You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఈటల రాజేందర్ భూములలో రాత్రికి రాత్రి సర్వే ఎలా చేశారు?’.. కలెక్టర్ నివేదిక చెల్లదన్న హైకోర్టు - Newsreel
కేసీఆర్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ భూములకు సంబంధించి మెదక్ జిల్లా కలెక్టర్ గంటల వ్యవధిలోనే తయారుచేసి ఇచ్చిన నివేదిక చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తి చేశారని ప్రశ్నించింది. అధికారులు కారులో కూర్చుని నివేదిక రాసినట్లుగా ఉందంటూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఫిర్యాదు వచ్చిందని ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా అంటూ చట్టప్రకారం నోటీసులు ఇచ్చి తగినంత సమయం ఇవ్వాలని ఆదేశించింది.
ఈటలకు చెందిన భూములలో ప్రభుత్వం సర్వే చేయడానికి ముందు నోటీస్ ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు ఉల్లంఘించారని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
తమపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై ఈటల కుటుంబం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిపై విచారణ జరిపింది.
ఈటల తరఫున న్యాయవాది ప్రకాశ్ రెడ్డి, ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జులై 6కి వాయిదా వేసింది.
ఇప్పటివరకు ఏం జరిగింది..
ఏప్రిల్ 30న కొందరు రైతులు తమ అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. దానిపై, మీడియాలో వరసగా వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఆరోపణలపై రెవెన్యూ, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
ఫిర్యాదు చేసిన రైతుల భూముల దగ్గర శని, ఆదివారాలలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు.
అసైన్డ్ భూముల విషయంలో ఈటల రాజేందర్ అక్రమాలకు పాల్పడినట్టుగా మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు. దీంతో ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా గవర్నర్‌ను కోరారు ముఖ్యమంత్రి.
ఈటల నిర్వహిస్తున్న శాఖను బదిలీ చేయాలని సీఎం కేసీఆర్ చేసిన సిఫార్సుకు గవర్నర్ తమిళిసై శనివారం ఆమోదం తెలిపారు. దాంతో ఈటల నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖను సీఎంకు బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
ఆ మరునాడే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి సూచించడం, గవర్నర్ కార్యాలయం దానికి ఆమోదముద్ర వేయడం జరిగాయి.
ఆరోగ్య శాఖను తన నుంచి బదిలీ చేసిన తరువాత ఈటల స్పందించారు.
"గత రెండు సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు" తెలిపారు.
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డాక్టర్స్, నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ స్టాఫ్, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పని చేస్తున్న ANM లు, ఆశా వర్కర్లు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నానని అన్నారు ఈటల రాజేందర్.
'హైదరాబాద్ జూలో సింహాలు కోవిడ్ నుంచి కోలుకుంటున్నాయి'
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్, జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఎనిమిది ఆసియా సింహాలు కోవిడ్ లక్షణాల నుంచి కోలుకుంటున్నాయని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ పరిధిలోని సెంట్రల్ జూ అథారిటీ వెల్లడించింది.
జూలోని సింహాలలో కొన్ని కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఏప్రిల్ 24న వాటికి అనస్తీషియా ఇచ్చి ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించారు.
మే 4న ''CCMB- LaCONES' ఎనిమిది సింహాలు SARS-CoV2 వైరస్ బారినపడినట్లు నిర్ధరించింది.
అయితే లక్షణాలు కనిపించిన రోజు నుంచే జూ అధికారులు, సిబ్బంది చికిత్స ప్రారంభించడంతో సింహాలు అన్నీ ఇప్పటికే కోలుకున్నాయని సెంట్రల్ జూ అథారిటీ వెల్లడించింది.
జూ సిబ్బందికి కరోనా సోకకుండా నివారణ చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. సెంట్రల్ జూ అథారిటీ నిబంధనల మేరకు జూ ను ఇప్పటికే మూసివేశారు. సందర్శకులకు అనుమతి లేకుండా చర్యలు తీసుకున్నారు.
అయితే, జంతువుల నుంచి ఈ వ్యాధి మనుషులకు సంక్రమిస్తుందనడానికి ఇంతవరకు శాస్త్రవేత్తలకు ఆధారాలు లభించలేదు.
కరోనా మృతుల దహనానికి కట్టెల కొరత.. 1,000 టన్నుల కలప ఉచితంగా ఇవ్వనున్న తెలంగాణ ఎఫ్‌డీసీ
తెలంగాణలో కరోనా మృతుల దహనానికి కట్టెల కొరత తీవ్రంగా ఉందన్న వార్తల నేపథ్యంలో ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) స్పందించింది.
తమ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా సరఫరా చేస్తామని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.
ఫారెస్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏటా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేపడతారు. ఈ కలపను కార్పొరేషన్ నుంచి పేపర్ మిల్లులు కొంటాయి.
ఇలా విక్రయించగా మిగిలిన సుమారు వెయ్యి టన్నుల కలపను హైదరాబాద్ సహా సమీప మున్సిపాలిటీలలోని స్మశానాలకు సరఫరా చేస్తామని ఎఫ్‌డీసీ ప్రకటించింది.
అంత్యక్రియలకు అవసరమైన కలప లభ్యత లేని పేదలు స్థానిక మున్సిపల్ అధికారులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. కలపను తరలించేందుకు స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్లు కూడా ముందుకు వచ్చినట్లు కార్పొరేషన్ వైస్ చైర్మన్ చంద్రశేఖర రెడ్డి చెప్పారు.
నటి కంగనా రనౌత్ అకౌంట్ సస్పెండ్ చేసిన ట్విటర్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అకౌంట్‌ను ట్విటర్ తొలగించింది.
పశ్చిమ బెంగాల్‌లో హింస గురించి చెబుతూ కంగన సోమవారం ఒక ట్వీట్ చేశారు.
ఆ తర్వాత ఆమె ట్వీట్ హింసాత్మకం అని, రెచ్చగొట్టేలా ఉందని ట్విటర్‌లో చాలామంది చెప్పారు.
మరికొంతమంది కంగనా రనౌత్ అకౌంట్‌ను తొలగించాలని ట్విటర్‌ను కోరారు.
అయితే, కంగన అకౌంట్ ఎందుకు సస్పెండ్ చేశారు అనేదానిపై ట్విటర్ తరఫున ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
"ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించే అకౌంట్లను ట్విటర్ సస్పెండ్ చేస్తుంది" అని కంగన పేజీలో రాసుంది.
దీనిపై కంగనా రనౌత్ కూడా స్పందించారని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
"వాళ్లు అమెరికన్లని, తెల్లవాళ్లు పుట్టుకతోనే నల్లవాళ్లను బానిసలుగా చేసుకునే హక్కు ఉన్నట్టు భావిస్తారనే నా అభిప్రాయాన్ని ట్విటర్ నిరూపించింది. మనం ఏం ఆలోచించాలో, మాట్లాడాలో, చేయాలో వాళ్లే మనకు చెప్పాలనుకుంటారు. నా సొంత కళావేదికైన సినిమాతోపాటూ నా గళం వినిపించడానికి నాకు ఎన్నో ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నాయి" అన్నారని తెలిపింది.
ఐపీఎల్ 2021ని రద్దు చేసిన బీసీసీఐ
ప్రస్తుత సీజన్‌కు ఐపీఎల్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇప్పటికే కొందరు ఆటగాళ్లు కోవిడ్ బారిన పడటంతో మే 3న జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు కరోనా సోకిందని జట్టు యాజమాన్యం ప్రకటించింది.
గతవారంలో కొందరు ఆటగాళ్లు, అంపైర్లు కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన కుటుంబానికి ప్రస్తుతం తన అవసరం ఉందని చెబుతూ రవిచంద్రన్ అశ్విన్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఆడమ్ జంపా, రిచర్డ్‌సన్ వంటివారు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు.
మరోవైపు, ప్రస్తుత కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఐపీఎల్‌ను రద్దు చేసేలా లేదా వాయిదా వేసేలా బీసీసీఐను ఆదేశించాలని కోరుతూ బోంబో హైకోర్టులో ఈరోజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఐపీఎల్ కోసం వెచ్చించే వనరులను కోవిడ్ వ్యాప్తి కట్టడికి వినియోగించాలని ఆ వ్యాజ్యంలో పిటిషనర్ కోరారు. దీనిపై గురువారం విచారణ చేపడతామని బోంబే హైకోర్టు వెల్లడించింది.
భారత్‌లో 2 కోట్లు దాటిన కరోనా కేసులు, కోవిడ్ వేగం నెమ్మదించిందంటున్న ప్రభుత్వం
భారత్‌లో కోవిడ్ వేగం నెమ్మదించిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికారికంగా 2 కోట్లు దాటింది.
గత 24 గంటల్లో కొత్తగా 3,57,229 కరోనా కేసులు నమోదు కావడంతో భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది.
మంగళవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొత్త కరోనా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,02,82,833కు చేరుకుంది.
భారత్‌లో 2020 మార్చి నుంచి పెరుగుతూ వచ్చిన కరోనా కేసులు, గత ఏడాది డిసెంబర్ 19న కోటి దాటాయి. ఈ ఏడాది సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడం, రోజువారీ కేసులు భారీగా నమోదు కావడంతో ఐదు నెలల్లోపే కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది.
గత 24 గంటల్లో 3449 మంది చనిపోవడంతో భారత్‌లో మొత్తం మరణాల సంఖ్య 2,22,408కు చేరింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34,47,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 1,66,13,292 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం 15,71,98,207 డోసుల వ్యాక్సినేషన్ జరిగింది.
దేశంలో కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వం చెబుతోంది.
ఏప్రిల్ 30న రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలకు చేరినప్పటి నుంచి దేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని భారత్ చెప్పింది.
మరోవైపు ఆక్సిజన్, వ్యాక్సీన్ల కొరత, బెడ్లు ఖాళీ లేకపోవడం, కరోనా ఔషధాలు అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.
బిల్ గేట్స్, మెలిండా గేట్స్: 27ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకుని, విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన
27 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత బిల్ గేట్స్, మెలిండా గేట్స్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు.
"ఒక జంటగా మేం ముందుకు వెళ్లగలమని మాకు అనిపించడం లేదు" అని తాము జారీ చేసిన ఒక ప్రకటనలో ఇద్దరూ చెప్పారు.
తమ విడాకుల గురించి ఇద్దరూ ట్విటర్ ద్వారా ఒక ప్రకటన జారీ చేశారు. అందులో "మా బంధం గురించి, చాలా లోతుగా ఆలోచించుకున్న తర్వాతే మేం విడాకులు తీసుకోవాలని నిర్ణయిచుంకున్నాం" అని చెప్పారు.
"గత 27 ఏళ్లుగా మేం ముగ్గురు పిల్లల్ని పెంచి పోషించాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యం, మెరుగైన జీవితాన్ని అందించే ఒక అద్భుతమైన సంస్థను స్థాపించాం. ఈ మిషన్ మీద మేం కచ్చితంగా మా నమ్మకం ఉంచుతాం. ఇక ముందు కూడా ఫౌండేషన్ కోసం పనిచేస్తూనే ఉంటాం. కానీ, మా జీవితం తర్వాత దశలోకి ఒక జంటగా మేం ముందుకు వెళ్లలేమని మాకు అనిపించింది" అన్నారు.
మెలిండా 1980వ దశకంలో టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ అయినప్పుడు బిల్ గేట్స్ తొలిసారి ఆమెను కలిశారు.
వీరిద్దరూ కలిసి 'బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధులకు చికిత్స, చిన్నారుల వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై ఈ సంస్థ వందల కోట్లు ఖర్చు చేస్తోంది.
'గివింగ్ ప్లెడ్జ్' ప్రారంభించడం వెనుక ఎక్కువగా బిల్-మెలిండా, బిలియనీర్ వారెన్ బఫెట్ చొరవ ఉంది.
'గివింగ్ ప్లెడ్జ్' అంటే ఒక బిలియనీర్ తనకుతానుగా తన సంపదలో ఒక పెద్ద భాగాన్ని సామాజిక అభ్యున్నతి కోసం విరాళంగా ఇస్తానని ప్రకటించడం.
ఫోర్బ్స్ మ్యాగజీన్ వివరాల ప్రకారం 124 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో బిల్ గేట్స్ ప్రపంచ సంపన్నుల్లో నాలుగో స్థానంలో నిలిచారు.
1970వ దశకంలో బిల్ గేట్స్ ప్రముఖ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ స్థాపించారు. ఈ కంపెనీ బిల్ గేట్స్‌కు పేరు, సంపద తెచ్చిపెట్టింది.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు...
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)