You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
'మృత శిశువు'ను ప్రసవించిన తర్వాత మళ్లీ గర్భం దాల్చడానికి ఆలస్యం చేయాల్సిన అవసరం లేదని ఓ అధ్యయనంలో తేలింది.
మృత శిశువును ప్రసవించాక మళ్లీ గర్భం దాల్చడానికి సంవత్సరకాలం ఆగాలని సాధారణంగా వైద్యులు చెబుతారు. కొన్ని ఆధారాలు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి.
కానీ, 14 వేల మందిపై జరిగిన ఓ అంతర్జాతీయ అధ్యయనంలో, సంవత్సరం కంటే ముందు గర్భం దాల్చినా ఇబ్బంది లేదని తేలింది.
ఈ అధ్యయనం ఫలితాలు చాలా ప్రధానమని, దీని ఫలితాలు ఓ భరోసా ఇస్తున్నాయని ఇంగ్లండ్‌కు చెందిన నిపుణుడు అంటున్నారు.
ఇంగ్లండ్‌లోని ప్రతి 225 ప్రసవాల్లో ఒక మృత శిశువు నమోదవుతోంది. అంటే 24వారాల వయసులో శిశువు మరణిస్తోందని విశ్లేషించుకోవచ్చు.
2000 సంవత్సరం నుంచి ఇంగ్లండ్‌లో మృత శిశు జననాలు రానురానూ తగ్గాయి. 2015 నుంచి గణనీయంగా తగ్గాయి. కానీ, ఇతర ఐరోపా దేశాలతో పోల్చుకుంటే ఇంగ్లండ్ ఇంకా వెనుకబడే ఉంది.
చాలా దేశాల్లో మృత శిశువు జన్మించాక, మళ్లీ గర్భం దాల్చడానికి సరైన మార్గదర్శకాలు పరిమితంగానే ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది.
ఈ విషయంలో 'భయపడాల్సిన అవసరం లేదు' అని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అలెక్స్ హీజెల్ అంటున్నారు.
''బిడ్డ మరణించడానికిగల కారణాలను తెలుసుకున్న తర్వాత, మళ్లీ ఎప్పుడు గర్భవతి అవ్వాలన్న ప్రశ్నకంటే, వారు మానసికంగా ఎప్పుడు సిద్ధంగా ఉంటారోనన్నది చాలా అవసరం. ఆ సమయంలో తల్లిపై ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. ఆ ఒత్తిడిని అధిగమించేందుకే కొందరు కాస్త సమయం తీసుకుంటూ ఉండొచ్చు'' అన్నారు.
ఇంతకూ.. ఆగాలా వద్దా?
పశ్చిమ ఆస్ట్రేలియా, ఫిన్లండ్, నార్వేలోని 14,452మంది మహిళలపై ఈ అధ్యయనం చేశారు. వీరంతా 37ఏళ్ల వయసు పైబడ్డవారే. వీరందరూ అంతకుముందు మృత శిశువుకు జన్మనిచ్చినవారే… ఈ మహిళలు మళ్లీ ప్రసవించాక పరిశీలిస్తే, వీరిలో కేవలం 2% మృతశిశువులు జన్మించారు. 18% శిశువులు నెలలు నిండకముందే జన్మించారు. 9%మంది శిశువులు ఉండాల్సిన బరువుకంటే కాస్త తక్కువ బరువుతో జన్మించారు.
మృత శిశువును ప్రసవించిన 2-3ఏళ్ల వ్యవధిలో మళ్లీ గర్భం దాల్చిన మహిళలతో పోలిస్తే, కేవలం 12నెలల వ్యవధిలో గర్భం దాల్చిన మహిళలకు మృత శిశువులు, నెలలు నిండకముందే ప్రసవాలు నమోదు కాలేదని అధ్యయనం గుర్తించింది.
ఈ మొత్తం మహిళల్లో 9,109మంది అంటే.. 63%మంది మహిళలు, మృత శిశువు జననం తర్వాత కేవలం 12నెలల వ్యవధిలోనే మళ్లీ గర్భం దాల్చారు.
మృత శిశువు జననం తర్వాత మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఈ ఫలితాలు ఉపయోగపడతాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అన్నెట్టే రీగన్ అన్నారు. ఈమె ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీకి చెందినవారు.
ఒక ప్రసవం నుంచి పూర్తిగా కోలుకోకముందే మరోసారి గర్భం దాల్చే మహిళల్లో, 'పౌష్టికాహార స్థాయిలు తక్కువగా ఉండటంతో, పిండం ఎదుగుదలపై దాని ప్రభావం పడుతుందని, దీంతోపాటు ప్రసవం సమయంలో సమస్యలు తలెత్తుతాయని డా.రీగాన్ చెబుతున్నారు.
కానీ ఈ కారణాలేవీ.. అబార్షన్లకు, మృత శిశువు జన్మించడానికి దారితీయవని వివరించారు.
ఈ అధ్యయనం గురించి మాట్లాడుతూ, ఇందులో గమనించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయని, అమెరికాకు చెందిన డా.మార్క్ ఎ క్లెబనాఫ్ అన్నారు.
''అన్నిటికీ మించి వైద్యులు.. మృత శిశువును ప్రసవించిన మహిళ మానసిక స్థితి గురించి ఆలోచించాలి. ఆమె వయసు, పిల్లల పట్ల ఆమె ఆసక్తి, కుటుంబ పరిస్థితులు, అన్నిటికీ మించి.. ఓ శిశువును కోల్పోయిన తర్వాత, మళ్లీ గర్భం దాల్చడానికి ఆమె మానసికంగా సిద్ధంగా ఉన్నారా? అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి'' అన్నారు.
మృత శిశువు అంటే ఏమిటి?
- గర్భానికి 24వారాల వయసు పూర్తయ్యాక ప్రాణం లేకుండా పుట్టిన బిడ్డను మృత శిశువు అంటారు.
- 24వారాల వయసు పూర్తవ్వకుండా గర్భంలోని శిశువు మరణిస్తే, అబార్షన్ అంటారు.
- కొందరు గర్భవతుల్లో ఆరోగ్య సమస్యలు, మాయ లేదా ప్లేసెంటా సమస్యలు కూడా మృత శిశు జననాలకు దారితీస్తాయి. మరికొందరు మహిళల్లో ఇలాంటి జననాలకు ఎలాంటి కారణాలు కనిపించలేదు.
(ఆధారం: ఎన్.హెచ్.ఎస్)
ఇవి కూడా చదవండి:
- హ్యాకింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న శాంటియాగో లోపెజ్
- డ్రాగన్ కాప్స్యూల్: అంతరిక్ష కేంద్రానికి ప్రయోగాత్మక ప్రయాణం షురూ
- భారత్-పాకిస్తాన్: ఒక భారతీయ యుద్ధ వితంతువు కథ
- బిన్ లాడెన్: ఒసామా కొడుకు హమ్జా సమాచారం ఇస్తే 10 లక్షల డాలర్ల రివార్డు
- ఎఫ్-16లను భారత్‌పై ఎందుకు ప్రయోగించారు? - పాక్‌ను ప్రశ్నించిన అమెరికా
- మసూద్ అజర్‌ను జమ్మూ జైలు నుంచి కాందహార్‌కు ఎలా తీసుకువచ్చారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)