You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులు: ‘లోదుస్తులు లేకుండా పోజ్ ఇమ్మని అడిగారు’
- రచయిత, విక్టోరియా ప్రిసెడ్స్కాయా
- హోదా, బీబీసీ యుక్రెయిన్
తను 12 సంవత్సరాల అమ్మాయి. తన పేరు ఐలోనా. ఎప్పుడూ చలాకీగా ఉండేది. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఉండేది.
కానీ కొన్ని నెలల క్రితం తన ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. చిన్న విషయానికే బాగా భయపడేది.
తీవ్రమైన ఆందోళనకు గురవుతూ ఉండేది. కొన్నిసార్లు తలుపులు బిగించుకుని గదిలోనే ఉండిపోవడం, భోజనం మానేయడం, ఇంట్లో వాళ్లతో మాట్లాడక పోవడం లాంటివి చేస్తూ ఉండేది.
"ఒక్కొక్కసారి పిచ్చెక్కినట్లు నవ్వుతూ ఉండేది. నన్ను ఎప్పుడూ గట్టిగా కౌగలించుకుంటూ ఉండేది" అని ఆ పాప తల్లి ఒక్సానా చెప్పారు. (వీరిద్దరి పేర్లు మార్చాం)
ఇలా ఆరు నెలల పాటు కొనసాగింది. ఆ సమయంలో చిన్నారి అనుభవించిన నిద్రలేని రాత్రులు, ఎదుర్కొన్న వేధింపులను ఐలోనా తల్లి బీబీసీకి వివరించారు.
ఫోన్‌తో అలా మొదలైంది..
ఇదంతా యుక్రెయిన్‌లో కోవిడ్ తొలి వేవ్‌కు ముందే మొదలయింది.
"టీనేజ్‌లో ఉన్న పిల్లలు తమకు స్వేచ్ఛ కావాలని, తమకంటూ ఒక స్పేస్ కావాలని ఎప్పుడూ పోరాడుతూ ఉంటారు. దాంతో మేము మా అమ్మాయికి కూడా తనకి కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చాం. తనను నమ్మకుండా ఉండటానికి మా దగ్గర ఎటువంటి కారణాలూ లేవు"
కానీ ఎప్పుడూ తుళ్ళుతూ, గెంతుతూ ఉండే అమ్మాయిలో మార్పు రావడాన్ని తల్లి గమనించడం మొదలు పెట్టారు. ముందు ఆ పాపకు మొబైల్ ఫోన్‌తో వ్యసనం మొదలయింది.
ఫోన్ వాడటం తగ్గించమని చెప్పినప్పుడల్లా ఐలోనాకు చాలా కోపం వచ్చేది.
"ఫోన్ పట్ల వ్యామోహం పెంచుకుని పదే పదే ఫోన్ చెక్ చేస్తూ ఉండేది. దాంతో తను ఎవరితోనో చాటింగ్ చేస్తోందని నాకర్థమైపోయింది. ఇదే తంతు రాత్రి పూట కూడా జరుగుతోందని తెలిసింది" అని ఒక్సానా చెప్పారు.
ఒక్కసారిగా మారిన ఐలోనా ప్రవర్తన
అకస్మాత్తుగా ఐలోనా మానసిక ఆరోగ్యం క్షీణించడం మొదలయింది.
"గదికే అంకితమైపోయింది. ఎక్కడికీ వెళ్లాలని లేదని చెప్పేది. తనకు ఒంట్లో బాలేదని చెబుతూ ఉండేది. కానీ అసలు విషయం మాత్రం అప్పుడు చెప్పలేదు" అని ఒక్సానా అన్నారు.
"యుక్రెయిన్‌లో లాక్‌డౌన్ విధించిన తొలి వారాల్లోనే ఇదంతా జరిగింది. నేను, నా భర్త ఒకవైపు మా ఉద్యోగాలు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాం. దాంతో మేము మా అమ్మాయి మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు"
"ఒకరోజు రాత్రి తను నిస్సహాయంగా ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది. నిన్నెవరైనా శారీరకంగా గాయపరిచారా అని అడిగాను. లేదమ్మా అంటూనే గాయపరుస్తారేమోనని భయంగా ఉంది అని చెప్పింది" అని ఒక్సానా వివరించారు.
ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొన్ని రోజుల పాటు నేను తనకు మంచి మాటలు చెప్పాల్సి వచ్చింది.
తియ్యని మాటలతో ముగ్గులోకి..
"ఆ అబ్బాయి అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. ఐలోనాను చాలా ప్రశంసించాడు. తను సులభంగా మోడల్ అవ్వగలదని అస్తమానూ చెప్పేవాడు. కొన్ని వారాల తర్వాత వారిద్దరూ వీడియో లింకులు, మ్యూజిక్ కూడా షేర్ చేసుకున్నారు. ఇక రాత్రంతా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు"
ఏ విషయాన్నైనా ఆ అబ్బాయితో షేర్ చేసుకోగలిగేటంత సాన్నిహిత్యం తమ మధ్య పెరిగిందని, వారి అభిరుచులు చాలా దగ్గరగా అనిపించేవని మా అమ్మాయి చెప్పింది.
ఒకసారి అకస్మాత్తుగా ఆ అబ్బాయి మెసేజ్‌లు పంపడం మానేశాడు. దాంతో ఆ అబ్బాయి సహచర్యం లేకపోవడాన్ని లోటుగా భావించింది ఐలోనా. తాను చేసిన తప్పేమిటో చెప్పమంటూ అతనికి మెసేజ్‌లు చేస్తూనే ఉంది.
చివరకు ఒక రోజు ఆ అబ్బాయి సమాధానమిచ్చాడు.
"నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అనుకోవడం లేదు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాతో మరింత స్వేచ్ఛగా ఉండేదానివి. నువ్వు నీ ప్రేమను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అంటూ మెసేజ్ చేశాడు.
అమ్మాయి ఫొటోలు, వీడియోలు షేర్ చేయమన్నాడు
ముందు అమ్మాయి ఫొటోలు, వీడియోలు షేర్ చేయమని అడిగాడు.
"నీ పుట్టినరోజు నాడు బహుమతిగా అందుకున్న కొత్త పైజామాలు చూపిస్తావా" అని అడిగాడు.
"నువ్వు వ్యాయామం చేసే ముందు ఎలా వార్మ్ అప్ అవుతావో చూపిస్తావా?" అని ప్రశ్నించాడు.
కానీ కాలం గడుస్తున్న కొద్దీ, ఆ అబ్బాయి కోరికలు పెరిగిపోసాగాయి. లోదుస్తులతో పోజ్ ఇమ్మని, ఆ తర్వాత లోదుస్తులు లేకుండా పోజ్ ఇమ్మని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు.
ఆ తర్వాత స్నానం చేస్తున్నప్పుడు లైవ్ స్ట్రీమ్ చేయమని అడిగేవాడు.
ఆమె తిరస్కరించిన ప్రతిసారీ సంభాషణ స్వరూపం మారిపోయేది.
తన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని, తల్లిదండ్రులకు కూడా పంపిస్తానని ఆమెకు బెదిరింపులు వచ్చేవి.
ఆమె పంపిన ఫోటోలు యుక్రెయిన్ చట్టాల ప్రకారం చట్టవ్యతిరేకమని, వాటన్నింటినీ పోలీసులకు ఇస్తానని కూడా సందేశాలు వచ్చేవి.
ఇలాంటి బెదిరింపు సందేశాలు రకరకాల అకౌంట్ల నుంచి వచ్చేవి.
ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసని, ఏ స్కూల్‌కి వెళ్తుందో కూడా తెలుసని ఆ సందేశాల్లో బెదిరించేవాళ్లు.
ఈ సందేశాలన్నీ ఒక బృందం సభ్యుల నుంచి వచ్చి ఉండవచ్చని, ఒక్క వ్యక్తి దగ్గర నుంచి మాత్రం కాదని చిన్నారి తల్లి తల్లి ఒక్సానా అనుమానిస్తున్నారు.
ఈ బెదిరింపులు ఆగాలంటే వాళ్లతో డేటింగ్‌కు రావాలని చెప్పారు. ఎవరూ ఆమెను బాధపెట్టరని, ఇందులో భయపడాల్సిందేం లేదన్నారు.
"ఆ సమయంలోనే తను ఇవన్నీ నాతో చెప్పింది" అని ఒక్సానా తెలిపారు.
"వాళ్లను కలిసి ఉంటే ఏం జరిగి ఉండేదో ఆలోచిస్తేనే భయమేస్తోంది" అని ఆమె అన్నారు.
అల్గారిథమే కేటుగాళ్లకు ఆసరా
ఆన్‌లైన్‌లో నేరస్థులు లైంగిక వేధింపులకు పాల్పడే ముందు సోషల్ మీడియాలో నమ్మకంగా ప్రవర్తిస్తారు. ఐలోనా ఆన్‌లైన్ గ్రూమింగ్ బాధితురాలు.
సోషల్ మీడియా వేదికలైన ఇన్స్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లికీ, టిక్ టాక్ లాంటి వేదికలు వయసు, లింగం, స్థలం, అభిరుచుల ఆధారంగా స్నేహితులను కనుగొనేందుకు వీలైన అల్గారిథింలను ఉపయోగిస్తాయి.
కానీ ఇలాంటి అల్గారిథింలు చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో మోసగాళ్లకు కూడా సహకరిస్తాయి.
దీని వల్ల నేరస్థులు రకరకాల అకౌంట్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి అవతల వాళ్ల అభిరుచులకు అనుగుణంగా ఉండే ప్రొఫైల్‌ను సృష్టించుకుంటారు. దీంతో ఎవరినైనా మోసం చేయడం సులభం అవుతుంది.
ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియా వేదికల్లో మీ మనసులో ఏముంది? లాంటి ప్రశ్నల వల్ల కూడా వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని బాలల హక్కుల ఉద్యమకర్తలు అంటున్నారు. ఇలాంటి ప్రశ్నల వల్ల మానసికంగా బలహీనంగా ఉన్నవారిని నేరస్థులు సులభంగా లక్ష్యం చేసుకోగలుగుతారు.
కొన్ని లక్షల మంది యువత గతంలో ఎన్నడూ లేనంత సమయం స్కూలు పాఠాలు, గేమ్స్, లేదా స్నేహితులతో మాట్లాడటం కోసం ఆన్‌లైన్‌లోనే గడపడం మొదలుపెట్టారు.
ఆన్‌లైన్‌లో పిల్లలపై వేధింపులు పెరగడానికి ఇది కూడా ఒక కారణం అని ది ఇంటర్నెట్ వాచ్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ చెప్పింది.
లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ ముప్పు గురించి చేసిన పరిశోధనలో యుక్రెయిన్ స్వచ్చంద సంస్థ చైల్డ్ రెస్క్యూ సర్వీస్, బాలల హక్కుల కమిషన్‌తో కలిసి 6-17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 7000 మంది పిల్లలను ఇంటర్వ్యూ చేసింది.
తమ శరీరం గురించి వ్యక్తిగత ప్రశ్నలు లేదంటే శరీరాన్ని బహిర్గతపరిచే ఫొటోలను షేర్ చేయమని తమను అడిగారని ఆ పిల్లల్లో ప్రతి నలుగురిలో ఒక్కరు చెప్పారు.
ఈ అధ్యయనంలో బయటపడిన ఫలితాలను చూసి భయమేసిందని అధ్యయన కర్త డాక్టర్ ఒలేనా అన్నారు. 10 - 17 సంవత్సరాల మధ్య వారిలో వేధింపులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
కెమెరా ముందు వారి శరీర భాగాలను తాకుతూ చూపించమని కొందరిని అడిగారు. అపరిచిత వ్యక్తులను కలవాలంటూ మరికొందరికి సందేశాలు వచ్చాయి.
"ఇవన్నీ చాలా ఇబ్బందికర విషయాలు కావడంతో వీటి గురించి సగంమంది పిల్లలు ఎవరితోనూ చెప్పలేదు. ఇది అన్నిటికంటే ఆందోళన కలిగించే విషయం" అని ఒలేనా అన్నారు.
పిల్లలు చాలాసార్లు ప్రమాదకరమైన పరిస్థితులను గుర్తించలేరు. ఆన్‌లైన్‌లో పొంచి ఉన్న ముప్పు నిజ జీవితంలో లైంగిక వేధింపులకు దారి తీయవచ్చు. దీని గురించి తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులు జాగ్రత్త వహించాలని సూచించారు.
పెరిగిన జూమ్ బాంబింగ్స్
కరోనాకాలంలో చదువు, శిక్షణ అంతా ఆన్‌లైన్‌కు మారిపోవడం కూడా యువతకు ముప్పు తెచ్చిపెట్టింది.
"జూమ్‌లో అకస్మాత్తుగా జరిగే జూమ్ బాంబింగ్స్ పెరిగాయి" అని యుక్రెయిన్ సైబర్ పోలీస్ చీఫ్ కెప్టెన్ రోమన్ సోచకా చెప్పారు.
అయితే స్క్రీన్ షాట్‌లు కానీ అదనపు ఆధారాలు కానీ లేకుండా వాటిని విచారించడం చాలా కష్టమని చెప్పారు.
జూమ్ సమావేశాలు జరుగుతుండగా అకస్మాత్తుగా సంబంధం లేని వ్యక్తులు హాజరు కావడాన్ని జూమ్ బాంబింగ్స్ అని అంటారు.
ఆన్‌లైన్ క్లాసులో పోర్న్ వీడియో ప్లే చేశారు
మరియా కుమారుడు ఆన్‌లైన్ క్లాసులకు హాజరైన సమయంలో కనీసం ఒక డజనుసార్లకు పైగా జూమ్ బాంబింగ్స్ జరిగినట్లు చెప్పారు.
మొదటిసారి, వాళ్ల తరగతిలో ముగ్గురు అపరిచితులు జూమ్ ద్వారా చేరారు. వాళ్లు.. పిల్లల పేర్లను బిగ్గరగా అరవడం లాంటివి చేసేవారు. టీచర్ కూడా దిగ్భ్రాంతికి గురై జూమ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. పిల్లలు ఆ అపరిచితులతో జూమ్ క్లాసులో మిగిలిపోయారు.
మరోసారి క్లాస్‌లో పిల్లలందరికీ ఎవరో పోర్నోగ్రఫీ వీడియో ప్లే చేసినట్లు మరియా 11 సంవత్సరాల కొడుకు చెప్పాడు.
ఇంకొకసారి ఒక పురుషుడు నగ్నంగా స్క్రీన్ ముందు నిల్చుని హస్త ప్రయోగం చేసుకుంటున్నట్లు కనిపించారని చెప్పాడు.
స్కూల్ విద్యార్థులే జూమ్ పాస్‌వర్డ్‌ను నేరస్థులతో షేర్ చేసి ఉంటారని భావిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు.
అయితే ఆన్‌లైన్ క్లాసుల్లో జూమ్ బాంబింగ్స్ చాలా సాధారణంగా మారిపోయాయి అని పోలీసులు చెబుతున్నారు.
మరియా పిల్లల లాంటి వారికి ఒక అసభ్యకరమైన దృశ్యాన్ని చూడవలసిన పరిస్థితి ఎదురయింది. ఇది చాలా తీవ్రమైన నేరం. కానీ ఈ అంశంపై ఎవరూ క్రిమినల్ కేసు పెట్టలేదు.
బయటకు వెళ్లడానికి ఇప్పటికీ భయపడుతోంది
"మేము ఫోన్ నెంబర్ మార్చేసి, అన్ని సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసేశాం. కానీ తను బయటకు వెళ్లడానికి ఇంకా భయపడుతూనే ఉంది. ఇంట్లోనే ఒంటరిగా ఉంటోంది" అని ఐలోనా తల్లి ఒక్సానా చెప్పారు.
"జరిగిన దానికి తను చాలా సిగ్గుపడుతోంది. ఇది ఆమె భవిష్యత్తులో ఏర్పరుచుకునే బంధాలు, ఎవరినైనా నమ్మే విషయంలో ప్రభావం చూపిస్తుందేమోనని భయపడుతున్నాను" అని ఒక్సానా అన్నారు.
"ఆన్‌లైన్‌లో జరిగే వేధింపుల స్వభావం వల్ల ఇంటర్నెట్‌లో ఫొటోలు విస్తృతంగా షేర్ అయిపోతాయి. ఇది బాధితులను తీవ్రమైన ఆందోళనలోకి నెట్టేస్తుంది" అని చైల్డ్ థెరపిస్ట్ డాక్టర్ ఒలేనా నాగుల చెప్పారు.
"వేధింపులకు గురైన పిల్లలు నిద్ర సమస్యలు, దడ, ఆత్మహత్య ఆలోచనలు కలిగి, స్వీయ హాని చేసుకునే అవకాశం కూడా ఉంటుంది" అని డాక్టర్ నాగుల చెప్పారు.
ఈ వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండేలా చూస్తామని సోషల్ మీడియా వేదికల యాజమాన్యాలన్నీ ఎప్పటి నుంచో చెబుతున్నాయి.
హానికరమైన సమాచారాన్ని, హాని తలపెట్టేవారిని తొలగించేందుకు చాలా రకాల టూల్స్ తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అలాంటి సమాచారం అప్‌లోడ్ అవ్వకుండా చూసేందుకు తగినన్ని ప్రయత్నాలు జరగటం లేదని బాలల హక్కుల బృందాలు అంటున్నాయి.
పిల్లల వయసును నిర్ధరించే విషయం అన్నిటి కంటే వివాదాస్పదంగా ఉంది. చాలా సోషల్ మీడియా వేదికలు యూజర్లకు 13 సంవత్సరాలు ఉండాలనే నిబంధన పెడతాయి. కానీ దాన్ని సక్రమంగా అమలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
యుక్రెయిన్‌లో 6 - 11 సంవత్సరాలు ఉన్న మూడు వంతుల మంది పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ అకౌంట్‌లు ఉన్నట్లు చైల్డ్ రెస్క్యూ సర్వీస్ నివేదిక తెలిపింది.
ఈ అకౌంట్లు తయారు చేసుకునేటప్పుడు పిల్లలు తప్పుడు వయసును ఎంటర్ చేస్తారని ఈ నివేదిక తెలిపింది.
సంరక్షకులు ఏం చేయగలరు?
కరోనావైరస్ లాక్‌డౌన్‌లో పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
ఆన్‌లైన్‌లో స్నేహితులతో సంబంధాలు కొనసాగించడం లాంటివి చేస్తున్నారు.
కానీ వారు ఆన్‌లైన్‌లో ఎటువంటి ఇబ్బందికర సందర్భాన్ని ఎదుర్కొన్నా వాటి గురించి చర్చించేందుకు ఎవరైనా పెద్దవాళ్లు ఉండటం చాలా అవసరం.
పిల్లలు ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారో అడిగి తెలుసుకుంటూ ఉండాలి. సోషల్ మీడియాలో ఏమి చేయడానికి ఇష్టపడతారో కూడా అడగాలి.
సోషల్ మీడియాలో ఎటువంటి చిత్రాలను చూస్తున్నారు, ఏ ఫొటోలను షేర్ చేస్తున్నారో తెలుసుకోవాలి.
యువత ఆన్‌లైన్‌లో గడుపుతున్న జీవితం పట్ల నమ్మకం, ఆసక్తి చూపించడమే వారిని సురక్షితంగా ఉంచేందుకు మార్గంగా పని చేస్తుంది.
ఇలస్ట్రేషన్స్: ఒలేస్యా వోల్కోవా
ఇవి కూడా చదవండి:
- నకిలీ వ్యాక్సీన్లు: కరోనా టీకాలకూ తప్పని నకిలీల బెడద.. సోషల్ మీడియాలో అమ్మకం..
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- కోవిడ్-19: 'మమ్మల్ని తీసుకువెళ్లి యుద్ధభూమిలో పడేశారు' - జూనియర్ డాక్టర్లు
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)