ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ అనుమానిత కేసు.. అప్రమత్తమైన కిమ్ జోంగ్-ఉన్

తమ దేశంలో మొదటి కరోనావైరస్ అనుమానిత కేసు నమోదైందని ఉత్తర కొరియా చెప్పింది.

మూడేళ్ల క్రితం దక్షిణ కొరియాకు వెళ్లి, గత వారం సరిహద్దులు దాటి స్వదేశానికి చేరుకున్న ఒక వ్యక్తికి కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్టు ఆ దేశ వార్తా ఏజెన్సీ కేసీఎన్ఏ చెప్పింది.

దీంతో, సరిహద్దు నగరం కేసాంగ్‌లో లాక్‌డౌన్ అమలు చేయడానికి, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్ ఉన్నతాధికారులతో ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

ఉత్తరకొరియా ఇంతకు ముందు తమ దేశంలో కోవిడ్-19 కేసులు లేవని చెప్పింది. కానీ విశ్లేషకులు మాత్రం అది అసంభవం అన్నారు.

“కేసాంగ్ నగరంలో ఒక అత్యవసర ఘటన జరిగింది. మూడేళ్ల క్రితం అక్కడ నుంచి దక్షిణ కొరియాకు పారిపోయిన వ్యక్తి, జులై 19న అక్రమంగా సరిహద్దు దాటి తిరిగి వచ్చాడు. అతడికి ప్రమాదకరమైన వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు” అని కేసీఎన్ఏ చెప్పింది.

వైరస్‌ను నియంత్రించడానికి గరిష్ట స్థాయిలో అత్యవసర వ్యవస్థ ఏర్పాటు చేయాలని కిమ్ శనివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో అధికారులను ఆదేశించారు.

“ఆర్మీ కట్టుదిట్టంగా గస్తీ కాస్తున్న సరిహద్దును దాటి అనుమానిత కోవిడ్ రోగి లోపలికి ఎలా రాగలిగాడో కూడా దర్యాప్తు చేయాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని” కిమ్ ఆదేశించారని కేసీఎన్ఏ చెప్పింది.

మరోవైపు, సైనికులు గస్తీ కాస్తున్న తమ సరిహద్దును ఇటీవల ఎవరైనా అక్రమంగా దాటినట్లు దక్షిణ కొరియా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

వైరస్ ప్రపంచమంతా వ్యాపిస్తున్న సమయంలో, ఆరు నెలల క్రితమే ఉత్తర కొరియా తమ సరిహద్దులను మూసివేసింది. వేలాది మందిని ఐసొలేషన్‌లో ఉంచింది.

కోవిడ్-19ను నియంత్రించడంలో తమ దేశం ఘన విజయం సాధించిందని ఈ నెల ప్రారంభంలో కిమ్‌ ఆకాశానికెత్తేశారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)