చైనా కమ్యూనిస్ట్‌ పార్టీకి వందేళ్లు: తమతో పెట్టుకుంటే 'ఉక్కు గోడకు తల బాదుకున్నట్లే' అన్న జిన్‌పింగ్

తమను బెదిరించాలని, ప్రభావితం చేయాలని చూసే విదేశీ శక్తుల తల పగలడం ఖాయమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీవ్రంగా హెచ్చరించారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం తన ప్రసంగంలో ఆయన.. 'బీజింగ్‌కు హితబోధలు చేయొద్దు' అంటూ అమెరికాను ఉద్దేశించి అన్నారు.

హాంకాంగ్‌లో చైనా మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కోవిడ్, గూఢచర్యం, వాణిజ్యం తదితర అంశాల నేపథ్యంలో ఇటీవల కొన్నేళ్లుగా అమెరికా, చైనాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

తైవాన్ అంశం కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణమే. ప్రజాస్వామ్య తైవాన్ దేశం తనను సార్వభౌమ దేశంగా చెబుతుండగా చైనా మాత్రం ఆ ద్వీపాన్ని తమతో విడిపోయిన రాష్ట్రంగా చూస్తోంది.

జిన్‌పియాంగ్ తన తాజా ప్రసంగంలో ఈ అంశం ప్రస్తావిస్తూ తైవాన్ ఏకీకరణకు చైనా కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

''దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను కాపాడుకోవడంలో చైనా ప్రజల సంకల్ప శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయరాద''ని జిన్ పింగ్ అన్నారు.

బీజింగ్‌లో గురువారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సైనిక విమానాల విన్యాసాలు అందరినీ అలరించాయి. దేశ భక్తి గీతాలు ఆలపించారు. చాలా మంది మాస్క్‌లు లేకుండానే ఈ వేడుకలకు హాజరయ్యారు.

ఒక గంట పాటు మాట్లాడిన జిన్‌పింగ్‌ ఆధునిక చైనా నిర్మాణంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్రను పునరుద్ఘాటించారు.

దేశాభివృద్ధిలో పార్టీయే కీలకమని.. ప్రజల నుంచి పార్టీని వేరు చేసే ప్రయత్నాలేవైనా విఫలమవుతాయని ఆయన చెప్పారు.

'సోషలిజం మాత్రమే చైనాను రక్షించగలదు. చైనా లక్షణాలతో ఉన్న సోషలిజం మాత్రమే చైనాను అభివృద్ధి చేయగలదు' అని తెలిపారు.

'చైనాను బెదిరించాలని, అణచివేయాలని, లొగదీసుకోవాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోం' అని ఆయన హెచ్చరించారు.

ఎవరైనా అలా చేయడానికి ధైర్యం చేస్తే 140 కోట్ల చైనా ప్రజలు సృష్టించిన 'గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ స్టీల్‌'తో తలపడి తలలు నెత్తుటిమయం అవుతాయని జిన్​పింగ్​ వ్యాఖ్యానించారు.

చైనా వృద్ధికి అడ్డుపడుతన్నారంటూ అమెరికాను ఉద్దేశించి పదే పదే ఆరోపణలు గుప్పించారు.

హాంకాంగ్, మకావు రెండూ స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. 'ఒక దేశం, రెండు వ్యవస్థలు' సూత్రాలను వీరు కచ్చితంగా అమలు చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)