You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఓల్డ్ కాయిన్స్: ‘పాత రూపాయి నాణేనికి రూ. 25 లక్షలు... 5, 10 రూపాయల కాయిన్స్ ఉన్నా మీరు లక్షాధికారే’ – ఇందులో నిజమెంత?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
'పాత రూ.5, రూ .10 కాయిన్స్‌తో ఈజీగా లక్షలు సంపాదించొచ్చు', 'పాత రూపాయి నాణానికి కూడా లక్షల రూపాయలు ఇస్తారు' - ఇలాంటి కథనాలు మీ కంటపడే ఉంటాయి.
పాత కాయిన్స్‌కు నిజంగానే లక్షల రూపాయలు ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎందుకిస్తారు? ఆ కాయిన్స్ మీ దగ్గరుంటే ఏం చేయొచ్చు? ఈ వ్యవహారంలో మోసాలు జరగొచ్చా.. ఇలాంటి ఎన్నో అనుమానాలు సహజంగా వస్తుంటాయి.
పాత నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ. మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు.
కొందరైతే ఈ పాత నాణేలను దేశం నలుమూలల నుంచి సేకరిస్తారు. దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకాడరు. వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంటారు.
అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ దగ్గరున్న నాణేలను అమ్మేందుకు ఈ-కామర్స్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో క్రయ విక్రయాలు
పాత కాయిన్ల క్రయ విక్రయాలన్నీ ఎక్కువశాతం ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్నాయి.
ఇందులో అమ్మేవారు నాణేలకు ఒక ధర నిర్ణయిస్తే, కొనే వారు తమ కొనుగోలు ధరను చెబుతారు. ఇలాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ఉంటారు.
వివిధ ట్రేడింగ్ కంపెనీలు, అసోసియేట్స్ పేరుతో అన్‌లైన్ సైట్లలో తమ ఆఫర్ ధరలను పెడుతున్నాయి. ఆ ధరలతో పాటు వారు ఎటువంటి నాణేలను, నోట్లను కోరుకుంటున్నారో కూడా స్పష్టంగా చెబుతున్నారు.
అయితే ఇదంతా కూడా అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరైతే ఆయా వెబ్‌సైట్లలో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఈ వివరాలను చూడగలరు.
థర్డ్ పార్టీకి బాధ్యత ఉండదు...
ఇండియామార్ట్, క్వికర్, ఎర్న్ మనీ, కాయిన్ బజార్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్‌సైట్‌లలో అకౌంట్‌ను ఓపెన్ చేయాలి.
తర్వాత ఎవరికి వారే ఓల్డ్ కాయిన్స్ , కరెన్సీ నోట్లు అమ్ముతామనో, కొంటామనో లేదా రెండు చేస్తామనో వివరాలను తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణేలను లేదా నోట్ల వివరాలను, కోరుకుంటున్న విలువను తెలియజేస్తూ వివరాలను అప్‌లోడ్ చేయాలి.
ఇవన్నీ ఒక ఐడీ పేరుతో కనిపిస్తుంటాయి. ఆసక్తి ఉన్న వారు ఈ ఐడీతో సంప్రదింపులు జరుపుతారు. ఇదంతా వారిద్దరి మధ్యే ఉంటుంది.
మోసాలు ఉంటాయి
ఈ వ్యాపారానికి వేదికగా నిలుస్తున్న ఈ-కామర్స్ వెబ్‌సైట్లు కేవలం థర్డ్ పార్టీగానే వ్యవహరిస్తాయి. అమ్మకం, కొనుగోలు అంశాలతో వాటికి సంబంధం ఉండదు.
ఈ వ్యాపారంలో జరిగే లావాదేవీలకు, మోసాలకు కూడా వారు బాధ్యత వహించరు. ఈ విషయాన్ని ఆ వెబ్‌సైట్ల నియమ నిబంధనల్లో స్పష్టం చేస్తారు.
ఈ వ్యాపారం పేరుతో మోసం చేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. అలాగే మోసపోయిన వారు కూడా ఉన్నారు. ఈ పురాతన నాణేల అమ్మకం, కొనుగోళ్లు కూడా బయ్యర్, సెల్లర్‌ల వ్యక్తిగత విషయమని ఆ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి.
వందేళ్లు దాటిందా...రూ. 25 లక్షలు
ఈ రోజుల్లో ఒక రూపాయికి ఏమోస్తాయంటే రెండు అర్ధ రూపాయిలు వస్తాయి అనేది జోక్. కానీ ఒక రూపాయికి 10లక్షల నుంచి 25 లక్షలు వస్తాయంటున్నారు ఓల్డ్ కాయిన్స్ ట్రేడర్స్.
అయితే, 25 లక్షలు పొందాలంటే ఆ నాణెం కొన్ని 'అర్హత పరీక్షలు' పాస్ కావాల్సి ఉంటుంది. అది సాధారణ నాణెం కాకూడదు. పురాతన నాణెమై ఉండాలి. ఏవైనా అరుదైన సంఘటనలు జరిగిన సంవత్సరానికి సంబంధించినదైనా అవ్వాలి.
ఇదంతా వేలం పద్దతిలో జరుగుతుంది.
నిర్ధిష్టమైన వివరాలతో కూడిన నోట్లు, నాణేలు ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు తిరుగుతూ ఉంటాయి. వాటిని చూసిన వారు, వారి వద్ద నాణేలు, నోట్లు ఉంటే వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తారు.
ఇలా అప్‌లోడ్ చేసిన విశాఖపట్నానికి చెందిన మల్లేష్ బీబీసీతో మాట్లాడారు.
"మా ఇంట్లో పాత రెండు రూపాయల కాయిన్ ఉంటే నేను కూడా ఒక వెబ్‌సైట్లో పెట్టాను. అది నిజంగా ఎవరైనా కొంటారో, కొనరో తెలియదు కానీ, ఇప్పటి వరకైతే నన్నెవరూ సంప్రదించలేదు"
బహుశా నేను పెట్టిన రెండు రూపాయల కాయిన్ బయ్యర్లకు కావాల్సిన స్పెసిఫికేషన్లలో లేదేమో. గతంలో కూడా పాత రేడియోకు 10లక్షలు అంటే అప్పుడు కూడా ప్రయత్నం చేశాను. వాటికి, వీటికి ఖర్చులంటే నా డబ్బులే కొంత మధ్యవర్తులకు ఇచ్చాను. అయితే ఈ సారి నేను డైరెక్టుగా వెబ్‌సైట్‌లో పెట్టాను" అని మల్లేష్ బీబీసీకి చెప్పారు.
రూపాయిపై 12345 ఉండాలి
ఒక వెబ్‌సైట్‌లో 1913లో తయారైన ఒక రూపాయి నాణెం విలువ రూ.25 లక్షలుగా చూపించింది.
అయితే ఇది వెండితో తయారు చేసి, ఈ నాణెంపై విక్టోరియా రాణి బొమ్మ ముద్రితమై ఉండాలి అని కండిషన్ పెట్టారు.
దీనిని విక్టోరియా కేటగిరీగా పిలుస్తారు.
అలాగే మరో వెబ్‌సైట్‌లో 18వ శతాబ్దపు నాణెం ధర రూ. 10 లక్షలు ఉంది. ఇది 1818 సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణెం. ఇది రాగితో తయారు చేసి ఉండాలి. అలాగే దీనిపై హనుమంతుడి చిత్రం కూడా ఉండాలి.
పాత రూపాయి, రూ. 10, రూ. 100లతో పాటు ఇతర పాత నోట్లకు కూడా మంచి డిమాండ్ ఉంది.
ప్రస్తుతం పాత రూపాయి నోటు విలువ రూ. 45వేలు. పాత రూ.100 నోటును క్వికర్‌లో రూ.50 వేలకు అమ్మకానికి పెట్టారు.
1947 అంటే ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది నాటి రూపాయి నాణేనికి రూ. 10లక్షలకు అమ్ముతున్నట్లు ఈ వెబ్‌సైట్‌లో ప్రకటన ఉంది.
పాత కాయిన్స్, నోట్లకు సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి.
ఫలానా సంవత్సంలో పని చేసిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉన్న, లేదా ఏదైనా సంవత్సరంలో ఫలానా సీరిస్ నోట్లు కావాలంటూ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఉంటున్నాయి.
1957 నాటి రూపాయి నోటు విలువ రూ.45 వేలుగా చెప్పారు. అయితే దానిపై సిరీస్ 12345గా ఉండాలని కండిషన్ పెట్టారు.
అలాగే ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఎస్.కె. వెంకటరమణ సంతకం ఉన్న పాత రూ.500 నోటు ఏకంగా రూ.1.55 లక్షలు పలుకుతోంది. ఈ నోటుపై 1616 సిరీస్ ఉండాలి.
ఇంతే కాకుండా ప్రత్యేక సంవత్సరాలు అంటే...ఇండిపెండెన్స్, మహాత్మాగాంధీ, ఐన్‌స్టీన్ పుట్టిన సంవత్సరాలు ఇలా ప్రత్యేకమైన సందర్భానికి చెందిన నాణెలు, నోట్లు అన్నీ కూడా అమ్మకానికి పెడుతున్నారు.
కొందరికి అభిరుచి...మరి కొందరికి వ్యాపారం...
నాణేల సేకరణ వందల సంవత్సరాల నుంచి జరుగుతోంది. పురాతన నాణేలను, వస్తువులను, చిత్రపటాలను సేకరించేవారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా అభిరుచితో పాటు ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ పనులు చేసేవారు.
అప్పట్లో అది ఒక అభిరుచిగా, తమ హోదాకి చిహ్నంగా భావించేవారు. అయితే ఇప్పుడది వ్యాపారంగా మారింది.
ఈ పరిణామం గురించి ఏయూ ఆర్కియాలజీ విభాగం ప్రొఫెసర్ ఎన్. జాన్ బాబు బీబీసీకి వివరించారు.
"ఇదంతా ఒక రకమైన గొప్పతనాన్ని చూపించుకునే ప్రక్రియ. డబ్బులున్నవారు తమ దగ్గర అపురూపమైన వస్తువులు ఉన్నాయని చెప్పుకోవాలని తాపత్రయపడుతుంటారు. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులు వాడిన వాచీలు, చేతికర్రలు, ఉంగరాలు, అలాగే ఫలానా కాలంనాటి సమాజంలో ఉపయోగించిన వస్తువులు ఇలా అనేక రకాలుగా సేకరించడం చేస్తారు"
ఇదంతా కనిపించని విలువతో చేసే గారడీ అని జాన్ బాబు అభివర్ణించారు.
‘‘పురాతన వస్తువుల వలన చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలా వ్యాపారం చేయడం వలన ఆ వస్తువులకు విలువ పెరగదు. డబ్బులు ఎక్కువగా ఉన్నవారు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపితే, ఆ ఆసక్తినే తమకు వ్యాపార అవకాశంగా మార్చుకుంటారు కొందరు" అని ప్రొఫెసర్ ఎన్. జాన్ బాబు చెప్పారు.
మోసాల్లో నయా ట్రెండ్
ప్రజల్లో ఉన్న ఆశని వాడుకుని మోసం చేసేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు నేరగాళ్లు. గతంలో ఇరీడియం లోహంతో తయారు చేసే విగ్రహాలతో, రైస్ పుల్లింగ్ యంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసేవారు. ఇప్పుడు అది కాస్త తగ్గింది.
ఇప్పుడు ఖరీదైన ఖనిజం, పాత నాణేలు, నోట్లు ఇలాంటి మోసాల ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియా కారణంగా, ఇటువంటి వాటికి ప్రచారం విపరీతంగా జరుగుతోంది.
ఈ మోసాల నుంచి తప్పించుకోవడానికి వాటికి దూరంగా ఉండటం తప్ప మరో మార్గం లేదని లాజిక్ షోర్ ఐటీ ప్రైవేట్ కన్సల్టింగ్ లిమిటెడ్ ఎండీ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.
"పాత నాణేలకు డిమాండ్ అనేది చాలా ఏళ్లుగా ఉంది. అయితే వాటికో ప్రత్యేకత ఉండాలి. అటువంటి వాటిని ఒక చోట చేర్చేందుకు కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లు తమ వేదికల్లో వీటికి ఒక విభాగాన్ని కేటాయించాయి. అయితే ఈ నాణేలు, నోట్ల వ్యాపారానికి అవి బాధ్యత వహించవు. వీటిలో మోసపోయిన వారు ఎవరైనా ఆయా వెబ్‌సైట్లపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించినా అవి నిలవవు" అన్నారాయన.
ఈజీ మనీ కోసం ఆశపడి ట్రాప్‌లో చిక్కుకోవద్దని రామకృష్ణ హెచ్చరించారు.
రూపాయికి 'లక్ష ఇస్తామని చెప్పి...పది వేలు' కొట్టేస్తారు
ప్రజల్లో అప్రమత్తత రానిదే ఈ మోసాలు ఆగవని విశాఖ సైబర్ క్రైమ్స్ పీఎస్ ఇన్స్‌స్పెక్టర్ ఆర్వీఆర్కే చౌదరి చెప్పారు.
"ఈ నాణేలు, నోట్లు లావాదేవీల పేరుతో మోసం చేసేవారు ఉన్నారు. మీ నాణేన్ని మేం కొంటాం. దానికి లక్ష రూపాయల ధర ఇస్తాం. అయితే మనీ ట్రాన్స్‌ఫర్ ఛార్జీల కోసం మాకు 10వేలు పంపండి అని అడుగుతారు. లక్ష వస్తుంటే పదివేలదేముంది అని పంపుతారు. ఆ తర్వాత ఆ ఫోన్ పని చేయదు" అని ఆయన వివరించారు.
ఇటువంటి మోసాలు మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. కర్నాటకలో 1947లో ముద్రించిన ఓ రూపాయి కాయిన్‌ను అమ్మే క్రమంలో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో పడింది.
పాత కాయిన్‌కు రూ. 20లక్షల వరకు ఇస్తామని మహిళకు చెప్పి, టాక్స్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఛార్జీల కోసం రూ.లక్ష పంపాలని అడిగారు. అది నిజమే అనుకుని లక్ష రూపాయలు పంపి మోసపోయిన ఆ మహిళ ఆ తర్వాత సైబర్ పోలీసులను ఆశ్రయించారని చౌదరి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- తంత్ర యోగా పేరుతో శిష్యులపై గురువుల అత్యాచారాలు, శివానంద సెంటర్ గుట్టు బయటపెట్టిన బీబీసీ
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)