You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"ఇది నా ఇల్లు, నా ఆస్తి, ఇందులో నీకు హక్కు లేదు" అన్న భర్తపై 72 ఏళ్ల భార్య ఎలా పోరాడిందంటే..
- రచయిత, సాండ్రీన్ లుంగుంబు
- హోదా, బీబీసీ న్యూస్
72 ఏళ్ల ఆగ్నెస్ సిటోల్ దక్షిణాఫ్రికాలో కొన్ని వేల మంది మహిళలకు అనుకోకుండా హీరోగా మారిపోయారు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఇంటిని అమ్మకానికి పెట్టిన భర్తకు వ్యతిరేకంగా ఆమె కోర్టులో కేసు వేశారు. తన హక్కులను సంపాదించుకునేందుకు దశాబ్దాల నాటి వర్ణవివక్ష కాలం నాటి చట్టాలను ఆమె సవాలు చేయవలసి వచ్చింది.
"పోరాడాలి.. లేదంటే రోడ్డున పడాలి"
తన వైవాహిక జీవితం కష్టంగానే ఉండవచ్చని ఆగ్నెస్ సిటోల్‌కు మొదట్లోనే అర్ధమయింది. ఆమె హైస్కూలు చదువుతున్నప్పుడు ప్రేమించిన గిడియోన్‌ను 1972లో పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆయన కొన్నేళ్ల పాటు తనకు చేసిన ద్రోహాన్ని ఆమె చూసీ చూడనట్లు ఊరుకున్నారు.
"ఆయనకు చాలా మందితో వివాహేతర సంబంధాలుండేవి. కానీ, 2016-2017 మధ్యలో మా ఆస్తులన్నీ అమ్మాలని అనుకునేవరకు ఆయన చేస్తున్న పనులు నన్ను పెద్దగా ప్రభావితం చేయలేదు" అని ఆగ్నెస్ చెప్పారు.
"ఈ అమ్మకాల విషయంలో ఆయన సమాధానం ఎప్పుడూ ఒకేలా ఉండేది. "ఇది నా ఇల్లు, నా ఆస్తి, ఇందులో నీకేమీ హక్కు లేదు" అని అనేవారు.
ఇంటిని కోల్పోతాననే భయంతో ఆగ్నెస్ తన భర్తకు వ్యతిరేకంగా 2019లో కోర్టులో కేసు వేయాలని అనుకున్నారు.
ఆమె తరానికి చెందిన మహిళలు ఇలా చేయడం చాలా అసాధారణమైన చర్య.
"అప్పుడు నాకు 72 సంవత్సరాలు. నేనెక్కడికి వెళతాను? ఎక్కడ నుంచి నా జీవితాన్ని మొదలుపెడతాను? నా దగ్గర ఉన్న మార్గాలు రెండే రెండు. అయితే, నేను వీధిన పడాలి లేదా పోరాడాలి" అని ఆగ్నెస్ చెప్పారు.
"నా అవసరమే నాకు ధైర్యాన్ని తెచ్చిపెట్టింది. అవసరం లేకపోయి ఉండి ఉంటే నేనలా చేసి ఉండేదానిని కాదేమో. ఎదిరించే వ్యక్తిని అవ్వాల్సి వచ్చింది" అని అన్నారు.
"మహిళలకు మరో మార్గం లేదు"
దక్షిణాఫ్రికాలో నల్లజాతి మహిళలకు ఆస్తి హక్కు అమలులో లేని సమయంలో ఆగ్నెస్ వివాహం జరిగింది. ఇంటి పెద్దగా పురుషులకు మాత్రమే అన్ని అధికారాలూ ఉండేవి.
"అప్పట్లో మహిళలకు ఎటువంటి నిర్ణయాధికారాలు ఉండేవి కావు. అయితే, ఆస్తి హక్కు లేకుండా వివాహం చేసుకోవాలి లేదా వివాహం చేసుకోకుండా ఉండిపోవాలి" అని ఆగ్నెస్ వివరించారు.
అయితే, 1988లో మాట్రిమోనియల్ ప్రాపర్టీ యాక్ట్‌కు చేసిన సవరణతో నల్ల జాతి మహిళలకు కూడా ఆస్తిలో సమాన వాటా పొందే హక్కు లభించింది.
అయితే, ఆ హక్కులు సహజంగా లభించవు. ఈ హక్కును పొందేందుకు చట్ట సవరణ జరిగిన రెండేళ్ల లోపు నల్ల జాతి మహిళలు వారి భర్తల అంగీకారంతో పాటు డబ్బులు చెల్లించి హక్కుల కోసం కోర్టులో దరఖాస్తు సమర్పించాలి.
"చట్టంలో మార్పులు వచ్చినట్లు మాకు తెలుసు, కానీ, అవి అందరికీ మారాయని అనుకున్నాను" అని ఆగ్నెస్ గుర్తు చేసుకున్నారు.
"ఆ తర్వాత చట్టం నన్ను మోసం చేసిందని గ్రహించి, దీని కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపారు.
"అత్యంత పేదరికం"
ఆగ్నెస్.. కాజూలు-నటల్ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న బొగ్గు గనులతో కూడిన రైహీడ్ పట్టణంలో జన్మించారు.
1940లలో దేశవ్యాప్తంగా వివిధ వర్ణాల ప్రజల మధ్య వివక్ష స్పష్టంగా ఉండేది.
ఆమె తండ్రి దక్షిణాఫ్రికా రైల్వేస్‌లో క్లీనర్ గా పని చేసేవారు.
ఆయన తెల్ల జాతి యజమానులు కోసం టీ చేసి ఇస్తుండేవారు. ఆమె తల్లి సంపన్న తెల్ల జాతి వారి ఇళ్లల్లో గిన్నెలు తోమడం, శుభ్రపరచడం, వంట చేయడం లాంటి పనులు చేసేవారు.
"నేను అత్యంత పేద కుటుంబంలో పుట్టాను. నా తల్లితండ్రులు కార్మికులు. వాళ్ళు నాకు మంచి ఉదాహరణగా నిలిచారు. వాళ్ళు నేర్పిన పాఠాలే నేను నేర్చుకున్నాను" అని ఆగ్నెస్ చెప్పారు.
"మేము వారాంతంలో చర్చికి వెళ్ళేవాళ్ళం. దంపతుల మధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కూడా కాథలిక్ మతానికి చెందిన వారిని విడాకులు తీసుకునేందుకు అనుమతించేవారు కాదు" అని ఆగ్నెస్ చెప్పారు.
"నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని లేదు. నా పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరూ లేకుండా పెరగడం నాకిష్టం లేదు. నాకు తెలిసింది ఇంతే" అని అన్నారు.
"నేనొక కష్టజీవిని"
ఎన్ని సవాళ్లున్నప్పటికీ తన తల్లితండ్రులు కలిసి ఉండటాన్ని ఆగ్నెస్ చూశారు. వారి కష్టాన్ని చూసిన తర్వాత ఆమె మెరుగైన జీవితం జీవించాలని ఆశపడ్డారు.
ఆమె గిడియోన్‌ను వివాహం చేసుకోక ముందు నర్సుగా శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంటి నుంచే బట్టలు అమ్మడం మొదలుపెట్టారు.
ఇంటి ఖర్చుల కోసం ఆమె రకరకాల పనులు చేసేవారు.
"నా భర్త నా జీవితంలో పూర్తిగా ఉండకపోవడంతో ఇంటి బాధ్యతను నేనే మోయాల్సి వచ్చేది" అని ఆగ్నెస్ చెప్పారు. ఆమెకు నలుగురు పిల్లలు.
"నేను ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు కుట్టడం, అమ్మడం లాంటి పనులు చేసేదానిని. నా పిల్లలు స్కూలుకు వెళ్లి చదువుకోవాలనే పట్టుదలతో చాలా పనులు చేసేదానిని".
"సహజంగా నేను కష్టాలను ఎలా ఈదాలో తెలిసిన మనిషిని. పురుషుడి మీద ఆధారపడాలని నేను అనుకోలేదు. నా కోసం ఎవరో పనులు చేసే బదులు, నా పనులు నేనే చేసుకోవాలని అనుకున్నాను" అని చెప్పారు.
సరిగ్గా 9 సంవత్సరాల క్రితం ఆగ్నెస్ వివాహం కూలిపోవడం మొదలయింది. ఒక రోజు పని నుంచి ఇంటికి వచ్చేసరికి, గిడియోన్ వేరే పడక గదిలోకి వెళ్లడం చూసారు. అయితే, ఆయన అలా చేస్తున్నందుకు ఎటువంటి వివరణా ఇవ్వలేదు. అలా అని ఆయన ఎన్నడూ తిరిగి ఈమె గదికి రాలేదు. వారిద్దరూ ఒకే ఇంటిలో ఉండేవారు కానీ, పూర్తిగా భిన్నమైన జీవితాలను గడిపేవారు.
"మేము ఇంట్లో నడుస్తున్నప్పుడు వరండాలలో, మెట్ల మీద, పార్కింగ్ దగ్గర ఒకరికొకరు ఎదురు పడేవాళ్ళం. కానీ, ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు" అని చెప్పారు.
అయితే, ఇల్లు అమ్మాలని అనుకుంటున్న విషయాన్ని ఆయనెప్పుడూ ఆగ్నెస్‌తో చెప్పలేదు.
"మా ఇల్లు చూసుకోవడానికి అకస్మాత్తుగా ఎవరెవరో రావడం నాకు దిగ్భ్రాంతిని కలిగించింది" అని ఆమె చెప్పారు.
దాంతో, ఆమెకు ఇల్లు లేకుండా అయిపోతుందనే విషయం అర్ధమయింది. ఆ ఇంటి కోసం ఆమె కూడా సమానంగా పెట్టుబడి పెట్టినట్లు పిటిషన్లో పేర్కొంటూ ఆమె భర్త తనను ఆర్ధికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు 2019 మొదట్లో కోర్టులో కేసు వేశారు.
బాధ లేదు
రెండేళ్ల తర్వాత ఏప్రిల్ 2021లో దక్షిణాఫ్రికాలో ఉన్న చట్టాలు నల్ల జాతి దంపతుల పట్ల వివక్షను ప్రదర్శించాయని దక్షిణాఫ్రికా కాన్‌స్టిట్యూషనల్ కోర్టు ధృవీకరించింది. 1988 ముందు జరిగిన వివాహాల్లో కూడా ప్రతీ ఒక్కరికి ఆస్తి హక్కు ఉంటుందని తీర్పు చెప్పింది.
ఆగ్నెస్, ఆమె కూతురితో కలిసి ఈ తీర్పును తన బెడ్ రూమ్ నుంచి ఆన్‌లైన్‌లో విన్నారు.
అయితే, ఈ కేసును ఆమె గెలిచినట్లు ఆమె లాయర్ ఫోన్ చేసి చెప్పేవరకూ ఆమెకు విషయం స్పష్టంగా అర్ధం కాలేదు.
"న్యాయసంబంధమైన భాష మాకు అర్ధం కాలేదు. మాకేమీ అర్ధం కాలేదు. నాకు పొట్టలో మెలికలు తిరిగినట్లయింది. నాకు నమ్మకం ఉన్నప్పటికీ కూడా భయపడ్డాను" అని చెప్పారు.
"నాకు ఆనంద భాష్పాలు వచ్చాయి. నా లాంటి వివాహాల్లో మగ్గుతున్న కొన్ని వేల మంది మహిళలను రక్షించానని అనిపించింది".
తాను సొంతంగా ఎదుర్కొన్న సవాళ్ళే ఆమెకు పోరాడే శక్తిని ఇచ్చాయని ఆమె చెప్పారు.
"నేనెవరిని, నేనెలా పనులు చేస్తాననేది నా వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. స్వయంగా పనులు చేసుకోవడం నాకిష్టం. నా తరానికి చెందిన మహిళలు ఇలా ఉండటం మా సంస్కృతిలో చాలా అరుదైన విషయం" అని చెప్పారు.
"ఈ కేసును గెలవడం నా జీవితంలో జరిగిన అత్యుత్తమమైన విషయం. నా గెలుపు అందరికీ గెలుపు లాంటిదే. నేనెప్పుడూ నా నిర్ణయం పట్ల సందేహించలేదు. నేను గెలిచినా, ఓడినా కూడా చివరి వరకూ పోరాడుతాను అని నాకు నేనే చెప్పుకున్నాను" అని చెప్పారు.
క్షమ
గిడియోన్‌ను ఆగ్నెస్ క్షమించగలిగారు. ఆయన ఈ కోర్టు కేసు జరుగుతున్న సమయంలోనే కోవిడ్ 19 సోకి మరణించారు.
మరణించడానికి రెండు రోజుల ముందు భార్యకు, కూతుర్లకు జరిగిన పరిస్థితికి ఆయన క్షమాపణలు చెప్పారు.
ఆయన విల్లులో తనకు ఏమీ రాయలేదని ఆగ్నెస్ గ్రహించారు. ఆ ఇంటిని ఆయన ఎవరికో రాశారు. కానీ, కోర్టు ఆదేశాలు ఆయన విల్లును తిరగరాశాయి.
"చాలా నష్టం జరిగింది. కానీ, ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉన్నాయనే కంటే, అవి చివరకు ఎలా మలుపు తిరిగాయనేదే ముఖ్యం" అని ఆగ్నెస్ అన్నారు.
"మేము ఆయనను క్షమించాం. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నాకేమీ చింత లేదు. కానీ, చివరి వరకు నేను నా వివాహ బంధానికి కట్టుబడి ఉన్నాను".
"నేనాయనకు చెందినది ఏదీ కావాలని అనుకోలేదు. కానీ, నేను కష్టపడింది, నాకు చెందాల్సింది కూడా ఆయన తీసుకోవాలని అనుకున్నారు. అదే నాకు నచ్చలేదు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌కు 'కాబుల్ కసాయి' హిక్మత్యార్ ఇచ్చిన సలహా ఏంటి?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)