ఈటల రాజేందర్: నాది ఆత్మగౌరవ పోరాటమన్న ఈటల...ఆస్తుల రక్షణకు ఆరాటమన్న టీఆర్ఎస్ నేతలు

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్‌తో కొనసాగిన 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నానని చెప్పారు.

ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాను కానీ, ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోనని అన్నారు. ఆత్మగౌరవానికి అభివృద్ధి ప్రత్యామ్నాయం కాదని.. బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేశారు, అయినా, భారత జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిందని ఈటెల చెప్పారు.

అయితే, చేసిన తప్పులు బైటపడకుండా ఉండేందుకు ఈటల ఆత్మగౌరవం నినాదాన్ని వినిపిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం గతంలోనూ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఈటల తెరాస నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇస్తే అన్నిసార్లూ తాను గెలిచానని చెప్పారు.

హైదరాబాద్ శివారు షామీర్‌పేటలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

"హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు ఎట్లా భరిస్తున్నవు బిడ్డా ఇన్ని కుట్రలు, అవమానాలు అని నాతో అంటూ బాధ పడుతుండ్రు. నిన్ను కడుపుల పెట్టి చూసుకుంటం అని వాళ్లే చెబుతున్నరు. ప్రాణం ఉండగనే బొంద పెట్టే విధంగా పార్టీ నాయకత్వం పని చేసింది" అని ఈటల రాజేందర్ అన్నారు.

"తెలంగాణ వచ్చినంక అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నం. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని వాగ్దానం చేసినం. కానీ, ఇవాళ్టికైనా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క దళిత ఐఏఎస్ అధికారి అయినా ఉన్నారా? ఒక్క బీసీ అయినా ఉన్నారా?" అని రాజేందర్ ప్రశ్నించారు.

‘‘ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండరు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు. నల్గొండ, హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు’’ అంటూ అనేక విషయాలను పంచుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండాలు చేసింది మేం, పార్టీని పెంచుకున్నది మేము అని చెప్పిన రాజేందర్ ఇంకా ఏమన్నారంటే:

ఈటల రాజేందర్ గారికి బంగారు పళ్లెంలో పెట్టి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినం, ఆర్థిక మంత్రి పదవి ఇచ్చినం. ఇంకా ఏమివ్వాలని ప్రశ్నించిండ్రు.

నాకు పదవి ఇమ్మని అడగలేదు. నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు పొంగిపోయిన. ఇవాళ మంత్రిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఈ సేవలో ప్రజలతో శెభాష్ అనిపించుకున్న వ్యక్తిని నేను.

ఎమ్మెల్యే పదవిని కూడా ఎలా తొలగించాలని చూస్తుండ్రు. అంత ఇజ్జత్ తక్కువ బతుకు వద్దు బిడ్డా అని నా నియోజక వర్గ ప్రజలే చెబుతున్నరు.

సంక్షేమ పథకాలను వ్యతిరేకించానని నామీద ఆరోపణలు చేశారు. నేను సంక్షేమ పథకాలను వద్దనలేదు. కానీ, రైతు బంధు పథకం కింద ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి నగదు సహాయం ఇవ్వొద్దని చెప్పిన. అది తప్పా. బెంజి కారులో వచ్చి లక్షలు లక్షలు తీసుకుని పోయే వాళ్లను చూస్తే పేద రైతుల పరిస్థితి ఎలా ఉంటుందని అడిగాను.

ఉద్యమానికి ప్రజా సంఘాలు అండగా నిలబడ్డాయి. ధర్నా చౌక్ వేదికగా నిలిచింది. ఇవాళ వాటిని లేకుండా చేసిండ్రు’’ అన్నారు.

బ్రిటిషర్లు కూడా అభివృద్ధి చేశారు.. అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు’

‘‘తెలంగాణలో చాలా అభివృద్ధి చేసినమని చెబుతుండ్రు. బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేసిండ్రు. దేశంలో రైల్వే లైన్లు వేసిండ్రు, రోడ్లేసిండ్రు. కానీ, భారత జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం చేసింది. అభివృద్ధి అన్నది ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రజలకు ప్రాతినిధ్యం లేదు. ఏ అధికారులైనా తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో చెప్పే పరిస్థితి ఉందా?’’ అని ఈటెల అన్నారు.

ఈటెలతో పాటు మరికొందరు నేతలూ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.

ఎమ్మెల్యే ఎనుగు రవీరందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు తుల ఉమ, గండ్ర నళిని, మహిపాల్ యాదవ్ తదితర నేతలంతా టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.

‘నయీంకే బెదరలేదు’

‘‘నాపై చాలా కుట్రలు చేశారు. నేనెప్పుడూ భయపడలేదు. నయీం బెదిరించినా భయపడలేదు. కుట్రలతోనే ఎంతో మందిని పార్టీ నుంచి బయటకు పంపారు. నాపై తప్పుడు రాతలతో కుట్రలు, కుతంత్రాలు చేశారు.

కష్టపడి పనిచేస్తేనే నాకు పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క మంత్రి అయినా స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారా..’’ అని ఈటెల ప్రశ్నించారు.

‘వరవరరావును పరామర్శించలేదు’

‘‘నక్సల్స్‌ తరహాలో తెరాస అజెండా ఉంటుందని కేసీఆర్‌ ఎన్నోసార్లు చెప్పారు. కానీ, విరసం నేత వరవరరావు జైలులో ఉంటే కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదు.

కాంగ్రెస్‌ హయాంలో నేను తెచ్చుకున్న గోదాములు మూసివేయించారు.

119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది మంత్రులపై నమ్మకం ఉంచని కేసీఆర్‌కు 4 కోట్ల ప్రజలపై నమ్మకముంటుందా?

90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారు?

2018 ఎన్నికల తర్వాత ఇన్నిసీట్లు వస్తాయని ఊహించలేదని మీడియా సమావేశంలో నేను చెబితే ఆ మాటలను కూడా వక్రీకరించారు.

పొట్టోడి నెత్తిన పొడుగోడు కొడితే, పొడుగోడి నెత్తిన పోషమ్మ కొడుతుందన్నట్లుగా మిమ్మల్నీ ఎవరో కొట్టేవారు వస్తారు'' అన్నారు ఈటెల.

‘ఆత్మగౌరవమా...ఆస్తుల రక్షణా?‘

పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపైనా, టీఆర్ఎస్ పార్టీ పైనా ఈటల రాజేందర్‌ విమర్శలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తప్పుబట్టారు.

బడుగులు, వెనకబడిన కులాల ఆత్మగౌరవం గురించి పదే పదే మాట్లాడుతున్న ఈటల రాజేందర్ దిల్లీ బీజేపీ పెద్దల నుంచి బడుగుల ఆత్మగౌరవం కోసం ఎలాంటి హామీ పొందారో చెప్పాలని కమలాకర్ డిమాండ్ చేశారు. వెనకబడిన వర్గాల కోసం మంత్రిత్వ శాఖ, రైతుల చట్టాలను వెనక్కి తీసుకోవడంపై బీజేపీ పెద్దల నుంచి హామీ దక్కిందా అని ఈటలను ఆన ప్రశ్నించారు.

ఈటల ప్రయత్నాలు ఆత్మగౌరవం కోసం కాదని, ఆస్తుల రక్షణ కోసమని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేసిన తప్పులు బైటపడకుండా ఈటల ఆత్మగౌరవం అంటూ నినాదాలు చేస్తున్నారని రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)