ఎల్‌జీబీటీ: ప్రైడ్ మంత్ అంటే ఏమిటి? దీన్ని ఎందుకు జ‌రుపుకొంటారు?

జూన్.. ప్రైడ్ మంత్‌. ఈ నెల ప్ర‌పంచ వ్యాప్తంగా ఎల్‌జీబీటీ స‌భ్యులు వేడుక‌లు చేసుకుంటారు.

ప్రైడ్‌లో ప‌రేడ్‌లు, మార్చ్‌లు స‌ర్వ‌సాధార‌ణం. అయితే క‌రోనావైర‌స్ ఆందోళ‌న‌లు, సామాజిక దూరం నిబంధ‌న‌ల‌ న‌డుమ‌.. ఈ ఏడాది ఇవి కాస్త భిన్నంగా జరిగాయి.

చాలా కార్య‌క్ర‌మాలు ర‌ద్ద‌య్యాయి. మ‌రికొన్ని వాయిదా ప‌డ్డాయి. అయితే జూమ్‌, టిక్‌టాక్‌, ఇత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో మాత్రం సంబ‌రాలు క‌నిపిస్తున్నాయి.

ప్రైడ్ మంత్ అంటే?

స్వ‌లింగ సంప‌ర్కుల‌ హ‌క్కుల కోసం తొలిసారిగా ఈ నెల‌లోనే అమెరికా‌లో "స్టోన్‌వాల్‌‌" నిర‌స‌న‌లు జ‌రిగాయని చెప్పుకుంటారు. వీటి త‌ర్వాతే అమెరికాతోపాటు చాలా ప్రాంతాల్లో స్వ‌లింగ సంప‌ర్కుల‌కు ప్ర‌త్యేక హ‌క్కులు ల‌భించాయి.

స్వ‌లింగ సంప‌ర్కుల హ‌క్కులు ఎంత‌వ‌ర‌కు ల‌భించాయో అంద‌రికీ తెలియ‌జేయ‌డంతోపాటు త‌మ ప్రేమ‌, స్నేహ భావాల‌నూ ప్ర‌తిబింబించేందుకు ఈ వేడుక‌లు నిర్వ‌హిస్తారు. అయితే చాలా ప్రాంతాల్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంద‌ని వారు బ‌లంగా న‌మ్ముతుంటారు.

ఎల్‌జీబీటీ స‌భ్యుల గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు స‌హ‌నాన్ని అల‌వ‌రుచుకోవ‌డం, స‌మాన‌త్వం దిశ‌గా అడుగులు వేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ వేడుక‌లు ఉంటాయి.

ఎల్‌జీబీటీ స‌భ్యుల‌పై వివ‌క్ష చూప‌డం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో గుర్తుచేసేందుకు దీనితో పిలుపునిస్తారు.

ఎవ‌రిని ప్రేమించినా ఫ‌ర్వాలేదు.. కానీ ఎప్పుడూ గ‌ర్వంగా ఉండాల‌ని ప్రైడ్ చెబుతుంది.

మీకు తెలుసా?

తొలి గే ప్రైడ్ మార్చ్‌ను నిర్వ‌హించిన అమెరికా మ‌హిళ బ్రెండా హోవ‌ర్డ్‌ను "ద మ‌ద‌ర్ ఆఫ్ ప్రైడ్"‌గా పిలుస్తారు.

వెలుగులు విర‌జిమ్మే ప‌రేడ్‌లు, సంగీత క‌చేరీలు, మార్చ్‌లు సాధార‌ణంగా ఈ స‌మ‌యంలో నిర్వ‌హిస్తుంటారు. అయితే సామాజిక దూరం నిబంధ‌న‌ల న‌డుమ ఈ సారి ఇవ‌న్నీ చాలా వ‌ర‌కూ ఆన్‌లైన్‌కే పరిమితం అయ్యాయి.

"గ్లోబ‌ల్ ప‌రేడ్ డే"ను జూన్ 27న నిర్వ‌హించారు. సంగీత క‌చేరీలు, లైవ్ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ జరిగాయి.

ఎల్‌జీబీటీ వేడుక‌ల‌ను ప్రైడ్‌గా సంబోధించాల‌ని ఎల్‌. క్రైగ్ షూన్‌‌మేక‌ర్ పిలుపునిచ్చారు.

‘‘చాలా మందిని అణ‌చివేస్తున్నారు. వారు ఎంతో మ‌థ‌న ప‌డుతున్నారు. దాన్నించి ఎలా బ‌య‌టప‌డాలో, గౌర‌వంగా ఎలా జీవించాలో వారికి తెలియ‌డం లేదు. నేను గ‌ర్వంగా ఉండాలి అనే భావ‌న ఈ ప్రైడ్‌తో అంద‌రికీ క‌ల‌గాలి’’ అని ఎల్‌. క్రైగ్ షూన్‌మేక‌ర్‌ అన్నారు.

1970 జూన్ 28వ తేదీ నుంచి నుంచీ ప్రైడ్ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత వైభ‌వంగా, గ‌ర్వంగా నిర్వ‌హిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)