You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సంప్రదాయబద్ధంగా ఉండే మా నాన్న సెక్స్ పుస్తకాలు రాస్తారని నాకు ఎలా తెలిసిందంటే...
- రచయిత, జాన్ కెల్లి, మరియానా డెస్ ఫొర్జెస్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
సారా ఫెయిత్ ఆల్టర్‌మాన్.. తన తండ్రి చాలా తెలివైన వాడని, సంప్రదాయ సిద్ధమైన మనిషని, అలాంటి స్వభావం ఉన్నవారితోనే స్నేహం చేస్తారని భావించేవారు. కానీ తన తండ్రి ఓ రహస్యాన్ని తన దగ్గర దాచినట్లు ఆమెకు చాలా కాలం వరకు తెలియలేదు.
1980లలో అమెరికాలోని బోస్టన్‌లో పుట్టి పెరిగారు సారా. తండ్రి అంటే ఆమెకు ఎంతో ఇష్టం. చిన్నతనంలో తనకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం తండ్రి దగ్గరకే పరుగెత్తేవారు సారా.
''నాకు, నాన్నకు చాలా పోలికలుంటాయి. మేం చాలా అందంగా కూడా ఉంటాం. నేనెప్పుడు నాన్నను అనుకరించడానికి ప్రయత్నించేదానిని'' అని సారా వివరించారు.
భాష మీద మంచి పట్టున్న సారా తండ్రి ఇరా ఆల్టర్‌మాన్ తన కూతురికి, కొడుక్కి కూడా తన భాషా నైపుణ్యాన్ని పంచారు. పిల్లలను అబ్బుర పరుస్తూ పదాలతో గారడీ చేస్తూ కథలు చెప్పేవారు. భాషకు సంబంధించి అనేక పజిళ్లను కూడా పిల్లలతో చేయించేవారు ఇరా.
కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేసిన ఇరా ఆల్టర్‌మాన్ తర్వాత మార్కెటింగ్‌లో అడుగు పెట్టారు.
పిల్లలతో సరదాగా గడిపే ఇరా దంపతులు, వారి ముందు అసభ్యకరమైన, అభ్యంతరకరమైన మాటలు వినిపించకుండా చాలా జాగ్రత్త పడేవారు.
''మా అమ్మానాన్న వేరే లోకం నుంచి వచ్చిన మనుషుల్లా వ్యవహరించే వారు. నాకు 30 ఏళ్లు వచ్చే వరకు మా నాన్న సెక్స్ అనే మాట వాడినట్లు నాకు గుర్తు లేదు'' అన్నారు సారా.
''టీవీలో లవ్ సీన్లు కనిపిస్తే మా నాన్న వెంటనే వీసీఆర్ ఆఫ్ చేసేవారు. టీవీలో అలాంటి దృశ్యాలు కనిపిస్తే పరుగెత్తుకెళ్లి టీవీ స్విచ్‌ను కట్టేసే వారు'' అని గుర్తు చేసుకున్నారు సారా.
ఎందుకు టీవీ ఆపేశావు అని అడిగితే సమాధానం చెప్పేవారు కాదని, అసలు అలాంటి వాతావరణంలో అక్కడ కూర్చోడానికి కూడా ఆయన అసౌకర్యంగా ఫీలయ్యేవారని వెల్లడించారు సారా.
నిజ స్వరూపం
కానీ, కొన్నాళ్ల తర్వాత తండ్రిలో అప్పటి వరకు తాను చూసిన గుణాలను, అభిప్రాయాలను తలకిందులు చేసే ఒక పెద్ద రహస్యం సారాకు తెలిసింది.
ఒక రోజు ఏమీ పొద్దు పోక ఇంట్లోని బుక్ షెల్ఫ్‌లో పుస్తకాలను తిరగేస్తుండగా, ఎక్కడో మూలన, ఎవరికీ కనిపించకుండా పేపర్లలో చుట్టి, దాచినట్లుగా పెట్టిన ఓ పుస్తకాల కట్ట కనిపించింది.
ఇందులో ఏవైనా మంచి పుస్తకాలు ఉన్నాయేమోనని వాటిని విప్పి చూసిన సారాకు తాను గతంలో ఎన్నడూ చూడని, చదవని పుస్తకాలు కనిపించాయి.
పుస్తకం కవర్ పేజీ మీద ఒక మహిళ, కొందరు పురుషులు ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. అలాంటి దృశ్యాలు టీవీలో కనిపిస్తే వెంటనే టీవీ ఆపేసే తండ్రి గుర్తొచ్చారు సారాకు.
ఆ పుస్తకాల టైటిల్స్ మీద దాదాపు ప్రతిదాంట్లో సెక్స్ అనే మాట రాసి ఉంది. ఇంతలో తల్లిదండ్రులు వస్తున్నట్లు శబ్ధం కావడంతో సారా వాటిని యథాస్థానంలో ఉంచేశారు.
‘రచయిత నాన్నే’
ఆ పుస్తకాల మీద రచయితగా తన తండ్రి పేరు ఇరా ఆల్టర్‌మాన్ అని రాసి ఉన్న దృశ్యం సారా కళ్లల్లో మెదులుతోంది. ''నాకసలు ఏమీ అర్ధం కాలేదు. మా నాన్న సెక్స్ గురించి ఇలాంటి పుస్తకాలు రాస్తారని అప్పటి వరకు నాకు తెలియదు'' అన్నారు సారా.
కానీ, 1970ల నుంచి తన తండ్రి ఇరా ఆల్టర్‌మాన్ ఇలాంటి పుస్తకాలు అనేకం రాశారని, మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయని, చాలా భాషల్లోకి ట్రాన్స్‌లేట్ అయ్యాయయని తెలుసుకున్నారు సారా.
ఈ పుస్తకాల గురించి తన తండ్రిని అడగాలని సారా అనుకున్నారు. కానీ అడగలేకపోయారు.
సారా సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్‌లో పాల్గొనడానికి అనుమతి కోరుతూ స్కూలు వాళ్లు పంపిన లేఖపై సంతకం పెడుతూ ఇరా తన కూతురు కళ్లలోకి చూడలేకపోయారు.
''ప్రతి చిన్నారికి జీవితంలో ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని నాకు అర్ధమైంది. చాలామంది పిల్లలు భావిస్తున్నట్లు తమ తల్లిదండ్రులు సూపర్ హీరోలు, అన్నీ తెలిసిన మేధా సంపన్నులు కూడా కాదని తెలుసుకునే సమయం వస్తుంది. మా అమ్మానాన్న సెక్సులో పాల్గొనడం వల్లే తాను పుట్టానని, వాళ్లు ఇప్పటికీ ఆ పని చేస్తున్నారన్న విషయం ప్రతి చిన్నారికి అవగతమవుతుంది'' అన్నారు సారా.
''నేను ఆయన్ను నమ్మడం మానేశాను. ఎందుకంటే రోజూ నాకు కనిపిస్తున్న నాన్నకు, లోపల ఉన్న నాన్నకు చాలా తేడా ఉంది'' అన్నారామె.
ఆడవాళ్లపై దారుణమైన కామెంట్లు
అయితే, టీనేజ్ వయసుకు చేరుకున్న సారా హైస్కూల్‌లో అడుగుపెట్టారు. అయితే, తన ఇంట్లో రహస్యంగా దాచిన ఆ పుస్తకాలను సారా అప్పుడప్పుడు తిరగేసే వారు. ఇప్పుడామెకు బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నారు.
ఇదంతా 1990ల నాటి విషయం. అప్పట్లో తండ్రి రాసిన పుస్తకాలు సారాకు గొప్పగా ఏమీ అనిపించ లేదు.
పైగా అందులో చాలా నెగెటివ్ అంశాలున్నాయి. ముఖ్యంగా అందంగా లేని, బొద్దుగా ఉండే మహిళల గురించి తన తండ్రి రాసిన కామెంట్లు ఆమెకు నచ్చలేదు. ఈ పుస్తకాలలో బ్రిడ్జెట్ అనే లావైన మహిళ గురించి ఇరా అనేక జోక్‌లు వేశారు.
''మా నాన్న ఇలాంటి జోకులు వేశారని, లావుగా ఉన్న మహిళలు సెక్స్‌కు, ప్రేమకు అర్హులు కాదన్నట్లు ఉన్న అభిప్రాయాలు నాకు భయంకరంగా అనిపించాయి'' అన్నారు సారా.
తరువాత రెండు దశాబ్దాలపాటు ఆమె తండ్రికి దగ్గరగానే ఉన్నప్పటికీ, ఈ పుస్తకాల గురించి తండ్రితో చర్చించే అవకాశం మాత్రం సారాకు రాలేదు.
కొన్నాళ్ల తర్వాత శామ్ అనే వ్యక్తిని పెళ్లాడిన సారా, తండ్రి ఉండే ప్రాంతానికి దూరంగా మకాం మార్చారు. తర్వాత ఆమె కూడా ఒక సక్సెస్‌ఫుల్ రచయితగా మారారు.
అయితే సారా తన కెరీర్‌లో ముందుకు దూసుకు పోతున్న సమయంలో ఆమె తండ్రి అందుకు రివర్స్‌లో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.
మళ్లీ మొదటికి..
తన 60వ ఏడు వచ్చేటప్పటికీ ఇరా 30 ఏళ్లుగా చేస్తున్న మార్కెటింగ్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో తండ్రికి సాయం చేయాలనుకున్నారు సారా. కానీ తాను ఇక జాబ్ చేయాలని అనుకోవడం లేదని ఇరా తేల్చి చెప్పారు.
ఇప్పటి వరకు కష్టపడింది చాలని, ఆయన రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారని సారా భావించారు. కానీ తన దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉందని, దాన్ని అమలు చేస్తానని ఇరా ఆల్టర్‌మాన్ కూతురుకు చెప్పారు.
ఇంతకు ముందులా తాను పుస్తకాలు రాయాలని అనుకుంటున్నట్లు బాంబు పేల్చారు. ఈ మాట విని సారా నిశ్చేష్టురాలయ్యారు.
అయితే, ఈసారి కొన్ని పిల్లల పుస్తకాలతోపాటు, సారా రాస్తున్న పుస్తకాల్లాంటివి రాయాలని కోరుకుంటున్నట్లు ఇరా మనసులో మాట చెప్పారు. ఇందుకు నీ సహకారం కావాలి అంటూ కూతురును అభ్యర్ధించారు ఇరా.
సారా ఇటీవల తన పెళ్లినాటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 'ది నాటీ బ్రైడ్' అనే పుస్తకం రాశారు. పెళ్లి రోజు రాత్రి అమ్మాయిలు తమ భర్తలను ఎలా ఆకట్టుకోవాలన్నది ఆ పుస్తక సారాంశం.
తాను కూడా ఆ తరహా పుస్తకాలను రాయాలనుకుంటున్నానని, వాటిని ఒకసారి చదివి రిఫైన్ చేసే బాధ్యత తీసుకోవాలని ఇరా సారాను కోరారు.
అంటే తండ్రి రాసే సెక్స్ పుస్తకాలను సారా ఎడిట్ చేయాలి. ఈ పుస్తకాలలోని కంటెంట్ గురించి ఆయనతో చర్చించాలి. ఈ ఊహే సారాకు భయంకరంగా అనిపించింది.
మొదట తండ్రి ప్రతిపాదనను తిరస్కరించారు సారా. కానీ, తర్వాత ఆమె మనసు మార్చుకున్నారు. దీనికి ఓ బలమైన కారణముంది.
ఆ తర్వాత ఏ జరిగింది?
ఏప్రిల్ 14, 2014 నాటికి ఇరాకు 68 సంవత్సరాలు రాగా, సారాకు 34 సంవత్సరాలు. ఆ రోజు సారాకు తల్లి నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. ఇరాకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందని డాక్టర్ చెప్పినట్లు సారా తల్లి ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.
ఈ వార్త వినే సమయానికి సారా నాలుగో నెల గర్భిణి. పరిస్థితి గురించి తెలుసుకున్న సారా హుటాహుటిన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరారు.
అల్జీమర్స్ గురించి డాక్టర్ ఆమెకు భయంకరమైన విషయాలు చెప్పారు. ఈ వ్యాధి కారణంగా మనుషులు సమాజం గురించిన స్పృహను కోల్పోతారని, ఇంతకు ముందుకన్నా భిన్నంగా ప్రవర్తిస్తారని, చిన్నచిన్న విషయాలను కూడా గుర్తు పెట్టుకోలేక పోతారని, ఒక విధంగా పతనావస్థలోకి వెళ్లిపోతారని డాక్టర్ వెల్లడించారు.
అప్పుడు సారాకు తన తండ్రి చేసిన ప్రతిపాదన గుర్తొచ్చింది. ఆయన అలా ఎందుకు ప్రవర్తించారో అప్పుడు ఆమెకు అర్ధమైంది. అందుకే తండ్రి కోరికను మన్నిస్తూ ఆయన రాసిన పుస్తకాలను ఎడిట్ చేసి ఆయనకు సాయపడాలని నిర్ణయించుకున్నారు సారా.
అయితే, అది కూడా సారాకు ఇబ్బందికరంగానే ఉంది. అందుకే రాతపని వరకు తండ్రికే వదిలేసి, స్క్రిప్ట్ ఎడిట్ చేయడం, ఫీడ్ బ్యాక్ ఇవ్వడానికే పరిమితమయ్యారు సారా.
మారిన నిర్ణయం
అయితే, కొన్నాళ్లకు ఇరా హఠాత్తుగా తన సొంత ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ''నా చిన్నతనంలో నా అన్న, స్నేహితులతో కలిసి ఆడుకున్న ప్రదేశాలను చూడాలి. అక్కడున్న రంగుల రాట్నాన్ని ఎక్కాలి అని నాతో చెప్పారు'' అని వెల్లడించారు సారా.
''బహుశా తన జీవితంలో అవి చివరి రోజులని ఆయనకు అర్ధమైంది. అందుకే చిన్ననాటి జ్జాపకాలను ఒక్కసారి తడుమకోవాలని ఆయన భావించారు'' అన్నారు సారా.
అప్పటికి సారా ఆరు నెలల గర్భవతి. ఇరా తన మనవడి కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఆ చిన్నారి పెరిగి పెద్దవాడు కావడాన్ని తాను చూడలేనని ఇరాకు స్పష్టం తెలుసు. చివరకు ఆయన తన మనవడిని చూశాక 2015 జులై 6న తుది శ్వాస విడిచారు.
ఆ తర్వాత ఆయన రాసిన అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. వాటిలో కొన్ని కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి కూడా.
అయితే, ఆయన మదిలోని మరో ప్రాజెక్టు కూడా ఉండేది. దీంట్లో కూడా తనకు సాయపడాలని ఇరా తన కూతురు సారాను కోరారు. అది, చిన్న పిల్లల కథల పుస్తకాల ప్రాజెక్టు.
''నా చిన్నతనంలో నాకు,అన్నయ్యకు మా నాన్న రకరకాల కథలు చెప్పేవారు. తన అందమైన పదాలతో, మాటల గారడితో రకరకాల కథలు చెప్పి మమ్మల్ని అమితానందంలో ముంచెత్తే వారు. ఆయన కథల్లో రకరకాల, చిత్రవిచిత్రమైన పాత్రలు ఉండేవి'' అన్నారు సారా.
చిన్నతనంలో తండ్రి తనకు చెప్పిన కథలను ప్రచురించడంలో తల్లి కూడా సారాకు సాయపడ్డారు. ''నేను మళ్లీ ఓ చిన్న పిల్లలా మారి, మా నాన్న చెప్పే అద్భుతమైన కథలలో లీనమైపోయినట్లు అనిపించింది'' అన్నారు సారా.
సారా తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి ''లెట్స్ నెవర్ టాక్ అబౌట్ అగైన్'' అనే జ్ఞాపకాల పుస్తకాన్ని రాశారు. చివరలో ''ది బాయ్ విత్ ది అగ్లీ స్వెటర్'' అనే కథను చేర్చారు సారా.
ఈ కథ ఇరా తన పిల్లలకు వారి చిన్నతనంలో చెప్పారు.
ఇందులో ప్రధాన పాత్రకు సారా తన కొడుకు కోలిన్ పేరు పెట్టారు. తన తాత ఎవరో కోలిన్‌కు తెలియనప్పటికీ ఆయన కథలో మాత్రం కోలిన్ చేరిపోయాడు.
‘‘మనుమళ్లతో అనుబంధం కోసం మేం ఆయన కోరికను ఈ విధంగా నెరవేర్చాం'' అన్నారు సారా.
ఇవి కూడా చదవండి:
- అమెరికా: బానిసత్వంలో మగ్గిన నల్ల జాతీయులకు పరిహారమే పరిష్కారమా?
- మోదీకి ప్రజాదరణ ఒక్కసారిగా ఎందుకు తగ్గింది
- కోవిడ్-19 అంతమయ్యే నాటికి భారత్‌లో డయాబెటిస్ సునామీ వస్తుందా?
- కరోనావైరస్: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ ఎలా సిద్ధం అవుతోంది?
- బ్రిటన్‌లోని భారతీయులు దైవభాష సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు?
- బ్రిటన్, అమెరికాల్లో క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- గూగుల్ సెర్చ్‌లో 'వివక్ష': రూ.136 కోట్లు జరిమానా
- 'దళితుల కోసం ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక పార్టీ'
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- ఈ దళిత విద్యార్థి ఎందుకు గుజరాత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)