‌హస్ట్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేట్ అయిన అహ్మద్ మసూద్... తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ తాలిబాన్లకు ఎదురుతిరుగుతున్నారు. ఆయన కేవలం సొంత దేశం మద్దతునే ఆశించడం లేదు. అమెరికా దళాల ఉపసంహరణ నేపథ్యంలో అంతర్జాతీయ మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌ను కలిశారు.

'' జాతి, లింగ భేదాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరి స్వేచ్ఛ, హక్కులు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటమే మా బాధ్యత'' అని సీఎన్‌ఎన్ ఇంటర్వ్వూలో అహ్మద్ మసూద్ తెలిపారు. మిలిటెంట్లు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

తాలిబాన్లకు ఏం కావాలి?

''అఫ్గాన్లందరికీ, తాలిబాన్ల ఇస్లామిక్ రాజ్యమే నిలయంగా ఉండాలి'' అనే భావనను మిలిటెంట్లు ప్రజలపై రుద్దుతున్నారు.

కానీ రాజధాని కాబుల్‌కు సమీపంలోని పంజ్‌షీర్ వ్యాలీ, ఈ భావనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందుకు తగినట్లే తాలిబాన్లపై తిరగబడుతూ వారి ఆశయాలకు అడ్డుతగులుతోంది.

వ్యాలీ ప్రతిఘటన యోధులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లోనూ హాష్ ట్యాగ్‌లు వెల్లువెత్తుతున్నాయి.

తాలిబాన్లు, ఎన్‌ఆర్ఎఫ్ సభ్యులు చాలా కాలంగా చర్చలు జరుపుతున్నారు. యుద్ధాన్ని నివారించడమే ఇరుపక్షాల ఉద్దేశమని పేర్కొంటున్నాయి. కానీ ఇంతవరకు దీనికి ఒక పరిష్కారాన్ని చూపలేకపోయారు. పైగా ఈ చర్చలే ప్రస్తుత పోరాటాలకు కారణమైనట్లు తెలుస్తోంది.

వందలాది మంది ఫైటర్లను తాము పంపించామని, కానీ వారిని ఎదుర్కొనేందుకు పంజ్‌షీర్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేదని తాలిబాన్లు చెప్పారు. వ్యాలీ సరిహద్దుల్లోకి తాలిబాన్లు చేరుకోగానే వారికి మెషీన్ గన్లు, మోర్టార్లు, ఇసుక బస్తాలతో పటిష్టంగా ఉండే నిఘా పోస్ట్‌లు స్వాగతం పలికేవని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

రెండు వైపులా ప్రాణనష్టం జరిగిందని ఇరుపక్షాలు చెబుతున్నాయి. కానీ మరణించినవారి కచ్చితమైన సంఖ్యను తెలుసుకోవడం చాలా కష్టం. వ్యాలీలోని కొన్ని ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చాయని తాలిబాన్లు చెబుతుండగా... వారి ఆరోపణలను ఎన్ఆర్ఎఫ్ సభ్యులు కొట్టివేశారు.

పంజ్‌షీర్ వ్యాలీ ప్రతిఘటనను నిరోధించేందుకు తాలిబాన్లు... లోయ రాకపోకల మార్గాలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పంజ్‌షీర్ ఎలా ఉంటుంది?

అఫ్గానిస్తాన్‌లోని అతి చిన్న ప్రావిన్సులలో పంజ్‌షీర్ ఒకటి. ఇది పంజ్‌షీర్ నదికి 9800 అడుగుల (3000మీ.) ఎత్తులో పర్వత శిఖరాల వెనుక ఉంటుంది. ఇక్కడ 1,50,000 నుంచి 2,00,000 వరకు జనాభా నివసిస్తున్నారు.

లోయలోని అద్భుతమైన ప్రదేశాలు, అక్కడ ఉండే భద్రత దృష్ట్యా ప్రజలు అక్కడికి తరలివచ్చారు.

ఇది అనేక జాతులకు ఆవాసంగా మారింది. ఇక్కడ తజిక్స్ అనే జాతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. బయటి వ్యక్తులతో పోరాటాల్లో ఇక్కడి ప్రజలు చూపించిన ధైర్య సాహసాలు వారికి ప్రాచుర్యాన్ని కల్పించాయి.

ఈ వ్యాలీ చారిత్రకంగా రత్నాలకు, మైనింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇటీవల సంవత్సరాలలో ఇక్కడ పెట్టుబడులు మొదలయ్యాయి. గత రెండు దశాబ్ధాలలో ఇక్కడ జలవిద్యుత్ ఆనకట్టలు, గాలిమరలు, రోడ్లు, రేడియో టవర్ల నిర్మాణం జరిగింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)