అంగారకుడిపై ల్యాండ్‌ అయిన నాసా ‘పెర్సెవీరన్స్’ రోవర్‌, జీవం ఆనవాళ్లపై స్పష్టత లభిస్తుందా?

    • రచయిత, జోనాథాన్‌ అమోస్‌
    • హోదా, బీబీసీ సైన్స్‌ కరస్పాండెంట్‌

అంగారక గ్రహం మీద మరో రోబో నడక కొనసాగుతోంది. అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా పంపిన పెర్సెవీరన్స్ రోవర్‌ అంగారకుడి మీద క్షేమంగా దిగడమే కాక, సైంటిస్టులు నిర్దేశించినట్లు జెజెరో అనే సరస్సు ప్రాంతంవైపు కదులుతోంది.

“గుడ్‌ న్యూస్‌, స్పేస్‌క్రాఫ్ట్‌ తాను చేరాల్సిన ప్రదేశానికి చక్కగా చేరింది’’ అని ఈ మిషన్‌ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్‌ మాట్‌ వాలేస్‌ ప్రకటించగానే, నాసాలోని ఇంజినీర్లు హర్షధ్వానాలు చేశారు.

ఈ గ్రహం మీద గతంలో జీవం ఉందా అని పరిశోధించేందుకు పెర్సెవీరన్స్ అనే ఆరు చక్రాల రోవర్‌ను నాసా అంగారకుడి మీదకు పంపింది. ఈ రోవర్‌ రెండేళ్లపాటు అక్కడే ఉండి, రాళ్లను, నేలను డ్రిల్‌ చేస్తూ జీవం ఆనవాళ్ల కోసం పరిశోధన కొనసాగిస్తుంది.

కోట్ల సంవత్సరాల కిందట మార్స్‌పై ఈ సరస్సు ఏర్పడిందని సైంటిస్టులు భావిస్తున్నారు. నీరు ఉంది కాబట్టి అక్కడ జీవం కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా.

రాత్రి 8.55 గం.ల ప్రాంతంలో పెర్సెవీరన్స్ అంగారక గ్రహం మీద అడుగు పెట్టినట్లు సిగ్నల్‌ అలర్టింగ్‌ కంట్రోలర్‌కు సమాచారం వచ్చింది. మామూలు పరిస్థితుల్లో సైంటింస్టులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అభినందనలు చెప్పుకునే వారు.

కానీ కరోనా కారణంగా శాస్త్రవేత్తలు దూరదూరంగా ఉండాల్సి వచ్చింది. మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఈ సంతోషం ఇంతటితో ఆగపోలేదు. దిగిన కాసేపటికే రోవర్‌ రెండు ఫొటోలను పంపడంతో శాస్త్రవేత్తలలో ఆనందం రెట్టింపయ్యింది.

రోవర్‌కు అమర్చిన తక్కువ రిజల్యూషన్‌ కెమెరాలతో ఈ ఫొటోలను తీసింది. కెమెరా గ్లాస్‌ మీద దుమ్ము ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అయినా రోవర్‌ ముందు, వెనక భాగాలలో ఉన్న అంగారకుడి ఉపరితలం స్పష్టంగా కనిపించింది.

పరిశోధన జరపబోయే ప్రాంతం జెజెరోకు ఆగ్నేయ దిశగా రోవర్‌ రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని సైంటిస్టులు వెల్లడించారు.

“రోవర్‌ ఇప్పుడు సమతల ప్రాంతానికి చేరింది. అయితే అది 1.2 డిగ్రీల మేరకు ఒరిగి ఉంది” అని వారు చెప్పారు. “పార్కింగ్‌కు మంచి ప్రాంతం దొరికింది. రోవర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు” అని వారు వెల్లడించారు.

“ఒకపక్క కోవిడ్‌ సవాళ్లను ఎదుర్కొంటూనే రోవర్‌ను క్షేమంగా అంగారక గ్రహానికి పంపడం గొప్ప విజయం. సైంటిస్టులంతా సమన్వయంతో పని చేసి గొప్ప విజయాన్ని సాధించారు” అని నాసా అడ్మినిస్ట్రేటర్‌ స్టీవ్‌ జుర్చిక్‌ అన్నారు.

మున్ముందు ఏం చేస్తుంది?

“రాబోయే కొద్దిరోజులు అత్యంత కీలకమైనవి. గతంలో ఎవరూ చేరని చోటికి మన ప్రతినిధి పంపించాం” అని నాసాలో జెట్‌ ప్రొపల్షన్‌ లేబరేటరీ డైరక్టర్‌గా పని చేస్తున్న మైక్‌ వాట్కిన్స్‌ అన్నారు.

2012లో క్యూరియాసిటీ రోవర్‌ తర్వాత నాసా పంపిన రెండో రోవర్‌ ఇది. క్యూరియాసిటీని మార్స్‌లోని మరో ప్రాంతంలో ల్యాండ్‌ చేశారు. అయితే పెర్సెవీరన్స్‌తో పోల్చితే క్యూరియాసిటీలో ఆధునిక సాంకేతికతను ఎక్కువగా వాడలేదు.

రాబోయే కొద్దిరోజులపాటు సైంటిస్టులు పెర్సెవీరన్స్‌కు భౌతికంగా ఏవైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా, అందులోని వ్యవస్థలు ఏవైనా దెబ్బతినడంలాంటి పరిస్థితులు ఉన్నాయేమో పరిశీలిస్తారు.

పెర్సెవీరన్స్ రోవర్‌ ముందు భాగంలో ప్రధానమైన కెమెరా ఉంది. ఈ ముందు భాగాన్ని ఎత్తు పెంచాల్సి ఉంది. రోబోట్‌ను ముందుకు వెనకకు కదిలించడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను కూడా ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉంది.

మరో వారంరోజుల్లో పెర్సెవీరన్స్ తన చుట్టూ ఉన్న ప్రాంతాలకు సంబంధించిన అనేక ఫొటోలను పంపుతుందని భావిస్తున్న శాస్త్రవేత్తలు, వాటి ద్వారా అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు.

ఈ రోవర్‌లో చిన్న హెలీకాప్టర్‌ను కూడా శాస్త్రవేత్తలు అమర్చారు. దీని ద్వారా రోవర్‌ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రయోగాలు నిర్వహిస్తారు. భూమి కానీ మరో ప్రాంతం మీద ఏర్పాటు ఎగరబోయే తొలి చాపర్‌గా హెలీకాప్టర్‌ రికార్డులకెక్కనుంది. దీన్నే సైంటిస్టులు రైట్‌ బ్రదర్స్‌ మూమెంట్ అని పిలుస్తున్నారు.

ఈ ప్రయోగాల తర్వాత రోవర్‌ తన అసలు పని ప్రారంభిస్తుంది. ఇప్పటికే శాటిలైట్‌లు గుర్తించిన సరస్సు ప్రాంతాన్ని చేరుకుని అక్కడ నమూనాల సేకరణ మొదలు పెడుతుంది.

డెల్టాగా పిలుచుకునే ఈ సరస్సు నదులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల ఏర్పడినదిగా భావిస్తున్నారు. జెజెరో డెల్టా ప్రాంతంలోని మట్టిలో జీవం ఆనవాలు ఉందేమో పరిశీలించడమే రోవర్‌ ముందున్న పని.

పెర్సీవరెన్స్‌ ఈ డెల్టా ప్రాంతపు మట్టి నమూనాలు సేకరించిన తర్వాత, ఈ సరస్సు అంచుల్లో ఉన్న రాళ్ల వైపు ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతంలో కార్బొనేట్ శిలలు ఉన్నట్లు శాటిలైట్లు ఇప్పటికే గుర్తించాయి.

భూమి మీద కూడా ఇలాంటి రాళ్లు ఉన్నాయని, వీటి వల్ల జీవం ఏర్పడేందుకు అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.

పెర్సెవీరన్స్ తన దగ్గరున్న అత్యాధునిక పరికరాల సాయంతో మట్టిని, రాళ్లను అతి సూక్ష్మస్థాయిలో పరిశోధిస్తుంది.

జెజెరో ప్రత్యేకత ఏంటి?

బోస్నియా-హెర్జిగోవినాలోని ఓ పట్టణం పేరు జెజెరోను ఈ సరస్సు ప్రాంతానికి పెట్టారు శాస్త్రవేత్తలు. స్లొవేకియా భాషలో జెజెరో అంటే సరస్సు అని అర్ధం. 45 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సరస్సు విస్తరించి ఉంది.

ఈ ప్రాంతంలో అనేక రాళ్లు, కార్బోనేట్‌ శిలలు, బురద మట్టి విస్తృతంగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ జీవం ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్న శాస్త్రవేత్తలు రోవర్‌ను ఈ ప్రాంతానికి పంపించారు.

నాసా, యూరోపియన్‌ స్పేస్ ఏజెన్సీలు ఉమ్మడిగా ఈ ప్రయోగానికి దిగాయి. అయితే మార్స్‌ మీదున్న మట్టిని, శిలలను కిందికి తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ భవిష్యత్తులో అంగారక గ్రహం మీద పరిశోధనలో ఇవి కీలకం.

ఒకవేళ ఇప్పుడు పెర్సెవీరన్స్ అక్కడి జీవం ఆనవాళ్లు ఉన్నట్టు చెప్పినా, మిగిలిన శాస్త్రలోకం దాన్ని సవాల్‌ చేయక మానదు. ఈ పరిస్థితుల్లో అక్కడి మట్టిని, రాళ్లను తీసుకొచ్చి వాటి మీద సమగ్రమైన పరిశోధన చేయాల్సి ఉంది.

నాసా పంపిన రోవర్ రూపకల్పనలో భారత్ సంతతికి చెందిన శాస్త్రవేత్త స్వాతి మోహన్ పాలు పంచుకున్నారని ఏఎన్ఐ వెల్లడించింది. రోవర్ యాటిట్యూడ్ కంట్రోల్, ల్యాండింగ్ సిస్టమ్ విభాగానికి ఆమె నాయకత్వం వహించినట్లు పేర్కొంది.

"రోవర్ క్షేమంగా దిగింది. ఇక జీవం ఆనవాళ్లు కనుక్కోవడమే మిగిలింది" అని ల్యాండింగ్ అనంతరం స్వాతి మోహన్ వ్యాఖ్యానించారు. స్వాతికి ఏడాది వయసులో ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు స్వాతి తొలిసారి స్టార్ ట్రెక్ సిరీస్ను చూశారు. అప్పటి నుంచి ఆమెకు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఏర్పడింది. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన స్వాతి ఆ తర్వాత ఏరోనాటిక్స్లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. నాసాలో పెర్సెవీరన్స్ మిషన్‌తోపాటు అనేక ఇతర ప్రాజెక్టులలో కూడా స్వాతి పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)