You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జపాన్: ‘గృహిణి’ బాధ్యతల నుంచి తప్పుకుని, ఉద్యోగాల్లోకి వస్తున్న మహిళా శక్తి
- రచయిత, మరికో ఓయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జపాన్‌లో తెలివైన, విద్యావంతులైన మహిళలకు కొదవ లేదు. ప్రస్తుతం కరోనా కారణంగా కుంటుపడిన వారి ఆర్థికవ్యవస్థను మళ్లీ అభివృద్ధి పథంవైపు నడిపించేందుకు వీరంతా సహయపడగలరు.
కానీ, అక్కడి మహిళలు తమ సామర్థ్యానికి తగిన ఉద్యోగాలు పొందేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నియామకాల్లో ఉన్న కఠినమైన నిబంధనలు, నాయకత్వ స్థానాల్లో పురుషులే ఎక్కువగా ఉండడం మొదలైనవన్నీ మహిళలకు అడ్డంకులుగా మారాయి.
చదువుకుని, యూనివర్సిటీల్లో డిగ్రీలు సంపాదించి కూడా ఇళ్లకే పరిమితమైన మహిళల సంఖ్య పెరగడం దేశానికేమంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2020 నాటికల్లా కార్యాలయాల్లో, సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య పెంచాలని జపాన్ ప్రభుత్వం గతంలో ఓ నిర్ణయం తీసుకుంది. అయితే, అది లక్ష్యానికి సుదూర తీరాల్లోనే ఆగిపోయింది.
"జపాన్.. వెలుగులు విరజిమ్మే మహిళల దేశం" అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే గొప్ప ఆర్భాటంగా ప్రారంభించిన 'వుమెనామిక్స్' పథకం చాలావరకు విఫలమైందనే చెప్పవచ్చు.
అయితే, అది కోవిడ్ 19 వల్ల మాత్రమే అనుకుంటే పొరపాటే.
నేడు, జపాన్ పార్లమెంటులో ప్రతి 10 మంది పురుషులకు కేవలం ఒక మహిళ మాత్రమే ఉన్నారు. ప్రైవేటు సెక్టార్‌లో ఉన్నత స్థానాల్లో 15 శాతం కన్నా తక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇది 2020 లక్ష్యాలలో సగం మాత్రమే.
అయితే, తమ పథకం విజయవంతమైందని జపాన్ పూర్వ ప్రధాని అబే ఇప్పటికీ అంటున్నారు.
ఆయన చెప్పినట్టు గతంలో కన్నా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య పెరిగింది. అది నిజమే కానీ ఉన్నత విద్యావంతులైన ఈ మహిళలు చేస్తున్న ఉద్యోగాలేమిటి? వారి చదువులకు, స్థాయిలకు తగ్గ ఉద్యోగాలే చేస్తున్నారా?
ఇది సమాజంలో మార్పులు తీసుకురాలేదు..
షింజో అబే ప్రవేశపెట్టిన పథకం సాంఘిక సంస్కరణలకు దోహదపడదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది పని ప్రదేశాల్లో మహిళల వికాసానికి తోడ్పడేది కాదని, కేవలం ఉద్యోగస్తుల సంఖ్య పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. జపాన్‌లో 1990ల నుంచి పని చేయగలవారి జనాభా (వర్కింగ్-ఏజ్ పాపులేషన్) తీవ్రంగా క్షీణిస్తోంది.
వుమెనామిక్స్ పథకం ద్వారా ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయే తప్ప మహిళల సామర్థ్యాలకు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు లభించట్లేదని నిపుణులు అంటున్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా పరిశీలిస్తే, జపాన్‌లో సుమారు 60 శాతం మంది మహిళలు తమకు మొదటి బిడ్డ పుట్టగానే ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి గృహిణులుగా మారిపోతున్నారు.
భర్త సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం, భార్య పూర్తిగా పిల్లల పెంపకంపై దృష్టి పెట్టగలగడాన్ని అక్కడ గొప్పగా భావిస్తారు.
కానీ, వుమెనామిక్స్ పథకం ప్రవేశపెట్టినప్పటికే, చాలామంది మహిళలు ఉద్యోగాలకు వెళ్లడం ప్రారంభించారు.
అప్పటికే కుటుంబ పోషణ భారంగా మారుతున్న పరిస్థితులు ఉండడంతో చదువుకున్న గృహిణులు మళ్లీ ఉద్యోగాల బాట పట్టారు.
ఫలితంగా, 2019లో కేవలం 42.1 శాతం మహిళలు మాత్రమే ఉద్యోగాలు విడిచిపెట్టారు. దాంతో, లేబర్ మార్కెట్‌లో 15-64 వయసు మధ్యగల మహిళా ఉద్యోగుల సంఖ్య 70.9 శాతానికి పెరిగింది. 25-44 కేటగిరీలో 77.7 శాతానికి పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ మార్పుకు మద్దతుగా పిల్లల డే కేర్‌లలో వెయిటింగ్ లిస్ట్ ఉండకూడదంటూ జపాన్ ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే, పెద్ద పెద్ద కంపెనీల్లో కనీసం ఒక మహిళా ఎగ్జిక్యూటివ్ అయినా ఉండాలనే ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ, ఆ దిశలో చర్యలు తీసుకునేందుకు కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహలకాలుగానీ, విఫలమైతే జరిమానాలు గానీ ప్రకటించలేదు.
ఫలితంగా, అనేకమంది మహిళలు ఎదుగుబొదుగు లేని ఉద్యోగాలతో, లేదా పార్ట్ టైం ఉద్యోగాలతో సర్దుకోవాల్సి వచ్చింది.
సగటున, ఒక జపాన్ మహిళ ఆదాయం, పురుషుడి కంటే 40 శాతం కన్నా తక్కువగా ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేర్కొంది.
మళ్లీ కెరీర్ ప్రారంభించడం అంత సులువేమీ కాదు..
సగం కన్నా ఎక్కువమంది జపనీస్ మహిళలు కనీసం డిగ్రీ అయినా చదువుకున్న తర్వాతే ఉద్యోగంలో చేరతారు. ఉద్యోగాల్లో చేరే పురుషుల విద్యార్హతతో ఇది దాదాపు సమానం.
కానీ, ఒకసారి ఉద్యోగం మానేసి, కొన్నేళ్ల తరువాత మళ్లీ చేరాలనుకుంటే మునుపటి ఉద్యోగాలు రావడం కష్టమే, అలాంటి స్థానాలు, పదవులు దొరకటమూ కష్టమే.
"మళ్లీ ఉద్యోగం చేయాలంటే ఏదైనా సూపర్‌మార్కెట్లో పనిలోకి చేరడమే. సాధారణంగా చదువుకునే రోజుల్లో విద్యార్థులు ఇలాంటి పార్ట్-టైం జాబులు చేస్తుంటారు" అని వార్క్ ఏజెంట్‌లో కెరీర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న యుమికో సుజుకి అన్నారు.
ఒక పదిహేనేళ్ల క్రితం సుజుకి కూడా ఉద్యోగం వలిదిపెట్టి గృహిణిగా మారారు. కానీ, ఆ నిర్ణయం అంత సులభంగా తీసుకోలేదని ఆమె అన్నారు.
చదువు పూర్తయ్యాక అందరిలాగే సుజుకి కూడా ఫుల్-టైం ఉద్యోగంలో చేరారు. కొన్నిసార్లు ఓవర్ టైం చేసేవారు. తాను పనిచేస్తున్న సంస్థలో తన సామర్థ్యాలను నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డారు.
అదే సంస్థలో పనిచేస్తున్న వ్యక్తిని వివాహమాడారు. పిల్లల్ని కనాలంటే ఇద్దరిలో ఒకరు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటూ వారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన అవసరం ఉందని వారు గ్రహించారు.
ఈమధ్యకాలంలో ఇలాంటి పరిస్థితి వస్తే పిల్లల్ని కన్న తరువాత కూడా మహిళా ఉద్యోగులు తక్కువ గంటలు లేదా సౌకర్యవంతమైన పని వేళలను (ఫ్లెక్సిబుల్ అవర్స్) ఎంచుకునే అవకాశాన్ని కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి.
కానీ 2006లో సుజుకి ఈ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు అలాంటి అవకాశాలేవీ లేవు. ఉద్యోగం వదిలిపెట్టడం ఒక్కటే మార్గం.
"మేమిద్దరం కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకూ పనిచేస్తూ ఉండేవాళ్లం. కొన్నిసార్లు లేట్ అవుతూ ఉండేది. ఇలా అయితే పిల్లల్ని కని, కుటుంబాన్ని ఏర్పరచుకోలేమని అనుకున్నాం."
ఇద్దరు పిల్లల్ని కని, వాళ్లు కాస్త పెద్దయాక.. ఏడేళ్ల తరువాత సుజుకి మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకున్నారు.
అయితే, ఆ ఏడేళ్ల కాలం తన జాబ్ అప్లికేషన్‌లో, సీవీలో ఖాళీగా మిగిలిపోయింది. ఆ ఖాళీని చూసి ఆమెను ఇంటర్వ్యూకి కూడా ఎవరూ పిలవలేదు.
మళ్లీ చదువు ప్రారంభించి, మూడు ప్రొఫెషనల్ కోర్సులు చేసి, సర్టిఫికెట్లు సంపాదిస్తే తప్ప ఆమెకు ఒక స్టార్టప్‌లో ఫుల్-టైం ఉద్యోగం రాలేదు.
ఇప్పుడు సుజుకి, తమ కెరీక్ తిరిగి ప్రారంభించాలనుకుంటున్న మహిళలకు సహాయం అందిస్తున్నారు.
నియామకాల్లో సమస్యలు
ఈ సమస్యలన్నిటికీ ముఖ్య కారణం జపాన్‌లో ఉన్న కఠినమైన నియామక పద్ధతులు.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి జీవితకాల ఉపాధి వ్యవస్థను జపాన్‌లో ప్రవేశపెట్టారు.
ఇది కచ్చితంగా పాటించాలన్న నియమం లేదుగానీ, చాలావరకు పెద్ద పెద్ద కంపెనీలన్నీ ప్రతీ సంవత్సరం కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకుంటూ వారికి జీవితకాల ఉద్యోగ పథకాన్ని అందిస్తున్నాయి.
ఒకవేళ, ఈ అవకాశం కోల్పోతే, మళ్లీ ఏడాది మరొక ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది.
కెరీర్‌లో ఖాళీ కనిపిస్తే ఈ కంపెనీలకు రుచించదు. ఇక్కడంతా సీనియారిటీ ప్రధానంగా నడుస్తుంది. వయసు పెరుగుతున్నకొద్దీ సంస్థల్లో పదవులు పెరుగుతాయి. సామర్థ్యం ఉన్నా లేకపోయినా అనుభవం ఉంటే చాలు ముందుకెళ్లొచ్చు.
"దేశంలో ప్రతిభకు ఎంతగానో కొరత ఉంది. కారణం, అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం" అని కాథీ మాట్సుయ్ అన్నారు.
వుమెనామిక్స్ పదాన్ని తొలుత ప్రయోగించినది కాథీనే. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్‌లో పనిచేస్తున్నప్పుడు ఆమె ఈ పదాన్ని వాడారు.
సమీప భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయని ఆమె భావిస్తున్నారు. ఇప్పుడు యువత చాలా చురుకుగా ఆలోచిస్తున్నారని, ముప్పై ఏళ్ల వరకూ మేనేజర్ పదవి ఇవ్వని కంపెనీల్లో ఉద్యోగాల కోసం అర్రులు చాచట్లేదని, అనుభవం ప్రాధన్యంగా కాకుండా ప్రతిభకు అద్దం పట్టే సంస్థల కోసం చూస్తున్నారని ఆమె అన్నారు.
గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఉద్యోగం మానేసిన తరువాత ఆమె ఎంపవర్ పార్ట్నర్స్ ఫండ్ అనే స్టార్టప్‌లో చేరారు.
"ఈ కొత్త సంస్థలన్నీ ప్రతిభను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. మహిళల్లోనే కాకుండా, వయసు మీరినవారిలో కూడా ప్రతిభ ఉంటే ఉద్యోగాలు ఇస్తున్నాయి" అని ఆమె తెలిపారు.
కొత్త కంపెనీలు, స్టార్టప్‌లలో వస్తున్న మార్పులు..
ఒక హోటల్ గ్రూపులో కంట్రీ మేనేజర్‌గా పనిచేస్తున్న సింథియా ఉసుయ్ కూడా ఇదే మాట అంటున్నారు. తాను పనిచేస్తున్న సంస్థ ‘గృహిణి’ బాధ్యతల నుంచి తప్పుకుని, ఉద్యోగంలోకి వస్తున్న మహిళలను, తల్లులను ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఇలాంటి వారంతా సంప్రదాయ సంస్థల్లో అవకాశాలు పొందడానికి కష్టపడుతున్నారు.
విజయం సాధించాలంటే తమలాగే భిన్న లక్షణాలున్న బృందాలు అవసరమని, ఈ విషయంలో కంపెనీలకు చాయిస్ లేదని తెలిపారు.
ఉసుయ్ కూడా 17 ఏళ్ల పాటు ఇంటి దగ్గర గృహిణిగానే ఉండిపోయారు. 47 ఏళ్ల వయసులో మళ్లీ ఉద్యోగంలో చేరారు. అప్పట్లో ఆమె తన కూతురి స్కూల్ క్యాంటీన్‌లో పనిలోకి చేరారు.
"50, 60 ఏళ్ల వయసులో ఉన్న పురుషుల నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతూ ఉంటుంది. అంతే డబ్బును మహిళల మీద కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్లూ గృహిణిలుగా ఉండిపోయినవారికి, తిరిగి ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి సహాయపడాలి’’ అని ఆమె చెప్పారు.
వుమెనామిక్స్ అంటే దేశం మొత్తం ఆర్థికంగా ఎదగడమని చాలామందికి అర్థం కావట్లేదని ఆమె వాపోయారు.
"ఇదేదో మహిళా హక్కులు, సమానత్వం అని మాత్రమే అనుకుంటున్నారు. అది కూడా. కానీ, ఇది చాలామందికి బోధపడట్లేదు" అని ఉసుయ్ అన్నారు.
జపనీస్ సంస్థలు ఇప్పటివరకు తమ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచే దిశగా బహిరంగ ప్రకటనలు చేయడానికి మొగ్గుచూపడం లేదు.
అయితే, చురుకుగా పనిచేసే బహుళజాతి సంస్థల నుంచి మార్పు మొదలుకావొచ్చు. సాధారణంగా ఈ సంస్థలు జెండర్ సమానత్వం, జీతాల్లో సమానత్వం వంటి విషయాలకు కట్టుబడి ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- జపనీయులకు ఇష్టమైన తెలుగు సినిమా ఇదే
- 'గాడ్‌ఫాదర్ ఆఫ్ సుడోకు' మాకి కాజీ మృతి
- జపాన్ వారికి నాణేలపై ఉన్న మోజు మాటల్లో చెప్పలేం
- రెండో ప్రపంచ యుద్ధం: రాగి గనుల్లో యుద్ధ ఖైదీలను బానిసలుగా హింసించిన చీకటి చరిత్ర
- జపాన్: వీళ్లు ఏడవడం నేర్చుకుంటున్నారు.. ఎందుకు?
- భూకంపం, సునామీ, న్యూక్లియర్ పేలుళ్ల విధ్వంసం నుంచి జపాన్ ఎలా కోలుకుంటోంది?
- ఒలింపిక్స్ పోటీలలో ఆటగాళ్లు నగ్నంగా పాల్గొనే ప్రాచీన గ్రీకు సంప్రదాయం మళ్లీ వస్తుందా?
- సంప్రదాయబద్ధంగా ఉండే మా నాన్న సెక్స్ పుస్తకాలు రాస్తారని నాకు ఎలా తెలిసిందంటే...
- స్టాలిన్ కాలంలో వేలాది మందిని సామూహికంగా ఖననం చేసిన భారీ శ్మశానం
- అఫ్గానిస్తాన్: 'ఓటమి ఎరుగని' పంజ్‌షీర్ లోయ కథ
- జపాన్ దీవుల్లోని కొండకోనల్లో దాగిన ప్రాచీన ఆలయాల విశేషాలు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)