You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డెల్లాయిడ్ రాటిఫర్: 24,000 ఏళ్ల కిందట గడ్డకట్టుకుపోయి మళ్లీ ఇప్పుడు బతికింది.. మగ జీవి లేకుండానే పిల్లలను కనే ప్రాణి
24,000 ఏళ్ల కిందటి డెల్లాయిడ్ రాటిఫర్ జీవి సైబీరియాలో కనిపించింది. ఇన్నేళ్లు ఇది గడ్డకట్టుకుపోయి ఉందని, ఇప్పుడే మళ్లీ ప్రాణం పోసుకుందని ఇటీవల ఒక పరిశోధనలో కనుగొన్నారు.
మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలిగే అతి చిన్న జలచరం 'డెల్లాయిడ్ రాటిఫర్' (జలగ లాంటి జీవి). ఇంత చిన్న జీవిలోనూ అనేక కణాలు ఉంటాయి. ఇది చూడ్డానికి జలగలా ఉంటుంది.
ఈ జీవిని శాస్త్రవేత్తలు రష్యన్ ఆర్కిటిక్‌లో ఉన్న అలేజా నదిలో కనుగొన్నారు.
దాని చుట్టూ ఉన్న మంచు కరిగి, మళ్లీ కొత్త ఊపిరిలూదుకున్న తరువాత ఈ జీవి ప్రత్యుత్పత్తి చేయగలిగింది.
ఇలా ఘనీభవించిన స్థితిలో ఉండడాన్ని క్రిప్టోబయోసిస్ అంటారు.
ఈ డెల్లాయిడ్ రాటిఫర్‌కు ఉన్న ప్రత్యేక గుణం ఏమిటంటే వీటిలో మగజీవులు ఉండవు. ఆడజీవులు మాత్రమే ఉంటాయి. ఆడజీవుల్లో ప్రత్యుత్పత్తికి అవసరమైన అండాలు విడుదల అయి, మగజీవి సహాయం లేకుండా వాటంతట అవే పిల్లల్ని కనగలుగుతాయి.
ఇవి గడ్డకట్టుకుపోయిన స్థితిలో 10 ఏళ్లు బతకగలగవని గత పరిశోధనల్లో తేలింది.
కానీ, ఇవి ఈ స్థితిలో వేల సంవత్సరాలు బతకగలవని ఈకొత్త అధ్యయనంలో తేలింది.
ఈ పరిశోధన ఫలితాలను సోమవారం 'కరంట్ బయాలజీ'లో ప్రచురించారు.
"దీన్ని నుంచి మనకు అర్థమవుతున్నదేమిటంటే బహుళ కణ జీవిని గడ్డకట్టుకుపోయే స్థితిలో ఉంచి వేల సంవత్సరాలు బతికించవచ్చు. వాటి చుట్టూ ఉన్న మంచును కరిగించి మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేయవచ్చు" అని స్టాస్ మాలవిన్ ప్రెస్ అసోసియేషన్‌కు తెలిపారు.
మాలవిన్, రష్యాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికోకెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సాయిల్ సైల్స్‌లో శాస్త్రవేత్తగా ఉన్నారు.
అయితే, ఈ జీవి దీన్ని ఎలా సాధించిందో తెలుసుకోవడానికి మరింత పరిశోధన చేయాల్సి ఉందని ఆయన అన్నారు.
అనేక రకాల జీవులను ప్రయోగశాలలో ఘనీభవింపజేసి, మళ్లీ కరిగించి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.
ప్రస్తుతం తవ్వకాల్లో బయటపడిన డెల్లాయిడ్ రాటిఫర్ వయసు 23,960 నుంచి 24,485 సంవత్సరాల మధ్యలో ఉంటుందని రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా కనుగొన్నారు.
డెల్లాయిడ్ రాటిఫర్ మంచి నీటి చెరువుల్లో, సరస్సుల్లో మాత్రమే జీవిస్తుంది. రాటిఫర్ అనే పేరు లాటిన్ నుంచి వచ్చింది. రాటిఫర్ అంటే 'చక్రాలు గలది' అని.
ఈ జీవులు ఎలాంటి విపరీత వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని మనుగడ సాగించగలవు.
తక్కువ ఆక్సిజన్, ఆకలి, అధిక ఆమ్లత, సంవత్సరాల తరబడి డీహైడ్రేషన్ ఉన్నా కూడా అవి జీవించగలవని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఇదే విధంగా, నెమటోడ్ పురుగులు, కొన్ని మొక్కలు, నాచులతో సహా మరెన్నో బహుళ కణ జీవులు వేల సంవత్సరాల తరువాత పునరుజ్జీవం పొందుతున్నాయని కొన్ని రిపోర్టులు తెలుపుతున్నాయి.
ఇవి కూడా చూడండి:
- డైనోసార్ శిలాజాలను కొనడంలో తప్పేముంది?
- ప్రతి నిమిషానికి 4 చెట్ల నరికివేత...గత అయిదేళ్లుగా భారత్‌లో జరిగిన పర్యావరణ ఘోరమిది
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- ఈ పర్వతాలను ఇక ఎవ్వరూ ఎక్కలేరు!!
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
- 124 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ఎంత కష్టమో వీరి కళ్లలోకి చూస్తే తెలుస్తుంది
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
- చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)