ఇమ్రాన్ ఖాన్: ‘భారత్ నవాజ్ షరీఫ్‌‌కు సాయం చేస్తోంది.. పాక్‌ను ముక్కలు చేయాలని ప్రయత్నిస్తోంది’

నవాజ్ షరీఫ్ అనుమతి లేకుండానే అప్పటి పాక్ సైన్యాధిపతి కార్గిల్‌పై దాడి చేసుంటే, ఆయన్ను షరీఫ్ పదవి నుంచి తొలగించి ఉండేవారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

పాక్ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ''సమా టీవీ''కి గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

1999లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. అప్పుడు పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నారు. పాక్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్.

సైన్యం చర్యలతో దేశం భ్రష్టు పట్టకూడదనే గుణపాఠాన్ని పాక్ చరిత్ర నుంచి నేర్చుకుందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

''దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే.. సైనిక చట్టాలను అమలుచేయడం సరికాదు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థను సంస్కరించాలి''.

గంటన్నర పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ చాలా ఆరోపణలు చేశారు.

''భారత్ సాయం చేస్తోంది''

పాక్ సైన్యాన్ని బలహీనం చేసేందుకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారత్ సాయం చేస్తోందని ఇమ్రాన్ ఆరోపించారు.

''నవాజ్ షరీఫ్ చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. అల్తాఫ్ హుస్సేన్ అప్పట్లో ఇలానే చేశారు. నవాజ్ షరీఫ్‌కు భారత్ మద్దతు ఇస్తుందని నాకు వంద శాతం తెలుసు. పాక్ సైన్యం బలహీనమైతే ఎవరికి ప్రయోజనమో అందరికీ తెలుసు.''

''మానవతా కోణంలో నవాజ్ షరీఫ్‌కు సాయం చేయాలని పాక్ ప్రభుత్వం భావించింది. కానీ ఆయన రాజకీయాలు చేస్తున్నారు. పాక్‌కు వ్యతిరేకులుగా భావిస్తున్న చాలా మందిని ఆయన కలుస్తున్నారు''అని ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

పాక్‌ను ముక్కలు చేయాలని భారత్ కుట్ర పన్నుతోందని ఇమ్రాన్ ఆరోపించారు.

సైన్యమే లేకపోతే

''ఒకసారి కళ్లు తెరవండి. అఫ్గానిస్తాన్, యెమెన్, ఇరాక్, సిరియాలను చూడండి. మనం ఇప్పుడు సురక్షితంగా ఉన్నాం. ఇదంతా సైన్యం వల్లే. సైన్యమే లేకపోతే దేశం నేడు ముక్కలైపోయుండేది''

''పాక్ ప్రభుత్వం, సైన్యం మధ్య సంబంధాలు నేడు చరిత్రలోనే అత్యంత ఉత్తమంగా ఉన్నాయి. సైన్యం కనుసన్నల్లో నడుచుకోకుండా స్వతంత్రంగా ఎదిగిన తొలి పాక్ నాయకుణ్ని నేనే''

గిల్గిత్-బాల్టిస్తాన్‌లో భారత్ చర్యల గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు.

''అది చైనా-పాకిస్తాన్ ఆర్థిక నడవాలో భాగం. ఆ ప్రాంతం మొత్తాన్ని ఏళ్లుగా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడి ప్రాంతవాసులు హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ అవకాశాన్ని భారత్ ఉపయోగించుకోవాలని అనుకుంటోంది''

పాక్ సున్ని-షియాల మధ్య భారత్ గొడవలు పెట్టాలని భావిస్తోందని ఇమ్రాన్ ఆరోపించారు. భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని అందరికీ తెలుసుని అన్నారు.

ప్రతిపక్షాల గురించి పట్టించుకోను

''ప్రతిపక్షాలు ఏం చేయాలని అనుకుంటున్నాయో నాకు అనవసరం. వారు దేశంలోని సైన్యం, న్యాయవ్యవస్థలపై విమర్శలు చేస్తూ.. ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు''అని ప్రతిపక్షాల గురించి అడిగిన ప్రశ్నలపై ఇమ్రాన్ స్పందించారు.

''నేను ఎన్నికైన ప్రధాన మంత్రిని. నన్ను రాజీనామా చేయాలని ఎవరు అడుగుతారు? ఒకవేళ ఐఎస్‌ఐ డీజీ అడిగితే.. ముందు ఆయన్నే రాజీనామా చేయమని చెబుతా''.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)