కోవిడ్ వ్యాక్సీన్ల ఫలితాల్లో తేడాలు ఎందుకొస్తున్నాయి? ‘సగం డోసు’ ఎక్కువ ఫలితాన్ని ఎలా ఇచ్చింది?

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, బీబీసీ హెల్త్ ఎడిటర్

యూకేలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సీన్ ట్రయల్స్ ఫలితాల ప్రభావవంతమైన పని తీరు గురించి ఆ సంస్థలు సోమవారం ప్రకటన చేశాయి.

ఫైజర్, బయోఎన్‌‌టెక్ తయారు చేస్తున్న ఆధునిక ఎం ఆర్ఎన్ఏ వ్యాక్సీన్ల నుంచి కూడా ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నట్లు కొన్ని రోజుల ముందే ఆ సంస్థలు ప్రకటించుకున్నాయి.

కానీ, ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి యూకేలో తయారవుతున్న వ్యాక్సీన్ చవకగా, అందరికీ సులభంగా సరఫరా చేసే వీలు కలుగుతుందనే ఆశను కలిగించింది.

కానీ, ఈ వార్త విని అందరూ సంతోషించే లోపే, ఈ ఫలితాల పట్ల వ్యతిరేక వార్తలు కూడా ప్రచురితమయ్యాయి.

ఈ వ్యాక్సీన్ డోసు ఎంత ప్రభావంతంగా పని చేస్తుందనే అంశం గురించి యూకే ,అమెరికాల్లో పలు వార్తా సంస్థలు ఈ వ్యాక్సీన్ పరీక్షలకు వినియోగించిన సమాచారం పట్ల అనుమానాలు వ్యక్తం చేసాయి. అయితే ఈ అనుమానాలు వ్యాక్సీన్ సురక్షత గురించి మాత్రం కాదు.

వ్యాక్సీన్ ట్రయల్స్ ఫలితాలు 70 శాతం ప్రభావవంతం అని తెలుపుతుండగా, అతి తక్కువగా 62 శాతం, అత్యధికంగా 90 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

అయితే వ్యాక్సీన్ లో వివిధ రకాల డోసులను ట్రయల్స్ లో తప్పుగా వాడటం వలనే ఈ ఫలితాలు వచ్చినట్లు ఆ సంస్థలు పేర్కొన్నాయి. కొంత మంది వాలంటీర్లకు వ్యాక్సీన్ డోసును నిర్ణీత మోతాదు కంటే సగమే ఇచ్చారు. అయితే ఈ డోసు ఇలా ఇవ్వడం తప్పుగా జరిగింది. కానీ, అలా తప్పుగా ఇచ్చిన డోసే విజయవంతం అయింది.

దీని అర్థం ఏమిటి?

ముందుగా రూపొందించిన డోసులకన్నా కొన్ని వ్యాక్సీన్ డోసులు బలహీనంగా ఉన్నాయి.

అంటే, వ్యక్తికి రోగ నిరోధక శక్తిని సమకూర్చేందుకు ఇవ్వవలసిన మోతాదు కంటే తక్కువ మోతాదులో పదార్ధాలు ఉన్నాయి.

ఒక డోసులో రెండు షాట్లు ఇవ్వవలసి ఉంటే, రెండవ డోసును బూస్టరు డోసుగా మొదటి డోసు ఇచ్చిన నెల రోజుల తర్వాత ఇస్తారు.

ఈ ట్రయల్స్ లో పాల్గొన్న చాలా మంది వలంటీర్లకు సరైన మోతాదులోనే వ్యాక్సీన్ డోసులు లభించాయి. అయితే, కొంత మందికి ఈ డోసు లభించలేదు.

ఈ విషయం గురించి నియంత్రణాధికారులకు ముందుగానే తెలియచేయడం వలన ఈ ట్రయిల్ కొనసాగించేందుకు అంగీకారం తెలిపారు. అలాగే, ఎక్కువ మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సీన్ ఇవ్వాలని భావించారు.

వ్యాక్సీన్ డోసులో జరిగిన ఈ తప్పిదం వలన వ్యాక్సీన్ సురక్షత పై ఎటువంటి ప్రభావం చూపలేదు.

ఫలితాలేమిటి?

నిర్ణీత మోతాదు కంటే సగం మోతాదులో ఉన్న వ్యాక్సీన్ డోసును సుమారు 3000 మంది వలంటీర్లకు ఇచ్చారు. నాలుగు వారాల తర్వాత వారికి పూర్తి డోసు ఇచ్చారు. ఈ తరహాలో చేసిన ప్రక్రియలో 90 శాతం సురక్షితంగా ఉన్నట్లు ట్రయిల్స్ లో తేలింది.

9000 మంది వాలంటీర్లు ఉన్న సమూహానికి నాలుగు వారాల వ్యవధిలో రెండు పూర్తి డోసులు ఇవ్వగా అవి 62 శాతం మాత్రమే ప్రభావ వంతంగా పని చేసినట్లు తేలింది.

ఆస్ట్రాజెనెకా కూడా తమ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సీన్ కోవిడ్ -19ని ఎదుర్కోవడంలో 70 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని చెప్పింది. ఈ సంఖ్యలు చూసి నిపుణులు కూడా ఆలోచనలో పడ్డారు.

"ఈ రెండు అధ్యయనాలలో రెండు వేర్వేరు డోసులను పరీక్షించారు. ఈ రెండూ కలిపి ఒక సగటు ఫలితాన్ని వెల్లడించారు. కానీ, ఇందులో ఏ ఒక్కటో వాడటం వలన ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియటం లేదు. దీనిని అర్ధం చేసుకోవడానికి చాలా మంది సమస్యల్లో పడ్డారు" అని ఇమ్యునైజేషన్ నిపుణుడు, చాథమ్ థింక్‌టాంక్ గ్లోబల్ హెల్త్ ప్రోగ్రాంలో అసోసియేట్ ఫెలోగా పని చేస్తున్న ప్రొఫెసర్ డేవిడ్ సాలిస్బరి చెప్పారు.

వ్యాక్సీన్ ఫలితాలను అంచనా వేసిన సమాచారం కేవలం ప్రాధమికమైనదని ఆస్ట్రాజెనెకా అంటోంది. ఇదే సూత్రం ఫైజర్, మోడెర్నా డోసులకు కూడా వర్తిస్తుంది. ఈ ఫలితాలేవీ, తుది ఫలితాలని చెప్పడానికి లేదు.

ఒకసారి వ్యాక్సీన్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత అన్ని సంస్థలు పూర్తి వివరాలను నిపుణుల పరిశీలన కోసం సైన్సు పత్రికల్లో ప్రచురిస్తాయి.

అలాగే అత్యవసరంగా ఆమోదాలు పొందేందుకు ఔషధ సంస్థలు నియంత్రణాధికారులకు మాత్రం పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నాయి. దీని వలన ఈ మూడు వేర్వేరు వ్యాక్సీన్లను తమ జనాభాకు ఇవ్వడానికి పలు దేశాలు వాడకం మొదలు పెట్టే అవకాశం ఉంటుంది.

అయితే, ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సీన్ వాడాలంటే అది కనీసం 50 శాతం ప్రభావవంతంగా ఉండాలని యుఎస్ రెగ్యులేటర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డి ఏ) చెబుతోంది.

ఆస్ట్రా జెనెకా డోసులో అతి తక్కువ ఫలితాలను చూపించిన మోతాదు కూడా 50 శాతం పైనే ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు ఫలితాలు చెబుతున్నాయి.

ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో కోవిడ్ 19 సోకిన 131 మందిపై వ్యాక్సీన్ ని పరీక్షించి ఈ విశ్లేషణ చేశారు.

ఇందులో 101 మందికి సెలైన్ కానీ, మెనింజైటిస్ వ్యాక్సీన్ కానీ ఇచ్చారు.

మిగిలిన 30 మందికి నిజమైన డోసు ఇచ్చారు. అందులో ముగ్గురికి సగం డోసు ఇచ్చారు. మిగిలిన 27 మందికి రెండు పూర్తి డోసులు ఇచ్చారు.

ఇలా మొదట సగం డోసు ఇచ్చ, తర్వాత పూర్తి డోసు ఇచ్చిన వారిలో వ్యాక్సీన్ ప్రభావ వంతంగా పని చేయడం పట్ల ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

ఇలా తక్కువ డోసు ఇచ్చి, తర్వాత ఎక్కువ డోసు ఇవ్వడం కరోనావైరస్ ఇన్ఫెక్షన్ తరహాలోనే ఉండటం వలన ఇది ఎక్కువ రోగ నిరోధక శక్తిని కలుగచేస్తూ ఉండి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

కానీ, ఎక్కువ డోసులు లభించిన వారి కంటే ఈ వలంటీర్లలో రోగ నిరోధకత కూడా భిన్నంగా ఉండి ఉండవచ్చు.

ఇలా సగం డోసు ఇచ్చిన వారిలో 55 సంవత్సరాల లోపు వాళ్ళే ఉన్నారని యూఎస్ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ సైంటిఫిక్ హెడ్ మొన్సెఫ్ స్లయి విలేకరులకు చెప్పారు.

కోవిడ్-19 సోకడంలో వయసు చాలా కీలక పాత్ర పోషించడం వలన, వృద్ధులకు కూడా సురక్షితంగా పని చేసే వ్యాక్సీన్ అవసరం చాలా ఉంది.

కానీ, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ రెండవ దశ ఫలితాలు ఈ వ్యాక్సీన్ అన్ని వయసుల వారిలో ప్రభావవంతంగానే పని చేసినట్లు లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమయిన వివరాలు చెబుతున్నాయి.

"ఈ వారం ఆరంభంలో చెప్పినట్లు ఈ సగం డోసు ఫలితాలను పూర్తిగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది" అని ఆస్ట్రాజెనెకా ప్రతినిధి చెప్పారు.

"ఈ సమాచారాన్ని మేము మరింత విశ్లేషణ చేసి, రెగ్యులేటర్లతో కలిసి పని చేస్తాం. ఇప్పటి వరకు జరిగిన ట్రయల్స్ కి సంబంధించిన సమాచారాన్ని కూడా జత చేసి రెగ్యులేటర్లకు అందచేస్తాం" అని సంస్థ ప్రతినిధి చెప్పారు.

దీని గురించి నిపుణులు ఏమంటున్నారు?

డోసులో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ తొలుత రూపొందించిన ప్రణాళికకు భిన్నంగా అధ్యయనంలో ఎటువంటి మార్పులు జరగలేదు.

దీనిని బట్టి మనకు మూడు రకాల కోవిడ్ వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అర్థమవుతోందని లండన్ ఇంపీరియల్ కాలేజి ప్రొఫెసర్ పీటర్ ఓపెన్ షా చెప్పారు.

"పూర్తి సమాచారం వచ్చే వరకు ఎదురు చూసి రెగ్యులేటర్లు ఈ ఫలితాలను ఎలా విశ్లేషిస్తారో చూడాల్సి ఉంది. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ కంటే ఎం ఆర్ఎన్ఏ వ్యాక్సీన్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు. అయితే, మనం దీని కోసం వేచి చూడాల్సిందే " అని ఆయన అన్నారు.

"ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సీన్ ప్రయోగాలన్నీ సురక్షిత ఫలితాలను ప్రకటించడం చాలా చెప్పుకోదగిన విషయం. ఇది సాధ్యం అవుతుందో లేదో మనకింకా తెలియదు" అని ఆయన అన్నారు.

"మనం ఇంకా హెచ్ఐవీ, టీబీ, మలేరియా లాంటి చాలా రోగాలకు చాలా రోజుల నుంచి వ్యాక్సీన్ కోసం ఎదురు చూస్తున్నాం. అవి ఇంకా అందుబాటులోకి రాలేదు" అని ఆయన అన్నారు.

కానీ, కోవిడ్ 19 వ్యాక్సీన్ విషయంలో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను చూస్తుంటే ఇది సాధ్యమైనట్లే కనిపిస్తోంది. ఇది నిజానికి చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)