జో బైడెన్‌, డోనల్డ్ ట్రంప్: ఏడు దశాబ్దాల వీరి జీవిత ప్రయాణాలు ఎలా సాగాయంటే...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్, జో బైడెన్‌ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది.

ఈ ఇద్దరు నేతలూ ఏడు పదుల వయసులో ఉన్నవారే. ట్రంప్ వయసు 74 ఏళ్లు కాగా, బైడెన్‌కు 77 ఏళ్లు.

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా గత ఏడు దశాబ్దాల్లో వీరి జీవితాలు చాలా మలుపులు తిరిగాయి. ఎన్నో అనుభవాలను వీరు మూటగట్టుకున్నారు.

వీరి జీవితాల్లోని వివిధ దశలకు అద్దం పట్టే ఫొటోలతో ఆ వివరాలను ఈ కథనం ద్వారా మీ ముందుకు తెచ్చాం.

తొలి రోజుల్లో…

డోనాల్డ్ ట్రంప్ 1946లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. న్యూయార్క్‌కు చెందిన పెద్ద వ్యాపారవేత్త ఫ్రెడ్ ట్రంప్, మేరీ ఏన్ మెక్లౌడ్ ట్రంప్‌లకు నాలుగో సంతానంగా జన్మించారు.

ఆర్థికంగా సంపన్నమైన కుటుంబమైనప్పటికీ, డోనల్డ్ ట్రంప్‌, తన తండ్రి సంస్థలో అనేక రకాల కింది తరగతి ఉద్యోగాలు చేశారు. 13 ఏళ్ల వయసులో స్కూల్లో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ట్రంప్‌ను ఆయన కుటుంబం మిలటరీ అకాడమీకి పంపింది.

తరువాత, ట్రంప్‌ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఉన్నత విద్య అభ్యసించారు. తన తండ్రి తదనంతరం కుటుంబ వ్యాపారాలకు సారథ్యం వహించారు.

జోసెఫ్ రోబినెట్ బైడెన్ జూనియర్ 1942లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్‌లో జన్మించారు. ఐర్లాండ్ నేపథ్యం ఉన్న ఓ కాథలిక్ కుటుంబంలో ఆయన పుట్టారు.

ఆయనకు చిన్నతనంలో నత్తి ఉండేది. స్కూలుకి వెళ్లే దశలో ఈ చిన్న లోపం బైడెన్‌ను చాలా బాధించేది. దీన్ని అధిగమించడానికి అద్దం ముందు నిల్చుని తడబడకుండా మాట్లాడడం ప్రాక్టీస్ చేసేవారు. కొన్ని నెలల అభ్యాసం తరువాత బైడెన్ ఈ లోపాన్ని పూర్తిగా అధిగమించగలిగారు.

బైడెన్, మొదట యూనివర్సిటీ ఆఫ్ డెలవేర్‌లో, తరువాత సిరక్యూస్ యూనివర్సిటీ లా స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించారు.

మొదటి భార్య నెలియాను వివాహమాడిన తరువాత విల్మింగ్టన్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

1970ల్లో...

తండ్రి నుంచి ‘కేవలం’ పది లక్షల డాలర్లు (నేటి భారత కరెన్సీలో ఏడు కోట్ల రూపాయలు) అప్పుగా తీసుకుని తాను రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టానని ట్రంప్ చెబుతుంటారు.

ఆ తర్వాత ట్రంప్ తన తండ్రి సంస్థలోనే చేరారు. న్యూయార్క్‌లో తన తండ్రి చేపట్టిన వివిధ హౌసింగ్ ప్రాజెక్టుల నిర్వహణను చూసుకున్నారు. అనంతరం సంస్థ పగ్గాలను అందుకున్నారు. 1971లో తమ సంస్థ పేరును ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చారు.

ఆరేళ్ల తరువాత, ట్రంప్ తన మొదటి భార్య ఇవానా జెల్నికోవాను వివాహాం చేసుకున్నారు. ఇవానా చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రీడాకరిణి, మోడల్ కూడా. వీరి సంతానమే డోనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్‌. ప్రస్తుతం ట్రంప్ ఆర్గనైజేషన్‌ను నిర్వహించడంలో వీరే తండ్రికి సహాయపడుతున్నారు.

జో బైడెన్ 1972లో సెనేటర్ ఎన్నికల్లో మొదటిసారి గెలిచి, పదవిని స్వీకరించడానికి సిద్ధమవుతుండగా, ఓ కారు ప్రమాదంలో ఆయన భార్య, కూతురు నెయోమి మరణించారు. కుమారులు బౌ, హంటర్‌లకు తీవ్రంగా గాయాలయ్యాయి.

గాయపడ్డ తన బిడ్డలకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి గది నుంచీ డెమొక్రటిక్ పార్టీ సెనేటర్‌గా బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంఘటన అప్పట్లో అందరినీ విశేషంగా ఆకర్షించింది.

1980ల్లో...

1970ల చివర్లో ట్రంప్ తన వ్యాపారాన్ని బ్రూక్లిన్, క్వీన్స్ నుంచీ మాన్‌హటన్‌కు విస్తరించారు. మూతపడడానికి సిద్ధంగా ఉన్న ఒక హొటెల్‌ను కొనుగోలు చేసి, దాన్ని 'గ్రాండ్ హయత్' హొటల్‌గా మార్చారు. ఫిఫ్త్ అవెన్యూలో ప్రసిద్ధిగాంచిన 68 అంతస్తుల 'ట్రంప్ టవర్‌'ను నిర్మించారు. 1983లో ఈ భవనానికి ప్రారంభోత్సవం చేశారు.

తరువాత వరుసగా ట్రంప్ ప్లేస్, ట్రంప్ వరల్డ్ టవర్, ట్రంప్ ఇంటర్నేషనల్ హొటల్ అండ్ టవర్‌లను నిర్మించారు. అజేయంగా ముందుకు దూసుకుపోతున్న ట్రంప్ బ్రాండ్ మీడియాను కూడా ఆకర్షించడం మొదలుపెట్టింది.

అయితే, ట్రంప్‌కు పట్టినదంతా బంగారమమీ కాలేదు. ఆయన చేపట్టిన నాలుగు వ్యాపారాలు దివాళా తీశాయి.

బైడెన్ సెనెటర్‌ పదవి చేపట్టిన తరువాత మొదటి 14 సంవత్సరాల కాలంలో తన వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశారు. భార్య, కూతురి మరణం తరువాత తన కొడుకులిద్దరికీ మంచి జీవితం అందించాలనే తాపత్రయంతో తన సొంతిల్లు ఉన్న డెలవేర్ నుంచీ వాషింగ్టన్‌కు రోజూ వచ్చి వెళ్తుండేవారు. తదనంతరం, స్కూల్ టీచర్ అయిన జిల్ జాకబ్స్‌ను వివాహమాడారు. వారి కుమార్తె ఆష్లే బైడెన్ ఒక ఫ్యాషన్ డిజైనర్, యాక్టివిస్ట్ కూడా.

ఆ తరువాత బైడెన్ జాతీయ స్థాయి నాయకునిగా ఎదిగారు. 1987లో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి పోటీలో తొలిసారిగా అడుగు పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటి బ్రిటిష్ లేబర్ పార్టీ లీడర్ నీల్ కినోక్ ఉపన్యాసాన్ని బైడెన్ అనుకరించారంటూ ఆరోపణలు రావడంతో ఆయన ప్రయత్నాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

1990ల్లో...

90ల్లో ట్రంప్ వినోద రంగంలో కూడా అడుగుపెట్టారు. 1996లో మిస్ యూనివర్స్, మిస్ యూఎస్ఏ, మిస్ టీన్ యూఎస్ఏ వంటి అందాల పోటీల నిర్వహణలో భాగం పంచుకున్నారు.

వ్యక్తిగత జీవితంలో, మొదటి భార్య ఇవానాతో విడిపోయిన తరువాత 1993లో నటి మార్లా మాపిల్స్‌ను వివాహం చేసుకున్నారు. వారికి టిఫనీ అనే కూతురు పుట్టింది.

1999లో మార్లాతో కూడా విడిపోయారు. అదే ఏడాదిలో ట్రంప్ తన తండ్రిని కోల్పోయారు.

"నా తండ్రి నాకు గొప్ప స్ఫూర్తి" అని ఆ సమయంలో ట్రంప్ అన్నారు.

1991, అక్టోబర్ 11 తేదీన యూనివర్సిటీ ఆఫ్ ఒక్లహామాలో న్యాయశాస్త్ర అధ్యాపకురాలు అనిటా హిల్, అమెరికా సుప్రీంకోర్టు న్యాయవాది క్లారెన్స్ థామస్ మీద వేసిన కేసు విచారణ జరుగుతోంది. రోనల్డ్ రీగన్ ప్రభుత్వంలో కలిసి పనిచేసినప్పుడు క్లారెన్స్ థామస్ తనను పలుమార్లు లైంగికంగా హింసించారని అనిటా హిల్ కేసు వేశారు. అమెరికాలో అందరూ ఈ కేసు విచారణ చూడటానికి టీవీలకు అతుక్కుపోయారు. అమెరికా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఈ విచారణ జరుపుతోంది.

ఈ కమిటీ ఛైర్మన్‌గా జో బైడెన్ విచారణకు అధ్యక్షత వహించారు. అనిటా హిల్ సాక్ష్యాల విషయంలో బైడెన్ వ్యవహరించిన విధానం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ విచారణ కమిటీలో అందరూ తెల్లజాతీయులైన పురుషులే సభ్యులుగా ఉన్నారు. అనిటా హిల్‌కు మద్దతుగా నిలిచిన పలువురు మహిళలను బైడెన్ సాక్ష్యం చెప్పడానికి పిలవలేదు.

2019 ఏప్రిలో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ కేసు గురించి మాట్లాడుతూ బైడెన్... "ఆవిడతో వ్యవహరించిన విధానానికి సిగ్గుపడుతున్నాను" అని చెప్పారు.

2000ల్లో

2003లో 'ద అప్రెంటిస్' అనే రియాల్టీ టీవీ షోను కూడా ట్రంప్ మొదలుపెట్టారు. ఎన్‌బీసీ టీవీ నెట్‌వర్క్‌ ఈ షోను ప్రసారం చేసింది. ట్రంప్ సంస్థలో మేనేజ్‌మెంట్ ఉద్యోగం కోసం జరిగే పోటీ నేపథ్యంగా నడిచిన షో ఇది. ఈ షోకు 14 సీజన్ల వరకూ ట్రంప్ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఈ షో నడిచిన కాలంలో ఎన్‌బీసీ నెట్‌వర్క్ మొత్తంగా తనకు 213 మిలియన్ డాలర్లు (1,580 కోట్ల రూపాయలు) చెల్లించిందని ట్రంప్ వెల్లడించారు.

2005లో ట్రంప్, యుగోస్లేవియాకు చెందిన మోడల్ మెలానియా నాస్‌ను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే బారోన్ విలియం ట్రంప్.

2008లో మళ్లీ బైడెన్ అధ్యక్ష పోటీలో అడుగు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నం కూడా విజయవంతం కాలేదు.

అయితే.. అప్పుడు డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న బరాక్ ఒబామా, తనకు తోడుగా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి జో బైడెన్‌ను ఎంచుకున్నారు.

ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలిచింది. ఒబామా-బైడెన్ జంట ఆ తర్వాత 2012 అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలిచింది. బైడెన్ అనేకమార్లు ఒబామాను తన సోదరునిగా అభివర్ణించారు.

2010ల్లో...

2016 ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ చుట్టూ అనేక వివాదాలు ముసిరాయి. గతంలో మహిళల గురించి ట్రంప్ చేసిన అసభ్య వ్యాఖ్యల రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. ఈ విషయంలో సొంత పార్టీ నేతలే ట్రంప్ అధ్యక్ష పదవికి తగినవాడు కాదని వ్యాఖ్యలు చేశారు.

కానీ ట్రంప్ ఏ మాత్రం తడబడకుండా రాబోయే ఎన్నికల్లో తాను తప్పక గెలుస్తాననే విశ్వాసాన్ని కనబర్చారు.

చెప్పినట్లుగానే 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. 2017 జనవరిలో అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఒబామా, తన అధ్యక్ష పదవి ఆఖరు రోజుల్లో బైడెన్‌కు అమెరికా దేశ అత్యున్నత పురస్కారమైన 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం' పురస్కారం ఇచ్చి సత్కరించారు.

"జో బైడెన్‌ అంటే నటన లేని ప్రేమ, స్వార్థం లేని సేవ, జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించే తత్వం" అని ఒబామా ప్రశంసించారు.

ఒబామా-బైడెన్ భాగస్వామ్యాన్ని అత్యంత విజయవంతమైన భాగస్వామ్యంగా విశ్లేషకులు అభివర్ణిస్తారు. అయితే, అంత గొప్ప దశలో కూడా బైడెన్‌కు వ్యక్తిగతమైన బాధలు తప్పలేదు. 2015లో ఆయన కుమారుడు బౌ బ్రెయిన్ 46 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మరణించారు.

బౌ బైడెన్ రాజకీయాల్లో తన తండ్రికి వారసుడిగా కొనసాగుతారని అందరూ ఆశించారు. 2016లో బౌ డెలవేర్ రాష్ట్ర గవర్నర్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంతలోనే ఈ విషాదం జరిగింది.

2020లో...

కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఎన్నికల ప్రచారం కొనసాగింది. అమెరికాలో 2,30,000 మంది కరోనావైరస్ సోకి మరణించారు. ట్రంప్‌కు కూడా కోవిడ్ 19 సోకింది. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, వారి కుమారుడు బారోన్ ట్రంప్‌తో సహా పలువురు వైట్ హౌస్ సభ్యులకు కోవిడ్ సోకింది.

ఎన్నికలకు కొద్ది రోజులముందు లాక్‌డౌన్ విరమించుకోవాలని రాష్ట్రాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. తన ప్రచారాన్ని యాథావిధిగా కొనసాగించారు.

కరోనావైరస్ సృష్టించిన సంక్షోభం పట్ల ట్రంప్, బైడెన్‌లకు భిన్నాభిప్రాయాలున్నాయి. ట్రంప్ కరోనావైరస్‌ను అరికట్టడంలో విఫలమయ్యారని బైడెన్ ఆరోపించారు.

"ఈ ఎన్నికల్లో నేను గెలిచినా సరే, కోవిడ్ మహమ్మారిని పూర్తిగా అరికట్టడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. పదవిలోకొచ్చిన మొదటిరోజు నుంచే ఈ సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు సరైన చర్యలు చేపడతాం" అని బైడెన్ తెలిపారు.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ముందుగానే ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా మంది పోస్టు ద్వారా ఓట్లు వేశారు.

గమనిక: ఫొటోలకు కాపీరైట్లు వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)