You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘మమ్మల్ని సింగపూర్ పౌరుల్లా చూడకపోయినా ఫరవాలేదు.. మనుషుల్లా చూడండి’
- రచయిత, యెవెట్ తాన్
- హోదా, బీబీసీ న్యూస్
జకీర్ హుస్సేన్ ఖొకాన్ పూర్తిగా విసిగిపోయాడు. పన్నెండు మంది ఉండే ఆ గది నుంచి బయటకు వెళ్లడానికి ఆయనకు అనుమతి దొరికి కొన్ని వారాలైంది.
ఆరు బంక్ బెడ్స్, కొన్ని దుస్తులు, ఎక్కడికక్కడ ఆరేసిన తువ్వాళ్లు మినహా ఆ గదంతా ఖాళీగానే ఉంది. ఉన్నంతలో ప్రైవసీ కోసం మంచాల ముందు తువ్వాళ్లు ఆరేసుకున్నారు.
''రాత్రీపగలు ఈ గదిలోనే ఉన్నాం.. ఇది జైలులా ఉంది.. పిచ్చెక్కిపోతోంది'' అన్నారు జకీర్ హుస్సేన్.
'భౌతిక దూరం పాటించడానికి ఇక్కడ మాకు తగినంత స్థలం లేదు'' అని చెప్పారు.
ఇప్పటికే కోవిడ్ నుంచి కోలుకుని తిరిగి తన పనికి వెళ్తున్న జకీర్ కష్టకాలం వెంటాడుతోందని అనుకుంటున్నారు. ఆయన ఉంటున్న డార్మిటరీని జూన్‌లొ 'కోవిడ్ ఫ్రీ'గా ప్రకటించారు.
అయితే, గత నెలలో మళ్లీ ఆ డార్మిటరీలో కొందరికి కరోనా రావడంతో అక్కడున్న అందరినీ క్వారంటీన్‌లో ఉండమని ఆదేశాలు వచ్చాయి.
వైరస్‌ను కట్టడి చేయడంలో సక్సెస్ సాధించిందని ఒకప్పడు ప్రశంసలు అందుకున్న సింగపూర్‌లో ఆ తరువాత విదేశీ వలస కార్మికులున్న చాలా డార్మిటరీల్లో కరోనావైరస్ వ్యాప్తి చెందింది.
ప్రస్తుతం సింగపూర్ స్థానిక ప్రజల్లో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రజలు విధుల్లోకి వెళ్తున్నారు.. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు తెరచుకున్నాయి.
కానీ, అక్కడి అల్పాదాయ వర్గాల ప్రజలు అనేక మంది ఇంకా నాలుగ్గోడల మధ్యే నలిగిపోతున్నారు. వారికి భవిష్యత్ ఇంకా అగమ్యగోచరంగానే ఉంది.
కట్టడి చేసిందని ప్రశంసలు.. కట్టలుకట్టలుగా కేసులు
జనవరి చివర్లో సింగపూర్‌లో కరోనావైరస్ కేసులు గుర్తించారు. కొన్నివారాల తరువాత అవి వందల్లోకి చేరాయి.
వైరస్ బాధితులతో కాంటాక్ట్ అయినవారిని గుర్తించే ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టారు. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం యాప్ ఒకటి అందుబాటులోకి తెచ్చారు.
ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. దీంతో సింగపూర్‌లో అనుసరిస్తున్న విధానం, ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు మహమ్మారి కట్టడి దిశగా సరైన మార్గంలో ఉన్నాయని.. అద్భుతంగా ఉన్నాయని హార్వర్డ్ యూనివర్సిటీ అంటువ్యాధుల నిపుణులు కితాబిచ్చారు.
కానీ, అంతర్గతంగా ఒక సంక్షోభం ఏర్పడుతున్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు.
భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చిన సుమారు 3 లక్షల మంది విదేశీ వలస కార్మికులకు సింగపూర్ ఆవాసం. వారిలో అత్యధికులు నిర్మాణ, తయారీరంగాల్లో పనిచేస్తుంటారు.
వారి ఉద్యోగం ఆధారంగానే వారికి సింగపూర్‌లో ఉండేందుకు అనుమతులుంటాయి. యజమానులే వారికి ఆశ్రయం చూపాల్సి ఉంటుంది. డార్మిటరీల నుంచి కిక్కిరిసిన వ్యాన్లలో పనిచేసే చోటికి వెళ్తుంటారు. అక్కడ లంచ్ బ్రేక్‌లో అలాంటి ఇతర సమూహాలతో కలిసి మెలగుతుంటారు. ఇవన్నీ వైరస్ వ్యాప్తికి అనుకూల పరిస్థితులే.
స్థానికులు సురక్షితం.. వలస కార్మికులకు ప్రాణాపాయం
డార్మిటరీల్లో ఎంతమంది ఉండాలన్న పరిమితులేవీ లేకపోవడంతో కోవిడ్‌కు ముందు ఉన్న పరిస్థితుల్లో గదికి 20 మంది వరకు ఉండేవారు.
విదేశీ వలస కార్మికుల్లో కేసులు పెరిగే ప్రమాదం ఉందని మార్చి చివర్లో వలస కార్మికుల హక్కుల కోసం పోరాడే సంస్థ 'ట్రాన్సియంట్ వర్కర్స్ కౌంట్ 2' హెచ్చరించింది.
పాక్షిక లాక్‌డౌన్ అమలు చేసిన కొద్ది వారాల తరువాత సాధారణ ప్రజల్లో వైరస్ వ్యాప్తిని అదుపులోకి తెచ్చినా హక్కుల సంస్థ ఊహించినట్లుగానే వలస కార్మికులు పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడడం మొదలైంది.
ఏప్రిల్ నుంచి అక్కడి ప్రభుత్వం స్థానికుల్లో కేసులు, డార్మిటరీల్లో ఉన్న వలస కార్మికుల్లో కేసులు అంటూ డాటా విడుదల చేయడం ప్రారంభించింది.
ఈ డాటా చూస్తే అక్కడ స్పష్టమైన అంతరం కనిపిస్తుంది. స్థానిక ప్రజల్లో వైరస్ బారిన పడిన కేసులు చాలా తక్కువగా ఉండగా వలస కార్మికుల్లో కేసులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి.
సంపూర్ణ లాక్‌డౌన్‌లో డార్మిటరీలు
''ఇతర మహమ్మారుల్లాగే కోవిడ్-19 కూడా అసమానతల మహమ్మారి'' మాసే యూనివర్సిటీ కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్ మోహన్ దత్తా అన్నారు.
కేసులు పెరుగుతుండడంతో డార్మిటరీలను సీల్ చేయాలని అక్కడి అధికారులు నిర్ణయించారు.
అత్యవసర సేవల్లో ఉన్న వలస కార్మికుల్లో ఆరోగ్యంగా ఉన్న సుమారు 10 వేల మందిని వేరు చేసి వారికి ప్రత్యామ్నాయ వసతి కల్పించారు. రోజువారీ పనులు కొనసాగడానికి వీలుగా వారి సేవలు ఉపయోగించుకునేందుకు అలా చేశారు.
పెద్దసంఖ్యలో కార్మికులు డార్మిటరీల్లోని ఇరుకు గదులకే పరిమితమైపోయారు. సామూహిక పరీక్షలు జరిపినప్పుడు కూడా కొందరిని బయటకు రానివ్వలేదు.. వ్యాధి సోకినవారిని మాత్రం గదుల నుంచి బయటకు తీసుకెళ్లి చికిత్స అందించారు.
దీంతో సింగపూర్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. డార్మిటరీల్లో ఉన్నవారికి గదులకే భోజనం పంపిస్తూ బయటకు రాకుండా పూర్తిగా లాక్‌డౌన్ చేయగా దేశంలోని మిగతావారికి మాత్రం షాపింగ్, రెస్టారెంట్లు అన్నిటికీ అనుమతించారు.
'లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు పక్క గదికి వెళ్లడానిక్కూడా మాకు అవకాశమివ్వలేదు'' అని భారత్‌కు చెందిన వైద్యనాథన్ రాజా 'బీబీసీ'కి చెప్పారు.
ఏమేం మార్పులొచ్చాయి
మారిన పరిస్థితులతో వలస కార్మికులు ఉండే డార్మిటరీల్లోనూ అనేక మార్పులొచ్చాయి. శుభ్రతా చర్యలు పెంచారు.
తానుండే డార్మిటరీలో పరిస్థితులు బాగున్నాయని.. పాత మంచాల అమరిక స్థానంలో ఇప్పుడు కొత్తగా దూరం పాటిస్తూ విడివిడి మంచాలు ఏర్పాటు చేశారని మహాలింగం వెట్రిసెల్వన్(51) అనే భారతీయుడు తెలిపారు.
తమ వసతి గృహంలో గదికి 15 మంది ఉండేవారని.. ఇప్పుడాసంఖ్యను 8కి తగ్గించారని మరో విదేశీ కార్మికుడు చెప్పారు.
కోవిడ్ పరిస్థితుల కారణంగా తమ యజమాని డార్మిటరీ నుంచి తనను మంచి హోటల్‌కు మార్చారంటూ సంతోషం వ్యక్తంచేశారు మరో కార్మికుడు.
కానీ, జకీర్ పరిస్థితి వీరికి భిన్నం. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఒక నిర్మాణ సంస్థలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న జకీర్ కోవిడ్ బారిన పడిన తరువాత వేరే ప్రాంతానికి మార్చి చికిత్స అందించారు. కోలుకున్నాక మళ్లీ డార్మిటరీకి పంపించేశారు.
''ఏప్రిల్ 17న డార్మిటరీ నుంచి బయటకు వెళ్లాను. జులై 9న మళ్లీ ఇక్కడకు వచ్చాను. నాకైతే ఎలాంటి మార్పూ కనిపించలేదు'' అన్నారు జకీర్.
6 మీటర్ల వెడల్పు, 7 మీటర్ల పొడవు ఉన్న గదిలో జకీర్‌తో పాటు మొత్తం 12 మంది ఉంటారు.
''భౌతిక దూరం పాటించాలని చెబుతారు. కానీ, ఇక్కడ ఈ గదిలో భౌతిక దూరం పాటించడమనేది పెద్ద జోక్' అంటారు జకీర్.
''ప్రతి అంతస్తులో ఇలాంటి 15 గదులుంటాయి. అన్ని గదులూ పూర్తిగా నిండితే ఒక్కో అంతస్తులో 180 మంది ఉంటారు.
వీరందరికీ కామన్ టాయిలెట్స్ ఉంటాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి 15 బెడ్లకు ఒక టాయిలెట్, షవర్, సింక్ ఉండాలి. కానీ, ఇక్కడ వందల మందికి ఒకటి ఉంటుందన్నారాయన.
''శుభ్రత పాటించాలని అధికారులు చెబుతారు. కానీ, ఇక్కడ సోప్ డిస్పెన్సర్‌లో సోప్ ఉండదు'' అన్నారు జకీర్.
ఆ డార్మిటరీ యజమానితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది కానీ ఆయన్నుంచి ఎలాంటి స్పందన లేదు.
వలస కార్మికుల హక్కుల కోసం పనిచేస 'ఇట్స్ రెయినింగ్ రెయిన్‌కోట్స్'' అనే సంస్థ వ్యవస్థాపకురాలు దీపా స్వామినాథన్ మాట్లాడుతూ చాలామంది కార్మికులు అనేక ఏళ్లుగా ఇలాంటి పరిస్థితుల్లోనే మగ్గుతున్నారని చెప్పారు.
''వలస కార్మికులకు తిండి, వసతి, అక్కడి అపరిశుభ్ర వాతావరణం వంటి అన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ ఎప్పటి నుంచో ఇలాంటి పరిస్థితులున్నాయి'' అన్నారామె.
''ఇంతకాలం ఇలాంటివి బయటకు రాకపోవడానికి కారణం వలస కార్మికులు ఫిర్యాదు చేసే రకం కాకపోవడమే'' అన్నారు దీపా.
అయితే, కరోనా మహమ్మారి మొదలైన తరువాత వలస కార్మికుల్లో ఎన్నో విషాద గాథలున్నాయి.. ఆత్మహత్యాయత్నం చేసినవారు, చనిపోయినవారూ ఉన్నారు.
ఒక డార్మిటరీ కిటికీ నుంచి దూకేయబోయిన కార్మికుడిని మిగతా రూంమేట్స్ లోనికి లాగి రక్షించిన వీడియో ఒకటి వైరల్ అయింది(దానికి సంబంధించిన నిజానిజాలు బీబీసీ స్వయంగా తనిఖీ చేయలేదు).
''నేనున్న డార్మిటరీలో ఎందరో తమ ఇళ్లకు ఫోన్ చేసి ఈ పరిస్థితి నుంచి బయటపడలేకపోతున్నామంటూ ఏడవడం.. ఇంటికి రావాలని ఉందని చెప్పడం చూశాను'' అని జకీర్ చెప్పారు.
జకీర్ కూడా వలస కార్మికుల కోసం ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు.
వేతనాలు, ఇతర సమస్యల వల్ల కూడా కార్మికుల్లో తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయని జకీర్ చెప్పారు.
'బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేకపోవడంతో ఉపాధి లేక, వేతనాల్లేక స్వస్థలాల్లో ఉన్న కుటుంబాలకు డబ్బు పంపించలేకపోతున్నాం'' అన్నారు జకీర్.
పూర్తికాలం పనిచేసే అందరు విదేశీ కార్మికులకూ పూర్తి జీతం చెల్లించాలని సింగపూర్ మేన్ పవర్ మినిస్ట్రీ 'బీబీసీ'కి చెప్పింది.
పోస్ట్ మార్టం
వలస కార్మికుల పరిస్థితులను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్న సింగపూర్ 2020 చివరి నాటికి ప్రతి ఒక్కరికీ కనీసం 6 చదరపు మీటర్ల లివింగ్ స్పేస్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది.
డార్మిటరీల్లోని గదుల్లో పడకల మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా గదికి గరిష్ఠంగా 10 పడకలు మాత్రమే ఉండాలన్నది లక్ష్యం.
మరి ఇంతకాలం సింగపూర్‌లో వలస కార్మికులుండే డార్మిటరీల్లో పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా మారడానికి కారణమేంటన్న ప్రశ్న వినిపిస్తోందని ప్రొఫెసర్ దత్తా అన్నారు.
డార్మిటరీల్లో కార్మికులంతా కోవిడ్ నుంచి కోలుకున్నారని గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది.
కానీ, అక్కడికి కొద్దిరోజుల్లోనే మళ్లీ డార్మిటరీల్లో కేసులు వెలుగుచూశాయి.
‘మమ్మల్ని సింగపూర్ పౌరుల్లా చూడకపోయినా ఫరవాలేదు.. మనుషుల్లా చూడండి’
ఇందులోంచి ఎప్పడు బయపడతానన్నది జకీర్ చెప్పలేకపోయినా తిరిగి పనికి వెళ్లడం.. సింగపూర్‌లోని వలస కార్మికుల పరిస్థితులు మెరుగుపరచడమనే ఆశతో ఉన్నానని చెబుతున్నారు.
''మాలో చాలామందికి ఇక్కడ ఏళ్లుగా ఉంటున్నాం..నేను గత 17 ఏళ్లుగా సింగపూర్‌లో ఉంటున్నాను. సింగపూర్ సమాజంలో ఇప్పటికే తాము భాగమైనట్లుగా ఉంద''ని జకీర్ అన్నారు.
''మమ్మల్ని సింగపూర్ పౌరులుగా చూడమని అడగడం లేదు.. మనుషులను మీరెలా చూస్తారో మమ్మల్నీ అలాగే చూడమని మాత్రం అడుగుతున్నాం.. ఈ సమాజంలో మేమూ భాగం అన్నట్లుగా చూడండి.. నిజంగా మమ్మల్ని మీరు అలా చూస్తే ఎంతో సంతోషం'' అన్నారు జకీర్.
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఆంధ్రప్రదేశ్‌లో రథాల చుట్టూ రాజకీయాలు... ఇంద్రకీలాద్రి వెండి రథంపై విగ్రహాలు ఏమయ్యాయి?
- అంతర్వేది ఆలయం: అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల భూముల సంగతి ఏమిటి?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)