సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని హత్యలు చేసిన 'ట్విటర్ కిల్లర్'కు మరణ శిక్ష

ట్విటర్ ద్వారా పరిచయం పెంచుకుని 9 మందిని హతమార్చిన జపనీయుడికి మరణ శిక్ష పడింది.

‘ట్విటర్ కిల్లర్’గా పేరుపడిన తకహిరో షిరాయిషీ ఇంటిలో మనుషుల శరీర భాగాలు దొరకడంతో 2017లో ఆయన్ను అరెస్ట్ చేశారు.

30 ఏళ్ల ఈ హంతకుడు సోషల్ మీడియాలో తనకు పరిచయమైన వారిని, ముఖ్యంగా యువతులను చంపేసి, వారిని ముక్కలు ముక్కలుగా కోసేసినట్లు అంగీకరించాడు.

ఈ వరుస హత్యలు అప్పట్లో జపాన్‌ను కుదిపేశాయి. ఆన్‌లైన్‌లో ఆత్మహత్యలకు సంబంధించి సంభాషణా వేదికలుగా ఉన్న వెబ్‌సైట్‌లపై చర్చకు దారి తీశాయి.

మంగళవారం ఈ కేసులో తుది తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు వినేందుకు వచ్చిన ప్రజలతో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది.

కోర్టులో కేవలం 16 సీట్లే ఉన్నప్పటికీ 400 మంది ప్రజలు హాజరయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. జపాన్‌లో మరణ శిక్షలకు ప్రజల నుంచి మద్దతు ఎక్కువగా ఉంటుంది.

ఇంతకీ ఈ సీరియల్ కిల్లర్ ఇదంతా ఎలా చేశాడు?

ఆత్మహత్య ఆలోచనలున్న మహిళలను సోషల్ మీడియాలో గుర్తించి వారిని మెల్లగా మాయ చేసేవాడు తకహిరో.

వారు చనిపోయేందుకు సహకరిస్తానని చెప్పేవాడు.. కలిసి ఆత్మహత్య చేసుకుందామని కూడా పిలిచేవాడు.

అలా తన ఫ్లాటుకు పిలిచి వారిని చంపి ముక్కలుముక్కలుగా కోసేసేవాడు.

ఇలా 2017 ఆగస్టు, అక్టోబరు మధ్య 15-26 ఏళ్ల వయసున్న 8 మంది అమ్మాయిలు, ఒక యువకుడిని హతమార్చాడని జపాన్‌కు చెందిన నేరాభియోగ పత్రాన్ని ఉటంకిస్తూ క్యోడో న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

2017 హాలోవీన్ సమయంలో ఈ వరుస హత్యలు తొలిసారి బయటకొచ్చాయి.

టోక్యో సమీపంలోని జామా నగరంలో ఉన్న తకహిరో ఇంట్లో మనుషుల శరీర భాగాలు పోలీసులకు దొరకడంతో విషయం వెలుగు చూసింది.

తకహిరో ఇంట్లోని కూలర్లు, టూల్ బాక్సుల్లో 9 తలలతో పాటు కొన్ని చేతులు, కాలి ఎముకలు దొరికాయి.

విచారణలో ఏం జరిగింది?

9 మందిని హతమార్చి, ముక్కలు చేసినట్లు తకహిరో అంగీకరించడంతో బాధితుల తరఫు న్యాయవాదులు ఆయనకు మరణశిక్ష విధించాలని కోర్టును కోరారు.

అయితే, తకహిరో లాయర్ మాత్రం మృతుల అంగీకారంతోనే వారిని తకహిరో చంపాడని వాదించారు.

అయితే, ఆ తరువాత తకహిరో అందుకు భిన్నమైన వాదనను కోర్టుకు వినిపించాడు.

చనిపోయినవారెవరూ తమను చంపేయాలని కోరలేదని.. వారి అంగీకారం లేకుండానే హత్య చేశానని తకహిరో కోర్టుకు చెప్పాడు.

ఈ కేసులో మంగళవారం తుది తీర్పు వచ్చింది. బాధితులెవరూ తమను చంపమని తకహిరోను కోరలేదని చెప్పిన న్యాయస్థానం ఈ కేసులో తకహిరోకు మరణశిక్ష విధించింది.

మృతుల్లో ఓ యువతి తండ్రి విచారణ సమయంలో గత నెలలో మాట్లాడుతూ తకహిరోను తాను ఎన్నటికీ క్షమించలేనని.. ఆయన మరణించినా కూడా క్షమించలేనని అన్నారు. తన కుమార్తె వయసున్న ఏ అమ్మాయి కనిపించినా తన కూతురే అనుకుంటున్నానంటూ ఆయన బోరుమన్నాడు.

కాగా, ఈ వరుస హత్యలు జపాన్‌ను కుదిపేశాయి. ఆత్మహత్యల గురించి చర్చించడానికి వీలు కల్పించే వెబ్‌సైట్‌ల గురించీ మళ్లీ చర్చ మొదలైంది.

ప్రభుత్వం కూడా వీటిని నివారించేందుకు కొత్త నియంత్రణలు తీసుకొస్తామన్నట్లుగా సంకేతాలిచ్చింది.

ఈ హత్యల తరువాత ట్విటర్ కూడా తన నిబంధనల్లో మార్పులు చేసింది. యూజర్లు ఆత్మహత్యలను ప్రోత్సహించరాదని నిబంధనలు తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)