చైనాపై అమెరికా అణ్వాయుధాలతో దాడి చేయాలని అనుకుంది: పెంటగాన్ పేపర్స్

1958లో తైవాన్‌ను కాపాడేందుకు చైనాపై అణు బాంబు వేయాలని అమెరికా సైనిక నిపుణులు వ్యూహాలు రచించినట్లు తాజాగా బయటపడిన పత్రాలు చెబుతున్నాయి.

అమెరికా సైనిక వ్యూహాలకు సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను ‘‘పెంటగాన్ పేపర్స్’’ పేరుతో ఆ దేశ మాజీ సైనిక విశ్లేషకుడు డేనియేల్ ఎల్స్‌బర్గ్ విడుదల చేశారు.

తాజాగా ఆయన మరికొన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టారు.

‘‘తాము అణ్వాయుధాలను ప్రయోగిస్తే చైనాకు సోవియట్ యూనియన్ సాయం చేస్తుంది. అణ్వాయుధాలను కూడా అందిస్తుంది. ఫలితంగా పెద్దయెత్తున ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంటుంది’’ అని అమెరికా సైనిక వ్యూహకర్తలు భావించినట్లు పత్రాల్లో ఉంది.

అమెరికా పత్రిక ‘‘ద న్యూయార్క్ టైమ్స్’’ దీనిపై ఒక కథనం ప్రచురించింది. తైవాన్‌ను కాపాడేందుకు ప్రాణనష్టం జరిగినా ఫర్వాలేదని అమెరికా వ్యూహకర్తలు భావించినట్లు అందులో పేర్కొన్నారు.

ఈ పెంటగాన్ పత్రాలను డేనియేల్ 1975లో తొలిసారి బయటపెట్టారు. అమెరికా సైనిక వ్యూహాలకు సంబంధించిన కీలక సమాచారం వీటిలో ఉంది.

వైమానిక స్థావరాలే లక్ష్యంగా...

వియత్నాం యుద్ధానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని బయటపెట్టడంతో 1971లోనూ డేనియేల్ వార్తల్లో నిలిచారు.

తైవాన్ సంక్షోభం కీలక సమాచారాన్ని కొన్ని రహస్య పత్రాల నుంచి 1970లోనే కాపీ చేసినట్లు టైమ్స్‌కు డేనియేల్ చెప్పారు.

తైవాన్ విషయంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటుండటంతో ఈ సమాచారాన్ని బయటపెట్టినట్లు ఆయన వివరించారు.

‘‘చైనా దురాక్రమణకు పాల్పడితే అమెరికా అణ్వాయుధాలను ఉపయోగిస్తుంది. ముఖ్యంగా చైనా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటుంది’’అని అప్పట్లో అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ నాథన్ ట్వినింగ్ చెప్పినట్లు పత్రాల్లో పేర్కొన్నారు.

‘‘చైనా దురాక్రమణ ఆగకపోతే ఉత్తర షాంఘైపై అణు బాంబు వేయాల్సి ఉంటుంది’’ అని ట్వినింగ్ అన్నట్లు అందులో వివరించారు.

అయితే, అణ్వాయుధాలకు బదులుగా సంప్రదాయ ఆయుధాలను ఉపయోగించడానికే అప్పటి అమెరికా అధ్యక్షుడు డీడీ ఐసన్‌హోవర్ మొగ్గుచూపారు.

సంక్షోభం ఎలా ముగిసిందంటే...

1958లో తైవాన్ నియంత్రణలోని ఒక ద్వీపంపై దాడులను ఆపేస్తున్నట్లు చైనా ప్రకటించింది. దీంతో ఈ సంక్షోభం ముగిసింది. ఆ ప్రాంతం చియాంగ్ కాయ్‌షెక్ నేతృత్వంలోని తైవాన్‌ జాతీయవాద దళాల చేతుల్లోకి వెళ్లింది.

తైవాన్ తమ దేశంలో భాగమని చైనా ఇప్పటికీ భావిస్తుంటుంది.

చాలా దేశాల్లానే అమెరికాకు తైవాన్‌తో దౌత్య సంబంధాలు లేవు.

అయితే తైవాన్‌ ఆత్మరక్షణ కోసం సాయం అందించడానికి వీలు కల్పిస్తూ అమెరికా ఒక చట్టాన్ని ఆమోదించింది.

తైవాన్ విషయంలో అనుసరిస్తున్న దూకుడు విధానాలపై అమెరికా ఇటీవల చైనాను హెచ్చరించింది.

‘‘వన్ చైనా పాలసీ’’ కింద తైవాన్ తమ దేశంలో భాగమని చైనా చెబుతోంది. మరోవైపు తమది సార్వభౌమ దేశమని తైవాన్ అంటోంది.

అంతర్యుద్ధం తర్వాత..

1949 అంతర్యుద్ధం తర్వాత చైనా, తైవాన్‌లలో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.

తైవాన్ అంతర్జాతీయ సంబంధాలను కట్టడి చేసేందుకు చైనా మొదట్నుంచి ప్రయత్నిస్తూనే ఉంది.

పసిఫిక్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలపై ఆధిపత్య పోరు రెండింటి మధ్య ఇప్పటికీ కొనసాగుతోంది.

ఇటీవల కాలంలో చైనా, తైవాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

తైవాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు బలప్రయోగం చేసే అవకాశాన్ని చైనా కొట్టివేయడం లేదు.

తైవాన్‌లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కొన్ని దేశాలు మాత్రమే అధికారికంగా గుర్తించాయి. అయితే, అనధికారికంగా చాలా దేశాలతో తైవాన్‌‌కు సంబంధాలు ఉన్నాయి.

చాలా దేశాల్లానే అమెరికాకు కూడా తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో తైవాన్‌కు సాయం అందించేందుకు అమెరికా ఓ చట్టాన్ని ఆమోదించింది.

చైనా ఆందోళన

అధికారికంగా స్వాతంత్ర్యం ప్రకటించుకునే దిశగా తైవాన్ చర్యలు తీసుకుంటోందని చైనా ఆందోళన చెందుతోంది. ఇలాంటి చర్యలు చేపట్టకూడదని చైనా ఇప్పటికే చాలాసార్లు తైవాన్‌ను హెచ్చరించింది.

అయితే తైవాన్ ఒక స్వతంత్ర దేశమని తైవాన్ ప్రస్తుత అధ్యక్షుడు సయ్ ఇంగ్ వెన్ పదేపదే చెబుతున్నారు. దీని కోసం అధికారికంగా తాము ఎలాంటి ప్రకటనా చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.

తైవాన్‌కు సొంత రాజ్యాంగం, సైన్యంతోపాటు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)